చైనాలో వర్షం కురిస్తే ఇక్కడ గొడుగు పడతారని భారత కమ్యూనిస్టుల గురించి ఒక సామెత లాంటి జోక్ ప్రచారంలో ఉండేది. చైనాలో సోషలిజానికి చరమగీతం పాడిన తర్వాత ఆ సామెత (లాంటి జోక్) ఇప్పుడు పెద్దగా ప్రచారంలో లేకుండా పోయింది. ఐతే 1992 నుండి అమలవుతున్న నూతన ఆర్ధిక విధానాల పుణ్యాన ఈ సామెతను మార్చి చెప్పుకోవాల్సిన అగత్యం ఎప్పుడో వచ్చింది. ‘అమెరికాలో మంచు కురిస్తే భారత ప్రజలు వణికిపోవాలి’ అని.
అయితే చైనాలో వర్షం కురిస్తే గొడుగు పట్టింది (ఒకవేళ పట్టారే అనుకుంటే) కమ్యూనిస్టులు మాత్రమే. అది కూడా సాధారణ శ్రామిక ప్రజలకు మేలు చేకూర్చే కమ్యూనిస్టు సిద్ధాంతం పై గౌరవంతో మాత్రమే. ఇందులో శ్రమ పట్ల గౌరవం, ప్రజల బాగోగుల పట్ల నిబద్ధత, ప్రజల భవిష్యత్తును గురించిన సుందరమైన కలలు కనిపిస్తాయి. కానీ అమెరికా, తదితర పశ్చిమ దేశాల్లో కాసింత ఆర్ధిక జలుబు చేసినా భారత ప్రజలంతా ఏకధాటిగా సంవత్సరాల తరబడి తుమ్మాల్సిన పరిస్ధితి. ఆ తుమ్ముడులో హరీమంటున్న ప్రాణాలు, దిగజారుతున్న జీవన ప్రమాణాలు, మూసివేయబడుతున్న కంపెనీలు, తరలిపోతున్న దేశ వనరులు… ఎన్నో!
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు అధిపతి బెన్ బెర్నాంక్ గురువారం ఒక చిన్న ప్రకటన చేశాడు. ఫెడరల్ రిజర్వ్ అమలు చేస్తున్న భారీ స్టిములస్ ప్రోగ్రామ్ ని ఈ సంవత్సరంతో ముగిస్తారన్నది ఆయన ప్రకటన సారాంశం. ఈ ఒక్క ప్రకటనతో ప్రపంచ ద్రవ్య మార్కెట్లలో (financial markets) ఒక పెద్ద సునామీయే విరుచుకుపడింది. భారత దేశంతో పాటు అనేక దేశాల్లో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోగా, వివిధ సరుకులు (కమోడిటీస్) ధరలు, కరెన్సీల రేట్లు భారీగా పతనం అయ్యాయి. మన రూపాయి ధరే చరిత్రలో ఎన్నడూ లేనంతగా 127 పైసలు పడిపోయింది. నిన్న (20/06/2013) ట్రేడింగ్ ముగిసేనాటికి రూపాయి విలువ: డాలర్ కి రు 59.58 పై.లు. గత నెలనుండి పతన దిశలో ఉన్న రూపాయి బెర్నాంక్ ప్రకటన ధాటికి మరింతగా బలహీనపడింది.
స్టాక్ మార్కెట్ల సంగతి చెప్పనే అవసరం లేదు. బోంబే స్టాక్ ఎక్చేంజీ సూచి బి.ఎస్.ఇ సెన్సెక్స్ ఏకంగా 526.41 పాయింట్లు (2.74 శాతం) పడిపోయింది. 2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం రోజుల్లో మాత్రమే ఈ స్ధాయిలో స్టాక్ సూచి పతనం అయింది. ఇటీవలే మళ్ళీ 20,000 పాయింట్ల మార్కును సెన్సెక్స్ దాటిందని ఉత్సాహపరులు సంబరపడ్డారు. ఆ తర్వాత రోజుల్లోనే పతనం అవుతూ వచ్చిన సెన్సెక్స్ నిన్నటి బెర్నాంక్ దెబ్బకి మునిగి 18719 పాయింట్ల దగ్గర తేలింది. నేషనల్ స్టాక్ ఎక్చేంజీ సూచీ ఎన్.ఎస్.ఇ నిఫ్టీ ది కూడా అదే పరిస్ధితి. 166 పాయింట్లు (2.86 శాతం) నష్టపోయి 5656 వద్ద ముగిసింది.
