లాంగ్ వాక్ చాలించిన నెల్సన్ రొలిహ్లాహ్లా మండేలా -1


నెల్సన్ రొలిహ్లాహ్లా మండేలా ‘సుదీర్ఘ నడక’ (లాంగ్ వాక్) గురువారం సాయంత్రంతో (స్ధానిక సమయం) ముగిసింది. 95 సంవత్సరాల ముదిమి మీద పడిన నల్ల సూర్యుడు నల్లజాతి విముక్తిని అర్ధాంతరంగా వదిలి శాశ్వత అస్తమయాన్ని ఆవాహన చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా పదే పదే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న మండేలా ఇక ఊపిరి పీల్చడం తనవల్ల కాదంటూ సెలవు తీసుకున్నాడు. శ్వేత జాత్యహంకార అణచివేతను ధిక్కరించిన నల్ల వజ్రం తన జీవితకాల పోరాట వెలుగులను తన జాతిజనుల చరిత్రకు అప్పగించి వెళ్ళిపోయింది. 

జాత్యహంకార పాలకుల ఉక్కుపాదాల అణచివేత నుండి నల్లజాతి ప్రజలు విముక్తి పొందాలంటే సాయుధంగా పొరాడటం తప్ప మరో మార్గం లేదని నమ్మినందుకు 27 సంవత్సరాల సుదీర్ఘ ఒంటరి ఖైదు శిక్షను అనుభవించిన నెల్సన్ మండేలా జోహేన్స్ బర్గ్ లోని తన స్వగృహంలో కుటుంబ సభ్యుల సమక్షంలో కన్ను మూశాడు.

నెల్సన్ మండేలాకు ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు రొలిహ్లాహ్లా. ఆ పేరుకు అర్ధం కష్టాలు తెచ్చిపెట్టేవాడు (troublemaker) అని అర్ధం అట! ఆ పేరు పెట్టడం ద్వారా ఆయన తండ్రి ఏమి ఆశించారో కానీ మండేలా మాత్రం తెల్లజాతి దురహంకారులకు మాత్రం భారీ కష్టాలే తెచ్చిపెట్టాడు. మొదట గాంధీ ప్రతిపాదించిన అహింసా పోరాటాన్ని నమ్ముకున్న నెల్సన్ మండేలాకు, ప్రతి నిమిషం తన జాతి కోల్పోతున్న ఆత్మగౌరవాన్ని, ప్రాధమిక హక్కులను, జాతి అస్తిత్వాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే బలప్రయోగం తప్ప మరో మార్గం లేదన్న నిర్ణయానికి వచ్చేయడానికి ఎంతోకాలం పట్టలేదు.

ఆ నిర్ణయానికి వచ్చిందే తడవుగా ఆఫ్రికా అంతటా పర్యటించి శక్తియుక్తులను సమకూర్చుకున్న నెల్సన్ మండేలా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కు అనుబంధంగా ఉంఖోంటో అనే మిలిటెంటు యువజన సంఘాన్ని స్ధాపించాడు. సంఘం నేతృత్వంలో శ్వేతాజాతి పాలకుల జాత్యహంకార ఆధిపత్యానికి ఆయువు పట్లయిన వ్యాపార, వాణిజ్య సంస్ధలపైనా, కంపెనీల పైనా, నిర్మాణాల పైనా విస్తృతంగా దాడులు నిర్వహించాడు. కానీ సాయుధ పోరాటం ప్రారంభంలోనే ఆయన దొరికిపోవడంతో జాత్యహంకార ప్రభుత్వం దేశ ద్రోహం, విధ్వంసకర కార్యకలాపాల నేరాలు మోపి జీవిత ఖైదు విధించింది.

