కాశ్మీర్: ఎఎపి ఆఫీసు దాడి, హిందూ రక్షా దళ్ నేత అరెస్ట్


Prashant Bhushan

బుధవారం ఉదయం ఘజియాబాద్, కౌసాంబి లోని ఎఎపి ప్రధాన కార్యాలయం పైన హిందూ రక్షా దళ్ పేరుతో 40 మందితో కూడిన మూక దాడి చేసింది. అక్కడ ఉన్న పూల కుండీలను వాళ్ళు పగల గొట్టారు. పార్టీ ఫ్లెక్సీలను చించేశారు. తలుపులు, కిటికీలకు ఉన్న అద్దాలను పగల గొట్టారు. ఇక హిందూ మతాన్ని కాపాడుతాం… లాంటి నినాదాలు మామూలే. సుప్రీం కోర్టు ఎదురుగా ఉన్న తన కార్యాలయంలోకి రెండేళ్ల క్రితం జొరబడి దాడి చేసి కొట్టింది కూడా వీళ్ళేనని ప్రశాంత్ భూషణ్ తెలిపారు. అప్పుడు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకుండా వదిలేశారని అందుకే మళ్ళీ ధైర్యంగా దాడి చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.

“కాశ్మీరు పైన ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలకు మేము వ్యతిరేకం. బాట్లా ఎన్ కౌంటర్ పైన అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కూడా ఈ దాడి చేశాం” అని పోలీసుల అరెస్టులో ఉన్న హిందూ రక్షా దళ్ నేత పింకి చౌదరి చెప్పారు. హిందూ రక్షా దళ్ కు తాను జాతీయ కన్వీనర్ ని అని ఈయన చెప్పుకున్నాడు.

దాడి జరిగిన కొన్ని గంటల వ్యవధిలో పింకి చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారని ది హిందు తెలిపింది. “ఎఎపి కార్యాలయంపై దాడికి సంబంధించి ఒకరిని అరెస్ట్ చేశాము. కార్యాలయంలో నెలకొల్పిన సి.సి.టి.వి ఫుటేజీ పరిశీలిస్తున్నాం. దాని సహాయంతో ఇతర నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తాం” అని డి.ఎస్.పి రావ్ విజయ్ సింగ్ చెప్పారు.

కాశ్మీరులో సైన్యం వలన అక్కడి ప్రజలు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎల్.ఓ.సి కి అవతలి వైపు నుండి ఎవరో ఒకరు వచ్చి దాడి చేస్తే ఇవతలి వైపు గ్రామాలకు ఇక మూడినట్లే. కూంబింగ్ పేరుతో ఇళ్ళల్లో జొరబడి నానా ఆగడాలు సృష్టిస్తారు. యువకులను పట్టుకెళ్లి పోతారు. వారికి టెర్రరిస్టు అని ఒక ట్యాగ్ తగిలిస్తారు. ఇలాంటి అరెస్టులు జరిగిన సందర్భాల్లో అనేకసార్లు బూటకపు ఎన్ కౌంటర్లకు యువకులు గురయ్యారు. వారిని టెర్రరిస్టులుగా చూపుతూ ప్రమోషన్లు పొందిన కేసులు వెలుగు చూశాయి. ఇటీవల కొందరు నిందితులకు శిక్షలు కూడా పడ్డాయి. సామూహిక సమాధులు కూడా వెలుగు చూశాయి. ఇక్కడ డి.ఎన్.ఎ పరీక్షలు నిర్వహించి మాయం అయిన యువకులను పాతిపెట్టిందీ లేనిదీ తేలుస్తామన్న ప్రభుత్వాల వాగ్దానాలు ఇంతవరకు నెరవేరలేదు.

aap cctv

aap cctv

ఇలాంటి నిర్బంధ పరిస్ధితుల మధ్య బతుకుతున్న కాశ్మీరీ ప్రజల అభిప్రాయం తీసుకుని అక్కడ సైన్యాన్ని నియోగించేది లేనిది నిర్ణయం తీసుకోవాలని ప్రశాంత్ భూషణ్ ప్రకటించారు. కాశ్మీరీ ప్రజల అభిప్రాయం తీసుకుని దాన్ని బట్టి కాశ్మీర్ కు స్వతంత్రం ఇవ్వాలా లేదా అని నిర్ణయించాలని ఆయనేమీ చెప్పలేదు. ఆయన చెప్పిన ప్రజాభిప్రాయం కేవలం సైన్యం నియోగం గురించే.

