మలేషియా విమానం: ఉద్దేశ్యపూర్వకంగా దారి మార్చిందా? -ఫొటోలు


అదృశ్యం అయిన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం Flight MH370 ఉద్దేశ్యపూర్వకంగానే దారి మార్చుకుని అండమాన్ వైపుకి ప్రయాణించిందా అన్న అంశాన్ని మలేషియా అధికారులు పరిశోధిస్తున్నారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన సమాచారం మేరకు హిందూ మహా సముద్రంలో కూడా వెతుకులాట ప్రారంభం కావచ్చని అమెరికా వైట్ హౌస్ ప్రతినిధి జె కార్ని ప్రకటించడంతో మలేషియా అధికారుల అనుమానాలకు ఇతర దేశాలు కూడా విశ్వసిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

విమానాన్ని ఎవరో ఉద్దేశ్యపూర్వకంగా దారి మార్చి అండమాన్ సముద్రం మీదికి, అక్కడి నుండి హిందూ మహా సముద్రం మీదికి మళ్లించి ఉండవచ్చని మలేషియా పరిశోధకులు చెప్పారని రాయిటర్స్ తెలిపింది. మలేషియా మిలట్రీ రాడార్ రికార్డు చేసిన సమాచారాన్ని విశ్లేషించాక నిపుణులు ఈ విధంగా అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని విమానం ఒకటి మలేషియాకు వాయవ్య (North-West) దిశలో ప్రయాణించినట్లుగా మలేషియా మిలట్రీ రాడార్ లో రికార్డు అయిందని, ఇది MH370 విమానం అయి ఉండొచ్చని ప్రమాదంపై విచారణ జరుపుతున్న మలేషియా అధికారులు ఇద్దరు చెప్పారని రాయిటర్స్ తెలిపింది.

మాన్యువల్ గా గానీ లేదా ఆటో-పైలట్ ప్రోగ్రామ్ ద్వారా గానీ విమానం అండమాన్ మీదుగా బంగాళాఖాతం మీదికి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. విమానం నడపడం ఎలాగో తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా దారి మళ్లించి వందల మైళ్ళు ప్రయాణింపజేశారని అనుమానిస్తున్నట్లుగా మూడో మలేషియా అధికారి చెప్పారని రాయిటర్స్ సమాచారం. “హైజాక్ చేయడం ద్వారా విమానంపై విద్రోహ చర్య జరిగి ఉండవచ్చని మేమింకా అనుమానిస్తున్నాము” అని సీనియర్ మలేషియా పోలీసు అధికారి చెప్పారని రాయిటర్స్ తెలిపింది.

వారం రోజులు గడిచినప్పటికీ మలేషియా విమానం ఆచూకీ గురించి వీసమెత్తు సమాచారం కూడా లభ్యం కాలేదు. దీనితో మానవ విజ్ఞానానికి పరిమితులు ఏమిటో మరోసారి స్పష్టం అయింది. మానవ సమాజానికి అందవలసిన పరిజ్ఞానం ఇంకా అపరిమితంగా మిగిలే ఉందని MH370 విమాన ప్రమాదం తెలియజేస్తోంది.

తాజా సమాచారం వల్లనే విమానం గురించిన అన్వేషణ పశ్చిమ మలేషియా మీదుగా అండమాన్ సముద్రం వరకు విస్తరించింది. ఈ అన్వేషణలో ఇండియాకు చెందిన 3 విమానాలు, 3 నౌకలు భాగం పంచుకుంటున్నాయి. అయితే విద్రోహ చర్య జరిగి ఉండవచ్చని మలేషియా పోలీసులు అనుమానిస్తున్నారా అన్న విషయాన్ని నిర్ధారించడానికి ఆ దేశ రవాణా మంత్రి హిష్మాముద్దీన్ హుస్సేన్ నిరాకరించారు. “మామూలుగా అయితే సమయం గడిచే కొందీ పరిశోధన మరింత తక్కువ ప్రాంతానికి పరిమితం అవుతుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న అన్వేషణ మామూలుది కాదు. ఈ కేసులో వెలువడుతున్న సమాచారం అన్వేషణను మరింతగా విస్తరించాల్సిన అవసరాన్ని రుద్దుతోంది” అని ఆయన తెలిపారు.

పరిశోధకులు నాలుగు లేదా ఐదు అవకాశాలను పరిశీలిస్తున్నారు. వీటిలో, ఉద్దేశ్యపూర్వకంగా దారి మళ్లింపు, బలవంతపు దారి మళ్లింపు, పేలుడు అంశాలు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ఇతర అంశాలను వారు వెల్లడించలేదు.