ఇంతా చేసి బెన్ బెర్నాంక్ తాము ఇస్తున్న స్టిములస్ ను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు గానీ, లేదా తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్లు గానీ ప్రకటించలేదు. క్యూ.ఇ-3 (Quantitative Easing 3) ని వచ్చే సంవత్సరం (2014) మధ్య నుండి క్రమంగా ‘మోడరేట్ చేస్తామని’ మాత్రమే ఆయన తెలిపారు. క్యూ.ఇ-3 కింద తాము ప్రతి నెలా సాగిస్తున్న 85 బిలియన్ డాలర్ల సావరిన్ బాండ్ల కొనుగోలు కొనసాగిస్తామని ఆయన స్పష్టంగా చెప్పారు కూడా. కానీ ఆస్తుల కొనుగోలు కార్యక్రమం (asset-purchase programme – రియల్ ఆస్తుల ధరలు పడిపోకుండా తానే కొనుగోలు చేయడం ద్వారా నిలిపి ఉంచడం) 2013 చివరికి క్రమంగా తగ్గిస్తామని, 2014 మధ్య కాలానికి ముగింపు పలుకుతామని ఆయన చెప్పారు. అది కూడా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి ‘ఇప్పటిలా కొనసాగితే’ అని ఆయన రైడర్ విధించారు. ఈ మాత్రానికే ఐరోపా, ఆసియా మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి.
ఇక్కడ గమనించవలసింది అమెరికా స్టిములస్ కార్యక్రమం పైన ప్రపంచం ఎంతగా ఆధారపడి ఉందా అని. ప్రస్తుతం అమెరికా స్టిములస్ లో ప్రధాన కార్యక్రమం ప్రతి నెలా 85 బిలియన్ డాలర్ల మేర సావరిన్ బాండ్లను కొనుగోలు చేయడం. సాధారణంగా అమెరికా ట్రెజరీ ఈ సార్వభౌమ ఋణ పత్రాలను (sovereign debt bonds) వేలం వేసి రుణాలు సేకరిస్తుంది. ఒకసారి వేలం వేశాక వాటిని కొనుగోలు చేసినవారు సెకండరీ మార్కెట్ లో వివిధ సందర్భాల్లో అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటారు. ఇలా సెకండరీ, ధర్డ్…. మార్కెట్లలో అధిక వడ్డీని డిమాండ్ చేసే పరిస్ధితి ఏర్పడితే తదుపరి జరిగే ఋణ పత్రాల వేలం ప్రమాదంలో పడుతుంది. అంటే అమెరికాకి మార్కెట్లో అప్పు పుట్టని పరిస్ధితి ఏర్పడుతుంది. ఆ పరిస్ధితి రాకుండా ఉండడానికి మార్కెట్లో అమ్మకానికి వచ్చే సార్వభౌమ ఋణ పత్రాలను ఫెడరల్ రిజర్వ్, నెలకి 85 బిలియన్ల మేరకు తానే కొనుగోలు చేస్తోంది. తద్వారా ఋణ పత్రాలకు కృత్రిమ డిమాండ్ ను సృష్టిస్తోంది.
ఈ ఋణ పత్రాల కొనుగోలును ఫెడరల్ రిజర్వ్ ఆపేస్తుందేమో అని ప్రపంచ వ్యాపితంగా విస్తరించి ఉన్న ద్రవ్య మార్కెట్లకు దడ పట్టుకుంది. దానికి కారణం ప్రపంచ మార్కెట్లలో ద్రవ్యత (లిక్విడిటీ) అందిస్తున్నది ప్రధానంగా ఇదే. లిక్విడిటీ అంటే స్ధూలంగా ద్రవ్య సరఫరా. ఆస్తులు, కమోడీటీల అమ్మకాలు, కొనుగోళ్లలో లిక్విడిటీ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఒక ఆస్తి యొక్క లిక్విడిటీ ఏ మేరకు ఉంటుంది అన్న విషయంపై (సదరు ఆస్తిని ఎంత త్వరగా సొమ్ము చేసుకోగలం అన్నది) ఆధారపడి వాటిపై మార్కెట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇది ఉండాలంటే మొదట మార్కెట్లో ద్రవ్య సరఫరా ఉండాలి. ఆర్ధిక సంక్షోభం వలన ద్రవ్య సరఫరా బిగదీసుకుని ‘క్రెడిట్ క్రంచ్’ పరిస్ధితులు ఇంకా కొనసాగుతున్నందునే ఫెడరల్ రిజర్వ్ అందజేస్తున్న లిక్విడిటీ పైన ప్రపంచ మార్కెట్లు ఆధారపడి ఉన్నాయి. డాలర్ ఇంకా ప్రధాన అంతర్జాతీయ కరెన్సీగా చలామణీలో ఉండడం కూడా దీనికి కారణంగా ఉన్నది.
