(ఫిబ్రవరి 4వ తేదీన ది హిందు పత్రికలో ప్రచురించబడిన ఆర్టికల్ “Dispossession, development and democracy” కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్)
“న్యాయమైన పరిహారం పొందే హక్కు, భూ స్వాధీనం, పునరావాసం మరియు పునఃస్ధిరనివాస చట్టం” (Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act –LARR) ను సెప్టెంబర్ 2013లో ఆమోదించినప్పటి నుండి అది అన్ని వైపుల నుండి విమర్శలు ఎదుర్కొంది. భూములు కోల్పోయినవారికి సరిపోయినంత పరిహారం కల్పించడంలో ఈ చట్టం విఫలం అయిందని, నీటిపారుదల ప్రాజెక్టులకు మినహాయింపు ఇవ్వడం లాంటి భారీ కంతలు చట్టంలో ఉన్నాయని, ముఖ్యంగా ప్రైవేటు కంపెనీల కోసం భూములను స్వాధీనం చేసుకునేందుకు అవకాశం ఇస్తోందని రైతులు మరియు సామాజిక ఉద్యమకారులు వాదించారు. మరోవైపు పారిశ్రామికవేత్తలు, డెవలపర్లు, రాష్ట్ర ప్రభుత్వాలేమో ఈ బిల్లు ప్రాజెక్టులను ఆలస్యం చేస్తుందని, భూ స్వాధీనం ఖర్చును పెంచుతుందని, ఆర్ధిక వృద్ధికి ఆటంకం అనీ ఫిర్యాదు చేశారు. (ఇప్పటి కేంద్ర) ప్రభుత్వం రెండో అభిప్రాయంతో ఏకీభవించిందన్న సంగతి రహస్యం ఏమీ కాదు. దరిమిలా డిసెంబర్ 31 తేదీన జారీ చేసిన ఆర్డినెన్స్ ద్వారా ఎల్.ఎ.ఆర్.ఆర్ లోని కీలకమైన అంశాలను అది నీరు గార్చడంలో ఆశ్చర్యమూ ఏమీ లేదు.
ఇష్టానుసారం భూముల నుండి తరిమివేయబడడం నుండి గ్రామీణ ప్రజలకు కాస్త రక్షణ కల్పించిన ఎల్.ఎ.ఆర్.ఆర్ చట్టంలోని ప్రధాన అంశాలను ఆర్డినెన్స్ తొలగించివేసింది. మొదటిది: ప్రైవేటు ప్రాజెక్టుల కోసం భూములను సేకరించేందుకు భూముల సొంతదారులలో కనీసం 80 శాతం మంది అనుమతి ప్రభుత్వం తీసుకోవాలన్న షరతును, పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్ షిప్ ప్రాజెక్టుల కైతే కనీసం 70 శాతం సొంతదారుల అనుమతి తప్పనిసరన్న షరతును తొలగించారు. ఆ విధంగా తన చిత్తానుసారం ఎలాంటి ప్రైవేటు కారణం రీత్యా అయినా సరే, దానివల్ల ప్రభావితులయ్యే ప్రజల మద్దతు గెలుచుకోకుండానే, భూములను స్వాధీనం చేసుకోగల సామర్ధ్యాన్ని ప్రభుత్వం పునరుద్ధరించుకుంది. రెండవది: భూముల స్వాధీనానికి ముందు తప్పనిసరిగా “సామాజిక ప్రభావ మదింపు’ (Social Impact Assessments -ఎస్.ఐ.ఎ) వేయాలని ఎల్.ఎ.ఆర్.ఆర్ నిర్దేశించగా ఆర్డినెన్స్ ఆ నిబంధననూ తొలగించింది. దీనివల్ల ప్రాజెక్టుల వల్ల కలిగే లాభాలతో నిర్వాసితుల (అభ్యంతరాల)ను తూచడం అటుంచి వారు ఎదుర్కొనే ప్రతికూల పరిణామాలను మదింపు వేసే అవసరం లేకుండానే భూముల నుండి ప్రజలను ఖాళీ చేయగల సామర్ధ్యం ప్రభుత్వానికి తిరిగి చేకూరుతుంది.
