44 మందిని మసి చేసిన దారుణ బస్సు ప్రమాదం


బుధవారం తెల్లవారు ఝామున ఘోరమైన రోడ్డు ప్రమాదం సభవించింది. బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు ఒకటి డివైడర్ ని ఢీకొట్టి ఉన్నపళంగా అగ్నికి ఆహుతయింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణీకులు ఏం జరిగిందో తెలుసుకుని తప్పించుకునే లోపు బస్సు నిండా దట్టమైన పొగలు అల్లుకుపోవడంతో ఎటు పోవాలో తెలియక మంటల్లో మాడి మసై పోయారు. రిజర్వేషన్ బుకింగ్ జాబితా తప్ప ప్రయాణీకులను గుర్తించడానికి మరే మార్గమూ లేకుండా పోయింది. డ్రైవర్, క్లీనర్ తో సహా ఐదుగురు మాత్రమే తప్పించుకోగలిగారని పత్రికలు, ఛానెళ్లు చెబుతున్నాయి.

హైదారాబాద్ కి 130 కి.మీ దూరంలో మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్త కోట గ్రామం వద్ద ఉదయం గం 5.20 ని లకు  ప్రమాదం సంభవించింది. డ్రైవర్, క్లీనర్ చెప్పిన వివరాల ప్రకారం ముందు టైర్ పేలిపోవడంతో బస్సు డివైడర్ ని ఢీకొట్టింది. దానితో మంటలు చెలరేగాయి. అయితే ప్రయాణీకులు ఒకరిద్దరు చెప్పిన వివరాల ప్రకారం ఒక కారును దాటి పోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో బస్సు అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగింది.

ది హిందూ పత్రిక ప్రకారం బస్సు కారును దాటిపోతూ ఒక కల్వర్టును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఆ ఢీకొట్టడంలో ఇంధన ట్యాంకు నేరుగా కల్వర్టును ఢీ కొట్టింది. ఫలితంగా ట్యాంకు బద్దలై ఇంధనం బైటికి వచ్చి రాజుకున్న మంటలను పెద్దవి చేసింది. ఘటనా స్ధలానికి వెళ్ళి పరిశోధించిన పోలీసులు తమ ప్రాధమిక విచారణలో ఈ సంగతి తేలినట్లు చెప్పారు.

మంటలు క్షణాల్లోనే బస్సు నిండా అలుముకోవడం, దట్టమైన పొగలు వ్యాపించడం, తప్పించుకోడానికి ప్రయత్నించే లోపు ఆక్సిజన్ కరువై ఊపిరి ఆడకపోవడం, తలుపులు మూసేసి ఉండడం… ఇవన్నీ ఒకదారికి ఒకటి తోడై 44 మంది ప్రాణాలను బలిగొన్నాయి. డ్రైవర్, క్లీనర్ మాత్రం దూకి తప్పించుకున్నారు. వారు కాకుండా ఐదుగురు ప్రయాణీకులు మాత్రమే అతి కష్టం మీద బైటికి రాగలిగారు. ఒక వ్యక్తి అయితే ఎలాగో బైటికి రాగలిగినప్పటికీ అప్పటికే మంటలు చుట్టుముట్టడంతో అవిసిపోయి తలుపు దగ్గరే చనిపోయారు.

ప్రయాణీకులంతా బస్సు వెనక భాగంలో ఉన్నారని ది హిందు తెలిపింది. అనగా మంటలు ముందు నుండి వెనక్కు వ్యాపించి ఉండాలి. అయితే బైటికి రావడానికి మార్గం ఏర్పరుచుకోవడంలో సఫలం అయ్యే లోపు లోపల ఉన్న ఆక్సిజన్ మంటలకు ఖర్చయిపోయింది. ఏ.సి బస్సు కావడంతో పొగలు బైటికి వెళ్లడానికీ, బైటి గాలిలోని ఆక్సిజాన్ లోపలికి రావడానికీ మార్గం లేకుండా పోయింది. దానితో లోపల ఉన్నవారికి ఊపిరి ఆడలేదు. అక్కడే చిక్కుకుపోయి దారుణమైన పరిస్ధితిలో సజీవంగా దహనం అయిపోయారు.

బెంగుళూరుకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ ఐనా ‘జబ్బార్ ట్రావెల్స్’ కి ఈ బస్సుకి యజమాని అని తెలుస్తోంది. అయితే రిజిస్ట్రేషన్ మాత్రం రాష్ట్ర మాజీ మంత్రి జె.సి.దివాకర రెడ్డి తమ్ముడు జె.సి.ప్రభాకర రెడ్డి పేరున ఉన్నట్లు ఏ.బి.ఎన్ చానెల్ తెలిపింది. దివాకర్ ట్రావెల్స్ పేరుతో రిజిస్టర్ అయిందని ఒక చానెల్, జె.సి.ఉమారెడ్డి పేరుతో రిజిస్టర్ అయిందని మరో ఛానెల్ చెబుతోంది. తాము తమ బస్సును జబ్బార్ ట్రావెల్స్ కి అమ్మేశామని జె.సి.ప్రభాకర రెడ్డి చెప్పినట్లుగా ఏ.బి.ఎన్ తెలిపింది.

