అండమాన్ పై MH370, కనుగొన్నది హైద్రాబాద్ టెకీ


MH370 by Hyd techie

అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న పశ్చిమ దేశాలేవీ సాధించలేని ఘనకార్యాన్ని హైద్రాబాద్ కి చెందిన ఐ.టి. ఎనలిస్టు సాధించినట్లు తెలుస్తోంది. పాతికకు పైగా దేశాలకు చెందిన నౌకలు, హెలికాప్టర్లు, వేగు విమానాలు గత పది రోజులుగా సముద్రాలూ, నేలలన్నింటా జల్లెడ పడుతున్నా కనిపించని విమానాన్ని శాటిలైట్ చిత్రాల్లో హైద్రాబాద్ టెకీ అనూప్ మాధవ్ గుర్తించారని సి.ఎన్.ఎన్ చెబుతోంది. ఈ విషయాన్ని మలేషియా ధృవీకరించిందా లేదా అన్నది తెలియలేదు.

యెగ్గిన అనూప్ మాధవ్ వృత్తి రీత్యా ఐ.టి. ఎనలిస్టు. QBo2 అనే శాటిలైట్ రికార్డు చేసిన అనేక చిత్రాలను ఆయన తిరగేస్తుండగా అండమాన్ ద్వీప కల్పంపైన అత్యంత తక్కువ ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని కనుగొన్నారు. ప్రపంచ వ్యాపితంగా వివిధ శాటిలైట్లు రికార్డు చేసిన చిత్రాలను ఆయా సంస్ధలు నెట్ లో అందుబాటులో ఉంచి MH370 కోసం వెతకాలని కోరాయి. అలాగే Qbo2 అనే పేరుగల డిజిటల్ శాటిలైట్ చిత్రాలను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది.

పెద్ద సంఖ్యలో ఉన్న శాటిలైట్ చిత్రాలను గత కొన్ని రోజులుగా పరిశీలిస్తున్న అనూప్ ఈ చిత్రాన్ని కనిపెట్టారు. దీనిని వెంటనే సి.ఎన్.ఎన్ వెబ్ సైట్ లోని ఐరిపోర్ట్ బ్లాగ్ కి అప్ లోడ్ చేశారు. ఇది జరిగి మూడు రోజులవుతోందని ది హిందూ పత్రిక తెలిపింది. అయితే ఈ చిత్రం నిజమైనదేనా అన్న సంగతిని పరిశీలించారా లేదా అన్నది తెలియరాలేదు.

మార్చి 8 తెల్లవారు ఝామున విమానం అదృశ్యమైన సంగతి తెలిసిందే. సరిగ్గా అదే రోజు అండమాన్ ద్వీపంపైన తక్కువ ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని శాటిలైట్లు రికార్డు చేశాయి. అండమాన్ లో భారత నావికా బలగాల విమానాలు నిత్యం కాపలా కాస్తుంటాయి. అయితే అవి భారీ విమానాలు కావు. అనూప్ కనుగొన్న విమానం చాలా భారీ పరిమాణంలో ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి MH370 విమానం అయి ఉండొచ్చని భావిస్తూ అనూప్ సి.ఎన్.ఎన్ పత్రికకు తెలిపారు.

ప్రపంచ వ్యాపితంగా అనూప్ లాంటి ఔత్సాహికులు లక్షలాదిమంది క్లౌడ్ సోర్సింగ్ ప్రాజెక్టు లో పాలు పంచుకుంటున్నారు. మలేషియా విమానాన్ని కనిపెట్టడం కోసం ఈ ప్రాజెక్టు ప్రారంభించి నిర్వహిస్తున్నారు. మార్చి 14 తేదీ శుక్రవారం ఈ చిత్రాన్ని కనుగొన్న అనూప్ వెంటనే సి.ఎన్.ఎన్ కి అప్ లోడ్ చేశారు. ఇప్పటిదాకా 16,000 మంది ఆ చిత్రాన్ని చూసినట్లు తెలుస్తోంది.

“అనేక కారణాల వల్ల ఈ విమానం అదృశ్యం అయిన విమానమే అని నాకు నమ్మకం కలుగుతోంది. మొదటి కారణం ఈ విమానం అండమాన్ లోని అడవులపైన తక్కువ ఎత్తులో, శిబ్ పూర్ ఎయిర్ స్ట్రిప్ కు సమీపంలో ఎగురుతోంది. ఈ ఎయిర్ స్ట్రిప్ కేవలం భారత రక్షణ బలగాల వినియోగం కోసం మాత్రమే ఉద్దేశించినది. పౌర విమానాలు ఎగరడానికి ఇక్కడ అనుమతి లేదు. ఈ చిత్రాన్ని పరిశీలనగా చూస్తే ఈ విమానం చాలా తక్కువ ఎత్తులో మేఘాల కంటే కిందుగా ఎగురుతున్నట్లు అర్ధం అవుతుంది. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే రాడార్ కంటికి చిక్కకుండా ఉండడానికే ఇలా తక్కువ ఎత్తులో ఎగురుతోందని స్పష్టం అవుతోంది. మరీ ముఖ్యంగా ప్రామాణిక కొలతల ప్రకారం చూసినా అదృశ్యమైన విమానం రంగు ప్రకారం చూసినా ఈ విమానం అదే అని తెలుస్తుంది” అని అనూప్ సి.ఎన్.ఎన్ కి రాసిన రైటప్ లో పేర్కొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు ఈ చిత్రాన్ని పరిశీలించి నిజానిజాలు విచారిస్తే ఫలితం ఉండే అవకాశం ఉంది. సి.ఎన్.ఎన్ కి అప్ లోడ్ చేసి నాలుగు రోజులైనా ఈ చిత్రం మలేషియా లేదా పశ్చిమ దేశాల దృష్టికి వెళ్లకపోవడం ఏమిటో తెలియకుంది. కనీసం అన్వేషణలో భాగం పంచుకుంటున్న భారత నావికా, విమానయాన అధికారులైనా అనూప్ వెల్లడి చిత్రాన్ని పరిశీలించాల్సి ఉంది.

వ్యాఖ్యానించండి