ఎడతెగని హింసా క్షేత్రం ఉక్రెయిన్ -ఫోటోలు


యూరోపియన్ యూనియన్ కి అనుకూలంగా రెచ్చగొట్టబడిన ఆందోళనలు తీవ్ర హింసారూపం దాల్చడంతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ వీధుల్లో రక్తం పారుతోంది. గురు, శుక్రవారాల్లో జరిగిన హింసాత్మక దాడులు, ప్రతిదాడుల పర్యవసానంగా 70 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భద్రతా బలగాలే భవంతులపై నుండి కాల్పులు జరపడం వలన ఆందోళనకారులు మరణించారని పశ్చిమ పత్రికలు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు అసలు కీవ్ లోనే లేకపోవడం, రక్తపాత దాడులు అరికట్టడానికి యూరోపియన్ దేశాల నేతలు కుదిర్చిన మధ్యవర్తిత్వానికి సైతం తీవ్రవాద సంస్ధలు తిరస్కరించడంతో సదరు ప్రచారం ఆవిశ్వసనీయంగా మారింది.

రాజధాని కీవ్ వీధుల్లో హింసాత్మక అల్లర్లు చెలరేగినప్పటికీ అల్లర్లను అరికట్టేందుకు పోలీసులు, భద్రతా బలగాలు వినియోగించే వివిధ సామాగ్రి ఉక్రెయిన్ కు సరఫరా కాకుండా యూరోపియన్ దేశాలు నిషేధం విధించాయి. అమెరికా ఒత్తిడితోనే ఇ.యు దేశాలు ఈ మేరకు వాణిజ్య ఆంక్షలు, వీసా ఆంక్షలు విధించారని ది అట్లాంటిక్ పత్రిక సూచించింది. కీవ్ వీధుల్లో అల్లర్లను చివరికి ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న వివిధ ప్రతిపక్ష పార్టీలు సైతం అరికట్టలేని పరిస్ధితికి చేరుకున్నాయి. వివిధ ప్రతిపక్ష గ్రూపుల మధ్యే తీవ్ర విభేదాలు నెలకొనడంతో ఇ.యు దేశాల నేతలు ఉక్రెయిన్ ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య కుదిర్చిన ఒప్పందం అమలులోకి రాలేదు. ఫలితంగా ఉక్రెయిన్ రాజధానిలో తీవ్ర హింస చెలరేగడంతో అధ్యక్షుడు యనుకోవిచ్ కీవ్ విడిచి తూర్పు ఉక్రెయిన్ లోని ఖార్కోవ్ నగరానికి తరలివెళ్ళినట్లు తెలుస్తోంది. ఆయన ఎక్కడ ఉన్నది ప్రస్తుతం నిర్ధారణగా తెలియని పరిస్ధితి.

ఇ.యు సభ్య దేశాల విదేశాంగ మంత్రులు కీవ్ వచ్చి మధ్యవర్తిత్వం నెరపడంతో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఒప్పందం కుదిరిందని వార్తా సంస్ధలు ప్రకటించాయి. పోలండ్ విదేశీ మంత్రి రదొస్లా సికొర్స్కి, జర్మనీ విదేశీ మంత్రి ఫ్రాంక్-వాల్టర్ స్టీన్మీర్, ఫ్రాన్స్ విదేశీ శాఖ ప్రతినిధి ఎరిక్ ఫోర్నియర్ తదితరులు మధ్యవర్తిత్వం వహించినవారిలో ఉన్నారు. పోలండ్ విదేశీ మంత్రి అయితే ఆందోళన విరమించి ఒప్పందాన్ని గౌరవించాలంటూ నేరుగా ఆందోళనకారులనే బ్రతిమాలుతూ కనిపించారని రష్యా టుడే తెలిపింది. ఉక్రెయిన్ ఆందోళనలను రెచ్చగొట్టిన దేశాల్లో పోలండ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.