ఎస్.ఐ.ఎ లు లేకుండా (భూముల స్వాధీనం వల్ల) కనీసం ఎవరు ప్రభావితం అవుతున్నారో తెలుసుకునే మార్గం కూడా పూర్తిగా మూసుకుపోతుంది. ఫలితంగా భూమేతర యజమానులకు -కూలీలు, కౌలుదారులు, చేతి వృత్తులవారు, మత్స్య కార్మికులు మొ.నవారు- కూడా పరిహారం చెల్లిస్తామన్న హామీ రద్దైపోయింది. ఇటువంటి ప్రధాన మార్పులతో పాటు ఇంకా, ప్రభుత్వం గానీ, కంపెనీ గానీ వినియోగించిన భూమిని తమవద్దనే అట్టిపెట్టుకోగల కాలాన్ని ఆర్డినెన్స్ పెంచింది. ఎల్.ఎ.ఆర్.ఆర్ చట్టం నిర్దేశించిన ప్రమాణాలను పాటించని అధికారులకు విధించిన కఠినమైన అపరాధ రుసుములను రద్దు చేసేసింది. ఇలాంటి తుడిచిపెట్టే మార్పులను ఆర్డినెన్స్ ద్వారా చేయడం ద్వారా, ఏడు సంవత్సరాల పాటు ప్రజల మధ్య చర్చోపచర్చలు నిర్వహించి, అనేక మార్పులు చేర్పులతో ద్వైపాక్షిక (పాలక, ప్రతిపక్షాల రెండింటి) మద్దతుతో పార్లమెంటు ఆమోదించిన ఒక చట్టం యొక్క స్ఫూర్తిని ఒకే ఒక్క కార్యనిర్వాహక చర్యతో ప్రభుత్వం బలహీనపరిచింది.
ఆర్ధిక వృద్ధికి పెద్ద ఆటంకంగా మారినందునే ఎల్.ఎ.ఆర్.ఆర్ కు ఈ మార్పులు అవసరం అయ్యాయని వాదిస్తున్నారు. ఈ వాదనకు మద్దతుగా వచ్చే ఎలాంటి సాక్ష్యమూ ఇంతవరకు లేదు. కాగా, సంజయ్ చక్రవర్తి అనే ఆర్ధికవేత్త ది హిందూ పత్రికలో జనవరి 7, 2015 తేదీన “అమలు సాధ్యం కాని ఒక చట్టాన్ని మెరుగుపరచడం” (Improving an unworkable law) శీర్షికన ఆర్డినెన్స్ కు మద్దతుగా విస్పష్టమైన అంశాలతో కూడిన వాదనలు ముందుకు తెచ్చారు. అప్పటికే అత్యధిక స్ధాయిలో ఉన్న మార్కెట్ ధరలను రెండు రెట్లు లేదా నాలుగు రెట్లు చేయడం ద్వారా భూములు కోల్పోయేవారి వల్ల గాలివాటున లబ్ది పొందేవారిని ఎల్.ఎ.ఆర్.ఆర్ చట్టం సృష్టించిందని చక్రవర్తి వాదించారు. ఉదారంగా ప్రకటించబడిన నష్టపరిహారం చెల్లింపుల స్ధాయిని కొనసాగిస్తూనే ఎస్.ఐ.ఎ ల నిర్వహణ మరియు ప్రభావిత ప్రజల ఆమోదం పొందడం లాంటివాటి వల్ల ఉత్పన్నమయ్యే పరోక్ష ఖర్చును ఆర్డినెన్స్ తగ్గించిందని ఆయన వాదన. ఆర్డినెన్స్ అనంతరం కూడా ఎల్.ఎ.ఆర్.ఆర్ నిర్దేశించిన నష్టపరిహారం స్ధాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయని, “ప్రభుత్వ ప్రాజెక్టులు భరించలేనివిగా, ప్రైవేటు ప్రాజెక్టులు పోటీ ఇవ్వలేనివిగా మారవచ్చు” అనీ చక్రవర్తి ఆందోళనచెందారు. ఈ అవగాహనతో ప్రైవేటు రంగం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్ధిక వృత్తిలో ఉన్నవారు విపరీతంగా ఏకీభవిస్తున్నారు.
