మొఖంపై సిరా మరకలు, కెరీర్ పై కస్టడీ మరకలు


Photo: Reuters

Photo: Reuters

‘మరక మంచిదే’

తమ బట్టల సబ్బు ఉత్పత్తిని మార్కెట్ చేసుకోవడానికి ఓ కంపెనీ ప్రచారం చేసే నినాదం ఇది. ఒక సబ్బుల కంపెనీ తన లాభాలు పెంచుకోవడానికి ఎవరూ ఇష్టపడని మరకను కూడా మంచిదే అని చెప్పగలదని నిరూపించే నినాదం కూడా ఇది. ఈ రోజు సుబ్రతా రాయ్ ఎదుర్కొన్న చేదు అనుభవాలు బహుశా ఆయనకు ఈ నినాదాన్నే స్మరించుకునేలా చేసి ఉంటాయి. మొఖంపై పడ్డ సిరా మరక, కోర్టులో పడ్డ కస్టడీ మరక రెండూ మంచివే అనుకుని ఆయన నచ్చజెప్పుకుని ఉండాలి.

వేల కోట్ల నిధులకు లెక్క చెప్పకుండా మార్కెట్లో తెచ్చి పడేసి కోట్లాది సామాన్యుల నుంచి పెట్టుబడులుగా వసూలు చేశానని ఈ దేశ అత్యున్నత కోర్టును సైతం నమ్మింపజూసిన సుబ్రత రాయ్ మొఖంపై ఓ వ్యక్తి సిరా జల్లి కోపం తీర్చుకున్నాడు. కోర్టులో సుబ్రతా రాయ్ కస్టడీ పొడిగింపును మార్చి 11 వరకు పొడిగించడం ద్వారా ఆయన వ్యాపార కెరీర్ పైనే భారీ మరకను జల్లింది సుప్రీం ధర్మాసనం.

లక్నోలో గత శుక్రవారం లొంగిపోయిన సుబ్రత రాయ్ ను సుప్రీం కోర్టులో హాజరుపరిచేందుకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు 500 కిలో మీటర్లు రోడ్డు మార్గంలో ఢిల్లీ తీసుకొచ్చారని పత్రికలు తెలిపాయి. విమానాల్లో ఫస్ట్ క్లాస్ సీట్లలో ప్రయాణించడానికి అలవాటు పడిన సుబ్రత రాయ్ కు సినిమా తారలతోనూ, క్రికెట్ సెలబ్రిటీలతోనూ కలిసి పత్రికల కెమెరాలకు చిక్కడం ఇష్టమైన హాబీ అని విమర్శకులు చెబుతారు. తనను తాను ఛైర్మన్ & మేనేజింగ్ వర్కర్ గా చెప్పుకునే సుబ్రత తన వెబ్ సైట్ లో 11 బిలియన్ డాలర్లకు, 36,000 ఎకరాల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యానికి అధిపతిని చెప్పినా, కోర్టు కేసుల్లో ఇరుక్కున్నాక గత యేడు తన ఆస్తి కేవలం 1 మిలియన్ డాలర్లు మాత్రమే అని చెప్పుకున్నారు.

కోట్లాది చిన్న మదుపుదారుల నుండి వసూలు చేసినట్లు సుబ్రత రాయ్ చెప్పిన మొత్తాన్ని ఆయా మదుపుదారులకు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ 2 సంవత్సరాల నుండి సదరు తీర్పును అమలు చేయకుండా తప్పించుకోగలిగాడు. చివరికి అన్నీ దారులు మూసుకునిపోయాక 5,120 కోట్ల రూపాయలు తప్ప మిగిలిందంతా చెల్లించేశానని తన లాయర్ రామ్ జేఠ్మలాని చేత చెప్పించారు. సెబి ఈ మాటలు నమ్మకపోవడంతో రికార్డులు చూపించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను పెడచెవిన పెట్టడంతో కోర్టుకు రావాలన్న సుప్రీం ధర్మాసనం ఆదేశాలను అమలు చేయడంలో కూడా సుబ్రత విఫలం అయ్యాడు. ఫలితంగా సుప్రీం కోర్టు అరెస్టు వారంటు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ రోజు (మార్చి 4) కోర్టుకు హాజరయిన సుబ్రత ఎప్పటిలాగా కోర్టును నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ ఈసారి మాత్రం ఆయన తరపున ఏ లాయరూ వాదించలేదు. తన తరపున తానే ఆయన వాదించుకున్నారు. కోర్టు ఆదేశాలను అనుసరించి ఫిబ్రవరి 26 తేదీన కోర్టులో హాజరు కానందుకు ఆయన క్షమించమని కోరాడు. తన ఆస్తులను అమ్మేసే కార్యక్రమం జోరుగా సాగుతోందని, అది పూర్తయ్యాక వెంటనే 22,500 కోట్ల రూపాయలను చెల్లిస్తానని తెలిపాడు. తన చివరి ప్రయత్నాన్ని మన్నించాలని, అప్పుడు కూడా చెల్లింపులు చేయకపోతే శిక్ష అనుభవిస్తానని విన్నవించాడు. ఒకటిన్నర యేళ్లుగా ఎందుకు చెల్లించలేదన్న ధర్మాసనం ప్రశ్నకు ఆయన బదులు ఇవ్వలేదు.

