భౌగోళిక రాజకీయాలలో ఆర్ధిక చర్యల వరకే పరిమితం అయిందని భావిస్తున్న చైనా సైనిక చర్యలకు సైతం సిద్ధపడుతోంది. ఇసిస్ బలగాల వల్ల దక్షిణ ఆసియా, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, చైనా పొరుగు ప్రాంతం అభధ్రతకు గురవుతున్నాయని భావిస్తున్న చైనా పెద్ద సంఖ్యలో ఆఫ్రికా, ఆసియాలకు సైనికులను తరలిస్తోంది.
సైనిక బలగాల నియోగానికి కారణంగాపైకి చెప్పటానికి ఇసిస్ టెర్రరిస్టు చర్యలు కారణంగా చైనా చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఇది భౌగోళిక రాజకీయాలలో చైనా సైనిక ప్రవేశంగా భావించవలసి ఉంటుంది. ఇసిస్ క్రమంగా తన ఉగ్రవాద చర్యలను దక్షిణాసియా దేశాలకు కూడా విస్తరిస్తున్నది.
బంగ్లా దేశ్ లో శనివారం (జులై 2, 2016) జరిగిన బాంబు పేలుళ్లలో 40 మంది వరకు చనిపోగా ఇండియాలో హైద్రాబాద్ నగరంలో ఇసిస్ తో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ 6గురు ముస్లిం యువకులను పోలీసులు నిర్బంధం లోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన మరుసటి రోజుకే ఒక వ్యక్తిని విడుదల చేసిన పోలీసులు మిగిలిన వారందరు దాడులకు పధకం వేసినట్లు చెబుతున్నారు. కాగా తమ పిల్లలు అలాంటి వారు కాదని తల్లిదండ్రులు గట్టిగా చెబుతున్నారు.
ఇసిస్ విస్తరణ అంటే అమెరికా సామ్రాజ్యవాద చర్యల విస్తరణ అని అర్ధం. సిరియాలో రష్యా మరియు ప్రభుత్వ బలగాల చేతుల్లో ఇసిస్, ఆల్-నూస్రా ఉగ్రవాద బలగాలు చావు దెబ్బలు తింటున్నప్పుడల్లా సంధి/చర్చల ప్రతిపాదనలు చేయటం ద్వారా సిరియా ప్రభుత్వ పురోగమనాన్ని అడ్డుకుని, కాల్పులకు విరమణ సంపాదించి తద్వారా ఇసిస్, ఆల్ నూస్రా బలగాలు తిరిగి పుంజుకోవటానికి పదే పదే కృషి చేయటం ద్వారా అమెరికా ఇసిస్ ను పోషిస్తున్నది, నడిపిస్తున్నది ఎవరో అనుమానం లేకుండా రుజువు చేసింది.
ఈ వాస్తవాన్ని గుర్తించగలిగితేనే ముస్లిం దేశాల్లో కూడా కారణం లేకుండా జరుగుతున్న బాంబు పేలుళ్లను అర్ధం చేసుకో గలము. లేనట్లయితే పశ్చిమ పత్రికలు, వాటిని అనుసరిస్తున్న భారతీయ పత్రికలు, ఛానెళ్ల disinformation ప్రవాహంలో పడి కొట్టుకు పోవటమే మిగులుతుంది.
చైనా పశ్చిమ రాష్ట్రంలో ముస్లిం తీవ్రవాదాన్ని అమెరికా పెంచి పోషిస్తున్న నేపధ్యంలో వారిని అరికట్టడానికి చైనా ఇరాన్, పాకిస్తాన్ లపై ఆధార పడుతోంది. ఆఫ్ఘనిస్తాన్ తో చైనా సంబంధాలను కూడా ఈ వెలుగులోనే పరిశీలించాలి. ఈ పరిస్ధితుల్లో సిరియాలో ఇసిస్ పై పోరాటంలో చైనా సైతం తన వంతు పాత్ర పోషిస్తోంది. ఇతర దేశాల్లో ఇసిస్ ఉగ్రవాద చర్యలకు చైనా అనివార్యంగా స్పందిస్తోంది.