బెంగుళూరులో 33 మంది రిజర్వ్ చేసుకున్నారు. వీరిలో వివిధ రాష్ట్రాల వారు ఉన్నారు. వారి పేర్లు మాత్రమే తెలిసాయి తప్ప విగత దేహాల్లో ఎవరినీ ఫలానా అని గుర్తు పట్టే పరిస్ధితి లేదు. మిగిలిన ప్రయాణీకులు మార్గ మధ్యంలో ఎక్కినవారు. కాబట్టి వారు ఎవరయిందీ పేర్లు కూడా తెలిసే పరిస్ధితి లేదని ది హిందూ తెలిపింది.

రాష్ట్ర సమాచార శాఖా మంత్రి డి.కె.అరుణ దుర్ఘటన స్ధాలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. ఆమె కూడా మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవారే. కలెక్టర్, జిల్లా ఎస్.పి, టి.డి.పి నేత నారా లోకేష్, ఇంకా అనేకమంది నాయకులు దుర్ఘటనా స్ధాలాన్ని సందర్శించారు. ట్రావెల్స్ యజమాని ముస్లిం కావడంతో బి.జె.పి కార్యకర్తలు సందడి చేస్తున్నట్లు ఛానెళ్ల వార్తల ద్వారా తెలుస్తోంది. డ్రైవర్, క్లీనర్ కూడా ముస్లింలే. ఇలాంటి దారుణ పరిస్ధితిని మతం ఆధారంగా సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తే అంతకంటే అమానవీయత మరొకటి ఉండబోదు.

ఎంతో భద్రం, సౌలభ్యం, సౌకర్యవంతం అనుకున్న వోల్వో బస్సు ప్రమాదానికి గురికావడంతో వోల్వో కంపెనీ ప్రతినిధులు కూడా రంగంలోకి దిగారు. ప్రమాదాన్ని పూర్తి స్ధాయిలో విచారిస్తున్నామని వారు తెలిపారు. వోల్వో ఇండియా మార్కెటింగ్ చీఫ్ సోహాన్ జీత్ ప్రకారం ప్రమాదానికి గురయిన బస్సు బహుళ ఇరుసులు కలిగిన బస్సు. 50 మంది ప్రయాణించడానికి సరిపోతుంది. రోడ్డు డిజైన్, బస్సు డిజైన్, నిర్మాణం తదితర అన్నీ అంశాలను తమ బృందం పరిశీలిస్తోందని ఒకటి, రెండు వారాల్లో ఏ విషయము చెబుతుయామని ఆయన చెప్పారు.

తమ ట్రావెల్ ఏజన్సీ ఆఫీసు నుండి మంగళవారం రాత్రి గం. 10:30 ని.లకు బయలుదేరిందని, నగరంలోని వివిధ చోట్ల ప్రయాణీకూలను ఎక్కించుకుని బయలుదేరిన బస్సు తెల్లవారు ఝాము గం. 5:20 ని.లకు ప్రమాదానికి గురయిందని జబ్బార్ ట్రావెల్స్ ప్రతినిధి తెలిపారు. తమ బస్సుకు అన్నీ అనుమతి పత్రాలు ఉన్నాయని సదరు ప్రతినిధి తెలిపారు. కానీ ఛానెళ్లు అందుకు విరుద్ధమైన సమాచారం ఇస్తున్నాయి.

ప్రైవేటు ట్రావెల్స్ కి చెందిన బస్సు కావడం వలన ప్రభుత్వం నుండి నష్టపరిహారం వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఈ విషయం ఆలోచిస్తామని కర్ణాటక రవాణా మంత్రి రామ లింగారెడ్డి చెప్పారు.

5 thoughts on “44 మందిని మసి చేసిన దారుణ బస్సు ప్రమాదం

  1. The body of Volvo bus is made with iron and aluminium but the seats are made with the material that can easily catch fire. The luggage cabin of the bus is close to diesel tank. More fire would evolve if some one carries crackers, gas cylinder or other inflamable good with his/her luggage.

  2. చచ్చినోనికి నష్టపరిహారం వస్తది, నాకు కోటి రూపాయిల బస్సు పోయింది అంటున్న జేసి బ్రదర్. నిన్న జరిగిన బస్సు దుర్ఘటనలో నలబై అయిదు మంది చనిపోయిన విషయం రాతిగుండెను సైతం కరిగించింది. కానీ ఆ బస్సు యజమాని… http://fb.me/6pkQT8naq

  3. లంచాల కంచాల ముందు బాశంపట్టుతో పాశం విలువలు తెలియని కూర్చున్న రవాణశాఖ సిబ్బంది, బిరియాని మందులను పీకలదాక కుక్కుకుని నడిపే వాహన చోదకులు, క్రిక్కిరిసిన పండగ ప్రయాణికుల అగచాట్లు మాటు విస్ఫోటనలకు తావునిస్తే కావు కావుమనే కాకులకు పిండాల పండగ తప్పదు. రక్తమరకలోడే రహదారులకు వక్రమార్గాలలో అక్రమ వేగాలను అడ్డుకట్ట వేయకపోతే కట్టకట్టిన మృత జీవాలకు ఖర్మనుకుని వదిలేసే పరిస్థితి దాపురిస్తుంది.

వ్యాఖ్యానించండి