ఇప్పుడంటే సాంకేతిక పరిజ్ఞానం అనూహ్య స్ధాయిలో విస్తరించడం వలన అసలు మనిషే లేని ‘మానవ రహిత’ డ్రోన్ విమానాలు వచ్చాయి గానీ అప్పుడు ఇవన్నీ ఎక్కడివి? గత శతాబ్దంలో కనీసం మూడో దశాబ్దం వరకు వివిధ యుద్ధాల్లో జంతువుల పాత్ర వెలకట్టలేనిది. వెలకట్టలేని పాత్రను జంతువులు నిర్వహించాయని చెబితే అది నిజానికి చాలా సాత్వికంగా చెప్పినట్లవుతుంది. అసలు జరిగిందేమిటంటే అంతులేని మానవ హింస, వినాశనంతో పాటు జంతువుల, పక్షుల హింస మరియు వినాశనం కూడా.
గుర్రాలను యుద్ధాల్లో వాడిన సంగతి అందరికి తెలిసిందే. ఆ రోజుల్లో ప్రధాన ప్రయాణ సాధనం గుర్రాలు, గాడిదలు, ఎద్దులే కనుక వీటిని రవాణాకి, ఆయుధాలు, సైనికులను మోయడానికి ఉపయోగించడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. కానీ పిల్లులు, కుక్కలు, పావురాలు, ఒంటెలు, కంచర గాడిదలు, ఏనుగులు లాంటి జంతువులు, పక్షులు కూడా యుద్ధంలో వివిధ దేశాల తరపున పోరాడాయని తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. మనిషి మచ్చిక చేసుకున్న ప్రతి జంతువు, పక్షీ కూడా మనిషి పాల్పడిన సకల దురాగతాలకూ బలయిందంటే సరిపోతుందేమో!
మొదటి ప్రపంచ యుద్ధం నాటికి ఆటో మొబైల్స్ తో కూడిన ఆయుధాలను అప్పుడప్పుడే కొత్తగా కనిపెడుతున్నారు. వివిధ రవాణా యంత్రాలకు ఆయుధాలు, మందుగుండు బిగించి ప్రయోగించడం అప్పటికి విస్తృతంగా వినియోగంలోకి రాలేదు. అందువల్ల అప్పటికి గుర్రాలే ప్రధాన యుద్ధ దళాలుగా ఉపయోగపడ్డాయి. పాత రాజుల కధలు, జానపద కధలు చదువుతుంటే ఆశ్విక దళం అనీ, కాల్బలం (ఒంటెలు), గజ బలం అనీ చదువుతుంటాం. మొదటి ప్రపంచ యుద్ధం నాటికి కూడా దాదాపు అదే పరిస్ధితి.
ఈ నేపధ్యంలో ఆశ్విక దళాలకు ప్రాముఖ్యత మెండుగా ఉండేది. భూతల యుద్ధానికి సంబంధించినంతవరకు ఒక మిలట్రీ ఎంత భారీగా గుర్రాలు కలిగి ఉంటే అది అంత శక్తివంతం అన్నట్లు! పోరాట బలగాలకు నిరంతరం సరఫరాలు, ఆయుధాలు, మందుగుండు అందజేయడానికి కూడా గుర్రాలను విరివిగా వాడేవారు. యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించిన బ్రిటిష్, ఫ్రెంచి రాజ్యాలు ప్రపంచ వ్యాపితంగా ఉన్న తమ వలస రాజ్యాల నుండి పెద్ద మొత్తంలో గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు తెప్పించుకుని తమ తమ పోరాట శక్తిని ఇనుమడింప జేసుకున్నాయి. యుద్ధం సాగినన్నాళ్లూ గుర్రాలు వందల వేల సంఖ్యలో ఖండాంతరాలకు పెద్ద మొత్తంలో రవాణా అవుతుండేవి.
అయితే అనువుగాని చోట్లలో కందకాలు తవ్వుకుని నెలల తరబడి, సం.ల తరబడి యుద్ధం చేయాల్సిన పరిస్ధితుల్లో గుర్రాలు కూడా ఒక దశలో ఉపయోగించుకోలేని స్ధితి! అదీ కాక యుద్ధం సాగే కొద్దీ గుర్రాలు కూడా పెద్ద మొత్తంలో చనిపోయేవి. ఒక అంచనా ప్రకారం మొదటి ప్రపంచ యుద్ధంలో నాలుగేళ్లలో కనీసం 80 లక్షల గుర్రాలు చనిపోయాయి. ఈ నేపధ్యంలో కుక్కలు, పావురాలు సైన్యాలకు ఇతోధికంగా తోడ్పడ్డాయి. కుక్కలు మెసెంజర్లుగా, సెంట్రీలుగా, ఆపదలో ఆదుకునేవిగా తోడ్పడగా పావురాలు ఉత్తరాల బట్వాడాకు బాగా ఉపయోగపడ్డాయి. ఆకాశంలో ఎగురుతాయి గనుక పావురాలకు కెమెరాలను అమర్చడం ద్వారా శత్రు శిబిరంలో బలగాల శక్తిని అంచనా వేసేందుకు పావురాలను వినియోగించారని కూడా తెలుస్తోంది.
కింది ఫొటోల్లో సార్జంట్ స్టబ్బీ పేరుతో మిలట్రీ యూనిఫారంలో ఉన్న కుక్క ఫోటోను చూడొచ్చు. ఈ కుక్క ఆనాడు అతి పెద్ద సెలబ్రిటీ కుక్క. అమెరికా తరపున యుద్ధంలో దాడికి, గూఢచర్యానికి, గాయపడిన సైనికులను కనిపెట్టడానికీ ఇది అత్యున్నత సేవలు చేసినదిగా చరిత్రకు ఎక్కింది. ఒకసారయితే ఒక జర్మనీ గూఢచారిని పట్టుకుని అమెరికా సైనికులు వచ్చేవరకూ ఎటూ పోకుండా నిలిపి ఉంచిందట. అలాగే గ్యాస్ దాడుల నుండి కూడా ఇది అనేకసార్లు అమెరికా, మిత్ర పక్షాల సైనికులను రక్షించింది. దాదాపు 18 నెలలు యుద్ధంలో సేవలు అందించి రెండు సార్లు గాయపడింది కూడాను. 4 దాడుల్లో, 17 పరస్పర యుద్ధాల్లో పాల్గొన్న ఈ కుక్కను సార్జంట్ గా ప్రమోషన్ ఇచ్చి సత్కరించుకుంది అమెరికా.
మొదటి ప్రపంచ యుద్ధంలో మనుషుల తరపున, బలగాల తరపున, రాజ్యాల తరపున పోరాటంలో పాల్గొన్న జంతువులు, పక్షులు లక్షలాది సైనికుల వలెనే తాము కూడా దుర్మరణం పాలయ్యాయి. ఆనాటి యుద్ధంలో పాలు పంచుకున్న వివిధ జంతువులు, పక్షులకు చెందిన ఈ ఫోటోలను ‘ది అట్లాంటిక్’ పత్రిక ప్రచురించింది.




























you can see how horses and mules being used in WW1 in “war Horse” movie in elabarate. a real tribute to all animals used in any war by Steven Spielberg.
నిజమే మనం మనుషులమే అన్ని జీవుల కన్నా గొప్ప వాళ్లమని విర్రవీగుతాం కానీ…సృష్టి లోని అన్ని జీవులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనిషి ఎదుగుదలకు, మనుగడకు సాయపడుతూనే ఉన్నాయి. అవి లేకుంటే మనమెక్కడ…?