ఉక్రెయిన్ ఆందోళనలలో అమెరికా ఎన్.జి.ఓ సంస్ధ CANVAS ప్రధాన పాత్ర పోషించినట్లు వివిధ పరిశోధనాత్మక వార్తా సంస్ధల ద్వారా తెలుస్తోంది. బోస్నియా, ఈజిప్టు, ఆక్యుపై వాల్ స్ట్రీట్ తదితర ఉద్యమాలలో సైతం ఈ సంస్ధ ముఖ్యమైన పాత్ర పోషించింది. అమెరికా వ్యతిరేక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా స్ధానిక ప్రజలను కూడగట్టి హింసాత్మక ఆందోళనలు నిర్వహించడంలో ఈ సంస్ధ పేరెన్నిక గన్నది. అయితే ఉక్రెయిన్ ఆందోళనల్లో నాజీ సంస్ధలు చొరబడడంతో ఆందోళనలను నియంత్రించే వెసులుబాటు ఏ ఒక్క సంస్ధ చేతుల్లోనూ లేకుండా పోయింది. ఆందోళనలను చూపి అధ్యక్షుడి అధికారాలు కత్తిరించడానికి, అవినీతి కేసులో జైలు పాలయిన మాజీ అధ్యక్షురాలిని విడుదల చేయడానికీ, పార్లమెంటు అధికారాలు పెంచడానికీ ప్రతిపక్ష పార్టీలు ఒప్పందానికి వచ్చినప్పటికీ దాన్ని అమలు చేయలేకపోతున్నాయి.

వివిధ ప్రతిపక్ష గ్రూపుల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నందున అధికారాల పంపిణీకి తమలో తాము ఘర్షణ పడుతున్నాయి. దీనితో కీవ్ వీధుల్లో జరుగుతున్న రక్తపాతం ఎవరికి వ్యతిరేకంగా ఎవరు చేస్తున్నారో తెలియడం లేదు. అదే సమయంలో హింసకు ముగింపు ఎప్పుడో ఎవరూ చెప్పలేని పరిస్ధితి. అధ్యక్షుడు మాత్రం ఒప్పందం ప్రకారం కీవ్ వదిలి తనకు బలం ఉన్న తూర్పు ఉక్రెయిన్ కు వెళ్లిపోయారని, ఒప్పందం నిలుపుకోవాల్సిన భారం ఇప్పుడు ప్రతిపక్షాలపై ఉండని కొన్ని పత్రికలు చెబుతున్నాయి. ఉక్రెయిన్ ను ఈ విధంగా ఎడతెగని హింసాక్షేత్రంగా మార్చిన పుణ్యం మాత్రం అమెరికా, ఇ.యులదే.

Photos: The Atlantic

 

2 thoughts on “ఎడతెగని హింసా క్షేత్రం ఉక్రెయిన్ -ఫోటోలు

  1. పేరుకి అగ్రరాజ్యం, ఆధిపత్య ఉగ్రరాజ్యం. ఆధునికత ముసుగు మాటున నియంత ధోరణి. మండేల జాతికి చెందిన ఒబామా ఒకోసారి కాదు అనేకసార్లు హిట్లర్లో పరకాయప్రవేశం చేస్తున్నాడనే భ్రమకలుగుతుంది. రెందో పర్యాయపు హోదాలో అవగాహనలేని అహంభావం అద్దంపడుతోంది. ప్రజా తిరుగుబాటు దేశ ఆంతర్గతమని తెలిసినా అమెరికా ఆవేశపడి ప్రజాసామ్యాన్ని వికృతంగా అణిచివేసే అధికారం ఎవరిచ్చారు?

  2. మళ్ళీ రాజుకున్న రష్యా, అమెరికాల మధ్య శీతలయుద్ధం(cold war),అగ్రరాజ్యాల ప్రోత్సాహం వల్లనే యుక్రైన్ లో అంతర్యుద్ధం జరుగుతున్నది.

వ్యాఖ్యానించండి