బోస్టన్ పేలుళ్లు: నిందితులు ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారే


ఝోఖార్,

ఝోఖార్, తామెర్లాన్

బోస్టన్ బాంబు పేలుళ్లకు బాధ్యులుగా అమెరికా ప్రకటించిన చెచెన్యా జాతీయులు అనేక సంవత్సరాలుగా ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారేనని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారు బాంబులు అభివృద్ధి చేసి సి.సి కెమెరాలు చూస్తుండగా వాటిని సంచుల్లో పెట్టుకుని బోస్టన్ మారధాన్ స్ధలానికి తెచ్చి ఎలా పేల్చగలరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలిద్దరిని కుట్ర చేసి ఇరికించారని తల్లిదండ్రులు ఆరోపించినట్లు రష్యా టుడే తెలియజేసింది. ఎఫ్.బి.ఐ గూఢచారులు ఎప్పుడూ తమ ఇంటికి వచ్చేవారని, తమ పిల్లల గురించి హెచ్చరించేవారని అలాంటిది ఉన్నట్లుండి తమ పిల్లలను నేరస్ధులుగా చేశారని నిందితుల తల్లి జుబేదత్ ఆరోపించింది.

జుబేదత్ కి కూడా అమెరికా పౌరసత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రష్యా రిపబ్లిక్ దగెస్తాన్ లో ఉన్న జుబేదత్ రష్యా టుడే (ఆర్.టి)తో మాట్లాడింది. “వాళ్ళు (ఎఫ్.బి.ఐ అధికారులు) ఎప్పుడూ మా ఇంటికి వస్తుండేవారు. నాతో మాట్లాడేవారు… మా పెద్దబ్బాయి (26 సంవత్సరాల తామేర్లాన్) నిజంగా తీవ్రవాది అని నాకు చెబుతుండేవారు. అతనికి ఏ సమాచారం వచ్చినా ఆ తీవ్రవాద వెబ్ సైట్ల నుండి వస్తోందని చెప్పేవారు… వాళ్ళు అతన్ని కంట్రోల్ చేస్తున్నారు. అతని ప్రతి అడుగుని పరిశీలిస్తున్నారు. ఇప్పుడేమో అకస్మాత్తుగా తీవ్రవాద చర్యకు పాల్పడ్డారని చెబుతున్నారు! ఇది ఎప్పుడూ నిజం కానే కాదు. మా పిల్లలిద్దరూ అమాయకులు” అని తామేర్లాన్, ఝోఖార్ (19 సంవత్సరాల రెండో సోదరుడు) ల తల్లి జుబేదత్ ఆర్.టి కి తెలిపింది.

అమెరికన్ అఫ్జల్ గురు?

తండ్రి అంజోర్ జర్నాయెవ్

తండ్రి అంజోర్ జర్నాయెవ్

జుబేదత్ చెబుతున్న విషయాలు అఫ్జల్ గురు ఉదంతాన్ని గుర్తుకు తెస్తున్నాయి. ది హిందు పత్రిక వెల్లడి చేసిన వివరాల ప్రకారం అఫ్జల్ గురు చేత కారు కొనిపించిందీ, పార్లమెంటు పైన  దాడికి పాల్పడిన ఒక నిందితుడిని అతనికి పరిచయం చేసిందీ అంతా పారామిలట్రీ బలగాల అధికారులే. దాడికి పాల్పడిన వారందరూ పోలీసుల కాల్పుల్లో చనిపోయిన నేపధ్యంలో అఫ్జల్ గురు నిర్దోషిత్వానికి పోలీసులు తప్ప మరో సాక్ష్యం లేకపోయింది. జె.కె.ఎల్.ఎఫ్ మిలిటెంటుగా పని చేసిన అఫ్జల్ గురును పారామిలిటరీ బలగాలు వేధించుకు తిన్నాయి. స్ధిరంగా పని చేసుకోనివ్వకుండా తోచిన కేసులు పెట్టి పీడించారు.

కేసులు పెడతామని, కేసులు పెట్టాక వదిలిపెట్టడానికి అఫ్జల్ గురు వద్ద ఉన్నదంతా ఊడ్చుకు తిన్నారు. అయినా అతనికి టెర్రరిస్టు ముద్ర తప్పలేదు. తనకు సంబంధం లేని కేసులో, పోలీసులు తన చేత చేయించిన పనులే సాక్ష్యాలుగా తేలిన పరిస్ధితుల్లో ఉరికంబం వద్ద బలిపశువుగా మిగిలాడు. అఫ్జల్ గురు పాత్ర ఉందని చెప్పడానికి సరైన సాక్ష్యం లేదని సుప్రీం కోర్టు సైతం చెప్పినా దేశం ఉమ్మడి అంతరాత్మ (collective conscience) ను సంతృప్తి పరచడానికి ఉరిశిక్ష వేస్తున్నట్లు తీర్పు చెప్పి అమలు చేయించింది సుప్రీం కోర్టు.

అఫ్జల్ గురు నిర్దోషి అనీ, ఆయనను కేసులో ఇరికించారని, బలి పశువును చేశారని వివిధ పత్రికలు, పరిశీలకులు సోదాహరణంగా, వివిధ సాక్ష్యాలతో వివరించి చెప్పాయి. అఫ్జల్ గురు ని ఉరితీయడానికి ముందు ఒక జైలు అధికారి విలపించాడంటే పదేళ్ళ జైలు జీవితంలో ఆయనను గమనించిన జైలు అధికారులు సైతం ఆయన నిర్దోషిత్వాన్ని గ్రహించారని అర్ధం చేసుకోవచ్చు. కానీ రాజకీయ నాయకుల రాజకీయ అవసరాలు, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు అఫ్జల్ గురు భవితవ్యాన్ని వేరే విధంగా రాసిపెట్టారు. ఇపుడు ప్రపంచం చర్చిస్తున్న తామేర్లాన్, జోఖార్ ల భవితవ్యం కూడా ముందే లిఖించబడిందని జుబేదత్ మాటలను బట్టి అనుమానం కలుగుతోంది.

