డీ-నాజీఫికేషన్, డీ-మిలటరైజేషన్ మా లక్ష్యం -రష్యా


Russian Presidential Spokesman Dmitry Peskov

ఉక్రెయిన్ పై దాడికి కారణాలను చెబుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ ను ‘డీ-నాజీఫై, డీ-మిలిటరైజ్’ చెయ్యడం మా లక్ష్యం’ అని ప్రకటించాడు. “మా నాటో మిత్రులు, ఉక్రెయిన్ పాలకులు మాకు ‘స్పెషల్ మిలటరీ ఆపరేషన్’ చేపట్టటం మినహా మరో దారి వదల లేదు” అని కూడా పుతిన్ ఫిబ్రవరి 21 తేదీ ప్రసంగంలో చెప్పాడు.

పుతిన్ మాటలకు అర్ధం ఏమిటి అన్న ప్రశ్నకు తలొక సమాధానం ఇస్తున్నారు. ముఖ్యంగా డీ-నాజీఫై చెయ్యడం అంటే ఏమిటి? డీమిలటరైజ్ చెయ్యడం అంటే ఏమిటి? అన్న ప్రశ్నలకు ఎవరి అర్ధం వారు ఇస్తున్నారు.

ఈ ప్రశ్నలకు క్రెమ్లిన్ (రష్యా అధ్యక్ష భవనం) ప్రతినిధి లేదా రష్యా అధ్యక్షుడి తరపున పత్రికలతో మాట్లాడే అధికారి డిమిట్రీ పెష్కోవ్ సమాధానం ఇచ్చాడు. డాన్ బాస్ ప్రభుత్వాల అభర్ధన మేరకు ‘స్పెషల్ మిలట్రీ ఆపరేషన్’ కు పుతిన్ ఆదేశాలు ఇచ్చారని చెప్పిన పెష్కోవ్ పై మాటలను  వివరించాడు.

“ఏది ఉత్తమం అని చూస్తే, ఉక్రెయిన్ ని విముక్తి చెయ్యడమే ఉత్తమం. ఉక్రెయిన్ లో నాజీ శక్తులు లేకుండా శుభ్రం చెయ్యాలి. నాజీ-అనుకూల సెంటిమెంట్లు కలిగి ఉన్న వారిని దేశం నుండి తొలగించాలి. డీనాజీఫై చెయ్యడం అంటే అర్ధం అదే” అని పెష్కోవ్ పేర్కొన్నాడు.

“ఉక్రెయిన్ లో ఇటీవలి కాలంలో మిలట్రీ సామర్ధ్యం చెప్పుకోదగ్గ విధంగా పెరిగింది. ముఖ్యంగా ఇతర దేశాల కార్యకలాపాల వలన ఇది పెరిగింది. ఈ మిలట్రీ సామర్ధ్యాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అదే డీమిలటరైజేషన్ కు అర్ధం” అని పెష్కోవ్ చెప్పాడు. (TASS News Agency, Feb 24)

2014లో అమెరికా, ఈ‌యూల మద్దతుతో నయా నాజీ భావాలు కలిగిన పలు గ్రూపులు ఆందోళన చేపట్టాయి. ఈ‌యూ – ఉక్రెయిన్ అసోసియేషన్ అగ్రిమెంట్ పైన సంతకం చేయడాన్ని అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ వాయిదా వేశాడు. ఇలా వాయిదా వేయటానికి నిరసనగా ఆందోళన చేస్తున్నట్లు వారు ప్రకటించారు.

ఆ నాటికి ఉక్రెయిన్, రష్యాకు 16 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు చేస్తున్నది. ఈ‌యూతో అసోసియేషన్ ఒప్పందం చేసుకుంటే ఈ‌యూ దేశాలకు 17 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేయొచ్చని ఈ‌యూ ఆశ చూపింది. కానీ ఈ ఒప్పందం చేసుకుంటే రష్యాతో సంబంధాలు దెబ్బ తింటాయి. రష్యాకు చేసే ఎగుమతులు ప్రమాదంలో పడతాయి. అందుకు నష్టపరిహారంగా 1 బిలియన్ డాలర్లు ఇస్తామని ఈ‌యూ హామీ ఇచ్చింది.

ఈ బేరం ఉక్రెయిన్ భవిష్యత్ కి అననుకూలంగా ఉన్నట్లు యనుకోవిచ్ భావించాడు. అందుకే వాయిదా వేశాడు. ఒప్పందం వద్దు అని మాత్రం చెప్పలేదు. మరింత సమయం తీసుకుని లాభ నష్టాలు బేరీజు వేసుకుని త్వరలో నిర్ణయం తీసుకుంటాను అని చెప్పాడు.

రైట్ సెక్టార్, స్కిన్ హెడ్, స్వోబోడా… లాంటి పార్టీల మిలిటెంట్లకు అప్పటికే కొన్ని నెలల నుండి పోలండ్ లో సి‌ఐ‌ఏ శిక్షణ ఇస్తోంది. తుపాకి కాల్చడం, పోలీసుల్ని ఎదుర్కోవడం, గుంపుల్ని మేనేజ్ చెయ్యడం లాంటి వాటిలో వాళ్ళు శిక్షణ తీసుకున్నారు. వాళ్ళు యూరో మైదాన్ ఆందోళనల్లో ప్రధాన పాత్ర పోషించారు. అవినీతి, నిరుద్యోగం లాంటి న్యాయమైన సమస్యలతో కదిలిన జనం కూడా ఆందోళనల్లో ఉన్నప్పటికీ ఆందోళనలు నాజీ గ్రూపుల చేతుల్లోకి వెళ్లిపోయింది.

