ఇజ్రాయెల్ ధ్వంస రచనకు 26 రోజులు పూర్తయ్యాయి. వందలాది మంది పాలస్తీనీయులు మర ఫిరంగుల తాకిడికి పుట్టలు పుట్టలుగా పిట్టల్లా రాలిపోతున్నారు. కుటుంబాలకు కుటుంబాలే ఉమ్మడిగా తుడిచివేయబడుతున్నాయి. భవనాలకు భవనాలే ఆనవాళ్ళు కోల్పోతున్నాయి. అక్కడ పిట్టలు ఎగరడం ఎప్పుడో మానేశాయి. విద్యుత్ తీగల్లో అణువులు కదలక స్తంభించిపోయాయి. రాత్రయితే ఇప్పుడక్కడ నీడలు కదలవు.
యంత్ర భూతాల ఫిరంగి గొట్టాలు, ఇనుప రెక్కల డేగలు విరామమెరుగక విరజిమ్ముతున్న పేలుడు మంటల్లో మానవత్వం శలభంలా మాడి మసవుతోంది. ఇజ్రాయెల్ నుండి ఒక్కో పేలుడు విరుచుకుపడినప్పుడల్లా గాజాలో ఒక్కో పీనుగుల గుంపు శ్మశానానికి ప్రయాణం కడుతోంది. శవాలను మోసే పాడెకు దినుసులు లేక విగత జీవులైన పిల్లలను, పెంచిన తండ్రుల చేతులే పాడె కడుతున్నాయి. సమాధి చేసేందుకు స్ధలం లేక ఉమ్మడి గోతుల్లో పూడ్చిపెడుతున్నారు. చుక్క భాష్పం లేని దుఃఖ సముద్రాలు అరబ్బు ఎడారులనే వెక్కిరిస్తున్నాయి.
ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన అతి చిన్న భూమి తునకపై నివసించే జనం చస్తే మాకేమని ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలు నేర సమాన మౌనంతో ఈసడిస్తున్నాయి. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, పాలస్తీనా శవాల దిబ్బల సాక్షిగా ప్రజాస్వామ్య దేవాలయాల్లోనే నిలబడి ‘సమాన దూరం’ అంటూ తర్క బోధ చేస్తున్నాయి. నిస్సహాయ గాజన్ల ఆక్రందనలను ఆదుకుంటే, జాత్యహంకార ఇజ్రాయెల్ ఆయుధాలు అందవేమోనని తీర్మానిస్తున్నాయి.
ఆత్మ రక్షణ హక్కు అంటే తెగబడి జాతి హననం సాగించడమే అంటూ యూదు జాత్యహంకారం మానవజాతి చరిత్రలో సరికొత్త పుటలు లిఖిస్తోంది. గాజా తీర చమురు బావుల్లో పండనున్న డాలర్ల పంటను తలచుకుని అంకుల్ సామ్, చమురు దాహంతో పిడచకట్టుకుపోయిన నాలికను అప్పుడే చప్పరిస్తున్నాడు. కాల్పుల విరమణ కోసం రాయబార నాటకాన్ని రక్తి కట్టించమని తన జీతగాడు ఈజిప్టు పాలకుడిని పురమాయించాడు. బేషరతు కాల్పుల విరమణ ప్రకటించిన రెండు గంటల్లోనే ఫిరంగులతో విరుచుకుపడిన జాత్యహంకారిని మురిపెంగా వెనకేసుకొస్తున్నాడు.
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్న మహాకవి ‘కవి’తాత్విక ప్రకటన నేటికీ ప్రత్యక్షర సత్యమని వర్తమాన మధ్యప్రాచ్యంలో ఆవిష్కృతం అవుతున్న హత్యాకాండ రుజువు చేస్తోంది. జాత్యహంకార అణచివేత నుండి విముక్తి కోరుతున్న పాలస్తీనా జాతి, “దేశాలు స్వతంత్రం కోరుతున్నాయి, జాతులు విముక్తిని కోరుతున్నాయి, ప్రజలు విప్లవాన్ని కోరుకుంటున్నారు” అన్న మావో చారిత్రక ప్రకటనను సమున్నతంగా నిలుపుతోంది.
అరె ఝాఁ! ఝాఁ!
ఝటక్, ఫటక్ ….
హింసనచణ
ధ్వంసరచన
ధ్వంస నచణ
హింస రచన!
విషవాయువు, మరఫిరంగి
టార్పీడో, టోర్నాడో!
అది విలయం,
అది సమరం,
అటో యిటో తెగిపోతుంది!
(Photos: The Atlantic)




















సర్,అసంధర్భం అనుకోకపోతే “విద్యుత్ తీగల్లో అణువులు కదలక స్తంభించిపోయాయి” -ఈ వాక్యంలో అణువులు అంటే ఎలాక్త్రాన్లని అర్ధం. ఇవి పరమాణువులలో ఒకభాగం.
అటువంటప్పుడు అణువుల కదలిక అనేది సరియైన వాక్యనిర్మాణమేనా?
అరె ఝాఁ! ఝాఁ!
ఝటక్, ఫటక్ ….
హింసనచణ
ధ్వంసరచన
ధ్వంస నచణ
హింస రచన!
విషవాయువు, మరఫిరంగి
టార్పీడో, టోర్నాడో!
అది విలయం,
అది సమరం,
అటో యిటో తెగిపోతుంది!
సర్,ఇందులో ఝటక్ ,ఫటక్,టార్సీడో వీటి అర్ధాలేమి?
విశేఖర్ గారు, మీ పోస్ట్ కి ధన్యవదములు.
హింస ఎక్కడ జరిగినా ఖండించి తీరాల్సిందే .
మీరు మరియు మన రాజకీయ నాయకులూ గాజా విషయం లో బాగా స్పందిస్తున్నారు.
మన సొంత గడ్డ మీద నిత్యం జేరిగేవి ఎందుకు కనపడ్డం లేదు మీకు.
అస్సాం లో, కాశ్మీర్ పండిట్స్ మీద, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లలో మైనారిటీస్ మీద జరిగే హింస మీద ఇంత శోధించరా ?
ఎవరి మెప్పు కోసం ఇవన్ని. మన దేశము మీద మనకు ప్రేమ లేదా ?