ఆంధ్ర ప్రదేశ్ లో, బహుశా కోస్తా ప్రాంతంలో, ఒక ముతక సామెత ఉంది. ఒక నిమ్న కులం యొక్క ఆర్ధిక వెనుకబాటుతనాన్ని, సామాజిక అణచివేతను పట్టిచ్చే సామెత అది. మరో విధంగా ఆ కులాన్ని న్యూనతపరిచే సామెత కూడాను. గురువారం ఎగిరెగిరి పడిన భారత స్టాక్ మార్కెట్లను గమనిస్తే ఈ సామెత గుర్తుకు రాక మానదు.
అమెరికా ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షిస్తూ ఆ దేశ సెంట్రల్ బ్యాంకు ‘ఫెడరల్ రిజర్వ్’ ఛైర్మన్ అయిన బెన్ బెర్నాంక్, తమ వడ్డీ రేటును ఎప్పటిలాగానే 0.25 శాతం కొనసాగించాలని నిర్ణయించినట్లు ప్రకటించాడు. మరీ ముఖ్యంగా ప్రతి నెలా ఇస్తున్న 85 బిలియన్ డాలర్ల ద్రవ్య ఉద్దీపనను అందరూ ఊహించినట్లుగా తగ్గించడమో, రద్దు చేయడమో కాకుండా యధావిధిగా కొనసాగించడానికే నిర్ణయించినట్లు కూడా చెప్పాడు.
దానితో భారత స్టాక్ సూచీ సెన్సెక్స్, ఒక్క రోజులోనే 600 పాయింట్లు ఎగబాకడమే కాక 20,000 పాయింట్లు కూడా దాటిపోయింది. అంతేనా! రూపాయి విలువ కూడా అమాంతం పెరిగిపోయి డాలర్ ఒక్కింటికి 61.80 రూపాయల వద్ద తేలింది. అంటే రూపాయి ఒక్క రోజులోనే 158 పైసలు పెరిగితే, సెన్సెక్స్ ఒక్క రోజులోనే 605 పాయింట్లు పెరిగి 20,567 పాయింట్ల వద్ద ముగిసింది.
నిజానికి అమెరికా మార్కెటే కాకుండా ప్రపంచ మార్కెట్లన్నీ కూడా ఫెడరల్ రిజర్వ్ నుండి ఇలాంటి ప్రకటన వస్తుందని ఊహించలేదు. వడ్డీ రేటు 0.25 శాతం వద్ద కొనసాగించినప్పటికీ నెలవారీ ఆర్ధిక ఉద్దీపనను రద్దు చేయకపోయినా కనీసం తగ్గిస్తారని ఊహించారు.
2008 నాటి ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం నుండి బైటపడడానికి అమెరికా ప్రభుత్వం అప్పటి నుండి వరుసగా ఆర్ధిక ఉద్దీపనలను అమలు చేస్తోంది. మూడు భారీ ఉద్దీపనలు అమలు చేసినా సంక్షోభం ఒక దారికి రాకపోవడంతో, గత సంవత్సరం అక్టోబర్ నుండి ప్రతి నెలా 85 బిలియన్ డాలర్ల మేర మార్కెట్ లోకి పంపింగ్ చేయడం ప్రారంభించారు.
డాలర్లు కానీ మరే కరెన్సీ అయినాగానీ ముద్రించాలంటే దానికి సమాన విలువ కలిగిన ఉత్పత్తి జరిగి ఉండాలి. ఒక ఉత్పత్తి (సరుకు)ని మరో ఉత్పత్తి(సరుకు)తో నేరుగా మార్చుకోడానికి బదులు వాటి ప్రతినిధులుగా మానవ సమాజం కనిపెట్టిన మారకం సాధనమే డబ్బు. కాబట్టి ఉత్పత్తి లేకుండా డబ్బు ముద్రిస్తే అది అప్పటికే ఉత్పత్తి అయి ఉన్న సరుకుల ధరలను పెంచుతుంది (అందువల్ల ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణానికి మరో రూపంగా చూస్తారు.) తప్ప అదనపు ఫలితం ఉండదు.
మరయితే ఫెడ్ ఇస్తున్న నెలసరి ఆర్ధిక ఉద్దీపన వల్ల వస్తున్న ప్రయోజనం ఏమిటి? నిజం చెప్పాలంటే ప్రజలకు వస్తున్న ప్రయోజనం వాస్తవంగా ఏమీ ఉండదు. ఉద్దీపనగా ఫెడ్ ఇస్తున్న మొత్తంలో 45 బిలియన్లు ట్రెజరీ బాండ్లు కొనుగోలు చేయడానికి, 40 బిలియన్లు తనఖా బాండ్లు కొనుగోలు చేయడానికి వినియోగించింది.