బహుశా మండేలాను ఖైదు చేసినందుకు తెల్లజాతి ప్రభుత్వం చింతించని రోజు ఉండి ఉండదు. ఎందుకంటే తమ మధ్య నుండి అదృశ్యం అయిన మండేలాను ప్రతి నల్లజాతి పౌరుడు తమ హృదయాంతరాళాల్లో నింపుకున్నాడు. మండేలా బైట ఉన్నట్లయితే ఒక్కరే మండేలా ఉండేవాడు. ఆయన మాయం అయ్యాక ఇక ప్రతి ఒక్కరూ మండేలా అయి మండిపోయారు. ఒక్కో నల్లజాతి వ్యక్తి ఒక్కొక్క అగ్నిగోళంలా మండి పోవడానికి దారి తీసిన కారణాల్లో ఆయన తన చర్యలను సమర్ధించుకుంటూ కోర్టులో వినిపించిన వాదన ఒకటి అంటే అతిశయోక్తి కాదు. కోర్టులో ఆయన వినిపించిన వాదన సమాన హక్కులతో కూడిన ఆత్మగౌరవం కోరుకున్న ప్రతి నల్ల జాతి వ్యక్తిలోనూ అద్భుతమైన చైతన్యాన్ని నింపాయి. ఆ చైతన్యం ఉత్తుంగ తరంగమై పెనుమంటలను సృష్టించిన దావానలమే అయింది. ఆయన బొమ్మ, ఆయన మాట, ఆయన నవ్వు… ఇలా మండేలాకు చెందిన ప్రతి అంశం దక్షిణాఫ్రికా నల్లజాతి ప్రజలను నిప్పు కణికలుగా మార్చివేసింది.

తొలి రోజులు

యువ న్యాయవాదిగా రాజకీయాల్లో ప్రవేశించిన నెల్సన్ మండేలా 44 సంవత్సరాల వయసులో 27 సంవత్సరాల జైలు శిక్షకు గురయ్యారు. జులై 18, 1918 తేదీన ఝోషా (xhosa) తెగలో ధెంబు ప్రజల నాయకుడికి జన్మించిన రొలిహ్లాహ్లాకు పాఠశాల ఉపాధ్యాయులు నెల్సన్ అన్న ఆంగ్ల నామం కేటాయించారు. అప్పటి నుండి రొలిహ్లాహ్లా మండేలా నెల్సన్ మండేలా అయ్యారు. తొమ్మిది సంవత్సరాల వయసులో తండ్రి చనిపోవడంతో మండేలా తన స్వగ్రామం కును ను వదిలిపెట్టారు. ఫోర్ట్ బ్యూఫోర్ట్ కాలేజీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫోర్ట్ హరే లలో కాలేజీ చదువు అభ్యసించిన అనంతరం బలవంతపు వివాహాన్ని తప్పించుకోడానికి 1941లో జోహాన్స్ బర్గ్ పారిపోయారు.

మండేలా జోహాన్స్ బర్గ్ చేరిన కొద్ది సంవత్సరాలకు 1948 ఎన్నికల్లో మితవాద తీవ్రవాద పార్టీ అయిన ఆఫ్రికనర్ నేషలిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ కాలంలో తెల్లవారికి మాత్రమే ఓటు వేసే హక్కు ఉండేది. నల్లవారు ఓటు హక్కుకు అర్హులు కారు. నల్లవారి కంటే తెల్లవారు అధికులు అనీ కాబట్టి తెల్లవారి ఆధిపత్యం అత్యవసరం అనీ ప్రభోదించి ఆఫ్రికనర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉన్నత జాతి అయినందున తెల్లవారిని నల్లవారి నుండి వేరుగా ఉంచాలని ప్రబోధించి అమలు చేసింది. దీనిని apartness అన్నారు. అదే apartheid అయింది.