ఈ నేపధ్యంలో జూన్ 2016 లో ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కంట్ లో షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సభ్య దేశాల నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉగ్రవాద వ్యతిరేక పోరాటమే ప్రధానాంశంగా చర్చలు జరిగాయని తెలుస్తోంది. సిరియాలో పరిస్ధితిని ఎస్‌సిఓ సభ్య దేశాలు ప్రత్యేకంగా కేంద్రీకరించి దృష్టి పెట్టాలని చైనా నిపుణులు విశ్లేషించడం గమనార్హం.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, రష్యా దేశాల భద్రతకు ఇసిస్ ఉగ్రవాద గ్రూపు ప్రమాదకరంగా మారిందని, దరిమిలా మధ్య ప్రాచ్యం, కాకసస్ (నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రం మధ్యన గల రష్యా ఐరోపా సరిహద్దు ప్రాంతం) లలోనూ భద్రతకు ప్రమాదం ఏర్పడిందని చైనా భావిస్తోంది. కనుక జీహాది గ్రూపుల వ్యతిరేక చర్యలు తీసుకునే క్రమంలో ఎస్‌సిఓ సభ్య దేశాలు పరస్పరం సహకరించుకోవాలని చైనా కోరుతోంది.
ప్రస్తుతం ఐరాస శాంతి స్ధాపక బలగాల హోదాలో లెబనాన్, దక్షిణ సూడాన్, మాలి దేశాలలో చైనా 2,500 బలగాలను నియోగిస్తున్నది. ఆఫ్రికా దేశం ద్జిబౌటిలో చైనా ఒక సైనిక స్ధావరాన్ని కూడా నిర్మిస్తోంది. ఎర్ర సముద్రం ఒడ్డున యెమెన్, ఎరిత్రియా, సోమాలియా దేశాల మధ్య కీలక ప్రాంతంలో ఉన్న చిన్న దేశం ద్జిబౌటి. ద్జిబౌటిలో సైనిక స్ధావరం నిర్మాణం పూర్తయ్యాక తన సైన్యాలను అక్కడ మోహరించేందుకు చైనా సన్నాహాలు చేస్తోందని పత్రికలు చెబుతున్నాయి.
ఈ స్ధావరం లోని సైన్యాలను ఉత్తర ఆఫ్రికా, మధ్య ప్రాచ్యంలో తన వ్యాపార ప్రయోజనాల రక్షణకు వినియోగించ నున్నదని వినికిడి. ద్జిబౌటి స్ధావరంలో 5,000 మంది సైనికులను నియోగించగల సౌకర్యాలను చైనా ఏర్పాటు చేస్తున్నది. (కౌంటర్ పంచ్ పత్రిక ప్రకారం చైనా స్ధావరంలో 10,000 మంది సైనికులను నియోగించవచ్చు.) ఇతర ఆఫ్రికా దేశాలలో మరో 2 లేదా 3 వేల మంది సైనికులను చైనా మోహరిస్తుందని పరిశీలకులు వివిధ ప్రభుత్వాల అధికారులను ఉటంకిస్తూ చెబుతున్నారు. ఈ నేపధ్యం లోనే ఉగ్రవాద వ్యతిరేక పోరాటంపై కలిసి పని చేయాలని ఎస్‌సిఓ లో చైనా ప్రతిపాదించిందని, ఆ విధంగా సైనిక సహకారం అంశాన్ని ఎస్‌సిఓ అజెండాలో చైనా చేర్చిందని నిపుణులు భావిస్తున్నారు.
పైన చెప్పినట్లు ఇసిస్ తదితర ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపుల విస్తరణ అంటే అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాల విస్తరణ అని అర్ధం. కనుక ఉగ్రవాద వ్యతిరేక పోరాటం అంటే, ఈ సందర్భంలో, అమెరికాకు వ్యతిరేకంగా తలపడటం అనే.
అమెరికా, ఇండియా, పాకిస్తాన్, ఐరోపా తదితర దేశాలు కూడా తరచుగా ఉగ్రవాద వ్యతిరేక పోరాటం అంటూ ఉంటాయి. వారి పోరాటానికీ, చైనా చెబుతున్న పోరాటానికి తేడాను తప్పనిసరిగా చూడాలి. అమెరికా ఉగ్రవ్యతిరేక పోరాటం అంటే ఉగ్రవాద వ్యతిరేక పోరాటం పేరుతో ఇతర దేశాలలో సైనికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా జోక్యం చేసుకోవటం. ఆ పేరుతో అమెరికా వెంటే ఐరోపా దేశాలు పోలోమని వస్తాయి. అదే చైనా, రష్యా, సిరియా, ఇరాన్ లాంటి దేశాల ఉగ్రవాద వ్యతిరేక పోరాటం అంటే ఇసిస్ తదితర గ్రూపుల పేరుతో అమెరికా సాగిస్తున్న సామ్రాజ్యవాద విస్తరణను, దూకుడును ప్రతిఘటించటం.