సుబ్రత వాదన విన్న ధర్మాసనం కేసును మార్చి 11 కు వాయిదా వేసింది. అప్పటివరకూ ఆయనను కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. “ఈ కోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయకపోవడం వల్ల మా న్యాయ వ్యవస్ధ మౌలిక పునాదులనే కదిలించినట్లయింది” అని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. తదుపరి హియరింగ్ లో ఆమోదపూర్వకమైన ప్రతిపాదనను తమ ముందుకు తేవాలని ఆదేశించింది. 

ఈ సందర్భంగా ధర్మాసనం సహారా అధినేతను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సుబ్రత వినిపిస్తూ వచ్చిన వివిధ వాదనలపై అనుమానాలు వ్యక్తం చేసింది. “వాది వల్లిస్తున్న చెల్లింపుల సిద్ధాంతాన్ని ఆయన ప్రవేశపెట్టిన వివిధ మదుపు పత్రాలే తిరస్కరిస్తున్నాయి. ఆయన చెబుతున్న మదుపుదారులు అసలు నిజంగా ఉనికిలో ఉన్నారా లేరా అన్న అనుమానాలను సదరు పత్రాలు కలిగిస్తున్నాయి… నిజం ఏమిటో తరిచి చూడాలని ప్రయత్నించిన అధికారులు అందరూ మదుపుదారుల్లో మెజారిటీ అసలు లేనే లేరని నిర్ధారించారు” అని కోర్టు తెలిపింది.

తన ఆస్తులుగా చెబుతూ సుబ్రత రాయ్ గతంలో పలు పత్రాలను సెబికి ఇచ్చారు. వాటి ఖరీదు 2 లక్షల కోట్ల రూపాయలని వాటిని అమ్మి చెల్లింపులు చేయాలని కోరాడు. అయితే ఆయన చూపిన ఆస్తుల లెక్కలు ఒట్టి బూటకం అని సెబి తేల్చేసింది. తాను చూపిన ఆస్తులకు విపరీతమైన ధర కట్టి చూపారని తేల్చింది. సెబి నియంత్రణ నుండి తప్పించుకోవడానికి సుబ్రత రాయ్ అనేక తప్పుడు మార్గాలతో నిధులు సేకరించారని విమర్శకులు అనేకమంది ఆరోపిస్తున్నారు.

సుబ్రత చెప్పిన మదుపుదారులు మెజారిటీ అసలు ఉనికిలో లేరని సెబి, సుప్రీం కోర్టు తేల్చడంతో ఆయన సేకరించానని చెప్పిన 17,000 కోట్ల రూపాయల్లో అధిక మొత్తం నల్ల డబ్బే అన్న నిర్ధారణకు రావలసి వస్తోంది. ఇంత జరిగినా సుబ్రత రాయ్ కు మళ్ళీ మళ్ళీ అవకాశాలు అంది రావడం బట్టి మన చట్టాలు ధనికుల ముందు చిన్నబోతాయన్న అనుమానం బలబడక తప్పదు.

2 thoughts on “మొఖంపై సిరా మరకలు, కెరీర్ పై కస్టడీ మరకలు

  1. గొప్పవారి గోత్రాలు కాలం చెల్లితే మొహం మీద మూత్రాలుగా మారుతాయి. ఒక సామన్యుడి గోడు వినలేని గొప్పతనం సూత్రాలు విధి వక్రిస్తే మసిపూసిన మారేడు రీతిలో ఇలా మొఖం మీద సిరా మరకలుతో తలవంపులు తెస్తాయి.

  2. ఆ సిరా చల్లినాయన లాయరట కదా….! ఇవాళ ఆగ్రహంతో చల్లిన సిరా…..ఒక సామాన్యుడి ఆగ్రహానికి, అసహనానికి, ఆవేశానికి సంకేతంగా భావించాలి. అదే సిరాతోనే జనం తమదైన రాజ్యాన్ని రూపొందించుకోవాలి.

వ్యాఖ్యానించండి