ప్రశాంత్ భూషణ్ అభిప్రాయం తమ అభిప్రాయం కాదని అరవింద్ వెంటనే ఖండించాడు. భద్రతా సమస్యల కోసం సైన్యాన్ని పిలవాలా లేదా అన్నది నిర్ణయిస్తారని, దీనికి ప్రజాభిప్రాయం అవసరం లేదని ఆయన తన అభిప్రాయం చెప్పారు. కానీ సైన్యాన్ని పిలిచే ముందు ప్రజల అభిప్రాయాన్ని విశ్వాసం లోకి తీసుకోవాలని అరవింద్ కూడా చెప్పారు. ఇద్దరి అభిప్రాయాల్లో పెద్ద తేడా లేదు. ప్రజల అభిప్రాయమే ఫైనల్ అన్నట్లుగా భూషణ్ అభిప్రాయం ఉంటే ప్రజల అభిప్రాయాన్ని కనుక్కుని దాన్ని విశ్వాశంలోకి తీసుకుంటూ ఫైనల్ నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలన్నట్లుగా అరవింద్ అభిప్రాయం ధ్వనిస్తోంది. కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం అని ఇద్దరూ చెప్పారు.

ఇందులో హిందూ మతానికి వచ్చిన ప్రమాదం ఏమన్నా ఉన్నదా? ఏమీ లేదు. అసలు మతానికి సంబంధించిన ప్రస్తావనే ఇక్కడ లేదు. కేవలం ప్రజలు, వారి పరిస్ధితులు, అవసరాలు ఇవే ఉన్నాయి. సైన్యం వల్ల ప్రజలు పడుతున్న బాధల పట్ల సానుభూతి ఉంది. ఆ బాధల్ని ప్రజలకు తొలగించాలన్న కోరిక ఉంది. అంతకు మించి మరేమీ లేదు. కాకపోతే ఆ ప్రజలు ఇక్కడ ముస్లింలు అయ్యారు. కాబట్టి హిందూ మతానికి నష్టం అని హిందూ రక్షా దళ్ వాళ్ళు నిర్ణయించేశారు. అక్కడితో ఆగకుండా తమ భ్రాంతిజనక భావాల్ని దౌర్జ్యన్యంగా రుద్దడానికి పూనుకున్నారు. కాశ్మీర్ లో సైన్యం, సీమాంతర ఉగ్రవాదులు అని చెబుతున్నవారు చేస్తున్న చర్యలకు ఈ రక్షకులు చేసిన చర్యలకు తేడా ఉందా?

బి.జె.పి, ఆర్.ఎస్.ఎస్ ప్రోద్బలంతోనే

ఆర్.ఎస్.ఎస్, బి.జె.పి తదితర హిందూ మతవాద సంస్ధల ప్రోద్బలంతోనే తమ కార్యాలయంపై దాడి జరిగిందని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. ఎఎపి ఎదుగుదలతో నిస్పృహకు గురయిన హిందూ సంస్ధలు ఓర్వలేక దాడులకు పురిగొల్పుతున్నాయని ఆయన ఆరోపించారు. “బి.జె.పి, ఆర్.ఎస్.ఎస్ వాటి అనుబంధ సంస్ధల తీవ్ర నిస్పృహను ఈ దాడి ఘటన సూచిస్తోంది. ఎఎపి ఎదుగుదల వీరికి నిరాశ కలిగించింది. ఎఎపిని చూసి వారికి భయం పట్టుకుంది. లోక్ సభ ఎన్నికల్లో వారి అవకాశాలు దెబ్బ తింటాయని వారి భయం” అని ప్రశాంత్ భూషణ్ విలేఖరులతో అన్నారు.

