మోడి గెలుపు: ఇక ఎఫ్.డి.ఐల వరదే -ఆసోఛామ్


ASSOCHAM

నరేంద్ర మోడి ప్రచార సారధ్యంలో బి.జె.పి/ఎన్.డి.ఏ సాధించిన విజయం ధనిక వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మోడి అభివర్ణించిన ‘మంచి రోజులు’ తమకే అని వారికి బాగానే అర్ధం అయింది మరి! గుజరాత్ నమూనాను దేశం అంతా అమలు చేయడం అంటే స్వదేశీ-విదేశీ  కంపెనీలకు, పరిశ్రమలకు, దళారులకు మేలు చేస్తూ ప్రజల వనరులను వారికి కట్టబెట్టడమే అని కాంగ్రెస్ సైతం చెప్పే మాట! ఈ నేపధ్యంలో మోడి అనుసరించే విధానాల వల్ల దేశంలోకి ఈ యేడు రికార్డు స్ధాయిలో 60 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు ప్రవహిస్తాయని ఆసోఛామ్ అంచనా వేసింది.

“మోడి ప్రభుత్వంపై పెట్టుకున్న భారీ అంచనాల ఫలితంగా ప్రపంచ స్ధాయి పెట్టుబడిదారులు భారత ఆర్ధిక వ్యవస్ధపై ఇనుమడించిన ఉత్సాహంతో ఉన్నారు. ఫలితంగా ఎఫ్.డి.ఐ ల ప్రవాహంలో 100 శాతం పెరుగుదల ఉంటుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ లు రెండూ కలిపి మొత్తం 60 బిలియన్ డాలర్లు దేశంలోకి వస్తాయి. 2013-14 ఆర్ధిక సంవత్సరంలో ఈ మొత్తం 29 బిలియన్ డాలర్లుగా ఉన్నందున ఇది 100 శాతం పెరుగుదలకు సమానం” అని ఆసోఛామ్ తన సర్వేలో పేర్కొంది.

‘అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా’ కు ఆసోఛామ్ పొట్టి రూపం. ఈ సంస్ధ ఆదివారం తమ సర్వే వివరాలను పత్రికలకు అందజేసింది. ఈ ప్రకటన ప్రకారం భారత దేశంలో అత్యధిక స్ధాయిలో విదేశీ పెట్టుబడుల రాక నమోదయిన సంవత్సరం 2012-13. ఆ యేడు ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఐ.ఐ లు కలిపి మొత్తం 46.17 బిలియన్ డాలర్లు దేశంలోకి వచ్చాయని, ఈ యేడు ఆ రికార్డును కూడా అధిగమించి 60 బిలియన్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తాయని ఆసోఛామ్ తెలిపింది.

మోడి అనుసరించనున్న విధానం వలన ఆర్.బి.ఐ వడ్డీ రేట్లు తగ్గుతాయని ఆసోఛామ్ అంచనా వేస్తోంది. కానీ అదే సమయంలో ధరలు కూడా తగ్గుతాయని ఆసోఛామ్ చెబుతోంది. ధరలు తగ్గడం అంటే ద్రవ్యోల్బణం తగ్గడమే. ఒక పక్క వడ్డీ రేట్లు తగ్గుతాయంటూ అదే నోటితో ద్రవ్యోల్బణమూ తగ్గుతుందని చెప్పడం ఏమిటో అర్ధం కానీ విషయం. వడ్డీ రేట్లు తగ్గిస్తే మరింత డబ్బు ఆర్ధిక వ్యవస్ధలోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా ద్రవ్య చలామణి పెరుగుతుంది. ఇది అనివార్యంగా ధరలు పెరగడానికి దారి తీస్తుంది. అనగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వడ్డీ రేట్లు పెంచినా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేక ఆర్.బి.ఐ ఒకపక్క సతమతం అవుతుంటే ఆసోఛామ్ సర్వే సదరు ఆచరణను గేలి చేస్తూ వడ్డీ రేట్లు తగ్గి, ధరలు కూడా తగ్గుతాయని చెప్పడం మోసం తప్ప మరొకటి కాదు.

