మేము చర్య తీసుకున్నాం, మీరేం చేశారు? -కేజ్రీవాల్



ఢిల్లీ రాష్ట్ర మంత్రి ఒకరు పరాయి మహిళలతో అనైతిక చర్యలకు పాల్పడుతూ అడ్డంగా దొరికి పోయారు. ఆయన లీలలు ఫోటోలు, వీడియోలుగా వెల్లడై పత్రికలూ, న్యూస్ చానెళ్లలో ప్రత్యక్షం అయ్యాయి. ఆ దొరికిపోయిన మంత్రి మహిళా మంత్రి కావడం మరింత విపరీతం అయింది. ఆయన పేరు సందీప్ కుమార్!

ఇప్పుడు ఈ వార్త బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మంచి అవకాశంగా లభించింది. లేదా ఒక బంపర్ అవకాశంగా ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఆ పార్టీల నేతలు చేస్తున్న ప్రకటనలు, వెల్లడి చేస్తున్న ఆగ్రహావేశాలు, ముందుకు తెస్తున్న డిమాండ్లు, అల్లుతున్న వలలు, వేస్తున్న ఎత్తులు వారి సంబరాన్ని పట్టిస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు AAP పైనా, కేజ్రీవాల్ పైనా ఆలౌట్ అటాక్ కు దిగారు.

“ఇంకేముంది! అరవింద్ కేజ్రీవాల్ నిజ స్వరూపం బట్టబయలు అయింది. ఆయన మంత్రులు అందరూ ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడి దొరికిపోయిన వారే. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు కోల్పోయారు. ఆయన రాజీనామా చేయాలి” అని ఇండియా టుడే ఛానెల్ లో నిన్న ఢిల్లీ బీజేపీ నేత ఆగ్రహంగా డిమాండ్ చేశారు. గురువారం కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసన ప్రదర్శన కూడా బీజేపీ నిర్వహించింది.

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కూడా దాదాపు ఇదే తరహా డిమాండ్ చేశారు. మంత్రుల అనైతిక చర్యలకు ఆయన బాధ్యత వహించాలని కోరారు. ఢిల్లీ కాంగ్రెస్ నేత ఒకరు కేజ్రీవాల్ ప్రభుత్వం ‘ఆలీబాబా నలభై దొంగలు’ మంత్రివర్గం నడుపుతున్నారని, ఆయన ప్రభుత్వం పై ప్రజలు నమ్మకం కోల్పోయారని తేల్చి చెప్పారు.

విమర్శలకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీటుగా సమాధానం ఇచ్చారు. ఆయన ముందుకు తెస్తున్న ఒకే ఒక డిఫెన్స్ “నేను వెంటనే చర్య తీసుకున్నాను. మీరు ఏమి చర్యలు తీసుకున్నారు. చర్యలు తీసుకోక పోగా తప్పు చేసిన, అవినీతికి పాల్పడిన మీ నేతలు అందరిని సమర్ధించుకున్నారు. ఇంకా సమర్ధించుకుంటూనే ఉన్నారు” అని.

ఇది నిజమే అనడంలో సందేహం లేదు. మంత్రి సెక్స్ స్కాండల్ కి సంబంధించిన వీడియో ఆయనకు అందగానే మంత్రిని పదవి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. “మంత్రి అనైతిక ప్రవర్తన వీడియోని ఇప్పుడే చూసాను. తక్షణమే ఆయనను పదవి నుండి తొలగిస్తున్నాను” అని ఆయన ట్విట్టర్ లో ప్రకటించారు. మంత్రికి మద్దతుగా కేజ్రీవాల్ ఒక్క మాట కూడా చెప్పలేదు. “ఆయన చెప్పేది కూడా వినాలి కదా” అని కూడా అనలేదు. “చట్టం తన పని తాను చేసుకు పోతుంది” అంటూ తప్పించుకునేందుకు, వెనకేసుకు వచేందుకు చెప్పే సొల్లు మాటలు చెప్పలేదు.

వాటికి బదులుగా 8 నిమిషాల 30 సెకన్ల నిడివి గల వీడియో సందేశాన్ని కేజ్రీవాల్ విడుదల చేశారు. “మేము ఈ చర్యను వెనకేసుకు రావటం లేదు. ఇతర పార్టీల వలే సమర్ధించే ప్రయత్నం చేయడం లేదు. పైగా వెంటనే, వేగంగా చర్య తీసుకున్నాము” అని అయన వీడియోలో ప్రకటించారు.

ఈ వ్యవహారం వల్ల పార్టీ కార్యకర్తల నైతిక ధృతి భంగపడిందని, వారు ఎంతో కొంత ధైర్యం కోల్పోయారని కేజ్రీవాల్ అంగీకరించారు. “ఆయన మా నమ్మకాన్ని బద్దలు చేశారు. తదుపరి తీసుకోవలసిన చర్యలను పార్టీ నిర్ణయిస్తుంది” అని స్పష్టం చేశారు.

బీజేపీ, కాంగ్రెస్ లు తప్పు చేసిన తమ నేతలను ఎలా సమర్ధించింది ఆయన వీడియోలో వివరిస్తూ తమ పార్టీకి ఆ పార్టీలకు తేడాలు చూపారు. “వాళ్ళ మంత్రులు అనేక కుంభకోణాల్లో దొరికిపోయారు. వారిని ఇప్పుడూ వెనకేసుకు వస్తున్నారు. వ్యాపం కుంభకోణంలో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ను బీజేపీ ఇప్పటికి సమర్థిస్తోంది. మైనింగ్ స్కామ్, లలిత్ గేట్ స్కామ్ లలో దొరికిన వసుంధర రాజే ను సమర్థిస్తున్నారు. పంజాబ్ కి చెందిన (బిక్రమ్ సింగ్) మజిథియ అందరికి తెలిసిన డ్రగ్ లార్డ్ (మాదకద్రవ్యాల స్మగులింగ్ డాన్). కానీ మేము ఇప్పుడు తీసుకున్నట్లుగా బీజేపీ వారిపైన ఎప్పటికి చర్య తీసుకోదు. కాంగ్రెస్ నాయకులు కూడా అంతే. కెప్టెన్ అమరీందర్ సింగ్ కుటుంబ సభ్యులకు స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. కానీ ఇంతవరకు వారిపై చర్యలు లేవు. పైగా ఆయన పంజాబ్ విభాగానికి ఇన్-చార్జి గా చేశారు” అని కేజ్రీవాల్ వివరించారు.

“AAP కి ఇతర పార్టీలకు ఇదే తేడా. మా మంత్రి తప్పు చేసినా మేము సహించేది లేదు. నేను ఏదన్నా తప్పు చ్చేస్తూ దొరికినా నా పైన కూడా కఠిన చర్య తీసుకోవాలని నేను మనీష్ సిసోడియా కు చెప్పాను” అని కేజ్రీవాల్ వీడియోలో వివరించారు.

అరవింద్ కేజ్రీవాల్ విసిరినా సవాలుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వద్ద సమాధానం ఉన్నదా?

One thought on “మేము చర్య తీసుకున్నాం, మీరేం చేశారు? -కేజ్రీవాల్

వ్యాఖ్యానించండి