ప్రభుత్వ అవసరాల కోసం మార్కెట్ నుండి అప్పు సేకరించడానికి ట్రెజరీ జారీ చేసేవే ట్రెజరీ బాండ్లు లేదా సావరిన్ ఋణ బాండ్లు. వీటిని వాస్తవంగా ప్రభుత్వానికి అప్పు ఇవ్వడలిచింవారు కొనాలి. కానీ అలా కొనేవారు లేక ఫెడరల్ రిజర్వే కొనుగోలు చేస్తోంది. ఆ విధంగా అమెరికా ఋణ సేకరణ రేటు లేదా అప్పుపైన వడ్డీ పెరగకుండా కాపాడుకుంటోంది.
అలాగే ఇళ్ల తనఖా రుణాలు చెల్లింపులు పడిపోయి వాటిపైన ఆధారపడిన అనేక సంక్లిష్ట ద్రవ్య సాధనాలు దివాళా తీసే స్ధితికి చేరాయి. దివాళా పరిస్ధితి రాకుండా ఉండడానికి మళ్ళీ ఫెడరల్ రిజర్వే హౌసింగ్ ఋణ బాండ్లను కూడా కొనుగోలు చేస్తూ వచ్చింది. అంటే అమెరికా ఆర్ధిక వ్యవస్ధ దివాళా తీయకుండా కృత్రిమ చర్యలతో నిలబెడుతూ వస్తోంది. ఆ దేశ సెంట్రల్ బ్యాంక్.
ఇలా కృత్రిమంగా ఇస్తున్న ఉద్దీపన మద్దతును మెల్లగా ఉపసంహరిస్తామని, ఆ ఉపసంహరణ ఈ సంవత్సరమే ప్రారంభం అవుతుందని బెర్నాంక్ గత జూన్ నెలలో ప్రకటించాడు. ఆ ప్రకటనకు భారత మార్కెట్లు చిగురుటాకులా వణికిపోయింది. ఆ వణుకు ఇంకా పూర్తిగా తగ్గనే లేదు. అమెరికా ద్రవ్య విధానాన్ని సమీక్షించే ‘ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ’ సమావేశం బుధవారం ముగుస్తున్న నేపధ్యంలో ఉద్దీపన ఉపసంహరణ ప్రకటన వెలువడుతుందని ప్రపంచం మొత్తం ఎదురు చూసింది. తనఖా బాండ్ల కొనుగోలును కొనసాగించి, ట్రెజరీ బాండ్ల కొనుగోలును 45 బిలియన్ల నుండి 35 బిలియన్లకు తగ్గిస్తారని అంతా ఊహించారు.
కానీ ఆశ్చర్యకరంగా ఫెడరల్ రిజర్వ్ అలాంటిదేమీ చేయలేదు. మొత్తం 85 బిలియన్ల నెలవారీ ఉద్దీపన (QE-3) కొనసాగుతుందని, వడ్డీ రేటు కూడా 0.25 శాతం వద్ద కొనసాగుతుందనీ ప్రకటించారు. ఆ మేరకు కమిటీ 9-1 ఓట్ల తేడాతో నిర్ణయం తీసుకుందని బెర్నాంక్ ప్రకటించాడు. దానితో భారత మార్కెట్లకు పట్టపగ్గాలు లేవు. అమెరికా ఉద్దీపన దన్నుతోనే ఎఫ్.ఐ.ఐలు భారత షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నాయి. తమ డబ్బు అమెరికా సెక్యూరిటీలలో భద్రంగా దాచుకుని ఉద్దీపన డబ్బును ఇండియా లాంటి దేశాల్లో స్పెక్యులేటివ్ కార్యకలాపాలకు వినియోగిస్తున్నాయి. వీటినే విదేశీ పెట్టుబడులుగా మన పెద్దలు డబ్బా కొట్టుకుంటారు.
ఉద్దీపన ఉపసంహరిస్తే ఎఫ్.ఐ.ఐ లకు ఆ మేరకు ద్రవ్యం అందుబాటులో ఉండదు. కాబట్టి ఆ మేరకు ఇండియా లాంటి దేశాల నుండి పెట్టుబడులు ఉపసంహరించుకుంటాయి. అంటే ఇండియా లాంటి దేశాల విదేశీ ద్రవ్య ఖాతా తరిగిపోతుంది. అనగా కరెంటు ఖాతా లోటు పెరుగుతుంది. కరెంటు ఖాతా లోటుతో రూపాయి ‘మారకపు విలువ’ నేరుగా ముడిపడి ఉంటుంది. కాబట్టి లోటు పెరిగితే రూపాయి విలువ తగ్గిపోతుంది.
