పేలలేదు, కూలలేదు -ఐరాస


మలేషియా విమానం ‘ఫ్లైట్ MH370’ గాలిలో పేలిపోయిందనడానికి గానీ, సముద్రంలో కూలిపోయిందనడానికి గానీ సాక్ష్యాలు లేవని ఐరాసకు చెందిన సంస్ధ CTBTO ప్రకటించింది. ‘సమగ్ర (అణు) పరీక్షల నిషేధ ఒప్పంద సంస్ధ’ (Comprehensive Test Ban Treaty Organisation) ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన పరిశీలనా కేంద్రాలేవీ విమానం కూలిపోయిన జాడలు గానీ, పేలిపోయిన జాడలను గాని రికార్డు చేయలేదని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్-కి-మూన్ ప్రతినిధి స్టెఫాన్ డుజరిక్ ప్రకటించారు.

విమానం సముద్రంలో కూలినా, నేలపై కూలినా పసిగట్టే సాధనాలు సి.టి.బి.టి.ఓ వివిధ ప్రాంతాల్లో నెలకొల్పింది. ఇవి వాస్తవానికి విమానం కూల్చివేతలను పసిగట్టడానికి ఉద్దేశించినవి కావు. వివిధ ఐరాస సంస్ధల అనుమతి, పరీక్షలు లేకుండా జరిగే అణు పరీక్షలను పసిగట్టడానికి ఉద్దేశించినవి. అయితే ఇవి విమాన పేలుళ్లను కూడా పసిగట్టగలవు. ‘100 శాతం పసిగట్టగలవు’ అని చెప్పలేము గానీ MH370 లాంటి భారీ విమానాలు కూలిపోతే మాత్రం సి.టి.బి.టి.ఓ దృష్టికి రాకుండా పోదని సదరు సంస్ధ అధికారులు చెబుతున్నారు.

అణు పరీక్షలను పసిగట్టడానికి సి.టి.బి.టి.ఓ నెలకొల్పిన అంతర్జాతీయ పరిశీలనా వ్యవస్ధలు (ఇంటర్నేషనల్ మానిటరింగ్ సిస్టమ్ -ఐ.ఎం.ఎస్) నాలుగు రకాల టెక్నాలజీలను వినియోగిస్తాయి. వీటిలో మూడు టెక్నాలజీలను విమాన ప్రమాదాలను పసిగట్టే సామర్ధ్యం కలిగి ఉన్నాయని డుజరిక్ తెలిపారు. అణు పేలుళ్లను పసిగట్టడం వీటి ప్రాధమిక కర్తవ్యం అయినప్పటికీ విమానాల పేలుళ్లను కూడా ఇవి పసిగడతాయి. విమానం పేలిపోయినపుడు లేదా కూలిపోయినపుడు అవి నీటిపైన గానీ, భూమి పైన గానీ కలుగ జేసే ప్రభావాన్ని గ్రహించడం ద్వారా అవి విమానం కూలిపోయినట్లు తెలియజేస్తాయి.

సి.టి.బి.టి.ఓ ఎక్జిక్యూటివ్ సెక్రటరీ లస్సినా జెర్బో ప్రకారం అణు పేలుళ్లు జరిగినపుడు వాతావరణంలో జరిగే మార్పులను పసిగట్టడానికి సి.టి.బి.టి.ఓ సంస్ధ ఇన్ఫ్రా రెడ్ సెన్సార్లను ఏర్పాటు చేసింది. ఇవి ఇన్ఫ్రా శబ్దాలను రికార్డు చేస్తాయి. మలేషియా విమానం తరహాలో 35,000 అడుగుల ఎత్తున పేలుడు జరిగినప్పుడు కూడా తమ సెన్సార్లు పసిగట్టగలవో లేదో పరీక్షిస్తున్నామని గత వారం తెలిపారు. మలేషియా విమానం అదృశ్యం అయినప్పటి నుండి ఆయా ఐరాస సభ్య దేశాల పరికరాలు రికార్డు చేసిన డేటాను జాగ్రత్తగా పరిశీలించాలని అక్కడి శాస్త్రవేత్తలను కోరామణి జెర్బో తెలిపారు. ఈ డేటాను విశ్లేషిస్తే ఎం‌హెచ్370 విమానం జాడలు తెలియకపోవని జెర్బో అంచనా.

