మలేషియా ప్రమాదం: అది విమాన ఇంధనం కాదు


మలేషియా విమాన ప్రమాదం మరింత మిస్టరీలోకి జారిపోయింది. దక్షిణ చైనా సముద్రంలో కనపడిన రెండు భారీ చమురు తెట్లు విమాన ఇంధనంకు సంబంధించినవి కావని పరీక్షల్లో తేలింది. వియత్నాం నావికా బలగాలకు కనపడ్డాయని చెబుతున్న విమాన శిధిలాలు కూడా వాస్తవానికి ఎక్కడా కనపడలేదని తెలుస్తోంది. దీనితో కూలిపోయిందని భావిస్తున్న మలేషియా ఎయిర్ లైన్స్ విమానం చుట్టూ మరింత మిస్టరీ అల్లుకున్నట్లయింది.

చోరికి గురయిన పాస్ పోర్ట్ లతో ప్రయాణిస్తున్న ఇరువురు ప్రయాణీకులు మలేషియా దేశస్ధులు కారని, చైనా దేశస్ధులు కూడా కారని మలేషియా అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. వారి రూపం ఆసియా తరహా రూపం కాదని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు చెప్పారని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది.

చైనాకు చెందిన ముస్లిం రాష్ట్రం గ్జిన్ జియాంగ్ టెర్రరిస్టులు మలేషియా విమానంలో ప్రయాణించారని, చోరికి గురయిన పాస్ పోర్ట్ లను వారు ఉపయోగించారని, వారే విమానం కూలిపోవడానికి కారణం అయి ఉండవచ్చని పత్రికలు పరోక్షంగా ఊహాగానాలు చేశాయి. కొద్ది రోజుల క్రితం చైనాలో జరిగిన ఊచకోతకు గ్జిన్ జియాంగ్ టెర్రరిస్టులే కారణం అని చైనా ప్రభుత్వం ఆరోపించిన నేపధ్యంలో ఈ ఊహాగానాల మీదికి ప్రపంచం దృష్టి మళ్ళింది.

అయితే చోరికి గురయిన పాస్ పోర్ట్ లు ఉపయోగించి విమానం ఎక్కినవారిని గుర్తించామని, వారు ఆసియా ముఖ కవళికలతో లేరని మలేషియా అధికారులు చెప్పడంతో గ్జిన్ జియాంగ్ అనుమానాలు తొలగిపోయాయి. ది హిందూ పత్రిక ప్రకారం సదరు తప్పుడు పాస్ పోర్ట్ లతో ప్రయాణించినవారు ఏ దేశస్ధులో కూడా మలేషియా అధికారులు గుర్తించారు. అయితే ఆ దేశం పేరు చెప్పడానికి వారు నిరాకరించారు. మలేషియా, చైనాలకు చెందినవారు మాత్రం కాదని వారు నిర్ధారించారు.

దీనికి తోడు కూలిపోయిన విమానం ఇంధనంగా భావించిన చమురు తెట్లు వాస్తవానికి విమాన ఇంధనం కాదని మలేషియా ప్రధాన దర్యాప్తు అధికారి చెప్పారని రాయిటర్స్ తెలిపింది. అనగా దొరికిందని భావించిన ఒక్క క్లూ కూడా క్లూ కాదని తేలిపోయింది. ఇప్పుడు విమానం ఆచూకీ గురించి తెలిపే క్లూలు ఇక లేనట్లే. చోరికి గురయిన పాస్ పోర్ట్ లను వినియోగించినవారిని గుర్తించారని చెబుతున్నది నిజమే అయితే వారి ద్వారా అయినా కొత్త క్లూలు అందుబాటులోకి రావాలి. లేనట్లయితే ఇక లీడ్స్ ఏమీ లేనట్లే.

