రాహుల్, మోడీ: పంచింగ్ బ్యాగ్స్ -కార్టూన్


ఎన్నికల ప్రచారం మామూలుగా ఎలా ఉండాలి? పోటీ చేసే అభ్యర్ధులు తమ తమ నియోజకవర్గాలను ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలి. నియోజక వర్గం సమస్యల పరిష్కారం దేశ భవిష్యత్తుతో ఎలా ముడి పడి ఉన్నాయో చెప్పగలగాలి. తమ తమ పార్టీల విధానాలను చెబుతూ అవి దేశాభివృద్ధికీ, నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారానికీ ఎలా దోహదపడతాయో చెప్పాలి.

కానీ జరుగుతున్నది అందుకు పూర్తిగా విరుద్ధం. ప్రత్యర్ధి పార్టీల నాయకులపైన ఎంత గొప్పగా విమర్శలు చేస్తే అంత గొప్ప ప్రచారంగా పార్టీల నేతలే భావిస్తున్నారు. తమ ఉపన్యాసాల నిండా ఎదుటి పార్టీ ఎంత చెడ్డదో, ఎంత పనికిమాలినదో వివరించే వర్ణనలను నింపడమే తప్ప తాము ఏమి చేయదలుచుకున్నారో చెప్పడం మానేశారు. బహుశా చేసేదేమీ లేదు గనకనే అవతలివాళ్లని తిట్టడంలోనే ప్రచారాన్ని నెట్టుకొస్తున్నారేమో మరి!

వ్యక్తిగత దూషణలు ప్రచారంలో ప్రధాన పాత్ర పోషించడం నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కనిపిస్తున్న ధోరణి. దూషణల పర్వంలో మోడి ఒక అడుగు ముందే ఉంటున్నట్లు కనిపిస్తోంది. ఇటలీ సోనియా అనీ, సరిహద్దుల్లో చొరబాట్లని ఇంకా ఇలాంటివి ఏవేవో చెబుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించడమే గానీ అవినీతి కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా తామేమి చేయబోతున్నారో మోడి ఇంతవరకు చెప్పలేదు. ఇన్ని లక్షల కోట్లు విదేశాల్లో మూలుగుతోందని విమర్శించడం బాగానే ఉన్నా, దాన్ని వెనక్కి తేవడానికి తమ వద్ద ఉన్న పధకం ఏమిటో బి.జె.పి చెప్పడం లేదు.

రాహుల్ గాంధీ ప్రసంగాలూ దాదాపు అంతే. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు తాతల గొప్పతనమే రాహుల్, కాంగ్రెస్ లకు మిగిలిన అస్త్రంలా కనిపిస్తోంది. మోడిపై ప్రతిదాడికి దిగడం, మోడి వల్లించే తప్పుడు చరిత్రాంశాలను ఎత్తి చూపుతూ హేళన చేయడం తప్ప ‘ప్రజలకు ఇది చేస్తాం’ అనే ధోరణే కరువయింది.

ఇదొక విషయం అయితే బి.జె.పి ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడీకి భారత దేశ చరిత్ర అలా ఉంచి బి.జె.పికి పునాదులు వేసిన నాయకుల విషయంలోనే అవగాహన లేకపోవడమే అర్ధం కాకుండా ఉంది. ఉదాహరణకి మోడి దృష్టిలో ప్రాచీన తక్షశిల విశ్వవిద్యాలయం బీహార్ లో ఉన్నట్లు చెప్పి హేళనకు గురయ్యారు. తక్షశిల విద్యాలయం ఇప్పటి పాకిస్తాన్ లో ఉన్నట్లు చెప్పడానికి మోడీకి నామోషియేమో తెలియదు. నామోషి అయితే అసలు దాని గురించి చెప్పమన్నది ఎవరు?

మరో ఉదాహరణ బి.జె.పి పూర్వ సంస్ధ జన్ సంఘ్ వ్యవస్ధాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గురించినది. ఆదివారం ఆయన ఒక ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గొప్ప గుజరాతీ పుత్రుడుగా అభివర్ణించారు. భారత విప్లవకారులకు ముఖర్జీ గురువు అనీ, ఆంగ్లేయుల గడ్డపైనే (లండన్) ‘ఇండియా హౌస్’ అని తిరుగుబాటు సంస్ధ స్ధాపించిన వీరుడాయన అనీ మోడి అభివర్ణించారు. పైగా ఆయన 1930లోనే చనిపోయారని కూడా చెప్పేశారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1930లోనే చనిపోతే ఆయన ఇక నెహ్రూ కేబినెట్ నుండి బైటికి వచ్చి 1951లో జన సంఘ్ పార్టీని స్ధాపించడం ఎలా సాధ్యమయింది? కలకత్తా వాసి అయిన ముఖర్జీ గుజరాతీ ఎప్పుడయ్యారు?

విషయం ఏమిటంటే శ్యామజి కృష్ణ వర్మ గురించి మోడి చెప్పదలుచుకున్నారు. ఇండియా హౌస్ వ్యవస్ధాపకులయిన శ్యామజి కృష్ణ వర్మ వీర సావర్కార్ లాంటివారికి గురువు. ఆయన పేరుకూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పేరుకు అయోమయానికి గురయ్యే అవకాశం కూడా లేదు. వారి పేర్లలోని మొదటి రెండు అక్షరాలే ఒకటి తప్ప మిగిలిన భాగం అంతా పూర్తిగా వేరు. పైగా ముఖర్జీ బి.జె.పి గొప్పగా కొలుచుకునే నాయకులు. ఇటీవలే ఆయన వర్ధంతిని కూడా బి.జె.పి జరిపింది. అలాంటి నాయకుడినే మర్చిపోగలిగిన మోడి ఇక దేశానికి చేసే సేవ ఏమిటో ఎవరికి వారు అర్ధం చేసుకోవాల్సిందే.

అయినా, గుజరాత్ పిల్లల్లో పోషకాహార లోపానికి కారణం అడిగితే ‘అందంగా కనపడాలన్న దుగ్ధతో పాలు తాగడం మానేయడమే కారణం’ అని చెప్పిన మోడీ గారు తక్షశిల, ముఖర్జీల విషయంలో ఆ మాత్రం విజ్ఞానం ప్రదర్శించడంలో ఆశ్చర్యం లేదు కాబోలు!

బి.జె.పి వేదిక పైన రాహుల్ గాంధీ పంచింగ్ బ్యాగ్ అయితే కాంగ్రెస్ వేదిక పైన మోడి పంచింగ్ బ్యాగ్ గా ఉన్నారని ఈ కార్టూన్ సూచిస్తోంది. ఈ రెండు పార్టీలు ఒకరినొకరు పెట్టుకుంటున్న శాపనార్ధాల్లో తనకు ఒరిగేది ఏమిటో తెలియక ఓటరు తలపట్టుకుని కూర్చున్న దృశ్యం నేటి రాజకీయ పార్టీల ప్రజా సేవ ఏపాటిదో స్పష్టం చేస్తోంది.

 Voter's confusion

వ్యాఖ్యానించండి