మార్చి 8 తేదీన అదృశ్యం అయిన విమానానికి సంబంధించి ఒక ఆశాజనక వార్త వెలువడింది. ఆస్ట్రేలియా ప్రధాని ఈ వార్తకు కర్త. ఆస్ట్రేలియాకు పశ్చిమ తీరాన ఉండే పెర్త్ నగరానికి వాయవ్య దిశలో దక్షిణ హిందూ మహా సముద్రంలో విమాన శిధిలాలుగా భావించదగ్గ రెండు వస్తువులు కనిపించాయన్నది ఈ వార్త సారాంశం. మార్చి 16 నాటి శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ వస్తువులను కనిపెట్టారు. వీటిలో ఒకటి 78 అడుగుల పొడవు ఉండగా మరొకటి 15 అడుగుల పొడవు ఉందని తేల్చారు.
తాజాగా కనిపెట్టిన వస్తువుల సమాచారం విశ్వసనీయమైనది అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ చెప్పడం విశేషం. దీనితో బాధితుల కుటుంబాల్లో ఒక్కసారిగా ఆశలు రేకెత్తాయి. రెండు వారాల ఎదురుచూపులతో ఆగ్రహావేశాలతో మరిగిపోతున్న బాధిత కుటుంబాలకు తమ వారు ఏమయ్యారో కనీస సమాచారం తెలియడం కూడా భారీ ఉపశమనం కలిగించే పరిస్ధితి. కనీసం విమానం ఫలానా చోట కూలిపోయిందని తెలిసినా కాస్త దుఃఖపడి తెరిపిడి పడదామని ఎదురు చూస్తున్న అయిష్టమైన, అసౌకర్యమైన కానీ అవసరమైన పరిస్ధితి వారిది.
మార్చి 16న తీసిన శాటిలైట్ చిత్రాల్లో శిధిలాలుగా భావిస్తున్న వస్తువుల ఆచూకీ దొరికినప్పటికీ వాటిని విశ్లేషించి కనీస స్ధాయిలో ధ్రువపరుచుకోవడానికి మూడు రోజుల సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాముగా ధ్రువపరుచుకున్న వెంటనే ఆస్ట్రేలియా మిలట్రీ అధికారులు మలేషియాకు సమాచారం ఇచ్చారు. అదే సమాచారాన్ని ఆస్ట్రేలియా ప్రధాని విలేఖరులకు తెలిపారు. ప్రకటించింది ఆస్ట్రేలియా అయినప్పటికీ శాటిలైట్ చిత్రాలు తీసింది మాత్రం అమెరికా ప్రైవేటు కంపెనీ ‘డిజిటల్ గ్లోబల్’ అని డెయిలీ మెయిల్ పత్రిక తెలిపింది.
పెర్త్ నగరం ఆస్ట్రేలియాకు పశ్చిమ తీరాన ఉండే నగరం. ఈ నగరానికి నైరుతి (South-West) దిశలో దాదాపు 2,500 కి.మీ దూరంలో MH370 శిధిలాలుగా భావిస్తున్న వస్తువులు తేలియాడుతున్నట్లు పత్రికలు చెబుతున్నాయి. అయితే ఆస్ట్రేలియా విమానాలు ఆ చోటికి వెళ్ళినప్పటికీ వాతావరణం కారణంగా అవి కనపడలేదు. భారీ వర్షం పడుతుండడం, మేఘాలు కమ్ముకుని ఉండడం లాంటి కారణాల వలన అక్కడ చూపు సరిగ్గా సాగలేదు. దానితో వస్తువులను తాము చూడలేకపోయామని ఆస్ట్రేలియా వైమానిక విభాగం తెలిపింది.
బహుశా సముద్ర ప్రవాహాల వలన సదరు వస్తువులు మరోచోటికి తరలిపోయినా తరలిపోయి ఉండవచ్చు. కానయితే ప్రస్తుతానికి అన్వేషించవలన ఏరియా దాదాపు సగానికి తగ్గింది. ఇప్పటివరకు 6 లక్షల చదరపు కి.మీ ఏరియాలో అన్వేషణ సాగుతుండగా అదిప్పుడు 350,000 చదరపు కి.మీ ఏరియాకు తగ్గిపోయింది.
అమెరికాకు చెందిన నావికా విమానం ‘P-8 పొసీడియన్’ సిబ్బంది అందజేసిన సమాచారం కూడా ఆస్ట్రేలియా ప్రధాని ఇచ్చిన సమాచారాన్ని దాదాపు ధృపరుస్తున్నట్లు డెయిలీ మెయిల్, ది హిందూలు తెలిపాయి. అన్వేషణ కోసం వినియోగించే ఈ విమాన సిబ్బంది ఆస్ట్రేలియా చెప్పిన చోట ఏదో ఒక వస్తువు ఉన్నట్లు గమనించారని పత్రికలు తెలిపాయి. అయితే ఎ.బి.సి న్యూస్ లాంటి సంస్ధలు అప్పుడే తొందరపడి ఒక నిర్ధారణకు రాలేమని వ్యాఖ్యానించింది. రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు మాత్రం ఈసారి కనపడిన వస్తువులు MH370కి చెందినవే అయి ఉండొచ్చని నమ్మకంగా చెబుతున్నారు.
విమానం కదలికలను ప్రతి అరగంటకు ఒకసారి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి ప్రసారం చేసే ట్రాన్స్ పాండర్లను ఉద్దేశ్యపూర్వకంగా నిలిపివేశారన్న అనుమానాలను కొందరు నిపుణులు కొట్టిపారేస్తున్నారు. అనుకోకుండా జరిగిన అగ్నిప్రమాదంలో ట్రాన్స్ పాండర్లు తగలబడి ఉండవచ్చని దానితో పైలట్లకు కూడా తాము ఎటు పోతున్నదీ తెలియని పరిస్ధితి ఏర్పడి ఉండవచ్చని వారు సూచిస్తున్నారు. దానితో వెళ్లగలిగినంత దూరం వెళ్ళాక విమానం సముద్రంలో కూలిపోయి ఉంటుందని వారు సూచిస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఇచ్చిన సమాచారం ఆధారంగా దాదాపు ఈ అవగాహనే ధ్రువపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.