వాళ్ళు పోలీసుల పైన క్రూరమైన హింసకు పాల్పడ్డారు. రష్యాకు అనుకూలంగా ఆందోళన చేసిన వారి పైన కూడా తీవ్ర హింసకు పాల్పడ్డారు. యనుకోవిచ్ ప్రభుత్వం కూలిపోయాక అధికారం లోకి వచ్చిన పార్టీల్లో ఈ నాజీ గ్రూపులే ముఖ్య పాత్ర పోషించాయి.

రష్యా అధ్యక్షుడి ప్రతినిధి పెష్కోవ్ నాజీ గ్రూపులు అని చెబుతున్నది ఈ పార్టీల గురించే. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ జర్మనీ రష్యాపై దండెత్తి వచ్చినప్పుడు ఈ గ్రూపులు జర్మనీతో కుమ్మక్కైనాయి. ఉక్రెయిన్ ని సోవియట్ రష్యా తో కలవకుండా సొంత ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేశాయి. ఈ గ్రూపులు మైదాన్ ఆందోళనను అడ్డం పెట్టుకుని రష్యాకు వ్యతిరేకంగా కుట్ర చెయ్యడం రష్యాకు సహజంగానే కోపం తెప్పించింది. నాజీ గ్రూపులని నిర్మూలించడం తమ లక్ష్యాల్లో ఒకటని పెష్కోవ్ చెప్పాడు.

డీమిలటరైజేషన్ లో భాగంగా ఉక్రెయిన్ మిలట్రీని కూడా నిర్మూలిస్తారా అన్న ప్రశ్నకు పెష్కోవ్ నిర్దిష్టంగా సమాధానం ఇవ్వలేదు. “ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాను” అని నర్మగర్భంగా చెప్పాడు.

అలాగే ఇప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఇతర మంత్రులు, అధికారులు నాజీ భావాలతో ఉన్నారని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు కూడా పెష్కోవ్ సమాధానం ఇవ్వలేదు.

అయితే నాజీ గ్రూపుల్ని ఉక్రెయిన్ నుండి నిర్మూలించడం అన్నది రష్యా పని కాదు. అది ఉక్రెయిన్ ప్రజలు తేల్చుకోవాల్సిన సమస్య. అతివాద, మితవాద, నాజీవాద… ఇలా ఎలాంటి భావాలనైనా ఒక దేశంలోని ప్రజలు, సమూహాలు కలిగి ఉండవచ్చు. ఎవరు అధికారంలోకి వస్తారు అన్నది ప్రజల ఆదరణ బట్టి ఉంటుంది. ఒక దేశ పాలకుల్ని నిర్ణయించుకోవలసింది ఆ దేశ ప్రజలే గాని రష్యా కాదు.

ఇదే సూత్రం అమెరికా, ఈ‌యూ లకు వర్తిస్తుంది. తమ వాణిజ్య ప్రయోజనాల కోసం, తమ కంపెనీల లాభాల కోసం ఉక్రెయిన్ లో ఎన్నికల్లో నెగ్గిన ప్రభుత్వాన్ని కూల్చడం, ఆ స్థానంలో తమ అనుకూలురను కూర్చోబెట్టడం, ఆందోళనలను రెచ్చగొట్టడం… ఇవన్నీ అమెరికా, ఈ‌యూలు 2014లో చేశాయి. ఉక్రెయిన్ ను నాటో కూటమి లోకి ఆహ్వానించే ప్రతిపాదనకు మద్దతు ఇచ్చాయి.

ఇవన్నీ తన భద్రతకు ప్రమాదంగా రష్యా భావించింది. అది నిజం కూడా. రష్యాలోని సహజవాయువు, చమురు వనరుల తవ్వకంలో తమ బహుళజాతి చమురు కంపెనీలకు కాంట్రాక్టులు లభిస్తాయని ఆశించిన అమెరికాకు పుతిన్ వల్ల శృంగభంగం అయింది. రష్యాను అమెరికా, పశ్చిమ రాజ్యాలకు బంటుగా ఉంచడానికి బదులు స్వతంత్ర రాజ్యంగా, ధీటైన మిలటరీ శక్తిగా పుతిన్ నిలబెట్టాడు. అందువలన ఎలాగైనా పుతిన్ ని అతని మద్దతుదారులను అధికారం నుండి తప్పించాలని అమెరికా పలు ప్రయత్నాలు చేసింది.

ఇవన్నీ ఉన్నప్పటికి అమెరికా చేసిందే తానూ చేస్తాననడం రష్యాకు తగని పని. రష్యా, అమెరికాల మధ్య 4 కోట్ల మంది ఉక్రెయిన్ ప్రజలు నలిగిపోవడం, దేశం వదిలిపోవలసి రావడం ఆమోదనీయం కాదు. తూర్పు ఉక్రెయిన్ ప్రజల కోరిక నెరవేర్చడం వరకు సరైన చర్యే అయినప్పటికి ఉక్రెయిన్ మొత్తాన్ని తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలని భావించడం ద్వారా రష్యా సామ్రాజ్యవాద లక్ష్యాలను చాటుతోంది తప్ప అది రక్షణ ఇవ్వడం కాదు. తన భద్రత ప్రయోజనాల నిమిత్తం ఉక్రెయిన్ ఉనికిని కూడా నిరాకరించడం నాజీ భావాలకు పోటీ రావటమే.

ఉక్రెయిన్ స్వతంత్ర దేశం. స్వతంత్ర దేశం తన రక్షణ కోసం భద్రత కోసం మిలట్రీని నిర్మించుకుంటుంది. స్వతంత్ర ఉక్రెయిన్ ను డీమిలటరైజ్ చెయ్యాలనుకోవడం పక్కా సామ్రాజ్యవాదం. దురాక్రమణవాదం కూడా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s