ఎలక్షన్ అఫిడవిట్: మోడి వివాహితులే


Modi nomination

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి అవివాహితులని, ఆజన్మ బ్రహ్మచారి అని చెప్పడం అంటే ఆయన అభిమానులకు చాలా యిష్టం. దేశం కోసం, దేశ ప్రజల ప్రయోజనం కోసం మోడి తన వ్యక్తిగత సుఖ సంతోషాలను తృణప్రాయంగా ఎంచుతూ త్యాగం చేశారని వారు తరచుగా చెబుతుంటారు. కానీ మోడి తన అభిమానులను నిరాశపరిచారు. ప్రధాని అభ్యర్ధిగా పోటీ పడుతూ అబద్ధం చెప్పకూడదు అనుకున్నారేమో తెలియదు గానీ తనను తాను వివాహితుడిగా పేర్కొంటూ ఆయన ఎన్నికల అఫిడవిట్ సమర్పించారు.

ది హిందూ పత్రిక సమాచారం ప్రకారం నరేంద్ర మోడి గతంలో జరిగిన ఎన్నికల్లో తనను తాను వివాహితునిగా చెప్పుకోలేదు. మీరు వివాహితులా అన్న ప్రశ్నకు ఎదురుగా ఇన్నాళ్లూ ఖాళీ వదిలిపెట్టారు గానీ పెళ్లి అయిందని రాయలేదు. వదోదర పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేయడానికి నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆయన మొట్టమొదటి సారిగా తనకు పెళ్లి అయిందని చెప్పారు. తన భార్య పేరు జశోదా బెన్ అని కూడా ఆయన వెల్లడించారు.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు తమ నామినేషన్ పత్రాలతో పాటు తన స్ధిర, చర ఆస్తుల వివరాలు వెల్లడించే అఫిడవిట్ కూడా సమర్పించాలి. తన పేరు మీదా, తన భార్య పేరు మీదా, పిల్లలు ఉన్నట్లయితే వారి పేర్ల మీదా ఉన్న ఆస్తులను ప్రకటించాలి. నరేంద్ర మోడి ఇన్నాళ్లూ భార్య పేరు స్ధానంలో ఖాళీ వదిలారు తప్ప పూరించలేదు. దానితో ఆయన అవివాహితులని, బ్రహ్మచారి అనీ ఆయన పార్టీ కార్యకర్తలు భావించడానికి ఆస్కారం ఏర్పడినట్లు కనిపిస్తోంది.

ఇటీవల 2012 లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం నరేంద్ర మోడి భార్య స్ధానంలో ఖాళీ వదిలారు. 2014 ఎన్నికల నాటికి ఆయన వివాహితుడిగా మారారు. తన భార్య పేరు మీద ఏయే ఆస్తులు ఉన్నదీ తనవద్ద సమాచారం లేదని ఆయన అఫిడవిట్ లో పేర్కొన్నారు. బుధవారం ఉదయం మోడి నామినేషన్ పత్రాలు దాఖలు చేసినప్పటికీ అర్ధరాత్రి తర్వాత మాత్రమే అఫిడవిట్ ను కలెక్టర్ కార్యాలయంలోని డిస్ ప్లే బోర్డులో ప్రదర్శించారని ది హిందు తెలిపింది.

గుజరాత్ ప్రధాన ఎన్నికల అధికారి వెబ్ సైట్ లో కూడా అభ్యర్ధుల అఫిడవిట్ లను ప్రదర్శించాల్సి ఉండగా అర్ధ రాత్రి వరకూ అది జరగలేదని పత్రిక తెలిపింది. లోక్ సభ ఎన్నికల సందర్భంగా అయినా మోడి తన వివాహ విషయాలకు సంబంధించిన వివరాలు వెల్లడి చేయాలని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. బహుశా సదరు విమర్శల వల్లనే మోడి తన నిర్ణయాన్ని మార్చుకున్నారేమో తెలియదు.

వదోదర లో నామినేషన్ వేసిన సందర్భంగా నరేంద్ర మోడి ఒక టీ వ్యాపారిని వెంటబెట్టుకు వచ్చి నామినేషన్ వేశారు. ఆయన గతంలో వదోదర లోనే టీ కుర్రాడుగా పని చేశారని కాంగ్రెస్ నేతలు కొందరు ఎగతాళి చేసే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన బి.జె.పి కాంగ్రెస్ నేతల ఎగతాళినే ప్రచార ఆయుధంగా మలుచుకుంది. ‘చాయ్ పే చర్చా’ పేరుతో విడతలు విడతలుగా ప్రచార కార్యక్రమాన్ని బి.జె.పి నిర్వహించింది. కాంగ్రెస్ లో అయితే పెద్దవారే ప్రధాని కాగల అవకాశం వస్తుందని, బి.జె.పి లో టీ కుర్రాడు కూడా ప్రధాని కాగల అవకాశం ఉంటుందని మోడి సైతం ప్రచారం చేసుకున్నారు. ఆ విధంగా కాంగ్రెస్ విమర్శ బి.జె.పి కి ఒక ప్రచార అస్త్రాన్ని సమకూర్చి పెట్టింది.

2 thoughts on “ఎలక్షన్ అఫిడవిట్: మోడి వివాహితులే

  1. నో ఉల్లు బనావింగ్ ( వెర్రోల్లని చేయొద్దు) అని , ఐడియా మొబైల్ ప్రకటన ఒకటి వస్తుంది. మోడీకి అది సరిగ్గా వర్తిస్తుంది.
    మోడీ మాయలో పడి, “పెళ్ళి కూడా చేసుకోకుండా మోడీ తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేశాడు.” అని కళ్ళు మూసుకుని తన్మయత్వంతో వాదించే మోడీ భజనపరుల్ని నేను ఇప్పటికే చాలా మందిని చూశాను. అది కాదురా బాబు, అతనికి పెళ్ళైంది, కాకపోతే భార్యని వదిలేసి ఇలా తిరుగుతున్నాడు, కావాలంటే ఆ అమాయకురాలి ఇంటర్వ్యూలు యూటూబ్లో కూడా ఉన్నాయి చూస్కోండి అని నేను చెబితే నమ్మకుండా, ఇవన్నీ కాంగ్రెస్ కుట్రలనీ, మోడీ నిఖార్సైన బ్రమ్మచారనీ నాతో వాదనలకి దిగారు. బ్రైన్ వాష్ తో మైడ్ దొబ్బేసిన వాల్లకి ఎన్ని చెప్పినా తలకెక్కదు లెమ్మని, నేనే సైలెంటై పోయా. పాపం వీరి పతిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుందో.

వ్యాఖ్యానించండి