“ఆవిష్కృతం అవుతున్న పరిస్ధితులను బట్టి చూస్తే ధరలు తగ్గుతాయని, వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయని సూచనలు అందుతున్నాయి. భారత ఆర్ధిక వ్యవస్ధ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అత్యంత కఠినమైన సవాళ్ళు ఈ రెండే” అని ఆసోఛామ్ అధ్యక్షుడు రాణా కపూర్ పేర్కొన్నారు. ఇలా అంటూనే ‘ఈ పరిస్ధితి ఆర్.బి.ఐ ముందు సరికొత్త సవాళ్ళు ఉంచుతుంది” అని కూడా కపూర్/ఆసోఛామ్ చెబుతున్నారు. ఏమిటయ్యా అదీ అంటే వ్యవస్ధలో మరింత లిక్విడిటీ పెరుగుతుంది కనుక రూపాయి విలువకూ ద్రవ్యోల్బణానికి మధ్య సమతూకం పాటించడమే ఆ సవాలు అని ప్రకటన పేర్కొంది. అనగా ముందు జాగ్రత్తగా ద్రవ్యోల్బణం పెరిగితే అది ఆర్.బి.ఐ తప్పే అవుతుందని, ఎదురయిన సవాలును సమర్ధవంతంగా ఎదుర్కోకపోవడం అవుతుందని ఆసోఛామ్ చెబుతోంది.

ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సింది ఏమిటి? వడ్డీ రేట్లు తగ్గించాలన్నది ఆసోఛామ్ డిమాండు. కానీ వడ్డీ రేట్లు తగ్గిస్తే లిక్విడిటీ (ద్రవ్యం అందుబాటు) పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుందని కూడా ఆసోఛామ్ కు తెలుసు. కానీ ద్రవ్యోల్బణం సమస్య తమ డిమాండ్ ని నెరవేర్చడం వల్ల వచ్చిందని జనానికి తెలియకూడదు. కాబట్టి ద్రవ్యోల్బణం పెరిగితే అది ఆర్.బి.ఐ సామర్ధ్యానికి సంబంధించిన సమస్యే తప్ప తమ డిమాండ్ వల్ల వచ్చిన సమస్య కాదని చెప్పుకోవాలి. అది నిజమైనా, అబద్ధమైనా సరే! కాబట్టి వడ్డీ రేట్ల తగ్గుదల వలన ద్రవ్యోల్బణం పెరిగితే అది ఆర్.బి.ఐ తప్పు అవుతుందన్నమాట!

ఆసోఛామ్ సర్వే ప్రకారం ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో యధావిధిగా ఎఫ్.డి.ఐ ల కంటే ఎఫ్.ఐ.ఐ లే ఎక్కువగా ఉంటాయి. లెక్క ప్రకారం ఎఫ్.డి.ఐలు కాస్త ఎక్కువ కాలం దేశంలో ఉండి ఆర్ధిక వ్యవస్ధలో ఊపు రావడానికి, జి.డి.పి పెరగడానికి కృషి చేయాలి. ఎఫ్.ఐ.ఐ లు అంటే హాట్ మనీ. అవి ప్రధానంగా పోర్ట్ ఫోలియో పెట్టుబడులుగా వస్తాయి. అనగా స్టాక్ మార్కెట్ల లోకీ, ఋణ మార్కెట్ల లోకీ అవసరమైతే వెంటనే/వేగంగా ఉపసంహరించుకోగల రంగాల్లోకి మాత్రమే వస్తాయి. దేశాల ఆర్ధిక వ్యవస్ధలను కుదేలు చేయగల సామర్ధ్యం వీటికి ఉంటుంది. కనుక ఎఫ్.ఐ.ఐ ల కంటే సాపేక్షికంగా ఎఫ్.డి.ఐ లే మేలని ప్రభుత్వాలు భావిస్తాయి.

కానీ ఎఫ్.డి.ఐలు దేశంలోని వనరులను విచక్షణా రహితంగా భోంచేస్తాయి. ఎఫ్.ఐ.ఐ లు ప్రధానంగా ద్రవ్య వనరులను భోంచేస్తే ఎఫ్.డి.ఐ లేమో ద్రవ్య వనరులతో పాటు ఖనిజ వనరులను, భూ వనరులను, నీటి వనరులను, పొదుపు వనరులను కూడా భోంచేస్తాయి. కాబట్టి జనం వైపు నుండి చూస్తే అవి రెండూ వారి పళ్లూడగొట్టే కొండ రాళ్లే.

