ఎట్టకేలకు మలేషియా ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చింది. తమ పౌర విమానం MH370 హిందూ మహా సముద్రంలో ఎవరూ పెద్దగా సంచరించని చోట కూలిపోయిందని మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ ప్రకటించారు. ఈ మేరకు బ్రిటన్ ప్రభుత్వం సాక్ష్యాధారాలతో నిరూపించిందని ఆయన తెలిపారు. ఆస్ట్రేలియా పశ్చిమ తీర నగరం పెర్త్ కు పశ్చిమ దిశగా 2,000 కి.మీ దూరంలో విమానం కూలిపోయిందని, ప్రమాదంలో ఎవరూ బతికి బట్టకట్టలేదని తాము భావిస్తున్నామని తెలిపారు.
విలేఖరుల సమావేశానికి కొద్ది నిమిషాలకు ముందు మలేషియా ప్రభుత్వం విమాన ప్రయాణీకుల బంధువులకు పాఠ్య సందేశం ద్వారా విమానం కూలిపోయిన వార్తను తెలియజేసింది. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రధాని విశాధ వార్తను వెల్లడి చేశారు.
బ్రిటన్ కి చెందిన విమాన ప్రమాదాల పరిశోధనా విభాగం (UK Air Accicents Investigation Branch), మరియు ప్రైవేటు విమాన ట్రాకింగ్ కంపెనీ ఇన్మర్ శాట్ లు సంయుక్తంగా కృషి చేసి విశ్లేషించిన ఆధారాల ద్వారా విమానం కూలిపోయినట్లు నిర్ధారణకు వచ్చారని నజీబ్ తెలిపారు. ఈ నిర్ధారణకు రావడానికి బ్రిటన్ గతంలో ఎన్నడూ ఉపయోగించని అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిందని నజీబ్ తెలిపారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా నిరూపించారన్న సమాచారం తప్ప నజీబ్ ఇంకేమీ చెప్పలేదు. ఆ సాంకేతిక పరిజ్ఞానం ఏమిటో, ఎలా నిర్ధారణకు వచ్చారో వివరాలను నజీబ్ ఇవ్వలేదు. ఇతర వివరాలు కూడా ఆయన ఏమీ ఇవ్వలేదు.
అయితే విమాన శిధిలాలు అని నమ్మకంగా భావించ దగ్గ వస్తువులేవీ ఇంతవరకూ భౌతికంగా కనిపెట్టలేదు.కానీ విమాన శిధిలాలుగా భావించ దాగిన అనేక చిన్నా, పెద్దా వస్తువులు వివిధ విమానాలకు కనిపించాయి. తక్కువ ఎత్తులో ఎగరడం ద్వారా ఈ వస్తువులను ఆయా విమానాల సిబ్బంది చూశారు. వీటిలో వేటి ఫోటోలనూ ఎవరూ విడుదల చేయలేదు.
విమానం కూలిపోయిన దుర్వార్తను నజీబ్ వెల్లడి చేసిన వెంటనే ప్రయాణీకుల బంధువులు పెద్ద పెట్టున దుఃఖంలో మునిగిపోయారు. వారు ఏడుస్తున్న దృశ్యాలను కెమెరాల్లో బంధించడానికి పత్రికల ఫోటో గ్రాఫర్లు పోటీలు పడ్డారు. ఒక దశలో దుఃఖిస్తున్న వారు, వారి బంధువులు విలేఖరులపై తీవ్ర స్ధాయిలో మండి పడ్డారు. హృదయం లేని అధములని తిట్టి పోశారు. కానీ విలేఖరులు మాత్రం తమ న్యూస్ వర్తీ ఫోటోల సేకరణలో కోసం పోటీ పడడంలో వెనుకంజ వెనుకంజ వేయలేదు.
ఆస్ట్రేలియా పశ్చిమ తీర నగరం పెర్త్ కు పశ్చిమ దిశగా దాదాపు 2,000 కి.మీ దూరంలో విమానం కూలిపోయినట్లు గా బ్రిటన్ శాటిలైట్ సంకేతాలూ, ఇన్మర్ శాట్ వివరాల ద్వారా ధ్రువపడిందని నజీబ్ తెలిపారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, చైనా, అమెరికాలకు చెందిన అత్యాధునిక విమానాలు, నౌకలు, ఇలా ధ్రువపడిన చోటికి తరలి వెళ్తున్నాయి. అమెరికాకు చెందిన నౌక ఒకటి ఇంధన ట్యాంకర్ తో సహా సదరు ప్రదేశానికి బయలుదేరి వెళ్లింది. అనగా విమానం శిధిలాలు దొరకబుచ్చుకునే వరకూ సదరు నౌక హిందూ మహా సముద్రంలో అన్వేషణ సాగించ వచ్చు. తమ నావికా దళ నౌకలు మంగళవారం ఉదయానికల్లా బ్రిటన్ గుర్తించిన చోటికి వెళ్తాయని ఆస్ట్రేలియా తెలిపింది.
విమానం కాక్ పిట్ లో జరిగిన సంభాషణను రికార్డు చేసే బ్లాక్ బాక్స్ ను వెతికేందుకు వీలయిన పరికరాలను అమెరికా నౌకలు తమ వెంట తీసుకెళ్తున్నాయి. బ్లాక్ బాక్స్ పంపే పింగ్ సిగ్నల్స్ ను ఈ పరికరాలు పసిగట్టి ఆ బాక్స్ ఎక్కడుందీ సమాచారం ఇస్తాయి. అయితే ఈ బ్లాక్ బాక్స్ కేవలం 30 రోజుల పాటు మాత్రమే పని చేస్తుంది. 30 రోజులకు సరిపడా బ్యాటరీ శక్తి మాత్రమే దానికి ఉంటుంది. ఈ లోపు బ్లాక్ బాక్స్ దొరికిందా సరేసరి. లేదంటే ఇక ఎన్నటికీ విమానం దొరికే అవకాశం లేదు.