బెర్నాంక్ ప్రకటన తర్వాత అసహనంగా మారిన వారిలో ఎఫ్.ఐ.ఐ (Foreign Inistitutional Investments) లు కూడా ఉన్నాయి. వీటిని ఆకర్షించడానికి భారత ప్రభుత్వం తెగ తంటాలు పడుతోంది. భారత సార్వభౌమ ఋణ పత్రాలను కూడా వీరు కొనుగోలు చేయగలిగే విధంగా ఇటీవలే ఆర్ధిక మంత్రి చిదంబరం నిబంధనలను సడలించారు. సరళీకరణ విధాన చర్యల్లో ఇదొకటి. సార్వభౌమ ఋణ పత్రాల్లో ఎఫ్.ఐ.ఐ ల ప్రవేశంపై పరిమితులు విధించామని మంత్రి చెబుతున్నా, ఆ పరిమితులను ఎత్తివేయడం ఇప్పుడు చిటికెలో పని. (సార్వభౌమ ఋణ పత్రాలు అంటే ఏమిటో ఆ పేరే చెబుతోంది. ఇవి దేశ ఆర్ధిక సార్వభౌమత్వాన్ని పరుల పాలు కాకుండా నియంత్రించేవి. ఎఫ్.ఐ.ఐ అంటేనే హాట్ మనీ. అంటే చెప్పా పెట్టకుండా లాభాలు వచ్చేచోటికి వెళ్లిపోతుంది. వాటిపై ప్రభుత్వాలకు నియంత్రణ ఉండదు. అలాంటి వాటికి కూడా సార్వభౌమ ఋణ పత్రాలు అప్పజెప్పడం అంటే దేశ ఋణ పరిస్ధితిని, తద్వారా ఆర్ధిక వ్యవస్ధను చేజేతులా అస్ధిరం పాలు చేయడమే.) బెర్నాంక్ ప్రకటన వలన ఎఫ్.ఐ.ఐ లు పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్ల నుండి వెళ్లిపోయాయి. స్టాక్ మార్కెట్లు పడిపోవడానికి అది మూల కారణం. ఎఫ్.ఐ.ఐలను ఆకర్షించే పనిలో ఉన్న భారత ఆర్ధిక మంత్రికి బెర్నాంక్ ప్రకటన ఒక విధంగా ఆశనిపాతం.
ఎఫ్.ఐ.ఐలు ఎక్కడికి వెళ్ళాయి? ఈ ప్రశ్నకు సమాధానం: సురక్షితమైన చోటికి. తక్షణ, అధిక లాభాల కోసం నిరంతరం వేట కొనసాగించే ఎఫ్.ఐ.ఐలు, ఆర్ధిక ప్రమాద పరిస్ధితుల్లో తన విలువ పడిపోకుండా ఉండే తావుకు వెళ్తాయి. భారత స్టాక్ లను అమ్మేయడమే కాక, డాలర్ అంతర్జాతీయ కరెన్సీ కనుక ఎఫ్.ఐ.ఐలు రూపాయలు అమ్మేసి డాలర్లను కొనుగోలు చేశాయి. దానితో డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ అమాంతం పడిపోయింది. ఇదే విధంగా ఇతర స్ధానిక కరెన్సీలకు కూడా జరిగింది. కరెన్సీలతో పాటు బంగారం, వెండి తదితర విలువైన లోహాల ధరలు కూడా పడిపోయాయి.
