ఆల్-ఖైదా నేతగా చెబుతున్న అయిమన్ ఆల్-జవహిరి వీడియో వెలువడిన వెంటనే కేంద్ర హోమ్ శాఖ దేశంలో హై అలర్ట్ ప్రకటించింది. హోమ్ మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, పరిస్ధితిని సమీక్షించి, భద్రతా సంస్ధలకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యను నిపుణులు విమర్శిస్తున్నారు. ‘హై అలర్ట్’ అంటూ ప్రకటించిన అప్రమత్తత చివరికి మైనారిటీ ప్రజలను పోలీసులు, ఇతర బలగాలు వేధింపులకు గురిచేసి భారత ప్రధాన స్రవంతి నుండి దూరం చేసేందుకే దోహదం చేస్తాయని హెచ్చరిస్తున్నారు.
న్యూ ఢిల్లీ లోని ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాన్ ఫ్లిక్ట్ మేనేజ్ మెంట్’ సంస్ధ డైరెక్టర్ అజయ్ సాహ్ని ఈ విషయమే చెప్పారు. ముస్లింలను డీ-రాడికలైజ్ (తీవ్రవాద భావాల నుండి దూరం చేసేందుకు చర్యలు చేపట్టడం) చేసేందుకు యు.కె, బెల్జియం లాంటి ఐరోపా దేశాలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయని ఆయన గుర్తు చేశాడు.
“తక్షణ ప్రతిస్పందన చూపవలసిన అవసరం ఇక్కడ ఏమీ లేదు. పశ్చిమ దేశాలను అనుకరించవలసిన అవసరం అసలే లేదు. పలు సంస్కృతులను ఇముడ్చుకునే స్వభావం కలిగిన మన బహుళ సంస్కృతి వలన ముస్లింలు, ముస్లిమేతరులు అనేక స్ధాయిల్లో పరస్పరం ఇచ్చి పుచ్చుకునే సంబంధాల్లో ఉన్నారు. తీవ్రవాద భావజాలం వైపుకు యువత ఆకర్షితులు కాకుండా ఉండడానికి మనకు ఇదే అత్యంత మెరుగైన గ్యారంటీ. బహుళ సంస్కృతుల బంధాన్ని మరింత పఠిష్టం చేయడమే మనము చేయవలసింది” అని అజయ్ సాహ్నీ వివరించారు.
ఆయన కొనసాగిస్తూ “భారతీయ ముస్లింలు ఎన్నడూ ఉగ్రవాదాన్ని సమర్ధించలేదు. గత అనేక శతాబ్దాలుగా భారత దేశంలోని ఇస్లాం చాలా జీవత్వాన్ని ప్రదర్శించింది. ముస్లింలు, ముస్లిమేతరులు శాంతియుతంగా సహజీవనం సాగించారు. ఆల్-ఖైదా లాంటి సంస్ధలు గత 18 సం.లుగా ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ భారతీయ ఇస్లాం బలం వల్లనే అక్కడక్కడా ఉన్న ప్రతికూల శక్తులు (fringe elements) వెనక్కి తగ్గాయి” అని సాహ్ని తెలిపారు.
అయినప్పటికీ అంతర్గతంగా కొన్ని శక్తివంతమైన చర్యలు తీసుకోవచ్చని, తద్వారా దేశంలోకి విదేశీ భావజాలాన్ని కొనితెచ్చే ప్రతీఘాత శక్తులను దూరం పెట్టవచ్చని సూచించారు. “ఇప్పుడు కావలసింది ఏమిటంటే పౌరులందరూ సమానమే అన్న సందేశాన్ని జనంలోకి తీసుకెళ్ళడం. ప్రత్యేక పధకాలు అమలు చేసినా దళితులు, ముస్లింలు ఇంకా పేదవారిగానే ఉండిపోయారు. మన రాజ్యాంగం అందరికీ సమానత్వం, న్యాయంలను గ్యారంటీ చేసింది. కనుక ఇతర భారత పౌరులకు మల్లేనే వారికి కూడా వివక్షారహితంగా అన్ని వసతులు అందేలా చూడాలి” అని అజయ్ సాహ్ని వివరించారు.
ఒక్క మేధావులే కాదు, భద్రతా బలగాలు, గూఢచార బలగాలు కూడా ఇవే సూచనలు చేయడం గమనార్హం. భారత ఉపఖండాన్ని ఆల్-ఖైదా టార్గెట్ చేసినట్లు ప్రకటించిన దరిమిలా పాలకులు సమ్మిళిత (inclusive) అభివృద్ధిపై దృష్టి పెట్టాలని వారు సూచించారు. లష్కర్-ఏ-తొయిబా, ఇండియన్ ముజాహిదీన్ లాంటి సంస్ధలను ఆసరా చేసుకుని ఇండియాలో వనరులను సమీకరించుకునేందుకు ఆల్-ఖైదా ప్రయత్నించవచ్చని వారు చెప్పడం మరీ గమనార్హం. నిజానికి ఆల్-ఖైదా ఇండియాపై కన్ను వేయడం కొత్త కాదని వారు తెలిపారు.
