లండన్ లో బ్యాంక్సీ స్ట్రీట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ (2008) -పునర్ముద్రణ


ప్రఖ్యాత లండన్ వీధి చిత్రకారుడు బ్యాంక్సీ , 2008 లో స్ట్రీట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. వాటర్ లూ స్టేషన్ అండర్ గ్రౌండ్ లో వినియోగంలో లేని టన్నెల్ లో ఈ ఎగ్జిబిషన్ ని నిర్వహించారు. బ్రిటన్, ఫ్రాన్సు, బెల్జియం లను కలిపే ‘యూరో స్టార్’ హై స్పీడ్ రైల్వే కంపెనీ ఈ టనెల్ ని వాడి వదిలేయగా, ఆ తర్వాత టాక్సీ డ్రైవర్లు ఉపయోగించారు. ఎగ్జిబిషన్ కి ‘కేన్స్ ఫెస్టివల్’ అని పేరు పెట్టారు. కేన్ అంటే పెయింటింగ్ డబ్బా అని. అత్యంత ఖరీదైన పద్ధతిలో హాలీవుడ్ సినిమాల కోసం తారల పటాటోపాలతో నిర్వహించే ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ కి ఇది నకలు. ఇటు ఆస్ట్రేలియా నుండి అటు కెనడా వరకూ 39 మంది ఆర్టిస్టులను బ్యాంక్సీ ఆహ్వానించాడు.

టన్నెల్ గోడలపైన వీధి చిత్రాలు గీయడంతో పాటు వృధా పరికరాలతో తయారు చేసిన అనేక కళాకృతులను కూడా ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. పాత కార్లు, వాడి పారేసిన గృహోపకరణాలు, సి.సిటి.వి కెమెరాలు అమర్చిన చెట్లు, ఐస్ క్రీం వేన్, బ్రిటిష్ రాణి కటౌట్, వివిధ చిన్న పెద్ద శిల్పాలు… ఇలా ఏది దొరికితే దానితో కళాకృతులు తయారు చేశారు. తరచుగా ‘అర్బన్ ఆర్ట్’ గా పిలిచే ఈ వీధిచిత్రకళ ద్వారా కళకు పనికిరానిదంటూ ఏదీ లేదని అర్ధం అవుతుంది. ‘కాదేదీ కవిత కనర్హం’ అని శ్రీశ్రీ తేల్చి చెబితే, ‘కాదేదీ కళకు అనర్హం’ అని బ్యాంక్సీ చెప్పాడని భావించవచ్చేమో.

బ్యాంక్సీ వీధి చిత్రాలని ‘వేండలిజం’ గా బ్రిటన్ అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తాయి. వేండలిస్టుల కోసం పోలీసుల్ని పురమాయించడం అధికార వర్గాలకి అలవాటే. బ్యాంక్సీ అందుకే ఆధిపత్య వర్గాలకి అందకుండా తిరుగుతూ కూడా కోట్లాది మంది స్వేచ్ఛాప్రియుల గుండెల్లో స్ధానం సంపాదించాడు. వీధి చిత్రాలు ఎప్పుడూ వీధుల అందాల్ని చెడగొడతాయనడాన్ని బ్యాంక్సీ తిరస్కరిస్తాడు. వాస్తవానికి వీధులకి అనేక రెట్లు అంచాన్నిచ్చేవి వీధి చిత్రాలేనన్నది ఆయన అభిప్రాయం. ఆయన మాటల్లోనే చెప్పాలంటే:

“Graffiti doesn’t always spoil buildings, in fact it’s the only way to improve a lot of them. In the space of a few hours with a couple of hundred cans of paint I’m hoping we can transform a dark forgotten filth pit into an oasis of beautiful art.”

పనికిరాదని వదిలేసిన రోడ్డు సొరంగానికి వీధి చిత్రాల ద్వారా మూడు రోజుల పాటు జీవ కళను నింపి వేలాది కళాప్రియులకు ‘వీక్షణా స్వర్గం’ మలచడాన్ని బట్టి బ్యాంక్సి మాటలు వాస్తవం అని అర్ధం అవుతుంది.

పాత ప్రచురణ తేదీ: 23/06/2012

వ్యాఖ్యానించండి