ఈ జాత్యహంకార దుర్గంధం ఎచటిదంటే గాజావైపు చూపండి! -ఫోటోలు


ప్రకృతి శక్తులకు మాత్రమే సాధ్యమైన ఉన్మత్త విధ్వంసం ఇది. ఆధునిక సాంకేతికాభివృద్ధి శక్తులను కూరి పసిప్రాణాల్ని పేల్చేస్తున్న చమురు దాహపు వినాశనమిది. నెలరోజుల నిర్విరామ డాలర్ల దాడుల్లో మిగిలిన మానవత్వపు శిధిలాలివి. అత్యంత ప్రాచీన పాలస్తీనా జాతి గుండె కోత ఇది. 

చెట్టూ-పుట్టా, గుడిసే-మేడా  తేడా లేకుండా దివిసీమనంతటినీ ముంచేసిన ప్రళయ భీకర పెను తుఫానును చూసి గుండెలు బాదుకున్నాం. ఉప్పు సముద్రాలన్నీ తెచ్చి కుమ్మరించిన హిందూ మహా సముద్రపు సునామీలో వేలమందిని కోల్పోయాం. కట్టుదిట్టమైన ఫుకుషిమా అణు శక్తి కర్మాగారాన్ని క్షణాల్లో నేలమట్టం చేసిన పెను భూకంపం చూశాం. నడిచిన దారివెంట వందల కిలో మీటర్ల మేర ఇళ్లూ, కార్లూ, చెట్లూ సమస్తాన్నీ ఏకం చేసి ఎత్తి కుదేస్తున్న ట్విస్టర్ లను చూస్తున్నాం. ఎన్ని చూసినా ప్రకృతి రుద్దిన ఉత్పాతాలు కనుక తేరుకుని సాగిపోతున్నాం.

కానీ ఈ విధ్వంసాన్ని ఏమని చెప్పుకోవాలి? ఈ ఉన్మత్త జాత్యంహంకారపు వికృత నర్తనాన్ని ఏమని సవరించాలి? మానవ నాగరికతా విలువలన్నింటిని ఐరన్ డోమ్ క్షిపణులతో కూల్చి బూడిద చేస్తుంటే ఏమని ఊరడిల్లాలి?

18 లక్షలమంది పాలస్తీనీయుల్ని 350 కిలో మీటర్ల భూమి తునకలో దట్టించి, సరిహద్దుల్ని మూసేసి, అతిపెద్ద బహిరంగ జైలును సృష్టించింది చాలక, ఎటూ పారిపోలేని నిస్సహాయులని తెలిసీ భూ, వాయు, జల తలాలన్నింటిపై నిలబడి బాంబులు కురిపించే అమానుషాన్ని చూస్తూ ఎలా సహించాలి? ఆత్మరక్షణ కోసం 1000 మంది పసిపిల్లల్ని చంపానంటే ఏమని అర్ధం చేసుకోవాలి?

హోమ్ మేడ్ రాకెట్ దాడుల్ని అడ్డుకోవడానికని చెబుతూ అమెరికన్ ప్రజాస్వామ్య దేవాలయాల నుండి బిలియన్లు ప్రవహిస్తాయి. ఆ చిన్న గాజా స్ట్రిప్ ను నలుమూలలా బంధించి చీమ దూరకుండా చేస్తూ పెను సామాజికార్ధిక, మాన, ప్రాణ సంక్షోభాలను రుద్దుతూ అదంతా హమాస్ ఉగ్రవాద నిర్మూలన కోసమే అంటే ఐరాస నమ్మి చప్పట్లు కొడుతుంది. నవరంధ్రాలను మూసేసినందుకు ప్రాణవాయువు కోసం పదుల అడుగుల లోతున సొరంగాలు తవ్వుకుంటే వాటిని ఉగ్రవాద కాసారలని అభివర్ణిస్తుంటే ఔనా అని తలలూపుతారు.

ఇదా ప్రపంచం? ఇదా మానుషం? ఇదా మానవత? ఇదా నాగరికత? ఇదా అభివృద్ధి? ఇదా ఆధునికత?

కాదు గాక కాదు!!!

ఈ జాత్యహంకార దుర్గంధం ఎచటిదంటే గాయాల గాజా వైపు చూపండి! పెట్రో డాలర్లు వెదజల్లుతున్న ఈ కర్బన ఉద్గారాల కమురు వాసన గాలులు ఎక్కడివంటే గాజా తీరాన్ని చూపండి! మానవతా చూపులను మసకబార్చుతున్న  ఆ గంధకపు పేలుళ్ళ పొగల మేఘాలు ఎక్కడ వర్షిస్తున్నాయంటే పుడమి తల్లి రాచపుండుగా మారిన గాజాలో సొమ్మసిల్లుతున్న మానవ దేహాలను చూపండి. మన ఇంటిపై కమ్మిన ఉప్పు భాష్పాల ఆక్రందనలు ఎచ్చటివంటే కరువు తీరా ఏడ్వడానికి లేకుండా ఆవిరవుతున్న పాలస్తీనా కంటి సముద్రాలను చూపండి!

Photos: The Atlantic

 

One thought on “ఈ జాత్యహంకార దుర్గంధం ఎచటిదంటే గాజావైపు చూపండి! -ఫోటోలు

  1. సర్,ఇంతకుమునుపు చూసిన క్షతగాత్రుల ఫొటోలతో పోల్చిచూసుకుంటే ఇది మరంతభయానికంగా ఉన్నది.!?
    క్షతగాత్రులను చూస్తే తక్షణమే భాధ కలుగుతుంది.,కానీ, ఇవి(ప్రస్తుత ఫొటోలు) చూస్తుంటే ఆ అలోచనే భయానికంగా ఉన్నది!
    ముఖ్యంగా, బడిలోని ఆ బాలుడి పరిస్థితి ఏమిటో?
    సర్,దేనికి జాత్యహంకారం అని పేరుకాకుండా ఇంకా అంతకంటే పెద్దపేరు(తీవ్రమైన)పేరును సూచించండి?

వ్యాఖ్యానించండి