‘Long Walk to Freedom’ పుస్తకంలో నెల్సన్ మండేలా వర్ణ వివక్షను ఇలా అభివర్ణించారు. “ఆఫ్రికన్లకు వర్ణ వివక్ష (aparthied) అంటే తెల్లవారు మాత్రమే నడిచే వాకిలిలో నడిస్తే పెద్ద నేరం కావడం; తెల్లవారు మాత్రమే ప్రయాణించే బస్సు ఎక్కితే నేరం కావడం; తెల్లవారు తాగే మంచినీటి చెలమలో నీరు తాగితే నేరం కావడం; తెల్లవారు మాత్రమే పాదాలు మోపే బీచ్ ని నల్లపాదాలు తాకితే నేరం కావడం; చివరికి రాత్రి 11 దాటి వీధిలోకి వచ్చినా నేరమే; పాస్ బుక్ లేకపోయినా నేరమే; ఆ పాస్ బుక్ లో తప్పు సంతకం ఉన్నా నేరమే; నిరుద్యోగిగా ఉంటే నేరం; తనదికాని చోట ఉద్యోగం పొందినా నేరమే; కొన్ని చోట్ల నివశిస్తే నేరం; నివశించడానికి కాసింత జాగా లేకపోయినా నేరమే.”

యువకుడిగా ఉన్నపుడు తనకు రాజకీయాలంటే భయంగా ఉండేదని మండేలా ఈ పుస్తకంలో రాశారు. రాజకీయాల్లో చేరి గొంతు కాస్త పెగిల్చితే అది తన వృత్తిగత (లాయర్) అవకాశాలను కోల్పోయేలా చేస్తుందేమోనని ఆయన భయపడ్డారు. అయితే అనునిత్యం ఎదుర్కోవాల్సి వచ్చిన వర్ణ వివక్ష అనుభవాలు ఒక నిరంతర ప్రవాహంలాగా ఆయన జీవితంలో పేరుకుంటూపోవడంతో వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమంలోకి రాకుండా ఉండడం ఆయనకు సాధ్యం కాలేదు. ఏదో ఒక్క తీవ్రమైన అనుభవం మాత్రమే ఉద్యమంలోకి దూకేందుకు తనను పురికొల్పలేదని ఆయన చెబుతూ “నిరంతరం నిలకడగా పేరుకున్న వెయ్యి తృణీకారాలు, రోషం పొడుచుకుని రావాల్సిన ఓ వెయ్యి సందర్భాలు, జ్ఞాపకం లేని మరో వెయ్యి అవమానకర క్షణాలు… నాలో క్రోధాన్ని, తిరుగుబాటుతనాన్ని, నా ప్రజల్ని ఖైదు చేసిన వ్యవస్ధతో పోరాడాలన్న కోరికను నింపాయి” అని మండేలా పేర్కొన్నారు.

ఈ నేపధ్యంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ లో మండేలా చేరిపోయారు. 1912లో స్ధాపించబడిన ఈ పార్టీ ప్రారంభంలో నల్లజాతి ప్రజల మన్ననలు అందుకుంది. కానీ అనంతర కాలంలో దారి వెతుక్కునే పనిలో పడిపోయింది. అలాంటి పార్టీకి అనుబంధంగా ‘యూత్ లీగ్’ సంస్ధను స్ధాపించడంలో మండేలా ప్రముఖ పాత్ర పోషించారు. ప్రారంభంలో భారతీయులు, తెల్ల కమ్యూనిస్టులు లాంటి ఇతర జాతీయులతో పొత్తు పెట్టుకోవడానికి మండేలా నిరాకరించారు. వారితో పొత్తు వలన పార్టీని దారి మల్లిస్తారని మండేలా భావించారు. అయితే అనంతర కాలంలో వర్ణ వివక్షను వ్యతిరేకించే శక్తులన్నిటితోనూ కలిసి విశాల ప్రాతిపదికన ఐక్య పోరాటాలు చేసేందుకు మొగ్గు చూపారు. 

గాంధీజి అహింసా సిద్ధాంతాలకు మండేలా అమితంగా ప్రభావితం అయ్యారని భారత పత్రికలు, నాయకులు ఎప్పుడూ చెప్పే మాట. కానీ అది పాక్షిక సత్యం మాత్రమే. ప్రారంభంలో ఆయన అహింసాయుత పోరాటానికి మొగ్గు చూపింది నిజమే. అయితే గాంధీ చెప్పినట్లు నైతిక ఎంపిక (moral choice) గా కాకుండా ఒక ఎత్తుగడగా మాత్రమే ఆయన దానిని పాటించారు. “రాజ్యం మాకంటే చాలా శక్తివంతమైనది… దానితో అహింసాయుత పోరాటం ఒక ఎంపికగా కాకుండా ఆచరణాత్మక అవసరం అయింది” అని నెల్సన్ మండేలా తన పుస్తకం ‘Long Walk to Freedom’ లో తెలిపారు.