పోనీ ప్రభుత్వాల లెక్క ప్రకారం చూసినా ఎఫ్.డి.ఐ ల కంటే ఎఫ్.ఐ.ఐ లు ఎక్కువగా వస్తాయని ఆసోఛామ్ లెక్క తేల్చింది. ఎఫ్.డి.ఐ లు సుమారు 25 బిలియన్ డాలర్లు ఉంటే ఎఫ్.ఐ.ఐ లు సుమారు 35 బిలియన్ డాలర్లు ఉంటాయని చెప్పింది. ఎఫ్.డి.ఐ లు కూడా భారీగా రావాలంటే ఆసోఛామ్ కొన్ని షరతులు కూడా విధించింది. “ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి, ప్రజల మెప్పును సంపాదించడంతో పాటు, సంస్కరణలకు అనుకూలమైన విధానాలను మోడి ప్రభుత్వం అమలు చేస్తే గనుక ఎఫ్.డి.ఐ లు కూడా ఎఫ్.ఐ.ఐ లతో పాటుగా వేగం పుంజుకుంటాయి. మోడీ తెచ్చిన ఉత్సాహాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ తర్వాత పరిస్ధితి దానంతట అదే పుంజుకుంటుంది” అని ఆసోఛామ్ ప్రకటన పేర్కొంది.

ఈ ప్రకటనలో ప్రజల మెప్పు అంటే సాధారణ ప్రజల మెప్పు అనుకునేరు! పెట్టుబడిదారీ కంపెనీలు, ధనిక వర్గాల దృష్టిలో ప్రజలు అంటే తామే. కంపెనీల కోసం, కంపెనీల వలన, కంపెనీల చేత ఆర్ధిక వ్యవస్ధను నడిపిస్తే అదే దేశ ఆర్ధిక వ్యవస్ధకు మేలు చేయడం అనీ, గొప్ప ప్రజాస్వామ్యం అన్నా అదేననీ ధనిక వర్గాల గట్టి నమ్మకం. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కూడా ఈ నమ్మకాన్ని పాటిస్తూ తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయి. మోడి ప్రభుత్వం ఈ విషయంలో మరింత దూకుడుగా ఉంటుందని మొత్తం ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ ఇప్పుడు అంచనా వేస్తోంది. ఆసోఛామ్ అంచనా కూడా అందులో భాగమే. ఈ అంచనా ఎంత తీవ్రంగా, ఎంత గట్టిగా ఉందంటే అమెరికన్ రిజర్వ్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తన నెలవారీ ఉద్దీపనను క్రమంగా ఉపసంహరించినప్పటికీ ఆ ప్రభావం ఇండియాపై పెద్దగా ఉండబోదని ఆసోఛామ్ భావిస్తున్నంత!

4 thoughts on “మోడి గెలుపు: ఇక ఎఫ్.డి.ఐల వరదే -ఆసోఛామ్

 1. మోడి అధికారంలోకి రావాలని సామాన్య జనం కన్నా….వ్యాపార వర్గాలే బలంగా కోరుకున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కేవలం కోరుకోవడమే కాదు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ప్రయత్నించారు, విజయం సాధించారు. అసమర్థ కాంగ్రెస్ విధానాలు, నాయకత్వ లేమి మరింత సాయపడ్డాయి. మొత్తానికి మోడి అధికారంలోకి వచ్చారు. సహజంగానే ధనిక వర్గాలు తమ ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు కచ్చితంగా ఆశిస్తాయి. వారు మోడిని అధికారంలోకి తెచ్చిందే అందుకు కదా.
  ఏ ప్రభుత్వంతో తమ ప్రయోజనాలు నెరవేరుతాయో సామాన్య జనం తెలుసుకున్న రోజు ఇటువంటి వాటికి అవకాశం ఉండదు. ఐతే దురదృష్టమేమిటంటే వారి ప్రయోజనాలకు కట్టుబడే సరైన ప్రత్యామ్నాయం వారికి అందుబాటులో లేకపోవడమే.