ఒకవేళ విమానం హిందు మహా సముద్రం వైపుకి వచ్చినట్లయితే అన్వేషణ మరింత క్లిష్టతరం అవుతుంది. ఈ సముద్రంలోని ప్రవాహాల వల్ల విమాన శిధిలాలు వందల మైళ్ళ దూరం ప్రయాణించడానికి ఎంతో కాలం పట్టదు. హిందూ మహా సముద్రంలో లోతు కూడా చాలా ఎక్కువని తెలుస్తోంది. విస్తార ప్రాంతంలో లోతు 7000 మీటర్ల కంటే ఎక్కువ ఉంటుందని అందువల్ల కూడా అన్వేషణ కష్టం అని నిపుణులు చెబుతున్నారు. హిందూ మహా సముద్రంలో అన్వేషణ కేవలం నౌకలు, హెలికాప్టర్ల వల్ల సాధ్యం కాదని విమానాలు కూడా సుదీర్ఘ దూరాలు అన్వేషించగల P-3 ఒరియన్ విమానాల వల్ల మాత్రమే అవుతుందని వారు తెలిపారు. అయితే విమానాలు కొన్ని దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి.

మలేషియా విజ్ఞప్తి మేరకు అమెరికా నేవీకి చెందిన USS Kidd అనే గైడెడ్ మిసైళ్ళ నౌక మలక్కా ద్వీప కల్పానికి బయలుదేరిందని అమెరికా రక్షణ అధికారులు తెలిపారు. అమెరికా సహాయంతో తమ రాడార్ సమాచారాన్ని మరింతగా విశ్లేషిస్తున్నామని మలేషియా అధికారులు తెలిపారు.

దక్షిణ చైనా సముద్రంలో, MH370 చివరి సారి సమాచారం పంపిండని భావిస్తున్న చోటి నుండి స్వల్పంగా కంపించిన సంకేతాలు వెలువడినట్లు చైనా తెలిపింది. విమానం తప్పిపోయిన రాత్రి తెల్లవారు ఝాము గం. 1. 25 ప్రాంతంలో ఈ సంకేతాలు వెలువడ్డాయని చైనా అధికారులు తెలిపారు. దక్షిణ చైనా సముద్రం భూకంపాలు సంభవించే ప్రాంతం కాదు. కాబట్టి కూలిపోయిన విమానం వల్లనే ఈ కంపనాలు రికార్డు అయి ఉండవచ్చని ఊహాలు మొదలయ్యాయి. ఈ సమాచారాన్ని ఇంకా విశ్లేషిస్తున్నారని ది హిందు తెలిపింది.

3 thoughts on “మలేషియా విమానం: ఉద్దేశ్యపూర్వకంగా దారి మార్చిందా? -ఫొటోలు

  1. // వారం రోజులు గడిచినప్పటికీ మలేషియా విమానం ఆచూకీ గురించి వీసమెత్తు సమాచారం కూడా లభ్యం కాలేదు. దీనితో మానవ విజ్ఞానానికి పరిమితులు ఏమిటో మరోసారి స్పష్టం అయింది. మానవ సమాజానికి అందవలసిన పరిజ్ఞానం ఇంకా అపరిమితంగా మిగిలే ఉందని అంహ్‌370 విమాన ప్రమాదం తెలియజేస్తోంది. //
    బాగా చెప్పారు అది ఎప్పుడు interminable గానే ఉంటుంది .

  2. నిజమే. ఆది మానవుని కాలం నుంచి నేటి వరకూ ….మానవుని జ్ఞానంలో అనూహ్యమైన అభివృద్ధి వచ్చింది వాస్తవమే ఐనా….ఇంకా మానవుడు అందుకోవాల్సిన ఎత్తు ఎంతో ఉందని ఇటువంటి ఘటనలు నిరూపిస్తున్నాయి.
    ఇప్పటికీ సముద్రాల గురించి మనిషికి తెలిసింది చాలా తక్కువేనట. భూభాగం మీద కంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా జీవులు సముద్రంలో ఉన్నాయని….వాటి గురించి మనకు తెలిసింది ‘సముద్రంలో నీటి బొట్టంత’ అని శాస్త్ర్రవేత్తలు అంగీకరిస్తారు.
    ఎక్కడిదాకానో ఎందుకు మన శరీరం గురించే ఎన్నో సంగతులు ఇంకా అంతు చిక్కకుండా ఉన్నాయంటే…., ఇక ఈ విశాల విశ్వం సంగతి చెప్పేదేముంది. ఆ చల్లని సముద్ర గర్భం పాటలో….దాశరథి గారు చెప్పినట్లు… మనిషికి అంతు చిక్కని రహస్యాలు ఎన్నో. విజ్ఞాన శాస్త్ర్ర సులోచనాలతో….అజ్ఞానపు చీకట్లు చీల్చుకుంటూ….అనంతంగా అన్వేషిస్తూ, అంతిమ సత్యం వైపు సాగిపోవడమే మనిషి నిరంతర కర్తవ్యం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s