(ఇటీవల కాలంలో బంగారం విలువ పడిపోవడం వెనుక ఫెడరల్ రిజర్వ్ చేసిన కుట్ర దాగి ఉంది. డాలర్ విలువను పెంచుకోడానికి, తద్వారా అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ విశ్వసనీయతను కాపాడుకోవడానికీ బెన్ బెర్నాంక్ బంగారం ధరను షార్ట్ చేస్తూ వచ్చారని అమెరికా మాజీ అధ్యక్షులు రీగన్ వద్ద అసిస్టెంట్ ట్రెజరీ సెక్రటరీగా పని చేసిన పాల్ క్రెగ్ రాబర్ట్ గత ఫిబ్రవరి నెలలో వెల్లడించిన సంగతి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు.)
ప్రపంచ మార్కెట్లలో లిక్విడిటీని తగ్గించే ఏ చిన్న చర్య అయినా ఎఫ్.ఐ.ఐల కదలికలను ప్రభావితం చేస్తుంది. అందులో భాగంగానే బెర్నాంక్ ప్రకటన భారత స్టాక్ మార్కెట్ల పైనా, రూపాయి విలువ పైనా, బంగారం ధరలపైనా ప్రభావం చూపింది. కరెంటు ఖాతా లోటు తగ్గించుకోడానికి అని చెప్పి ఎఫ్.ఐ.ఐ లకు మన విత్త మంత్రి ఎర్ర తివాచీ పరిచారు. డాలర్ ను బలపరుచుకునే కృషిలో ఉన్న బెర్నాంక్ చర్యల వలన ఈ ఎర్ర తివాచీ కాస్తా నలుపు రంగు సంతరించుకుంటోంది. కరెంటు ఖాతా లోటు పెరిగినా రూపాయి విలువకు ప్రమాదమే. ఇవన్నీ పరస్పరం సంబంధం కలిగిన పరిణామాలు. ఒకే చర్యకు వివిధ ముఖాల్లో వచ్చే ప్రతిస్పందనలు. అంతిమంగా భారత ఆర్ధిక వ్యవస్ధకు గాయాలు. ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ కుర్చీలో కూర్చొని ఉన్న బెన్ బెర్నాంక్ మాటలు ఈ విధంగా ముత్యాలు కాదు, బంగారం బిస్కెట్లుగా రాలిపడతాయన్నమాట! ఆ బిస్కెట్ల కింద పడి రూపాయి నోటు చితికి చీరిపోవడమే మనకు వస్తున్న అనుభవం!
మన దేశంలో అమలులో ఉన్న మిశ్రమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా దేశ ఆర్థికవ్యవస్థను మెరుగుపరచవచ్చునేమో!
మూల గారు, మన దేశంలో ఇప్పుడు మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధ లేదు. అదెప్పుడో కొడిగట్టుకుపోయింది. రాజీవ్ గాంధీ కాలం నుంచే దానిని బలహీనపరచడం మొదలయింది. పి.వి.నరసింహారావు నుంచి మార్కెట్ ఎకానమీ విధానం ఊపందుకుంది. అది కూడా స్వంత మార్కెట్ ఎకానమీ కాదు. పశ్చిమ దేశాలకు అనుబంధంగా ఉండే మార్కెట్ ఎకానమీ మాత్రమే.
బ్యాంకులు, ఇన్సూరెన్స్ లతో పాటు పేరు పొందిన పబ్లిక్ కంపెనీలని డిజ్-ఇన్వెస్ట్ మెంట్ ద్వారా అమ్మేయడం అందులో భాగమే. అమ్మేయడానికి వీలుగా పబ్లిక్ కంపెనీలను లోపలి నుండి కుళ్లబొడుస్తున్నారు. అస్ధిపంజరాలు మాత్రమే మిగిలి ఉన్నాయిప్పుడు.
విశేఖర్ గారు,ఆ అస్థిపంజరాలకు ఏవిదంగా జీవం పోయడంద్వారా తిరిగి మన ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి వీలవుతుందో వివరిస్తారా? అలా సాధ్యమా?కాదా?
మూల గారూ, మీకు సమాధానం మరిచాను.
ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టడానికి అవకాశాలు ఎప్పుడూ పుష్కలంగానే ఉంటాయి. కాకపోతే వాటిని అందిపుచ్చుకోడానికి పాలకులు సిద్ధంగా ఉన్నారా అన్నదే ప్రశ్న.
