డబ్లూ.టి.ఓ రాతినేలపై ఇండియా నాగలి సాగు -కార్టూన్


Between a rock and a hard place...

ప్రపంచ వాణిజ్య సంస్ధ (World Trade Organization)! ప్రపంచ దేశాలను చుట్టుముట్టి మెడపై కత్తి పెట్టినట్లు ‘ఆమోదిస్తారా, చస్తారా’ అంటూ ఆమోదించబడిన తొంభైల నాటి డంకేల్ ముసాయిదా, గాట్ (General Agreement on Trade and Tariff) ఒప్పందంగానూ అనంతరం డబ్ల్యూ.టి.ఓ గానూ మన ముందు నిలిచింది. స్ధాపించింది మొదలు పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీల వాణిజ్య ప్రయోజనాలే లక్ష్యంగా సమస్త రంగాలను ‘సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ’ అనే చురకత్తులకు బలి చేస్తున్న సంస్ధ డబ్ల్యూ.టి.ఓ. ఇప్పుడిది భారత దేశ ప్రభుత్వం ఇష్టంగా ఆమోదించిన ‘ఆహార భద్రతా బిల్లు’ ను బలిగోరుతోంది.

ఉరుగ్వే రౌండ్ చర్చలను గత మిలీనియం అంతానికి పూర్తి చేసిన డబ్ల్యూ.టి.ఓ మూడో ప్రపంచ దేశాలన్నింటా మొదటి విడత ‘వ్యవస్ధాగత సర్దుబాటు కార్యక్రమాలను’ అమలు చేయించడంలో సఫలం అయింది. అనంతరం 2001లో ప్రారంభం అయిన ‘దోహా రౌండ్ చర్చలు’ వ్యవసాయ రంగ ఉత్పత్తుల వాణిజ్యాన్ని పశ్చిమ ధనిక దేశాలకు బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించడానికి నడుం బిగించాయి. తమ దేశాల్లోని వ్యవసాయ కంపెనీలకు భారీ మొత్తంలో వందల బిలియన్ల డాలర్లు సబ్సిడీలుగా సమర్పించుకునే అమెరికా, ఈ.యు దేశాలు ఇండియా లాంటి మూడో ప్రపంచ దేశాలను మాత్రం వ్యవసాయ, ఆహార సబ్సిడీలను రద్దు చేయాలని డిమాండ్ చేయడమే దోహా రౌండ్ చర్చల సారాంశం.

ఇండియా, ఇండోనేషియా, చైనా లాంటి 33 దేశాలు జి-33 గా ఏర్పడి పశ్చిమ దేశాల డిమాండ్లను ప్రతిఘటించాయి. ధనిక దేశాలయిన జి7 గ్రూపు దేశాలు వ్యవసాయ సబ్సిడీలు తగ్గించాలని జి33 డిమాండ్ చేసింది. అందుకు అవి నిరాకరించడంతో దోహా రౌండ్ చర్చలు 2008 నుండి స్తంభించిపోయాయి. ఈ చర్చలు గత వారం రోజులుగా ఇండోనేషియా రాజధాని బాలిలో పునః ప్రారంభమై కొనసాగుతున్నాయి. ఈ పదేళ్ళలో జి33 గ్రూపుతో మరో 13 దేశాలు వచ్చి చేరాయి. దానితో సభ్య దేశాల సంఖ్య 46కు చేరుకుంది. పేరు మాత్రం జి33 గానే కొనసాగుతోంది.

బాలిలో జరుగుతున్న చర్చలో నేటితో (నవంబర్ 6, శుక్రవారం) ముగియాల్సి ఉంది. కానీ అమెరికా ఒకవైపు, ఇండియా, ఇండోనేషియాలు ఒకవైపు తమ తమ వాదనలకు కట్టుబడి ఉండడంతో మరోసారి ఒప్పందం కుదరకుండానే సమావేశాలు ముగిసిపోయే పరిస్ధితి ఏర్పడింది. అమెరికా తదితర పశ్చిమ దేశాలు తయారు చేసిన ముసాయిదాను యధాతధంగా అంగీకరిస్తే మన పార్లమెంటు ఆమోదించిన ఆహార భద్రతా బిల్లు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం 80 కోట్లమందికి పైగా ఇవ్వ తలపెట్టిన ఆహార సబ్సిడీ రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు. కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా రైతులకు ప్రకటించే గిట్టుబాటు ధరలు చట్ట విరుద్ధం అవుతాయి. వీటన్నింటిని రద్దు చేసుకుని డబ్ల్యూ.టి.ఓ నిబంధనలకు అనుగుణంగా (పశ్చిమ బహుళజాతి కంపెనీలకు అనుగుణంగా అని చదువుకోవాలి) కొత్త చట్టాలను రూపొందించుకోవాల్సి ఉంటుంది.

