బ్రిక్స్ బ్యాంకు త్వరలో సిద్ధం!


ఐదు వర్ధమాన దేశాల బహుళపక్ష బ్యాంకు త్వరలో పని ప్రారంభిస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు బ్రెజిల్ ప్రభుత్వ వర్గాలు సమాచారం ఇచ్చాయని రాయిటర్స్ తెలిపింది. BRICS కూటమిగా బహుళ ప్రచారంలోకి వచ్చిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాల ఆర్ధిక, వాణిజ్య కూటమి గతేడు దర్బన్ సమావేశంలో బ్రిక్స్ బ్యాంకు ఏర్పాటును ప్రకటించాయి. (వివరాల కోసం చూడండి: ఉమ్మడి ప్రయోజనాలకు గొడుగు -బ్రిక్స్ బ్యాంకు) ఇది త్వరలో ఆచరణలోకి రానున్నట్లు తెలుస్తోంది.

గతంలో అనుకున్నట్లుగా చైనాకు ప్రధాన వాటా ఇవ్వడం కాకుండా ఐదు దేసాలూ సమాన వాటా కలిగి ఉండేవిధంగా బ్యాంకు ఉనికిలోకి వస్తుందని బ్రెజిల్ అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. కానీ ఇది ఎంతవరకు నిజం అన్నదీ ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం సముచితం కాబోదు. ఎందుకంటే చైనాకు ఉన్న ఆర్ధిక శక్తి బ్రిక్స్ గ్రూపు లోని మరే ఇతర దేశానికి లేదు. చైనా వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు అపారం. పైగా స్ధిరమైన వాణిజ్య మిగులును చైనా నమోదు చేస్తోంది. అనగా విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరగడమో, స్ధిరంగా ఉండడమో జరుగుతుంది తప్ప తగ్గవు. అలాంటి చైనాతో సమానంగా ఇండియా, సౌత్ ఆఫ్రికా దేశాలు మూలధనం సమకూర్చడం అనుమానమే.

బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటులో ముల్లులా అడ్డం ఉన్న అంశాల్లో మూలధనం కూర్పు కూడా ఒకటి కావడం గమనార్హం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక నిర్మాణాల కోసం ప్రధానంగా ఉద్దేశించిన బ్రిక్స్ బ్యాంకు, ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్ (ఎ.డి.బి) లాంటి ఇతర అంతర్జాతీయ బ్యాంకులకు పోటీ కాదని బ్రిక్స్ దేశాలు చెప్పాయి. అయితే ఆచరణలో పోటీ అనివార్యం. ప్రపంచ ద్రవ్య, ఆర్ధిక రంగాలు ఇన్నాళ్లూ అమెరికా, ఐరోపా, జపాన్ లే శాసిస్తూ వచ్చాయి. ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్, ఎ.డి.బి ల ద్వారా గ్లోబల్ ద్రవ్య, ఆర్ధిక పెత్తనాన్ని గుప్పెట్లో పెట్టుకున్న పశ్చిమ దేశాలకు బ్రిక్స్ బ్యాంక్ ఆవిర్భావం సహజంగానే కంటకప్రాయం అయింది.

బ్రిక్స్ బ్యాంక్ లో మెజారిటీ పెట్టుబడి తానే పెడతానని చైనా ముందుకు వచ్చింది. అలా జరిగితే బ్యాంకుపై పెత్తనం చైనా చేతుల్లోకి వెళ్తుందని తతిమా దేశాలు భయపడుతున్నాయని, చర్చలు రెండు సం.లకు పైగా సాగడానికి కారణం అదేనని పశ్చిమ పత్రికలు ఊహాగానాలు సాగిస్తున్నాయి. కానీ అదేమీ తమకు సమస్య కాదని ఇతర బ్రిక్స్ దేశాలు వివిధ సందర్భాల్లో స్పష్టం చేశారు. దేశాలన్నీ సమాన పెట్టుబడిని సమకూర్చడానికే సిద్ధంగా ఉన్నాయని, అది తప్ప వేరే ప్రతిపాదన తమ ముందు లేదని బ్రెజిల్ అధికారి చెప్పారని రాయిటర్స్ తెలిపింది.

