సిరియా చర్చలు: ఇరాన్ కు ఆహ్వానం


UN Secretary-General Ban Ki-moon

UN Secretary-General Ban Ki-moon

మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాధాన్యతను పశ్చిమ దేశాలు గుర్తించక తప్పడం లేదా? సిరియా తిరుగుబాటు విషయంలో త్వరలో జెనీవాలో జరగనున్న అంతర్జాతీయ చర్చలకు ఇరాన్ కూడా హాజరు కావాలని ఐరాస అధిపతి ఆహ్వానించడంతో ఈ అనుమానం కలుగుతోంది. జెనీవా చర్చలలో ఇరాన్ పాత్రను అమెరికా నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ వస్తోంది. బేషరతుగా పిలిస్తేనే పాల్గొంటానని ఇరాన్ కూడా స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో సిరియా చర్చల్లో ఇరాన్ కూడా పాల్గొనాలని ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ ఆహ్వానించడం అమెరికా, ఇ.యు, ఇజ్రాయెల్ దేశాల ఆలోచనలో మార్పు వచ్చిందనడానికి సూచనగా కనిపిస్తోంది.

సిరియా తిరుగుబాటుకు సంబంధించి స్విట్జర్లాండ్ రాజధాని జెనీవాలో జనవరి 24 నుండి రెండవ దఫా శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు దాదాపు 40కి పైగా దేశాలు హాజరవుతున్నాయి. చర్చల్లో పాల్గొనడానికి ఇరాన్ ను కూడా అధికారికంగా ఆహ్వానించామని ఐరాస అధినేత బాన్ కి మూన్ ప్రకటించారని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. సిరియా చర్చల్లో “నిర్మాణాత్మక పాత్ర” పోషిస్తామని ఇరాన్ తమకు హామీ ఇచ్చిందని కూడా ఆయన ప్రకటించారు.

“సిరియా సంక్షోభంకు సంబంధించి పరిష్కారంలో ఇరాన్ కూడా పాత్ర వహించాల్సిన అవసరం ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. తాము నిర్మాణాత్మకమైన, ముఖ్యమైన మరియు సానుకూల పాత్ర పోషించడానికి కట్టుబడి ఉన్నామని ఇరాన్ చెప్పింది” అని బాన్ కి మూన్ న్యూయార్క్ లో ప్రకటించాడు. ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం బాన్ ఈ ప్రకటన చేశారని రాయిటర్స్ తెలిపింది.

జెనీవాలో జరగనున్న చర్చలను జెనీవా-2 గా పిలుస్తున్నారు. గత సంవత్సరం జూన్ లో జరిగిన చర్చలను జెనీవా-1 గా పిలుస్తున్నారు. ఈ చర్చల్లో ‘జెనీవా కమ్యూనిక్’ పేరుతో ఒక ఒప్పందం కుదిరినప్పటికీ దానిని అమలు చేయడానికి అమెరికా, ఇ.యు, ఇజ్రాయెల్ తదితర దేశాలు పూనుకోలేదు.

ఇరాన్ ను ఆహ్వానించడానికి అమెరికా అంగీకరించిందని కూడా పత్రికల వార్తలను బట్టి తెలుస్తోంది. మధ్యప్రాచ్యంలో ముఖ్యంగా సిరియా విషయంలో ఇరాన్ పాత్ర లేకుండా తాము సాధించేదేమీ ఉండదని అమెరికా తెలుసుకుందనడానికి ఇదొక సూచన అని అంతర్జాతీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇరాన్ ను ఆహ్వానించడానికి అంగీకరించినా సన్నాయి నొక్కులు నొక్కడం మాత్రం అమెరికా మానలేదు.