జి33 డిమాండ్లను సంతృప్తి పరచడానికి పీస్ క్లాజ్ అంటూ ఒక సౌకర్యం ప్రవేశపెట్టామని ధనిక దేశాలు చెబుతున్నాయి. ఈ క్లాజ్ ప్రకారం మరో ‘రెండు డబ్ల్యూ.టి.ఓ మంత్రుల స్ధాయి సమావేశాల’ వరకు ఆహార సబ్సిడీలు (రేషన్ షాపుల నిర్వహణ లేదా ఆహార భద్రతా చట్టం), గిట్టుబాటు ధరలు కొనసాగించుకోవచ్చు. ఇది కూడా షరతులు లేకుండా కాదు. మంత్రుల స్ధాయి డబ్ల్యూ.టి.ఓ సమావేశాలు 2 యేళ్లకొకసారి జరుగుతాయి. అంటే మరో 4 సం.లు మాత్రమే ఆహార భద్రతా చట్టం, గిట్టుబాటు ధరలు మన రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఉండవు.

ఆహార భద్రతా చట్టం, గిట్టుబాటు ధరలు భారత దేశానికి అత్యవసరం అనీ, డబ్ల్యూ.టి.ఓ ముసాయిదాలో వీటికి చట్టబద్ధత ఇవ్వకుండా ఒప్పందానికి అంగీకరించేది లేదని చర్చల్లో పాల్గొంటున్న భారత వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ చెబుతున్నారు. కానీ అమెరికా అందుకు ఒప్పుకోవడం లేదు. అనధికార వార్తలను బట్టి భారత ప్రతినిధులు అమెరికాతో తెరవెనుక ఒప్పందాలకు సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే మన పాలకులు సొంత ప్రజలను వంచించినట్లే. అంతిమ ఒప్పందం కుదిరేవరకూ తీర్పు ఇవ్వడం తగదు. కానీ గత అనుభవాలను బట్టి చూస్తే ఏదో ఒక రూపంలో అమెరికా తదితర పశ్చిమ దేశాల ఒత్తిడులకు పాలకులు సాగిలపడడానికే అవకాశం ఉంది. సారం కొనసాగిస్తూ కాకపోతే పదాల రూపం మార్చే ఎత్తుగడలకు పాల్పడడానికి అన్నీ అవకాశాలూ ఉన్నాయి.

అలా కాకుండా భారత ప్రజల, రైతుల ఆహార, వ్యవసాయ ప్రయోజనాలు కాపాడడానికే డబ్ల్యూ.టి.ఓ వేదికపై మనవాళ్లు ప్రయత్నిస్తున్నట్లయితే అది రాతినేలపై సాగు చేయడంతో సమానమే. భారత రైతుల వ్యవసాయం ప్రధానంగా ఎద్దుల నాగలి దశలోనే కుంటుతోంది. ధనిక దేశాల్లో వ్యవసాయం ఎన్నడో పెట్టుబడిదారీ పద్ధతిలోకి ప్రవేశించడమే కాక ప్రమాదకరమైన బి.టి వంగడాలను పెద్ద ఎత్తున విస్తరిస్తున్నాయి. విత్తనాల దగ్గర్నుండి దిగుబడుల వరకూ, పురుగు మందుల నుండి ఎరువులు, అత్యాధునిక యంత్రపరికరాల వరకూ వారు ఆధిక్యతలో ఉన్నారు. భారీ ఉత్పత్తులు తీయగల శక్తి ఉండడం వలన తక్కువ ధరలకు వివిధ ఉత్పత్తులతో మార్కెట్లను ముంచెత్తగలరు.

కాబట్టి భారత వ్యవసాయ ఉత్పత్తులు పశ్చిమ బహుళజాతి కంపెనీల ఉత్పత్తులతో పోటీ పడలేవు. ఫలితంగా రైతులు పొలాలు అమ్ముకుని పెద్ద ఎత్తున నిరుద్యోగులుగా మారక తప్పదు. మరోవైపు ఆహార సబ్సిడీలు రద్దు చేయించడం లేదా తగ్గిస్తూ క్రమంగా రద్దు చేయడం ద్వారా తమ ఉత్పత్తులకు కూడా ధరలు పెంచుకునే వెసులుబాటును సాధిస్తారు. సబ్సిడీలు లేని మన ఉత్పత్తుల ధరలు పెరిగిపోతే భారీ సబ్సిడీలు పొందే పశ్చిమ దేశాల ఉత్పత్తుల ధరలు సరసమైన స్ధాయిలో లబిస్తాయి. తద్వారా దేశీయ వ్యవసాయ ఉత్పత్తి రంగాన్ని గిరాటేసి దేశాన్ని పశ్చిమ దేశాల ఉత్పత్తులు ఆక్రమిస్తాయి. స్వాతంత్రోద్యమంలోనే మనం విదేశీవస్తువులను బహిష్కరించాం. స్వతంత్రం వచ్చిందని చెప్పాక వాటికి మళ్ళీ ఆహ్వానం పలకడం ఏమిటి? ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఇది.

డబ్ల్యూ.టి.ఓ అనేది ఒక రాతినేల. అక్కడ భారత రైతుల, ప్రజల అవసరాలకు తావు లేదు. కేవలం బహుళజాతి వ్యవసాయ కంపెనీలకే అక్కడ పెద్ద పీట. అలాంటి రాతినేలలో మన వ్యవసాయ నాగలి ముందుకు సాగదని ఈ కార్టూన్ సూచిస్తోంది.

వ్యాఖ్యానించండి