మెక్సికో: తుపాకి పట్టిన జనం, డ్రగ్స్ మాఫియా పరార్ -ఫోటోలు


ఏలేవాడికి చేతగాకపోతే జనమే తమని తాము ఎలా రక్షించుకుంటారో మెక్సికో లోని మిచోకాన్ రాష్ట్ర ప్రజలు చెబుతున్నారు. కిడ్నాప్ లకు, హత్యలకు, అత్యాచారాలకు పాల్పడుతూ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధను గుప్పెట్లో పెట్టుకున్న ‘ద నైట్స్ టెంప్లార్’ అని డ్రగ్స్ ముఠాను ప్రభుత్వాలు సంవత్సరాల తరబడి ఏమీ చేయలేకపోయాయి. నిమ్మ, వెన్న పండు (Avocado) పండించే రైతులకు కూడా వివిధ డ్రగ్స్ ముఠాలు బెడదగా మారినప్పటికీ పోలీసుల నుండి గానీ, సైన్యం నుండి గానీ జనానికి ఏమీ సహాయం అందలేదు. రక్షణ కరువై బ్రతకడమే కష్టంగా మారిన పరిస్ధితుల్లో మిచోకాన్ లో అనేక చోట్ల జనమే సాయుధులై మాఫియా ముఠాలను ఎదుర్కోవడం మొదలు పెట్టారు.

మెక్సికోలో డ్రగ్స్ మాఫియాలకు పుట్టినిల్లు అన్న సంగతి అందరికి తెలిసిందే. మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడం దగ్గర్నుండి ప్రజలు, రైతులు, వ్యాపారులనుండి బలవంతపు వసూళ్లు చేయడం వరకూ అక్కడి మాఫియా గ్రూపులు పేరుపొందాయి. వారిని ఎదుర్కొని నిలువరించడానికి బదులు గత అనేక ప్రభుత్వాలలోని నేతలు, అధికారులు వారి అక్రమ సంపాదనలో వాటాలు పంచుకున్నారు.

మాఫియా ముఠాల ఆగడాలతో విసిగిపోయిన జనం గత సంవత్సరం ప్రారంభం నుండి తామే ఆయుధాలు పట్టి మాఫియాలను ఎదుర్కోవడం మొదలు పెట్టారు. గ్రామాల్లోని యువకులు, ముసలివాళ్ళు అన్న తేడా లేకుండా స్వతంత్రంగా ముందుకు వచ్చిన వారందరితో కలిసి గ్రామ రక్షక దళాలను ఏర్పరుచుకున్నారు. తమ తమ గ్రామాల్లోకి గానీ పట్నాలలోకి గానీ మాఫియా ముఠాలు అడుగు పెట్టకుండా చూడడం వారి పని. అందుకోసం సొంతంగా గ్రామ, పట్టణ శివార్లలో చెక్ పోస్టులు కూడా నిర్మించుకుని వచ్చే పోయే వాహనాలను తనిఖీ చేస్తూ మాఫియా ముఠాల సభ్యులను ఏరివేయడం ప్రారంభించారు. వాలంటీర్ దళాలకు ప్రజలే ఆయుధాలు సమకూర్చి పెట్టారు. ఎ.కె 47, ఆర్.పి.జి (Rocket Propelled Grenades) లాంటి ఆధునిక ఆయుధాలను కూడా వారు సంపాదించుకుని మాఫియాలకు వణుకు పుట్టిస్తున్నారు.

ఒకవైపు మాఫియా సాయుధ ముఠాలు, మరోవైపు అత్యాధునిక ఆయుధాలతో సంచరించే వాలంటీర్ దళాలు పోరాటాలు చేసుకుంటుండడంతో ప్రభుత్వం ఉండీ లేనట్లుగా మారింది. మాఫియా ముఠాల అరాచకాలను ప్రభుత్వ బలగాలే అరికట్టవలసి ఉండగా దానికి బదులు జనమే ఆయుధాలు పట్టాల్సి వచ్చిన పరిస్ధితే ప్రభుత్వానికి సిగ్గు చేటయిన విషయం. ఇది గమనించిన మెక్సికో ప్రభుత్వం ‘ద నైట్స్ టెంప్లార్’ లాంటి గ్రూపులను ఎదుర్కోవడం సంగతి అటుంచి జనం దగ్గర ఉన్న ఆయుధాలను సమస్యగా భావిస్తోంది.