Iran's Foreign Minister Mohammad Javad Zarif

Iran’s Foreign Minister Mohammad Javad Zarif

“పరస్పర అంగీకారంతో పూర్తి అధికారాలతో ట్రాన్సిషనల్ గవర్న్ మెంట్ ను ఏర్పాటు చేయడంతో సహా  జెనీవా కమ్యూనిక్ ను పూర్తిగా అమలు చేయడానికి ఇరాన్ స్పష్టంగా, బహిరంగంగా మద్దతు ప్రకటించాలి. జెనీవా కమ్యూనిక్ ను పూర్తిగా బహిరంగంగా అంగీకరించకపోతే ఇరాన్ కు అందజేసే ఆహ్వానాన్ని వెనక్కి తీసుకోవాలి” అని అమెరికా షరతు విధించింది. అయితే ఈ షరతు కింద పడ్డా పై చేయి నాదే అని చెప్పుకోడానికేననీ వాస్తవంలో ఇరాన్ సహకారం లేకుండా అమెరికా సాధించేది ఏమీ ఉండదని పరిశీలకుల అభిప్రాయం. ఆ సంగతి జెనీవా-1 సమావేశమే రుజువు చేసిందనీ, ఇరాన్ పాత్ర లేకుండా తయారు చేసిన కమ్యూనిక్ ఇప్పటివరకు కాగితాల మీదనే అలంకార ప్రాయంగా ఉండిపోయిందని వారు గుర్తు చేస్తున్నారు.

అయితే జెనీవా 1 ఒప్పందాన్ని ఇరాన్ ఇప్పటిదాకా పూర్తిగా అంగీకరించలేదు. సిరియాలో ట్రాన్సిషనల్ గవర్న్ మెంట్ ఏర్పాటు చేస్తే అందులో బషర్ ఆల్-అస్సాద్ కు పాత్ర లేకుండా చేస్తారని ఇరాన్ భావిస్తోంది. దేశ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించడంలో అద్యక్షుడు బషర్ కు పాత్ర లేకుండా చేయడం ఇరాన్ కు సుతరామూ ఇష్టం లేదు. అయితే జెనీవా 2 చర్చల్లో పాల్గొనడానికి తాను ఇరాన్ ను ఒప్పించానని బాన్ చెబుతున్నారు.

“చర్చల లక్ష్యం సిరియాలో పరస్పర అంగీకారం ద్వారా పూర్తి అధికారాలతో ఒక ట్రాన్సిషనల్ గవర్న్ మెంట్ ఏర్పాటు చేయడమేనని నేను (ఇరాన్) విదేశీ మంత్రి జరిఫ్ ఒక అంగీకారానికి వచ్చాము. దాని ప్రాతిపదికనే మాంట్రియక్స్ లో నిర్మాణాత్మకమైన, సానుకూలమైన పాత్రను ఇరాన్ పోషిస్తుందని జరిఫ్ ప్రతిజ్ఞ చేశారు” అని బాన్ కి మూన్ ప్రకటించారని రష్యా టుడే తెలిపింది. జెనీవాలో జనవరి 24 నుండి ప్రధాన చర్చలు జరగనుండగా దానికి ముందు మాంట్రియక్స్ లో ముందస్తు చర్చలు జరుగుతాయి.

జెనీవా 1 సమావేశంలో 39 దేశాలు పాల్గొన్నాయి. జెనీవా 2 చర్చలకు ఇరాన్ జత కలుస్తోంది. ఇవి కాక మరో 9 దేశాలను (ఆస్ట్రేలియా, బహ్రయిన్, బెల్జియం, గ్రీస్, ద హోలీ సీ, లగ్జెంబర్గ్, మెక్సికో, ద నెదర్లాండ్స్, దక్షిణ కొరియా) కూడా బాన్ ఆహ్వానించారు.

సిరియా ప్రతిపక్షాల అభ్యంతరం

బాన్ కి మూన్ ప్రకటనను సిరియా ప్రతిపక్షాలు నిరసించాయి. ఇరాన్ హాజరయితే తాము హాజరు కాబోమని ‘సిరియన్ నేషనల్ కోవలిషన్’ (ఎస్.ఎన్.సి) ప్రతినిధి లౌవాయ్ సఫీ ట్విట్టర్ లో ప్రకటించారని రాయిటర్స్ తెలిపింది. ఇరాన్ ను ఆహ్వానించినట్లు బాన్ చేసిన ప్రకటన తమను ఆశ్చర్యానికి గురి చేసిందని ఎస్.ఎన్.సి లోని మరో సభ్య సంస్ధ ప్రకటించిందని ఆర్.టి తెలిపింది.

