పోలీస్ చర్యతో సిడ్నీ సీజ్ అంతం -ఫోటోలు


సిడ్నీలో ఒక చాకోలేట్ కేఫ్ ను అదుపులో తీసుకున్న ఆగంతకుడు ఒకరు ఒక రోజంతా భయాందోళనలు సృష్టించాడు. కేఫ్ లో ఉన్న పౌరులను బందీలుగా ఉంచుకున్న సాయుధ వ్యక్తి డిమాండ్ లు ఏమీ చేయకపోవడం విశేషం. ఆగంతుకుడు ముస్లిం ఉగ్రవాదిగా పశ్చిమ పత్రికలు ప్రచారం చేశాయి. తీరా చూస్తే ఆ వ్యక్తి ఒక ఇరానియన్ ఆస్ట్రేలియన్ అనీ, తనపై దాఖలైన కేసుల్లో హై కోర్టు నిర్ణయం తనకు వ్యతిరేకంగా ఉండడంతో ఈ చర్యకు పాల్పడ్డాడని కొన్ని పత్రికలు తెలిపాయి.

16 గంటల డ్రామా అనంతరం పోలీసులు ఒక్కుమ్మడిగా కేఫ్ పైకి దాడి చేసి సీజ్ కు ముగింపు పలికారని పత్రికలు తెలిపాయి. పోలీసు చర్యలో ఆగంతకుడు మరణించాడా, బందీగా పట్టుకున్నారా అన్న వివరాలను పోలీసులు గానీ, ప్రభుత్వం గానీ చెప్పలేదు. 49 సం.ల హరోన్ మునిస్ గా ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తించిన ఆగంతకుడు ఇరాన్ నుండి వలస వచ్చి ఆస్ట్రేలియా పౌరుడు అయ్యాడు. మాజీ భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు. ఆయన ఇసిస్/ఆల్-ఖైదా ఉగ్రవాదే అని నమ్మబలికేందుకు పశ్చిమ పత్రికలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవేమీ పెద్దగా ఫలించినట్లు లేదు.

15 మంది కేఫ్ విజిటర్లను బందీలుగా ఉంచుకున్న మునిస్ తో సంబంధం పెట్టుకున్నామని, ఆయన డిమాండ్లు ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెబుతూ వచ్చారు. ఈ లోపే అయిదారుగురు బందీలు ఎలాగో బైటపడి కేఫ్ పక్క గేటు నుండి తప్పించుకుని పరుగు పరుగున పోలీసుల చేతుల్లోకి వచ్చి వాలారు. తాము తొందరపడడం లేదని, కిడ్నాపర్ తో ఓపికగా వ్యహరిస్తామని చెప్పిన పోలీసులు ఉన్నట్లుంది కేఫ్ పై దాడి చేశారు. దాడిలో మునిస్ పరిస్ధితి ఏమైంది తెలియలేదు. చెప్పడానికి పోలీసులు నిరాకరించినట్లు తెలుస్తోంది.

ఇరాన్ నుండి వలస వచ్చిన మునిస్ తనను తాను షేక్ గా ప్రకటించుకున్నాడని డెయిలీ మెయిల్ పత్రిక తెలిపింది. ఆఫ్ఘన్ యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాలకు 2007, 2009లలో ద్వేషపూరిత ఈ మెయిల్స్ పంపిన కేసులో మునిస్ కు ఆస్ట్రేలియా కోర్టు 300 గంటల కమ్యూనిటీ సర్వీసు శిక్ష విధించింది.

నవంబర్ 13లో మునిస్ మాజీ భార్య నవంబర్ 2013లో తన అపార్టుమెంటులో మంటల్లో కాలి మరణించింది. ఆయన మహిళా స్నేహితురాలు, మునిస్ కలిసి ఆమెను చంపారని నేరారోపణలు ఎదుర్కొన్నారు. అయితే కేసు బలహీనంగా ఉండడంతో ఇరువురూ బెయిలుపై విడుదల అయ్యారు.

అనంతరం 27 యేళ్ళ యువతిపై 2002లో అత్యాచారం చేశాడన్న ఆరోపణతో ఈ సం. ఏప్రిల్ లో ఆయన మళ్ళీ అరెస్టు అయ్యాడు. తన క్లినిక్ కి వచ్చిన యువతికి తాను ఆస్ట్రాలజీ, ధ్యానం, బాణామతి నిపుణుడిని అని చెప్పి ఆకర్షించి అత్యాచారం చేశాడని అభియోగం మోపారు. ఇదే ఆరోపణలతో అక్టోబర్ లో మరిందరు యువతులు ముందుకు రావడంతో మునిస్ చుట్టూ ఉచ్చు బిగీసుకుంది. ఈ ఆరోపణలను కొట్టివేయాలని మునిస్ హై కోర్టుకు వెళ్ళగా అందుకు తిరస్కరిస్తూ కోర్టు గత శుక్రవారం తీర్పు చెప్పింది. దానితో నిరాశా, నిస్పృహలకు గురయిన మునిస్ సిడ్నీలో తాజా దురాగతానికి తెగబడ్డాడు.

కిడ్నాప్, బందీలుగా ఉంచుకున్న ఈ వ్యవహారంలో ఎవరికీ గాయాలు కాలేదని ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు.

తాజా సమాచారం

పోలీసుల మెరుపు దాడిలో ఇద్దరు బందీలు, హరోన్ మునిస్ చనిపోయారు. ఐదుగురు బందీలు ఒక్కరోక్కరుగా కిడ్నాప్ నుండి తప్పించుకుని బైటపడడంతో మునిస్ ఒక్కసారిగా ఆగ్రహోదగ్రుడు అయినట్లు తెలుస్తున్నది. పెద్ద పెద్దగా కేకలు వేస్తూ బందీలపై దాడికి దిగుతున్న సూచనలు కనిపించడంతో పోలీసులు దాడి చేశారని తెలుస్తోంది. దాడిలో ఇద్దరు బందీలతో పాటు హరోన్ మునిస్ కూడా చనిపోయాడు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి.

బందీలు ఒక్కరొక్కరుగా తప్పించుకుపోవడంతో హరోన్ మునిస్ కుపితుడై ఒక బందీపై కాల్పులు జరిపి చంపేశాడని దానితో పోలీసులు దాడి చేశారని డెయిలీ మెయిల్ తెలిపింది.

దుర్ఘటన గురించిన మరిన్ని వాస్తవాలు కొద్ది రోజులలో వెల్లడి కావచ్చు. ఈ వాస్తవాలు పశ్చిమ పత్రికల ఊహాగానాలకు భిన్నమైన చిత్రాన్ని మనముందు ఉంచినా ఆశ్చర్యం లేదు.

ఫోటోలను డెయిలీ మెయిల్. రాయిటర్స్… తదితర సంస్ధలు అందించాయి.

 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s