అయితే ఆయుధాలు అప్పగించడానికి జనం ససేమిరా అనడంతో వారినే అధికారిక బలగాలుగా గుర్తించే పనికి మెక్సికో ప్రభుత్వం పూనుకుంది. గత జనవరి నుండి మొదలుకొని వాలంటీర్ దళాలు తమ ఆయుధాలను రిజిస్టర్ చేసుకోవాలని మెక్సికో ప్రభుత్వం కోరింది. ఆయుధాలు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం లేదని సాయుధులు తమ పేరు, ఆయుధం రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుందని చెప్పడంతో అందుకు కొన్ని దళాలు ముందుకు వచ్చాయి. మొత్తం 20,000 మంది వాలంటీర్ దళాల్లో సభ్యులుగా ఉన్నారని భావిస్తుండగా వారిలో కనీసం 3,300 మంది తమ వద్ద ఉన్న 6,000 ఆయుధాలను రిజిస్టర్ చేసుకున్నారని ప్రభుత్వం తెలిపింది. సాధారణ ఆయుధాలు, హ్యాండ్ గన్ లు, దాడి ఆయుధాలు చివరికి ఎ.కె 47 లు కూడా ఉంచుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఆర్.పి.జి, బజూకా లాంటి ఆయుధాలను మాత్రం ప్రభుత్వానికి అప్పగించాలని కోరింది.

జనం వాలంటీర్ దళాలు ఏర్పరుచుకుని తిరగబడడం ప్రారంభించాక మాఫియా ముఠాల బెడద చాలావరకు తగ్గిపోయిందని ప్రభుత్వం సైతం అంగీకరిస్తోంది. అయితే మాఫియా ముఠాలు తాత్కాలికంగా వెనక్కి తగ్గారే గానీ మొత్తంగా వారి కార్యకలాపాలను విరమించుకోలేదని జనం భావిస్తున్నారు. తమ పోరాటం ప్రారంభించినప్పుడు ఎక్కడ చూసినా బ్యారీకేడ్లు ఏర్పాటు చేసుకుని యుద్ధాలు చేయడమే కనిపించేదని ఇప్పుడు పరిస్ధితి కాస్త సద్దుమణిగినప్పటికీ మాసిపోలేదని వాలంటీర్ దళాల నాయకులు చెబుతున్నారు.

వాలంటీర్ దళాలు కేవలం తమ గ్రామాలను, పట్నాలను రక్షించుకోవడం వరకే పరిమితం కాలేదు. మాఫియా బలగాలు తమ తమ తావుల్లో రక్షణ పొందుతున్న నేపధ్యంలో అక్కడికి వెళ్ళి దాడులు చేయడం ద్వారా వారిని పూర్తిగా తుడిచి పెట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం పోలీసులు వారికి శిక్షణ ఇస్తున్నారు. గత ఫిబ్రవరిలో ‘ద నైట్స్ టెంప్లార్’ కు కేంద్రంగానూ, రక్షణ తావు గానూ కొనసాగుతున్న అపాట్ జింగాన్ పట్నంపైకి దాడి చేశారు. మొదట సదరు పట్నం చుట్టూ ఉన్న గ్రామాలనుండి మాఫియా ముఠాలను తరిమేసినాక, పట్నం శివార్లలో బ్యారీకేడ్లు, చెక్ పోస్టులు నిర్మించుకుని తనిఖీలు చేశారు. అనంతరం పట్నం లోపలికి చొరబడి ఇల్లిల్లూ గాలించి టెంప్లార్ ముఠా సభ్యులను పట్టుకున్నారు. ప్రధాన నాయకులు మాత్రం వారికి దొరకలేదు.

నేరస్ధ ముఠాల సభ్యులు కొందరు వాలంటీర్ దళాల్లోకి కూడా చొరబడి టెంప్లార్ ముఠా కార్యకలాపాలు సాగిస్తున్న ఉదాహరణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. యువకులను దళాల్లో చేరవలసిందిగా బలవంత పెడుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు లేకపోలేదు. అలాంటి వారిని కూడా తాము ఏరివేస్తున్నామని వాలంటీర్ దళాలు చెబుతునాయి.

మిచోకాన్ ప్రజల సాయుధ ప్రతిఘటన ఇతర దేశాల్లోని సాధారణ ప్రజలకు కూడా ఆదర్శం కావాలేమో. నేరస్ధ ముఠాలే కాకుండా నేరస్ధ ముఠాలుగా మారిపోయిన రాజ్యాలను ఎదుర్కోవాలన్నా జనానికి సాయుధ ప్రతిఘటన తప్ప మరో మార్గం లేని పరిస్ధితులు దాపురిస్తున్నాయి. ఈ కింది ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక అందించింది.

వ్యాఖ్యానించండి