బి.జె.పి ఎం.పిల మద్దతు: ఒకరు రేప్ కి, మరొకరు హత్యకి!


బాబూలాల్ గౌర్

బాబూలాల్ గౌర్

భారతీయ జనతా పార్టీ తరపున పార్లమెంటులో ప్రవేశించిన లోక్ సభ సభ్యులు ఒక్కొక్కరు తమ తమ నిజస్వరూపాలను బట్టబయలు చేసుకుంటున్నారు. బి.జె.పిని మితవాద భావాల పార్టీగా విశ్లేషకులు ఎందుకు చెబుతారో వారు తమ వెనుకబాటు భావాలను వెల్లడి చేసుకుంటూ వివరించి చెబుతున్నారు. ఒకరు యు.పిలో అత్యాచారానికి మద్దతుగా వచ్చి ములాయం పట్ల సానుభూతి ప్రకటిస్తే, మరొకరేమో శివాజీ, ధాకరేలను ఫేస్ బుక్ లో అవమానిస్తే తత్పరిణామాలు ‘సహజం’ అంటూ ముస్లిం టెకీ హత్యను సమర్ధించుకొచ్చారు.

ఉత్తర ప్రదేశ్ లో బదౌ జిల్లా, కత్రా షహాదత్ గంజ్ గ్రామంలో ఇటీవల ఇద్దరు బాలికలపై దుండగులు అత్యాచారం జరిపి, అనంతరం వారిని హత్య చేసి చెట్టుకు వేలాడదీశారు. ఈ ఘటనపై జాతీయ స్ధాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్ధాయిలోనూ ఖండన మండనలు వెలువడుతున్నాయి.

‘అబ్బాయిలు అబ్బాయిలే’ అంటూ అత్యాచారాలని పరోక్షంగా సమర్ధిస్తూ ఉరిశిక్షను వ్యతిరేకించిన ములాయం వ్యాఖ్యలను గుర్తు చేస్తూ అలాంటి ధోరణి ఆధునిక సమాజంలో సహించరానిదని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కి-మూన్ ప్రకటన విడుదల చేశారు. అమెరికా విదేశీ మంత్రిత్వ శాఖ కూడా బదౌ అత్యాచారాలను ఖండిస్తూ, సదరు ఘటన భయానకంగా ఉందని వ్యాఖ్యానించింది.

మధ్య ప్రదేశ్ బి.జె.పి ప్రభుత్వంలో హోమ్ మంత్రిగా నియమితులయిన బాబూలాల్ గౌర్ మాత్రం ఇందుకు భిన్నంగా, విపరీత వ్యాఖ్యలతో స్పందించారు. “అత్యాచారాలు కొన్నిసార్లు తప్పు, మరికొన్ని సార్లు సరైనవే” అని వ్యాఖ్యానించారు. సమర్ధించదగిన అత్యాచారాలు కూడా కొన్ని ఉంటాయని ఆయన ఆ విధంగా చెప్పారు. అలాంటి సందర్భం ఏమిటో మచ్చుకు ఒకటి వివరించి ఉంటే ఆయనగారి విశాల భావం ఏమిటో జనానికి సంపూర్తిగా అంది ఉండేది.

అత్యాచారం సామాజిక నేరం అని బాబూలాల్ అంగీకరించడం విశేషం. తద్వారా సామాజిక భావాల్లోనే అత్యాచారాలను న్యాయబద్ధం చేసే పునాదులు ఉన్నాయని చెప్పిన బాబూలాల్ తన వ్యాఖ్య కూడా అందులో దాగి ఉందన్న ఎరుకలో ఉన్నారో లేదో తెలియదు. అంతటితో ఆగని బాబూలాల్ ములాయం, అఖిలేష్ యాదవ్ లపట్ల సానుభూతి ప్రకటించారు. అత్యాచారం గురించి పోలీసు స్టేషన్ లో రిపోర్ట్ అయ్యేదాకా అది అత్యాచారం కాదని, సామాజిక నేరాలకు ములాయం, అఖిలేష్ లు ఎలా బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.

