(విశాఖ జిల్లా ప్రగతిశీల మహిళా సంఘం (POW) వారు 1990లో ఒక పుస్తకం ప్రచురించారు. కుటుంబ హింసకు, వరకట్న హత్యకు, లాకప్ హత్యకు, అత్యాచారాలకు గురయిన వివిధ మహిళల కోసం వారు చేసిన కృషిని విశ్లేషణాత్మకంగా ఈ పుస్తకంలో వివరించారు. దాదాపు అన్ని రంగాలలోని -కూలీలు, ఫ్యాక్టరీ కార్మికులు, ప్రొఫెసర్ల కూతుళ్ళు, బ్యాంకర్ల భార్యలు, ఉద్యోగుల కోడళ్ళు…ఇలా వివిధ తరగతులకు చెందిన మహిళలు పురుషాధిక్య వ్యవస్ధ పాటించే వివక్షను, అణచివేతను, హింసను, చివరికి హత్యలను ఎదుర్కొంటున్నారని విశాఖ POW వారు చేసిన కృషి ద్వారా తేటతెల్లం అయింది. ఆ పుస్తకం వెనుక కవర్ పేజీపై ఈ కవిత ప్రచురించబడింది. -విశేఖర్)
*********
మీ ఊపిరులతో నోట్ల కట్టలు
ప్రాణం పోసుకుని పరుగులు తీస్తున్నపుడు…
మీ మానాలు సిగరెట్ కాల్చడం కంటే
తేలిగ్గా భంగం అవుతున్నపుడు…
మీ దేహాలు ఆ చూపులకి ఆవిరై
మాంసపు ముద్దలుగా ఘనీభవిస్తున్నపుడు…
మీ ఆశలు ప్రాణ ప్రతిష్ట కాకముందే
ఎనిమిదో అడుగులోనే సమాధి అవుతున్నపుడు…
మీ కన్నీటికి ఇక
ఏ మాత్రం ఓదార్పు దొరకదు!
.
పురుషత్వం అహంకార బురుజులపై
బీరాలు పలుకుతున్నపుడు…
మతాలు ‘బురఖాల్ని’
దాటి రావద్దని శాసిస్తున్నపుడు…
వెండి తెరపై మీ శీలం
నగ్నంగా ఆరవేయబడుతున్నపుడు…
వర శుల్కం వధ్య శిలపై మీ అస్తిత్వమే
ఓ ప్రశ్నగా మిగిలినపుడు…
మీ వేడుకోళ్ళు ఇక
ఎంతమాత్రం మిమ్మల్ని రక్షించవు!!
.
ఎర్రటోపీల సాక్షిగా మీ ఆర్తనాదాలు
లాకప్ గదుల్లో రికార్డవుతున్నపుడు…
మానభంగ నిర్ధారణకై
నల్లకోట్లు సిగపట్లు పడుతున్నపుడు…
మీ శవాలతో పోస్టుమార్టం బల్లపై
తెల్లకోట్లు బిలియర్డ్స్ ఆడుతున్నపుడు…
వ్యవస్ధ చిత్రపటంపై మీ జీవితాలు
నెత్తుటి మరకలుగా ప్రత్యక్షమవుతున్నపుడు…
మీ మౌనం ఇక
ఎంతమాత్రం పరిష్కారం కాదు!!!
.
-ఎన్వీయస్, 04/03/1990
నిజమే. అణచివేతను మౌనంగా భరించినంత కాలం …కొనసాగుతుంది. అదే ఎదురుతిరిగి ప్రశ్నిస్తేనే…పరిష్కారమవుతుంది. మహిళలూ గొంతు విప్పండి. అన్యాయాల్ని ప్రశ్నించండి
//వ్యవస్ధ చిత్రపటంపై మీ జీవితాలు
నెత్తుటి మరకలుగా ప్రత్యక్షమవుతున్నపుడు…//
ఇక్కడ దారునాతి దారుణం ఏమిటంటే ,ఎవరినైతే మోసం చేస్తున్నారో వారిచేతనే మోసాన్ని జరిపించడం! వారినే రక్షక కవచంగా ఉపయోగించుకోవడం. వారు స్త్రీలు గానీ, శ్రామికులు గానీ. భస్మాసూరున్ని భస్మాసూర హస్తంతోటే చంపటం ఈ వ్యవస్థకు వెన్నతో పెట్టిన విధ్య. ఉదా: సిల్క్ స్మితా గారి క్యాబరే డాన్స్ ల మీద కొన్ని ప్రాంతాల్లో దాడి చేయటం చివరకు ఆమె ఈ పురుష దురాహంకార వ్యవస్థకు భలి కావటం తెలిసిందే.
తొంబైల్లోనే ఈ కవిత రాయటం, ఈ సంఘటణలు కూడా జరిగినట్లు అనుకుంటాను.