అణు పేలుళ్లను, భూకంపాలను రికార్డు చేయడానికి ప్రపంచవ్యాపితంగా అత్యంత సున్నితమైన సెన్సార్లను సి.టి.బి.టి.ఓ ఏర్పాటు చేసిందని, ఈ సెన్సార్లలో ఏవీ MH370 కూలిపోయినట్లుగాని, పేలిపోయినట్లు గానీ పసిగట్ట లేదని డుజరిక్ ధృవీకరించారు. 239 మందితో ప్రయాణిస్తున్న మలేషియా విమానం అదృశ్యమై 11 రోజులయింది. ఇప్పటికీ విమానం జాడ తెలియకపోవడం అనేక దేశాల శాస్త్రవేత్తలకు పెద్ద సవాలుగా పరిణమించింది. పాతికకు పైగా దేశాలకు చెందిన విమానాలు, నౌకలు, హెలికాప్టర్లు అహరహం శ్రమిస్తున్నా ఫలితం దక్కకపోవడంతో సంబంధిత రంగాల నిపుణులు సమాధానం చెప్పలేని పరిస్ధితుల్లో ఉన్నారు.

జెర్బో ప్రకారం అదృశ్యం అయిన విమానంలో పేలుడు జరిగినట్లయితే దానిని పసిగట్టడానికి ఇన్ఫ్రా సౌండ్ టెక్నాలజీకి మించిన పరిజ్ఞానం లేదు. అయితే ఈ టెక్నాలజీ కూడా ఖచ్చితంగా పసిగట్టగలదా అన్న అంశంలో నిర్ధారణగా చెప్పలేకపోతున్నారు. “విమాన పేలుళ్లకు సమీపంలో మానిటరింగ్ స్టేషన్ ఉన్నట్లయితే పసిగట్టగల అవకాశం అయితే బాగా ఉంది. కానీ ఖచ్చితంగా చెప్పలేము” అని జెర్బో చెప్పారని ది హిందు తెలిపింది.

ప్రకృతిలో సంభవించే వివిధ ఉత్పాతాలను ఇన్ఫ్రా జోన్ టెక్నాలజీ రికార్డు చేస్తుంది. అగ్ని పర్వతాల పేలుళ్లు, భూకంపాలు, ఉల్కాపాతం, తుఫానులు, అరోరాలను ఇన్ఫ్రా జోన్ కనిపెడుతుంది. అలాగే మానవ నిర్మితమైన అణు పేలుళ్లు, మైనింగ్ తవ్వకాలు, భారీ రసాయన పేలుళ్లు, విమానాలు లేదా రాకెట్ లాంచింగ్ లను కూడా ఇన్ఫ్రా జోన్ టెక్నాలజీ కనిపెడుతుంది. సమగ్ర అణు నిషేధ ఒప్పందం మేరకు నెలకొల్పిన మానిటరింగ్ వ్యవస్ధలు ఏవీ MH370 కూలినట్లు రికార్డు చేయకపోవడంతో మిస్టరీ మరింత తీవ్రం అయింది. గతంలో కొన్ని విమాన ప్రమాదాలను రికార్డు చేసిన చరిత్ర సి.టి.బి.టి.ఓ కు ఉన్నది.

ఇదిలా ఉండగా అదృశ్యమైన విమానం ప్రయాణం చేసిందని అనుమానిస్తున్న రెండు ఎయిర్ కారిడార్లను పాతిక దేశాల నౌకలు, విమానాలు శోధిస్తున్నాయి. చైనా తమ వాయవ్య రాష్ట్రాల్లో విమానం ఆచూకీ కోసం పరిశోధిస్తోంది. MH370 లో ప్రయాణిస్తున్న చైనీయ ప్రయాణీకులందరి నేపధ్యాలను తాము పరిశీలించామని, వారిలో ఎవరికీ టెర్రరిస్టు అనుమానిత నేపధ్యం లేదని చైనా తెలిపింది. హైజాక్ చేసే అవకాశాలు కూడా ఎవరికీ లేవని తెలిపింది. ఉత్తర కారిడార్ లో శోధనకు చైనా నాయకత్వం వహిస్తోంది.

దక్షిణ కారిడార్ శోధనలో ఆస్ట్రేలియా ప్రధాన పాత్ర పోషిస్తోందని పత్రికలు తెలిపాయి. ఇండోనేషియా పశ్చిమ సరిహద్దు నుండి హిందు మహా సముద్రం దక్షిణ భాగం వరకు విస్తరించిన ఈ కారిడార్ విస్తారమైనది. బహుళ దిశల్లో ప్రయాణించే సముద్ర పవనాలకు కేంద్రం. విమానం ఇక్కడ కూలిన పక్షంలో ఆచూకీ దొరకబుచ్చుకోవడం, అది కూడా ఇన్ని రోజుల తర్వాత, చాలా కష్టమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

వ్యాఖ్యానించండి