ఆచూకీ లేని విమానం, టెర్రరిజం అనుమానం


దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయిందని భావిస్తున్న మలేషియా విమానం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మలేషియా, వియత్నాం, ఫిలిప్పైన్స్, చైనా దేశాలకు చెందిన విమానాలు, నౌకలు ఉమ్మడిగా గాలిస్తున్నప్పటికీ వారి గాలింపు ఫలవంతం కాలేదు. అమెరికా, ఐరోపాల సాయం తీసుకోవడానికి నిర్ణయించినట్లు మలేషియా మంత్రులు ప్రకటించారు. చోరికి గురయిన పాస్ పోర్ట్ లతో ఇద్దరు ప్రయాణీకులు విమానంలో ఉన్నందున టెర్రరిస్టు చర్యకు గురై ఉండొచ్చన్న అవకాశాన్ని ఎవరూ నిరాకరించడం లేదు. విమానం ప్రయాణించిన తీరును బట్టి అది మధ్యలోనే వెనక్కి ప్రయాణించి ఉండొచ్చని మలేషియా అనుమానిస్తోంది.

వెనక్కి ప్రయాణించిందని భావిస్తున్న కొద్ది క్షణాలకే రాడార్ నుండి విమానం అదృశ్యం అయిందని మలేషియా మిలట్రీ అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. దీనితో విమానం అదృశ్యంపై మిస్టరీ ఇంకా తీవ్రం అయింది. వాతావరణం విమానం ముందుకు వెళ్లడానికి వ్యతిరేకంగా ఉందనేందుకు ఎటువంటి సూచనలు లేకపోవడంతో వెనక్కి ఎందుకు మళ్లిందన్న (ఒకవేళ మళ్ళి ఉంటే) ప్రశ్నలు అధికారులను, పరిశీలకులను, నిపుణులను వేధిస్తున్నాయి.

విమాన శకలాల ఆచూకీ కనుగొనడం కోసం తమ వెతుకులాట ఏరియాను మరింత విస్తారం కావిస్తున్నట్లు మలేషియా అధికారులు తెలిపారు. మలేషియా భూభాగం చుట్టుపక్కల, వియత్నాం తీరం వరకూ వెతకడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దొంగిలించిన పాస్ పోర్ట్ లను వినియోగిస్తూ ప్రయాణించిన ఇద్దరు ప్రయాణీకులు ఎవరన్నది తెలుసుకోవడానికి మరోవైపు దర్యాప్తు చేపట్టారు. విమానాశ్రయంలో సి.సి.టి.వి లో రికార్డయిన ఫుటేజీ ద్వారా వారిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. విమానాశ్రయంలో భద్రతా ప్రక్రియలను సమీక్షిస్తున్నట్లు మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ తెలిపారు. భద్రతా ప్రక్రియలు ఉల్లంఘనకు గురయినట్లు మలేషియా ప్రభుత్వం అనుమానిస్తోందని దీని ద్వారా అర్ధం అవుతోంది.

అనేక సివిల్, మిలట్రీ విమానాలు, నౌకలు కూలిన విమానం కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. విమానం ప్రయాణించిన మార్గం వెంబడి సముద్రం జల్లెడ పట్టామని, అయినా ఆచూకీ దొరకలేదని అధికారులు తెలిపారు. దానితో వెతుకులాట ఏరియాను మరింత విస్తృతం చేశారు. వియత్నాంకు దక్షిణ భాగాన చమురు తెట్లు కనపడిన ప్రాంతంలో కూడా విమాన శకలాల జాడ లేదని తెలుస్తోంది. నిన్న కనపడిన చమురు తెట్లు ఈ రోజు కనిపించలేదని కొన్ని పత్రికలు చెబుతుండగా చమురు తెట్ల వద్దకు చేరిన నౌకలకు విమానం కూలిన జాడలు కనిపించలేదని మరికొన్ని పత్రికలు చెబుతున్నాయి.

ఆస్ట్రియా, ఇటలీ పాస్ పోర్ట్ ల మీద ప్రయాణించారని చెబుతున్న ప్రయాణీకులు ఇద్దరు నిజానికి ధాయిలాండ్ లోనే ఉన్నారని ఆస్ట్రియా, ఇటలీలు తెలిపాయి. వారు తమ పాస్ పోర్ట్ లు పోగొట్టునట్లు గతంలో ఫిర్యాదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. వారి పాస్ పోర్ట్ లపై ప్రయాణిస్తున్న ఇద్దరూ కలిసి ఒక ప్రైవేటు ట్రావెల్ ఏజన్సీ వద్ద టికెట్లు కొనుగోలు చేసినట్లు బి.బి.సి తెలిపింది. బీజింగ్ లో దిగిన అనంతరం అక్కడి నుండి యూరోప్ ప్రయాణించడానికి వారు టికెట్లు కొన్నట్లు తెలుస్తోంది. అనగా వారికి చైనా పాస్ పోర్ట్ అవసరం లేదు. అమెరికా, యూరోపియన్ భద్రతా సంస్ధలు మాత్రం తప్పుడు చర్యలు జరిగిన డాఖాలాలు లేవని, దొంగిలించిన పాస్ పోర్ట్ లు వాడడానికి ఇతర వివరణలు ఉండి ఉండవచ్చని చెబుతున్నాయి.

ఏదో ఘోరం జరిగిందని మలేషియన్ ఎయిర్ లైన్స్ అధికారులు గట్టిగా అనుమానిస్తున్నారు. అట్లాంటా లోని వైపరీత్యాల నిపుణుల సాయాన్ని అర్ధించామని వారు తెలిపారు. తప్పుడు పాస్ పోర్ట్ లపై దర్యాప్తుకు తమ గూఢచార సంస్ధలను ఆదేశించామని మలేషియా రక్షణ మంత్రి తెలిపారు. అంతర్జాతీయ గూఢచార సంస్ధల సహాయాన్ని కూడా కోరామని ఆయన తెలిపారు. అమెరికా ఎఫ్.బి.ఐ సహాయాన్ని కూడా కోరామని అయితే విద్రోహ చర్య ఒక అవకాశంగా మాత్రమే చూస్తున్నామని తెలిపారు. తమ తక్షణ ప్రాధామ్యం విమానం ఎక్కడ ఉన్నదీ కనిపెట్టడమే అని తెలిపారు.

వియత్నాం, మలేషియా, చైనా తదితర దేశాలు 22 విమానాలను, 40 నౌకలను వెతుకులాటకు వినియోగిస్తున్నాయి. అమెరికా నౌకలు కూడా రంగంలోకి దిగాయి. సముద్ర నిఘా విమానాన్ని అమెరికా నియోగించింది. బోయింగ్ కంపెనీ నుండి ఎలాంటి సహాయం లేదు. పరిస్ధితిని పరిశీలిస్తున్నామని మాత్రమే సదరు కంపెనీ ప్రకటించింది.

వ్యాఖ్యానించండి