నష్టపరిహారం లెక్కించడం
కానీ ఈ వాదనతో అనేక సమస్యలు ఉన్నాయి. మొదటిది: ఎల్.ఎ.ఆర్.ఆర్ ద్వారా నష్టపరిహారం లెక్కించే పద్ధతిని గురించి తప్పు దోవ పట్టించే దృశ్యాన్ని ముందుకు తేవడం పైన ఈ వాదన ఆధారపడింది. ఇటీవలి సంవత్సరాలలో భూముల ధరలు ఆకాశానికి చేరాయనడం వాస్తవమే గానీ, ఎల్.ఎ.ఆర్.ఆర్ చట్టం కింద రైతులు నష్టపరిహారం పొందడానికి ఈ ధరలే ప్రాతిపదిక అని చెప్పడం తప్పు. గత ‘భూ స్వాధీన చట్టం’ (Land Acquisition Act -LAA) లాగానే ఎల్.ఎ.ఆర్.ఆర్ కూడా భూమి యొక్క మార్కెట్ మదింపు విలువనే ప్రారంభ విలువగా పరిగణిస్తుంది. దీనినే “సర్కిల్ రేటు”గా చెబుతారు. భూమి యొక్క గత వ్యవసాయక ధరపై ఆధారపడి సర్కిల్ రేటును నిర్ణయిస్తారు గానీ పారిశ్రామిక, వాణిజ్య, నివాసయోగ్య భూమిగా మారిన తర్వాత పలికే ధరను సర్కిల్ రేటుగా తీసుకోరు. స్టాంప్ డ్యూటీని కనీస స్ధాయిలో ఉంచేందుకు వీలుగా వ్యవసాయక ధరను ఉద్దేశ్యపూర్వకంగా తగ్గించి ఉంచుతారన్నది రహస్యం ఏమీ కాదు. సర్కిల్ రేటుకూ, మార్కెట్ రేటుకూ మధ్య వ్యత్యాసం సాధారణంగా చాలా అధికంగా ఉంటుంది. ఉదాహరణకి ‘ద గ్రేటర్ నొయిడా ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ ఆధారిటీ” (GNIDA) చదరపు మీటరుకు రు. 820 లు చెల్లించి స్వాధీనం చేసుకున్న భూమిని డెవలపర్స్ కు రు 35,000 లకు అప్పగించడం ద్వారా ప్రసిద్ధికెక్కింది. ఈ ధర సైతం ఆ భూములపై నిర్మించిన అత్యున్నత స్ధాయి ఫ్లాట్ ధరలో చాలా కొద్ది భాగం మాత్రమే. అయితే నొయిడా ఆధారిటీని ఒంటరిని చేసి నిందించరాదు. దేశవ్యాపితంగా ఉన్న అర్బన్ డెవలప్ మెంట్ ఆధారిటీలు, ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లు అన్నింటిలోనూ ఇది సర్వ సాధారణం.
నిజానికి ఇండియాలో నేడు అనేక భూముల స్వాధీనాల్లో మార్కెట్ ధరలు మరియు నష్టపరిహారం నిమిత్తం చెల్లించే ధరల మధ్య వ్యత్యాసాన్ని స్వాయత్తం చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఉంది. ఈ వ్యత్యాసాన్ని మనం “డిస్పొసెషన్ విండ్ ఫాల్” – భూముల నుండి వాటి సొంతదారులను తరిమివేయడం ద్వారా పొందే గాలివాటు లాభం- గా పేర్కొనవచ్చు. రైతులను వారి భూములను బలవంతంగా వెళ్లగొట్టడమే కాకుండా ఆ భూములు పొందేవారికి సబ్సిడీ ఇవ్వడానికి కూడా ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నందువల్ల మాత్రమే ఈ గాలివాటు లాభం ఉనికిలో ఉన్నది. ఇంత స్పష్టంగా ఉన్న అన్యాయం వల్లనే భూముల స్వాధీనంపట్ల రైతుల్లో విస్తృతంగా వ్యతిరేకత పెల్లుబికి, బి.జె.పి మద్దతుతో యు.పి.ఎ ప్రభుత్వం ఎల్.ఎ.ఆర్.ఆర్ చట్టాన్ని తెచ్చేలా ఒత్తిడి వచ్చింది. ఇక్కడగా గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎల్.ఎ.ఆర్.ఆర్ చట్టం ‘డిస్పొసెషన్ విండ్ ఫాల్’ ను రద్దు చేయలేదు. ఎల్.ఎ.ఆర్.ఆర్ నిర్దేశించిన నష్టపరిహార సూత్రంలో సర్కిల్ రేటును పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు, గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు రెట్లు (ఈ తేడా ఎలా చూడాలన్నది రాష్ట్రాలకు వదిలివేయబడింది) చేయడం ఉన్నది గానీ మార్కెట్ రేటును రెండు, నాలుగు రెట్లు చేయడం లేదు. ఇలా ఇన్ని రెట్లు పెంచడం చిత్తానుసారం జరిగిందని కొందరు వాదించవచ్చు. కానీ అది నష్టపరిహారం చెల్లింపును మార్కెట్ ధరలకు చేర్చడం అయితే ఖచ్చితంగా చేయలేదు. ఎల్.ఎ.ఆర్.ఆర్ వల్ల రైతులు, ప్రైవేటు రంగాన్ని బలిపెట్టి, గాలివాటు లాభం పొందుతున్నారని వాదించడం అంటే వాస్తవాన్ని తిరగేసి చెప్పడమే. రైతులకు చెల్లించే నష్టపరిహారం తగ్గించాలని వాదించడం అంటే ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వ (ప్రజల) ప్రయోజనాలకు ఉపయోగించేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని కార్పొరేట్ వర్గాల సూపర్ లాభాల అర్జనకు ఉపయోగించడాన్ని సమర్ధించడమే.
…………………………..ఇంకా ఉంది.
Reblogged this on మావో ఆలోచనా విధానం.