Why this!ఈ పార్టీలు అవసరం అయితే ఏం చేయడానికైనా సిద్ధమేనని ధ్రువపరిస్తున్నాయని, తద్వారా వారి ఫాసిస్టు ధోరణి వ్యక్తం చేస్తున్నాయని భూషణ్ ఆరోపించారు. జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న బి.జె.పి అన్నిరకాల హింసకు పాల్పడాలని తమ గూండాలను పురిగొల్పడం దురదృష్టకరం అని నిరసించారు. “రెండేళ్ల క్రితం సుప్రీం కోర్టు ఎదురుగా ఉన్న నా ఛాంబర్ లో దాడి చేసింది కూడా వీళ్ళే. అప్పటి దాడిలో ఉన్నవారిలో కొందరు ఇప్పుడూ ఉన్నారు. దాడి చేసినవారిలో ఒకరు ఒక వెబ్ సైట్ ను నడుపుతున్నారు. ఆ వెబ్ సైట్ ను ఒక బి.జె.పి నాయకుడు ప్రమోట్ చేస్తున్నారు” అని భూషణ్ తెలిపారు. ఐతే దాడిని బి.జె.పి కూడా ఖండిస్తోందని ఆ పార్టీ ప్రతినిధి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దాడినీ, భూషణ్ వ్యాఖ్యలను రెండింటినీ ఖండిస్తున్నామని ఆమె తెలిపారు.  

ఎఎపి ఎదుగుదల పట్ల బి.జె.పి నిస్పృహ ఇప్పటికే వివిధ సందర్భాలలో వ్యక్తం అయింది. ఢిల్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరించిన బి.జె.పి విచిత్రంగా ఆ బాధ్యత ఎఎపి పైన ఉందని ప్రకటించింది. తీరా కాంగ్రెస్ మద్దతుతో ఎఎపి ప్రభుత్వం ఏర్పాటు చేశాక తిట్టడం మొదలు పెట్టింది. అవినీతి పార్టీ అని నిందించిన కాంగ్రెస్ మద్దతు ఎలా స్వీకరిస్తారు అని ప్రశ్నించింది. అంటే బి.జె.పి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆ పార్టీ ఉద్దేశ్యమా? కానీ బి.జె.పి అవినీతిని కూడా ఎఎపి ప్రశ్నించింది. ఈ లెక్కన బి.జె.పి చెప్పిన ‘ప్రభుత్వం ఏర్పాటు చేసే బాధ్యత’ను ఎఎపి ఎలా నెరవేరుస్తుంది?

ఇప్పుడేమో ఏకంగా ఎఎపి ప్రధాన కార్యాలయం పైనే దాడులు! ఈ లెక్కన బి.జె.పి నాయకులు చెప్పే అభిప్రాయాలూ నచ్చకపోతే ఆ పార్టీ కార్యాలయంపై దాడి చేయాలనీ, ఆర్.ఎస్.ఎస్ ప్రకటనలు నచ్చకపోతే వాళ్ళ ఆఫీస్ పైన దాడి చేయాలనీ ఈ రక్షకులు చెప్పదలిచారేమో తెలియదు. హిందూ రక్షా దళ్ అభిప్రాయం ఎఎపి కి ఎలాగూ నచ్చదు కాబట్టి ఆ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు కర్రలు పుచ్చుకుని పింకి ఆఫీసు పైనో, ఇంటి పైనో దాడి చేయాలన్నట్లుగా పింకి చౌదరి ప్రకటన చెబుతోంది. భూషణ్ అన్నట్లు నిస్పృహ లో ఉన్నవారు చేసే పనులే ఇవి.

వ్యాఖ్యానించండి