 2. you are always crtiscizing modi and his mosel of development. Though some drawbacks were there in gujarat but overall it does well ( apart from mal nutrition and all) first you just understand one thing i.e It is impossible for any govt to over come all hurdels. In the above article it is un neccessary to critiscize modi govt, the article is meant for ASSOCHAM pridictions day after day you become more biased like Ramoji rao etc.

 3. భరత్ గారూ,

  ఒకటి: మోడిని విమర్శించకూడదన్న నియమం నాకు లేదు. మీకు ఉంటే గనక అది నా నియమం అవదు.

  రెండు: రాజకీయాలు, ఆర్ధిక వ్యవస్ధ, సమాజం, ఇలాంటి అంశాలన్నీ వ్యక్తి కేంద్రకాలు కావు. ప్రజా కేంద్రకాలు. ప్రజల ప్రయోజనాలకు భంగం కలుగుతున్న చోట విమర్శ తప్పదు. ఒకరి అభిమానానికి, మరొకరి ఇష్టాయిష్టాలకి అవి అతీతం.

  మూడు: మీలాంటి వారికి మోడి అంటే ఇష్టం. అది మీ యిష్టం. తప్పు లేదు. కానీ ఆ యిష్టాన్ని నాలాంటివారిపై రుద్దాలని చూడడం అభ్యంతరకరం. విమర్శలో యుక్తాయుక్తాలు చూడండి. వాస్తవాలు చూడండి. అవి లేకపోతే వాటిని ఎత్తి చూపండి. కానీ అసలు ఒక వ్యక్తినే విమర్శించొద్దు అనడం, ఆయన తప్పుల్ని చూసి చూడనట్లు పోలేరా అనడం తగదని నా అభిప్రాయం.

  నాలుగు: గుజరాత్ లో జరిగినవి చిన్న లోపాలన్నది మీ అభిప్రాయం. నాది కాదు. అక్కడ అమలయిన విధానాలు పక్కా ప్రజా వ్యతిరేక విధానాలని నేను వివిధ ఆర్టికల్స్ లో తెలియజేసాను.

  ఐదు: ఆసోఛామ్ అంచనాలు, మోడి వాగ్దానాల మధ్య సంబంధాన్ని మీరు చూడలేకపోతే అది నాదా తప్పు!

  ఆరు: ఒక్క మోడీనేనా ఈ బ్లాగ్ లో నేను విమర్శించింది. అరవింద్ కేజ్రీవాల్ ను విమర్శించాల్సిన చోట విమర్శించాను. మెచ్చాల్సిన చోట మెచ్చాను. రాహుల్. సోనియా, మన్మోహన్ ఇత్యాదిలాంటివారినీ విమర్శించాను. మీకు బహుశా ఆ విమర్శలు నచ్చాయి కాబట్టి అభ్యంతరం లేదనుకుంటాను. కానీ నాకు వ్యక్తుల తేడాలు లేవు. ఉంటే అది నా తప్పవుతుంది. ప్రజల కోణంలో నుండి చూస్తూ ఆయా విమర్శలు, మెచ్చడాలు చేస్తాను. జర్నలిస్టులు అదే చేయాలని నా అబిప్రాయం.

 4. sekhar garu,
  1. modi ni Vimarsinchakudadu ane niyamam naku ledu am not a supporetr of modi
  2. vimarsinchakudadu ani nenu analedu, target cheyakudadu ani matrame cheppa, last 18 months ga nenu me articles chadutunnanu, nenu observe chesinadi enti ante modi pm candidate ga elect ainapati nundi meru target chestunaru
  3.vastavalu grahinchadaniki nenu epudu siddame
  4.Gujarat lo vidhanalu pakka praja vyatireka vidhanalu aite prajalu BJP govt ki 3 times enduku pattam kattaru
  5.artika abhivruddi gurinchi ea pm cheppina daniki assocham anchanalaki sambandam vidadeyaranidi
  6.andarni vimarsincharu no doubt but modi ni vimarsinchadam lo dosage ekkuvindi ani na abhiprayam

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s