‘అత్యాచారం సామాజిక నేరం’ అని అంగీకరించడంలో బాబూలాల్ అంతరార్ధం ఇదన్నమాట! ఒక నేరం సామాజికం అని తేల్చి పారేస్తే ఇక అలాంటి నేరాలకు పాలకులు బాధ్యత వహించనవసరం లేదని బాబూలాల్ గారి సామాజిక అవగాహనలోని ఒకానొక ఆణిముత్యం! మధ్య ప్రదేశ్ లో కూడా అత్యాచారాలు తక్కువ కాదు. ‘మా రాష్ట్రంలోనూ అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటికి హోమ్ మంత్రిగా నేనెలా బాధ్యుడిని?’ అని బాబూలాల్ పరోక్షంగా ప్రశ్నిస్తున్నారు కాబోలు! ఇలాంటి అద్వితీయమైన భావాలను ఈ పెద్ద మనుషులు ఎన్నికల సమయంలోనే చెప్పేస్తే బాగుండేది.

బాబూలాల్ వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవనీ, బి.జె.పి పార్టీకి వాటితో సంబంధం లేదని మధ్యప్రదేశ్ బి.జె.పి నేతలు దూరం జరిగారు. మధ్యప్రదేశ్ లో జరిగే అత్యాచారాల పట్ల తాము కఠినంగా వ్యవహరిస్తామని వారు పనిలో పనిగా హామీ ఇచ్చారు.

ముస్లిం టెకీ ఒకరు పూనేలో హిందూ రాష్ట్ర సేన సభ్యుల చేతుల్లో దారుణంగా హత్యగావించబడిన ఉదంతాన్ని ఒక బి.జె.పి ఎం.పి పరోక్షంగా సమర్ధించుకొచ్చారు. “ఫేస్ బుక్ లో ప్రత్యక్షం అయిన బొమ్మలు చాలా బాధాకరమైనవి. అలాంటి చర్యలకు తగిన పరిణామాలు ఏదో ఒక రూపంలో జరగడం సహజమే” అని పూనే ఎం.పి అనీల్ శిరోల్ వ్యాఖ్యానించారు.

మాహా రాష్ట్ర రాజు శివాజీ, శివసేన దివంగత నేత బాల్ ధాకరే ల ఫోటోలను అభ్యంతరకరమైన రీతిలో మార్ఫింగ్ చేసి ప్రదర్శించడంతో పూణేలో అల్లర్లు జరిగాయి. హిందూ రాష్ట్ర సేన యువకులు వీధుల్లోకి వచ్చి 200 పైగా బస్సుల్ని నాశనం చేశారు. శివాజీ విగ్రహంపై ఎవరో రాళ్ళు విసిరారన్న పుకార్లు వ్యాపించడంతో మరోసారి హిందూ రాష్ట్ర సేన మూకలు వీధుల్లోకి వచ్చి ముస్లిం సెటిల్మెంట్లపై దాడులు చేశారు. ప్రార్ధన ముగించుకుని ఇంటికి వస్తున్న షేక్ మోహిసిన్ సాదిక్ ని చుట్టుముట్టి హాకీ కర్రలతో చితకబాది చంపేశారు.

సాదిక్ హత్య ‘సహజమైన పరిణామం’ అని అనీల్ అభిప్రాయం. శివాజీ, ధాకరే బొమ్మల్ని ఎక్కడో ఇంటర్నెట్ లో మార్ఫింగ్ చేస్తే ఒక కుటుంబానికి ఆధారం అయిన యువ ఇంజనీర్ ని చంపడం ఎందుకన్న ఆలోచనే బి.జె.పి ప్రజాప్రతినిధికి రాకపోవడం ఎంతటి దౌర్భాగ్యం? సహజ పరిణామాలకీ, బలవంతపు పరిణామాలకీ తేడా తెలియని మేధావులు లోక్ సభలో ప్రవేశించాక ఇక ఎలాంటి ‘సహజ’ పరిణామాలు దేశంలో సంభవిస్తాయో ఎవరికి వారు తమ శక్తికొలదీ ఊహించుకోవలసిందే!

వ్యాఖ్యానించండి