“మనది బహుళ-సంస్కృతులు, బహుళ మతాలతో కూడిన బహుళ సమాజం. అందువలన మైనారిటీ మతస్ధులలోని అసంతృప్తి యువకులను తీవ్రవాదం వైపు ఆకర్శించేందుకు గతంలో సాగిన అనేక ప్రయత్నాలు పెద్దగా సఫలం కాలేదు. కనీస స్పందన మాత్రమే వారికి దక్కింది. అయితే విద్యారంగంలోనూ, నైపుణ్య అభివృద్ధి కోసమూ ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో సమ్మిళిత వైఖరిని నిశ్చయాత్మకంగా చేపట్టాలి. అలా జరిగితే యువత బైటి శక్తులవైపు ఆకర్షితులు కావడం సాధ్యం కాదు” అని ఒక సీనియర్ గూఢచార అధికారి చెప్పారని ది హిందు తెలిపింది.
అయితే సోషల్ మీడియా ప్రభావం విస్తరిస్తున్నందున కొన్ని కఠిన సవాళ్ళు ఎదురు కావచ్చని వారు హెచ్చరించారు. అందువలన సైబర్-మీడియా పైన గట్టి నిఘా పెట్టాలని సూచించారు. భారత ప్రభుత్వ ఆందోళనల పట్ల సోషల్ మీడియా వెబ్ సైట్లకూ ముందే సమాచారం ఇవ్వాలని, సమస్యలు సృష్టించే శక్తి (ఉగ్ర) శక్తులకు లేకపోయినా వారి భావజాలం ఎప్పటికీ ప్రమాదంగా ఉండగలదని అభిప్రాయం వెలిబుచ్చారు.
కడు పేదలయిన యువకులను ఆకర్షించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని భద్రతా బలగాలు చెప్పారు. అనేక ఈతి బాధలవల్ల అన్యాయం జరుగుతోందన్న దృష్టి భావం పేద వాడల్లో ఉంటుందని అందుకే వారిని ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతాయని తెలిపారు.
అయితే ఈ హెచ్చరికలు, అవగాహన అంతా ఆల్-ఖైదా శక్తులను దేశంలో చొరణీయకుండా చేయడానికి ఉద్దేశించినది. పాలకులు ఈ విషయంలో సిన్సియర్ గా ఉన్నారని భావిస్తూ చేసిన సూచనలు. కానీ ముస్లిం యువత రాడికలైజ్ కావడమే అవసరమని భావిస్తే…?
ఉదాహరణకి బోస్టన్ మారధాన్ పై జరిగిన బాంబు దాడులను తీసుకోవచ్చు. ఈ దాడులకు కారకులని అమెరికన్ పోలీసులు చెప్పిన చెచెన్ సోదరులు ఇరువురి పైనా ఎఫ్.బి.ఐ నిఘా పెట్టింది. వారు ఇరువురిని రిక్రూట్ చేసుకోవడానికి కూడా ఎఫ్.బి.ఐ ప్రయత్నం చేసి విఫలం అయింది. రిక్రూట్ మెంటు ఎఫ్.బి.ఐ గూఢచర్యం కోసం అనుకునేరు. కాదు. ఉగ్రవాద దాడుల కోసమే రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నించారు. (ఈ సంగతి పేరు చెప్పని ఎఫ్.బి.ఐ అధికారులు చెప్పారని పశ్చిమ పత్రికలు కొన్ని తెలిపాయి). ఆర్ధిక సమస్యలపై అమెరికన్ ప్రజల అసమ్మతిని పక్కదారి పట్టించేందుకు గూఢచార వర్గాలే Inside Job ద్వారా ఉగ్రవాద చర్యలు జరిపిస్తాయి. ఆనక ఆ సాకుతో కఠిన చట్టాలు, చర్యలు అమలు చేస్తారు. ఇంటర్నెట్ పై నిఘాకు అమెరికా చూపిన కారణాల్లో ఒకటి బోస్టన్ బాంబు దాడులు.
అఫ్జల్ గురు ఉరితీత కూడా ఈ కోవలోనిదే అని పలు భారతీయ పత్రికలు వెల్లడి చేశాయి. ఈ వివరాలను కూడా పై లింక్ లో చూడవచ్చు.
కనుక దేశంలో ఆల్-ఖైదా చొరబాటును పాలకులు నిరోధించదలిచారా లేక ఆహ్వానించదలిచారా అన్నది సమాధానం దొరకని ప్రశ్న. అయిమన్ ఆల్ జవహరి ప్రకటన నేపధ్యంలో సైబర్ నిఘా తీవ్రం చేయాలని గూఢచార అధికారులు సూచించడం బట్టి ఏం తెలుస్తోంది?