అహింసా ఎత్తుగడ అంతకంతకూ ప్రభావశూన్యం కావడంతో 1950ల నాటికి మండేలా బలప్రయోగం మార్గాన్ని ఎంచుకున్నారు. జాత్యహంకార ప్రభుత్వ సాధనాలను విధ్వంసం చేసే ఎత్తుగడ చేపట్టారు. ఉక్కు నిర్బంధం ప్రయోగిస్తున్న తెల్లజాతి దురహంకారానికి ప్రజల నిరసన వేడి తాకాలంటే మరో మార్గం లేదని ఆయన భావించారు. వివిధ ప్రభుత్వ నిర్మాణాలను లక్ష్యం చేసుకుని విధ్వంస కార్యకలాపాలకు దిగారు. మిలట్రీ లక్ష్యాలపై దాడులు నిర్వహించారు.

ఉంఖోంటో వె సెజ్వే (Umkhonto we Sizwe) స్ధాపన

1961లో మండేలాకు గెరిల్లా పోరాట సంస్ధను ఏర్పాటు చేసే బాధ్యత అప్పగించబడింది. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కు అది సాయుధ విభాగంగా ఉండాలని పార్టీ నిర్ణయించింది. ‘ఉంఖోంటో వె సెజ్వే’ అంటే ‘జాతి ఈటె’ (Spear of the Nation) అని అర్ధం. కొత్త బాధ్యతల రీత్యా నెల్సన్ మండేలా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అజ్ఞాతంలో ఉంటూనే ఆఫ్రికా అంతా పర్యటించారు. సాయుధ విభాగాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధుల సేకరణ, సైనిక రణ తంత్ర పద్ధతుల శిక్షణ ఈ పర్యటన లక్ష్యం. పర్యటన ముగిసిన తర్వాత ఆగస్టు 1962లో తిరిగి దక్షిణాఫ్రికాలో ప్రవేశిస్తుండగా ఆయన జాత్యహంకార ప్రభుత్వానికి దొరికిపోయారు. మరో ఆరుగురు సహచరులు (వాల్టర్ సిసులు, గోవన్ ఎంబెకి, డెనిస్ గోల్డ్ బర్గ్, అహ్మద్ కత్రాడ, రేమండ్ మహ్లాబా, ఎలియస్ మొత్సోవాలెడి) కూడా పట్టుబడ్డారు. ఈ ఏడుగురిని విచారించిన రాజ్యం అందరికి జీవిత ఖైదు విధించింది. అప్పటికి మండేలా వయసు 44 సం.లు. ఆరుగురు పిల్లలకు తండ్రి కూడా.

నెల్సన్ మండేలాకు శ్వేత జాత్యహంకారం ఎంతగా భయపడిందంటే కేప్ టౌన్ తీరానికి దగ్గరలో ఉన్న రాబేన్ ద్వీపంలో ఆయనను ఒంటరిగా ఖైదు చేసింది. ఈ జైలు ద్వీపంలో 18 సంవత్సరాల పాటు మండేలా గడిపారు. ఆ ఖైదులోనే మండేలా చనిపోవాలని జాత్యహంకార ప్రభుత్వం ఆకాంక్షించింది. “ఇది ద్వీపం. నువ్వు ఇక్కడే చస్తావు” అని గార్డులు తమతో అరుస్తూ చెప్పారని మండేలా తన పుస్తకంలో తెలిపారు.

అయితే మండేలా ఖైదుతో వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమం బలహీనపడకపోగా మరింత బలపడింది.

………………..ఇంకా ఉంది

వ్యాఖ్యానించండి