వెనిజులా కమ్యూనిస్టు దేశం కాదు. కనీసం వారు చెప్పుకునే సోషలిస్టు విధానాలు కూడా అక్కడ లేవు. కానీ అక్కడి ప్రజలకు సాపేక్షికంగా మెరుగైన విద్య, వైద్య, ఉద్యోగ అవకాసాలు అందుతున్నాయి. దానికి వాళ్లు బ్రహ్మాండాలేమీ చెయ్యలేదు. దేశ ఆయిల్ వనరులను వెలికి తీసే కంపెనీలలో కొద్ది భాగం మాత్రమే జాతీయం చేసి ప్రజలకు సౌకర్యాలు పెంచారు. అంటే ఉద్యోగావకాశాలు పెంచి, అనేక సరుకులను సబ్సిడీ రేట్లకు అందివ్వగలుగుతున్నారు.
మన దేశంలో పరిస్ధితి ఇందుకు భిన్నం. ఉన్న పబ్లిక్ కంపెనీలను తెగనమ్ముతున్నారు. నూతన ఆర్ధిక విధానాలను వెనక్కి తిప్పి మిశ్రమ ఆర్ధిక విధానాలను నిబద్ధతతో అమలు చేసినా (నెహ్రూ, ఇందిర లలాగా మోసంతో కాకుండా) మెరుగైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా భూసంస్కరణలు అమలు చేస్తే భారత దేశం సాధించగల అభివృద్ధి ఊహించలేము. అంత గొప్పగా ఉంటుంది. వాస్తవంలో రైతులు భూములు అమ్ముకుని కూలీలుగా మారే విధానాలు అమలవుతున్నాయి. కార్పొరేట్ కంపెనీలకు భూముల్ని ధారాదత్తం చేసేందుకే ఇలా జరుగుతోంది. భూములు లాక్కోవడానికి ప్రతిఘటన ఎదురవుతుండడంతో వారంతట వారే భూములు వదులుకునే విధంగా వ్యవసాయ విధానాలు అమలు చేస్తున్నారు.
నెహ్రూ, ఇందిర లలాగా మోసంతో కాకుండా మెరుగైన విధానాలు meeru vachi అమలు cheyandi
@rk
నేనే కాదు, అమలు చేయగలవారు చాలామందే ఉన్నారు, చేస్తామంటున్నవారు చేతకాదని పక్కకు తప్పుకుంటే.
మీ వ్యాఖ్యలు దారి తప్పుతున్నాయి. గమనించగలరు.
విశెఖర్ గారూ స్టీములస్ పొగ్రాం ను అమెరికా ఉపసమ్హరించుకుంటె విదేశీ ముదుపు దారులకు వచ్చిన నస్టం ఎమిటి? దీన్ని కొంచం వివరించమని కొరుచున్నాను.
@shanmuga
స్టిములస్ ఉపసంహరించుకోవడం అంటే ఒక అర్ధంలో ద్రవ్య సరఫరా కట్టడి చేయడం. అంటే డాలర్ల సరఫరా తగ్గి దాని విలువ పెరుగుతుంది. అప్పుడు కరెన్సీ మదుపుదారులకు భారత షేర్ మార్కెట్ల కంటే డాలర్ నిల్వలే లాభకరం అవుతాయి. ఇదొక అంశం. మరొక అంశం కొందరు విదేశీ మదుపుదారులు భారత స్టాక్ మార్కెట్ల నుండి ఉపసంహరించుకుని డాలర్ కరెన్సీలలోకి తమ పెట్టుబడుల్ని తరలిస్తే భారత స్టాక్ మార్కెట్లు పడిపోతాయి. అంటే ఇంకా నష్టకరంగా తయారవుతాయి. మరింత పడిపోతుందన్న భయంతో మదుపుదారులు సేఫ్ గా ఉండే చోటు కోసం వెతుకుతారు. తక్షణం డాలర్ మార్కెట్ వారి అవసరాలు తీరిస్తే అక్కడికి వెళ్తారు. దానికంటే లాభకరంగా అమెరికా స్టాక్ ఉంటే అక్కడికి వెళ్తారు.
అమెరికా స్టిములస్ ఉపసంహరణ, భారత స్టాక్ మార్కెట్లను బలహీనపరచడమే ఇక్కడి మదుపు చేసిన విదేశీయులకు నష్టం.
పింగ్‌బ్యాక్: అమెరికా మబ్బులు, ఇండియనోడి ఉబ్బులు | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