సిరియా చర్చలకు మరో ప్రధాన అడ్డంకి సిరియా ప్రతిపక్షాలే. ఇరాన్ పాల్గొనడం, అధ్యక్షుడు బషర్ కు భవిష్యత్తు ప్రభుత్వంలో పాత్ర కల్పించడం తమకు అబ్యాంతరకరమని వారు చెబుతున్నప్పటికీ వాస్తవం ఏమిటంటే ఎస్.ఎన్.సి ఒక కలగూరగంప. వారి తరపున ఎవరెవరు చర్చల్లో పాల్గొనాలో వారి

Bashar al-Assad

Bashar al-Assad

మధ్యనే ఏకాభిప్రాయం లేదు. వీరికి పశ్చిమ దేశాలు పూర్తి మద్దతు ఇస్తున్నప్పటికీ తిరుగుబాటులో వీరి పాత్ర బహుస్వల్పం. తిరుగుబాటులో ప్రధాన పాత్ర టెర్రరిస్టులది కాగా వారిపై ఎస్.ఎన్.సి కి ఎటువంటి పట్టూ లేదని పత్రికలు తరచుగా చెబుతాయి. చర్చల్లో పాల్గొనడానికి ఎస్.ఎన్.సి ఇంతకుముందు సంసిద్ధత వ్యక్తం చేసింది. తిరుగుబాటులో ప్రధానపాత్ర ధారులైన ఆల్-ఖైదా అనుబంధ సంస్ధలు (నూస్రా ఫ్రంట్ మొ.వి) చర్చల్లో పాల్గొనబోమని స్పష్టం చేశాయి.

ఈ నేపధ్యంలో చర్చల్లో పాల్గొనేవారు వాస్తవ దృక్పధాన్ని అవలంబించాలని ఇరాన్ కోరుతోంది. చర్చలు చివరికి తీవ్రవాద సంస్ధలు బలపడడానికే దారి తీయడం వల్ల ఫలితం ఉండదని హెచ్చరించింది.

జెనీవా 2 చర్చలు అమెరికా, రష్యాల చొరవతో జరుగుతున్నాయి. ఈ చర్చలు వాస్తవానికి గత సంవత్సరం సెప్టెంబర్ లోనే జరగాల్సి ఉండింది. కానీ చర్చలలో పై చేయి సాధించడానికి వీలుగా మొదట టెర్రరిస్టు సంస్ధలు సాధ్యమైనంత ఎక్కువ భూభాగాన్ని ఆక్రమింపజేయడానికి అమెరికా పధకం వేసింది. ఈ పధకంతో చర్చలను ఆలస్యం చేస్తూ వచ్చింది. అయితే ఈ లోపు తిరుగుబాటుదారులు పైచేయి సాధించడం అటుంచి అధ్యక్షుడు బషర్ అస్సాద్ మరిన్ని భూభాగాలు స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. పైగా తిరుగుబాటు సంస్ధలు తమలో తాము కొట్టుకుని ప్రజలకు మరింత ప్రమాదకరంగా మారాయి.

తిరుగుబాటుదారుల మధ్య అంతర్గత ఘర్షణల ద్వారా మోడరేట్ టెర్రరిస్టులను ప్రధాన శక్తిగా ప్రొజెక్ట్ చేయడానికి అమెరికా నాటకం ఆడుతోందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. తిరుగుబాటుదారులు వరుస పరాజయాలు ఎదుర్కోవడంతో తాము మద్దతు ఇచ్చే సంస్ధలు టెర్రరిస్టు సంస్ధలు కాదని, సిరియా పాలనకు అర్హులేనని రుజువు చేయడానికే ఘర్షణలు జరుగుతున్నట్లు సృష్టించి ఈ ఘర్షణల్లో మోడరేట్లు విజయం సాధించారని ప్రపంచం ముందు చూపే ప్రయత్నం చేసిందని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానించారు.

జెనీవా 2 చర్చలు ఒక కొలిక్కి వస్తే గాని అసలు విషయం ఏమిటన్నది స్పష్టంగా తెలియదు.

వ్యాఖ్యానించండి