వచ్చే జులై 15 తేదీన బ్రిక్స్ దేశాలు మరోసారి సమావేశం కానున్నాయి. ఈసారి బ్రెజిల్ నగరం ఫోర్టలేజాలో సమావేశం అవుతున్న బ్రిక్స్ నేతలు బ్రిక్స్ బ్యాంక్ ను అధికారికంగా ప్రారంభించే ఒప్పందంపై సంతకాలు చేయవచ్చని పత్రిక తెలిపింది. ప్రారంభ పెట్టుబడి 50 బిలియన్ డాలర్లుగా ఉంటుందని తెలుస్తోంది. ఇది పాత సమాచారమే. బ్యాంకు ప్రారంభానికి నేతలు ఒప్పందం చేసుకున్నాక దానిని సభ్య దేశాల చట్ట సభలు కూడా ఆమోదం చెప్పవలసి ఉంటుంది. బ్యాంకు మొదలయ్యాక రెండేళ్లలో రుణాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది.

ప్రారంభ పెట్టుబడి 50 బిలియన్లలో 10 బిలియన్ల మేరకు డబ్బు రూపంలో సభ్య దేశాలు సమకూర్చుతాయి. మిగిలిన 40 బిలియన్లను గ్యారంటీల రూపంలో సమకూర్చుతాయి. దీనిని అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడిని సమకూర్చడానికి వినియోగిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఉనికిలో ఉన్న అంతర్జాతీయ బ్యాంకులు, ద్రవ్య నిధి సంస్ధలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో అభివృద్ధి కార్యక్రమాలకు దూరంగా ఉన్నాయని, ఈ ఖాళీని పూరించడానికి బ్రిక్స్ బ్యాంకు ప్రయత్నిస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. పూర్తిగా రుణాలు ఇవ్వకపోవడమే కాకుండా సదరు రుణాలను అడ్డం పెట్టుకుని జాతీయ ప్రభుత్వాల రోజువారీ కార్యకలాపాలలోను, విధానాల రూపకల్పనలలోనూ అమితంగా చొరబడడం వాటికి (ఐ.ఎం.ఎఫ్, డబ్ల్యూ.బి) అలవాటు అయింది. బ్రిక్స్ బ్యాంకు ఈ విధమైన చొరబాటుకు దూరంగా ఉంటుందని హామీ ఇస్తున్నారు.

“ఋణ గ్రహీతల ఆర్ధిక, ద్రవ్య పరిస్ధితిని మాత్రమే బ్యాంకు పట్టించుకుంటుంది. ఆ దేశాల ఆర్ధిక విధానాలను మాత్రం ఎప్పటికీ ప్రభావితం చేయబోదు. ఎ దేశం అయినా 100,000 డాలర్ల వాటాతో బ్యాంకులో చేరవచ్చు. మార్కెట్లలో లభ్యమయ్యే రుణాల కంటే తక్కువ ఖరీదు (వడ్డీ) కు మేము రుణాలు ఇస్తాము” అని బ్రెజిల్ అధికారి చెప్పారని పత్రికలు తెలిపాయి.

బ్రిక్స్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉండేదీ ఇంకా నిర్ణయం కాలేదు. న్యూ ఢిల్లీ, జోహాన్స్ బర్గ్, షాంఘై, మాస్కో నగరాలను ఇందుకోసం పరిశీలిస్తున్నారు. త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నందున బ్రెజిల్ నగరాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. బ్యాంకు అధ్యక్షుడిని కూడా ఎన్నుకోవలసి ఉంది. అధ్యక్షుడి పదవీ కాలం 5 యేళ్ళు ఉండాలని, ద్రవ్య రంగంలో బాగా అనుభవం ఉన్న వ్యక్తిని నియమించాలనీ ప్రస్తుతానికి అనుకున్నారు. అధ్యక్ష పదవిని వ్యవస్ధాపక సభ్య దేశాలకు రొటేషన్ ప్రాతిపదికన అప్పజెప్పాలని, ఐదేళ్లలో ప్రారంభ పెట్టుబడిని 100 బిలియన్ డాలర్లకు పెంచాలని కూడా ఇప్పటిని నిర్ణయించారు. మూల పెట్టుబడిలో కనీసం 55 శాతం భాగాన్ని తమ నియంత్రణలో ఉంచుకుంటూ మిగిలిన మొత్తాన్ని ఇతర సభ్య దేశాల నుండి సమకూర్చుకోవాలని భావిస్తున్నారు.

2 thoughts on “బ్రిక్స్ బ్యాంకు త్వరలో సిద్ధం!

  1. ఈ వ్యాసంలో రష్యా యొక్క అభిప్రాయాలు గూర్చి ఎక్కడా ప్రస్తావించలేదు,కారణం ఏమిటి?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s