నిఘాలో ఉండగానే…?

జుబేదత్ చెప్పిన అంశాల ప్రకారం అనేక సంవత్సరాలుగా సోదరులిద్దరూ ఎఫ్.బి.ఐ నిరంతర నిఘాలో ఉన్నారు. సోదరులే కాకుండా వారి తల్లిదండ్రులు, వారి ఇల్లు అందరూ ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నారు. పైగా ఝోఖర్ అనేకమంది ఇష్టపడే తెలివైన వైద్య విద్యార్ధి. అతనిని స్నేహితులు, క్లాస్ మేట్లు, ఉపాధ్యాయులు అంతా ఇష్టపడతారని అతని తల్లి చెబుతోంది. అతని అన్న అయితే ఒక స్టార్ అధ్లెట్. ఎప్పటికైనా అమెరికా రెస్లింగ్ టీం లో చోటు సంపాదించాలనేది అతని కల. ఇదంతా ఎలా ఉన్నప్పటికీ వీరి కుటుంబం పైన ఎఫ్.బి.ఐ నిఘా నిరంతరం కొనసాగుతూనే వచ్చింది. ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారు బాంబు తయారు చెయ్యడం, ప్రెజర్ కుక్కర్ లు కొనుక్కొని, మేకులు బాల్ బేరింగులు వాటిలో కుక్కి, పేలుడు పదార్ధాలు చొప్పించి, సి.సి కెమెరాలు చూస్తుండగానే సంచుల్లో పెట్టుకుని జనసమ్మర్ధ ప్రాంతాల్లోకి రావడం ఎలా సాధ్యం?

పేలుడు జరిగిన తర్వాత అనుమానితుల తండ్రి తన పెద్ద కొడుకుతో ఫోన్ లో మాట్లాడాడని ఆర్.టి తెలిపింది. “మేమిద్దరం మామూలుగానే మాట్లాడుకున్నాం. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకొమ్మని చెప్పాను. తమ్ముడు బాగా చదివేట్లు చూడాలని పెద్దోడికి చెప్పాను. ‘నువ్వేమో త్వరగా స్కూల్ వదిలేశావు. త్వరగా పెళ్లి చేసుకున్నావు. కానీ తమ్ముడు మాత్రం చదువు పూర్తి చేయాలి. ఎందుకంటే చదువుకోనివారు బాగా కష్టపడాల్సి ఉంటుంది’ అని వాడితో చెప్పాను” అని తండ్రి అంజోర్ జర్నాయెవ్ ఒక రష్యన్ టి.వి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడని ఆర్.టి తెలిపింది. ఇంత ఘోరం ఎవరు చేసి ఉంటారని కూడా తాను తన పెద్ద కొడుకుతో అన్నానని అంజోర్ తెలిపాడు.

జర్నాయెవ్  సోదరుల తల్లిదండ్రులు చెబుతున్నట్లు వారు నిర్దోషులే అయితే భవిష్యత్తులో అయినా నిజం బైటికి రాక మానదు.

6 thoughts on “బోస్టన్ పేలుళ్లు: నిందితులు ఎఫ్.బి.ఐ నిఘాలో ఉన్నవారే

 1. నేను కాదు సుప్రీం కోర్టు తీర్పే చెప్పింది, సరైన సాక్ష్యాలు లేవని. ‘ఉమ్మడి అంతరాత్మ’ శాంతించడం కోసం ఉరి శిక్ష వేస్తున్నామని కూడ తీర్పు చెప్పింది. ది హిందు, తెహెల్కా ఆ విషయాన్ని చెబుతూ తీర్పును విమర్శించాయి కూడాను.

 2. వాడెవాడో ఎక్కడో అమెరికా లో బాంబు పెడితే ఇక్కడ మన కోర్టు తీర్పు గురించి చర్చ ఎందుకు????

 3. Sai గారూ, మీ వ్యాఖ్య చూస్తుంటే- జర్మనీలో నాజీల పాలన గురించి మార్టిన్ నీమోల్లర్ చెప్పిన ప్రసిద్ధ కొటేషన్ గుర్తొస్తోంది-

  ‘‘వాళ్ళు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు
  నేను కమ్యూనిస్టును కాదు కాబట్టి మాట్లాడలేదు

  తర్వాత వాళ్ళు యూదుల కోసం వచ్చారు
  నేను యూదును కాదు కాబట్టి ఎదురుమాట్లాడలేదు

  తర్వాత వాళ్ళు కార్మిక నాయకుల కోసం వచ్చారు
  నేను కార్మిక నాయకుణ్ణి కాదు కాబట్టి మాట్లాడలేదు

  తర్వాత వాళ్ళు కాథలిక్కుల కోసం వచ్చారు
  నేను ప్రొటెస్టెంటును కాబట్టి మాట్లాడలేదు

  చివరకు…
  వాళ్ళు నాకోసం వచ్చారు
  అప్పటికి నాకోసం మాట్లాడేందుకు ఎవరూ మిగిలిలేరు!’’

  మంచి చెడుల గురించీ, న్యాయాన్యాయాల గురించీ చర్చించడానికీ, ఆలోచించడానికీ ప్రాంతాల, దేశాల సరిహద్దులు అడ్డొస్తాయా?

 4. పింగ్‌బ్యాక్: హై అలర్ట్: ఆల్-ఖైదాకు వ్యతిరేకం కాదు అనుకూలం -నిపుణులు | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s