విమాన ప్రయాణీకుల్లో కనీసం ఇద్దరు చోరీకి గురయిన పాస్ పోర్ట్ లను వాడారని ఇంటర్ పోల్ ఇప్పటికే నిర్ధారించింది. విమాన ప్రయాణీకుల పాస్ పోర్ట్ లను తమ వద్ద ఉన్న డేటా బేస్ తో సరిపోల్చి తప్పుడు పాస్ పోర్ట్ లను ఎరివేయాలని ఇంటర్ పోల్ (ఇంటర్నేషనల్ పోలీస్) అధికారులు ఎప్పటినుండో చెబుతున్నా పట్టించుకున్నది కొద్ది దేశాలేనని కనీసం ఇప్పుడయినా తగిన చర్యలు తీసుకోవాలని ఇంటర్ పోల్ అధికారులు చెబుతున్నారు.

శనివారం తెల్లవారు ఝామున అదృశ్యమైన మలేషియా విమానం ‘ఫ్లైట్ ఎం‌హెచ్370’ ప్రస్తుతం ఎక్కడ ఏ పరిస్ధితుల్లో ఉన్నదీ అంతుబట్టని విషయంగా మారింది.  “మున్నెన్నడూ ఎరగని మిస్టరీ”గా మలేషియా సివిల్ ఏవియేషన్ అధికారులు అభివర్ణిస్తున్నారు. 10 దేశాలకు చెందిన విమానాలు, నౌకలు దక్షిణ చైనా సముద్రాన్ని జల్లెడ పడుతున్నా చిన్న ఆచూకీ కూడా లభించకపోవడం విమానయాన రంగం నిపుణులను సైతం హతాశులను చేస్తోంది.

దక్షిణ చైనా సముద్రం విషయంలో ప్రాంతీయంగా ఆయా దేశాల మధ్య ఎడతెగని విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలను సైతం పక్కనబెట్టి చైనా, వియత్నాం, ధాయిలాండ్, మలేషియా, ఫిలిప్పైన్స్ దేశాలు తమ ఓడలను, విమానాలను దింపి వెతికిస్తున్నా ఫలితం దక్కలేదు. ఇప్పటికే వెతుకుతున్న ప్రాంతాన్ని విస్తరించిన మలేషియా, మంగళవారం నుండి మరింత విస్తరించనున్నట్లు తెలిపింది.

సాయుధులైన వ్యక్తులు తప్పుడు పత్రాలతో కౌలా లంపూర్ లో విమానం ఎక్కడానికి ప్రయత్నించిన ఘటనలు గతంలో జరిగాయని మలేషియా పోలీసులు చెబుతున్నారు. కనీసం రెండు లేదా మూడు ఘటనలు అలాంటివి జరిగాయని వారు తెలిపారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి ఆ రెండు పాస్ పోర్ట్ లపైనే కేంద్రీకృతం అయింది.

విమానం శిధిలాలు ఒక్కటి కూడా ఇంతవరకు కనపడకపోవడాన్ని బట్టి విమానం 35,000 అడుగుల ఎత్తున ఉండగానే పేలిపోయి ఉండవచ్చన్న అనుమానాలను కొందరు నిపుణులు బలంగా వ్యక్తం చేస్తున్నారు. అంత ఎత్తున పేలడం వలన చాలా విస్తారమైన ప్రాంతంలో శిధిలాలు చెల్లా చెదురు అయి ఉండవచ్చని అందుకే అవి ఇప్పటికీ కనపడకపోయి ఉండవచ్చని వారు సూచిస్తున్నారు.

అమెరికా తన గూఢచార ఉపగ్రహాల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు రాయిటర్స్ తెలిపింది. ఎంతగా తనిఖీ చేసినా వారికి ఏమీ దొరకలేదని తెలుస్తోంది.

అక్రమ వలసదారులకు మలేషియా కేంద్రం అనీ కాబట్టి అక్రమ పాస్ పోర్ట్ లపై ప్రయాణించేవారంతా టెర్రరిస్టులే అన్న నిర్ణయానికి రావడం తొందరపాటుతనం అవుతుందని కౌలా లంపూర్ లోని యూరోపియన్ రాయబారి ఒకరు చెప్పారు. మలేషియా, బీజింగ్ ల ద్వారా ఐరోపా రావడానికి అనేకమంది అక్రమ పాస్ పోర్ట్ లతో ప్రయాణిస్తుంటారని కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చే ముందు జాగ్రత్త వహించాలని ఆయన హెచ్చరించారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s