ద్జిబౌటిలో ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, జపాన్ దేశాలకు మిలట్రీ స్ధావరాలు ఉన్నాయి. ద్జిబౌటిలోని అమెరికా స్ధావరం ఈ ప్రాంతంలో ఆ దేశానికి అతి పెద్దది. 4,000 మంది సైనికులను అక్కడ అమెరికా నియోగిస్తోంది. అదనంగా చిన్న స్ధావరాన్ని కూడా అమెరికా కలిగి ఉండగా దానిని ఖాళీ చేయాలని ద్జిబౌటి ప్రభుత్వం గత సం.ము అమెరికాను ఆదేశించింది. అనంతరం ఈ యేడు జనవరిలో ఆ ప్రాంతాన్ని చైనాకు అప్పగించింది.
తన పెద్ద సైనిక స్ధావారానికి (క్యాంప్ లేమోన్నియర్) గాను అమెరికా యేటా 63 మిలియన్ డాలర్లు చెల్లిస్తోంది. చైనా అంతకు మించిన ఫలితాన్ని ద్జిబౌటికి అందిస్తోంది. ఇధియోపియా రాజధాని అడ్డిస్ అబాబా నుండి ద్జిబౌటి వరకు 3 బిలియన్ డాలర్ల ఖర్చుతో రైలు, రోడ్డు మార్గాన్ని చైనా నిర్మిస్తోంది. 400 మిలియన్ డాలర్ల ఖర్చుతో ద్జిబౌటి రేవు పట్టణాన్ని అభివృద్ధి చేస్తోంది.
ద్జిబౌటిలో చిన్న స్ధావరం కోసం అమెరికా 14 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. దానిని ఖాళీ చేయించి చైనాకు అప్పగించటం అమెరికాకు తీవ్ర అవమానంగా మిగిలింది. దానితో ద్జిబౌటిలో ప్రభుత్వం మార్పుకు (శ్రీలంకలో వలెనే) అమెరికా కుట్రలు ప్రారంభించిందని తెలుస్తోంది. ద్జిబౌటిలో అమెరికా నిర్మించిన విమానాశ్రయాన్ని కూడా, అభివృద్ధి కోసం అంటూ, చైనాకు అప్పగించినట్లు తెలుస్తున్నది. ఈ విమానాశ్రయం ద్వారా అరేబియా ద్వీపకల్పం, ఈజిప్టు, తూర్పు లిబియాల నుండి మధ్య ఆఫ్రికా వరకు గూఢచార సమాచారాన్ని సేకరించే అవకాశం చైనాకు దక్కుతుంది.
మిలటరీ విశ్లేషకుల ప్రకారం ఆధునిక యుగంలో ఉగ్రవాద వ్యతిరేక పోరాటం అంటే పూర్తి స్ధాయి ఫిరంగి, క్షిపణి బలగాలను యుద్ధ విమానాలను ఉమ్మడిగా వినియోగించడం. ఇందుకోసం సాధ్యమైనంతగా అధిక సంఖ్యలో లాజిస్టిక్స్ (రేవులు, స్ధావరాలు, రవాణా మార్గాలు, ఇంధన రవాణా) సౌకర్యాలు చైనా, మిత్ర దేశాలకు అవసరం అవుతాయి. ఇరాన్ కూడా ఎస్‌సిఓ లో చేరినట్లయితే చైనాకు మరిన్ని లాజిస్టిక్స్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
ఎస్‌సిఓ సాధనంగా, మధ్య ప్రాచ్యం కేంద్రంగా చైనా తన మిలట్రీ శక్తిని ప్రదర్శించటానికి ఏర్పాట్లు చేసుకుంటోందని జూన్ నెలలో జరిగిన ఎస్‌సిఓ సమావేశం అంశాలు తెలియజేస్తున్నాయి.