ఈ పరిస్ధితిని నివారిస్తున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన ద్రవ్య విధానం ద్వారా పరోక్షంగా తెలిపింది. అందుకే భారత షేర్ మార్కెట్లు ఎగిరెగిరి పడ్డాయి. రూపాయి విలువ కూడా అమాంతం పెరిగిపోయింది. కానీ ఇది మునుపటి స్ధాయికి చేరుకోలేకపోవడం గమనార్హం.
ఇంతకీ ఆర్ధిక ఉద్దీపనను బెర్నాంక్ ఎందుకు తగ్గించలేదు? ఫెడరల్ రిజర్వ్ మాటల్లో చెప్పాలంటే అమెరికా ఆర్ధిక వ్యవస్ధ కోలుకుందని నమ్మడానికి విశ్వసనీయమైన సూచనలు వారికి కనిపించలేదు. ఉద్యోగాలు పెరుగుతున్నాయని చెబుతున్నా అది ఉద్దీపన ఉపసంహరణకు అనువుగా లేదు. జి.డి.పి వృద్ధి పైన ఫెడ్ పెట్టుకున్న అంచనాకు ఈ సంవత్సరం రెండో అర్ధభాగపు జి.డి.పి చేరుతుందన్న నమ్మకం కలగలేదు. కాబట్టి మరింత నమ్మకమైన వృద్ధి కనపడేవరకూ ఉద్దీపన యధావిధిగా కొనసాగించాలని ఫెడ్ నిర్ణయించింది. అమెరికా చూపిస్తున్న వృద్ధి కృత్రిమమైందని సాక్ష్యాత్తూ ఫెడరల్ రిజర్వే ఈ విధంగా అంగీకరించిందన్నమాట!
ఇక్కడ గమనించాల్సింది ఏమీటంటే భారత షేర్లు, రూపాయి విలువ ప్రస్తుతానికి కోలుకున్నప్పటికీ, అమెరికా ఉద్దీపన పధకం ఉపసంహరణ రూపంలో ముప్పు ఇంకా పొంచే ఉంది. అందుకే ఉద్దీపన ఉపసంహరించే ముందు తమకు ఒక ముక్క చెప్పాలని మొన్న సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిన జి20 కూటమి సమావేశాల్లో అమెరికాను భారత పెద్దలు బతిమాలుకున్నారు. అందుకు వారు అంగీకరించారని కూడా ప్రధాని చెప్పారు. అది ఆయన దృష్టిలో ఒక గొప్పే మరి!
ఈ గొప్పలో భారత ప్రజలకు భాగస్వామ్యం లేదు. అందుకని సామెతను తిరగరాయాలి. ‘అమెరికా మబ్బులు, భారత పాలకుల ఉబ్బులు’ అని.

@visekar gaaru
ఈ economics ని అర్ధం చేసుకోడం చాలా కష్టంగా ఉందండి, మీరు చెప్పిన విషయాల్లో చాలా టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి. థీమ్ – మన ప్రబుత్వం us pressures కి లోన్గిపోతుంది అని అర్దమైంది. మీరు ఇలాంటి విషయాలు ఇంకా సులభ బాష లో చెప్తే ఇంకా ఎక్కువ మంది అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తారు. నేను రాజీవ్ దిక్షిత్ imf , వరల్డ్ బ్యాంకు , అమెరికా capitalism ,globalization మీద చెప్పిన కొన్ని లెక్చర్స్ విన్నాను అవి బేసిక్ ఎడ్యుకేషన్ లేని వారు కుడా అర్ధం చేసుకునీ విధంగా ఉన్నాయి , మీరు కూడా అలాగే ఇంకా సులబతరంగా వివరిస్తారని ఆశిస్తున్నాను, రాజీవ్ దిక్షిత్ చెప్పినవి హిందీ లో వుండడం వలన కాస్త కష్ట తరంగా అనిపించింది.
అలాగే economics బాగా అర్ధం చేసుకునే దానికి , ఈ imf, capitalism , world bank etc ల ముసుగులు తెలుసుకునే దానికి బాగా ఉపయోగ పడే బుక్స్ ఏమైనా ఉంటే చెప్పండి
అసలు ఇండియా coca cola, head & shoulders, HUL etc లాంటి 1000 కొద్ది ఉన్న MNC లని వాటి స్థాయిలో govt వి / ప్రజల చే నడపబడేవి / కనీసం డొమెస్టిక్ వ్యాపారులు పెడితే వాటి వాల్ల వచ్చే లాబం కూడా govt కే అంటే ప్రజలకే చేరుతుంది కదా, ఎంప్లాయిమెంట్ కూడా పెరుగుద్ది , కాని అలా ఎందుకు చెయ్యట్లేదు ?