ఈ ఫోటోలను ఫస్ట్ పోస్ట్ పత్రిక ప్రచురించింది. ఐ.ఏ.ఎస్ అధికారి, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అయిన దుర్గాశక్తి మసీదు కూల్చివేత సమయంలో అక్కడ లేరని లీక్ అయిన లోకల్ ఇంటలిజెన్స్ వర్గాల నివేదిక చెబుతోందని, వాస్తవానికి ఆమె అక్కడే ఉన్నారని ఈ ఫోటోల ద్వారా తెలుస్తోందని సదరు పత్రిక అట్టహాసంగా ప్రకటించింది. సంఘటన స్ధలంలో ఉన్న స్ధానికులు తమ సెల్ ఫోన్ ద్వారా ఈ ఫోటోలు తీశారనీ, వారి వద్ద నుండి తాము ఫోటోలు సంపాదించామని ఫస్ట్ పోస్ట్ తెలిపింది.
అయితే అడ్వకేట్ మనోహర్ లాల్ శర్మ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ప్రకారం చూస్తే దుర్గాశక్తి నాగపాల్ మసీదు కూల్చివేత సమయంలో ఆమె అక్కడ లేరని ఆమెను సమర్ధిస్తున్నవారు చెప్పడం లేదు. పైగా కూల్చివేత సమయంలో అక్కడే ఉన్నారనీ, సుప్రీం కోర్టు 2009లో ఇచ్చిన తీర్పును మాత్రమే ఆమె అమలు చేశారని మనోహర్ లాల్ శర్మ తన పిటిషన్ లో పేర్కొన్నారని ది హిందు తెలిపింది.
దుర్గాశక్తి నాగపాల్ సైతం సంఘటనా స్ధలంలో తాను లేనని వాదించినట్లుగా ఎవరూ చెప్పలేదు. మసీదు గోడ కూల్చివేతకు ఆమె ఆదేశాలు ఇచ్చినమాట నిజమేననీ, కానీ అది నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని దుర్గ మద్దతుదారులు మొదటి నుండి చెబుతున్నారు. ఐ.ఏ.ఎస్ అధికారుల సంఘం కూడా గోడ కూల్చివేతలో దుర్గాశక్తి నాగపాల్ పాత్ర లేదని చెప్పడం లేదు. ఆమె నిబంధనల ప్రకారమే తన విధులు నిర్వర్తించారనీ, పైగా ఆమె సస్పెన్షనే రూల్స్ కి విరుద్ధమని సంఘం వాదించింది.
అక్రమ ఇసుక తవ్వకాలను నివారించడంలో నిజాయితీతో వ్యవహరించినందుకే ఆమెను అక్రమంగా సస్పెండ్ చేశారని తమ వినతిపత్రంలో ఐ.ఏ.ఎస్ అధికారులు పేర్కొన్నారు. ఇసుక మాఫియాను ఒంటి చేతితో ఎదుర్కొన్నందుకు గాను ఆమెకు అలహాబాద్ హై కోర్టు ప్రశంసల జల్లు కురిపించిందని ఫస్ట్ పోస్ట్ ద్వారా తెలుస్తోంది. రాజకీయ ఒత్తిడులకు వెరవకుండా పెద్ద సంఖ్యలో డంపర్లను సీజ్ చేసి అక్రమ తవ్వకందారులను అరెస్టులు చేయించారని పత్రికలన్నీ చెబుతున్నాయి.
ఇంతకీ ఈ ఫొటోల్లో కూల్చివేతకు గురయిన మసీదు గోడ లేకపోవడమే మిస్టరీగా ఉంది. గోడ కూల్చివేత సమయంలో ఆమె అక్కడె ఉన్నారని చెబుతున్నపుడు ఆ రెండు పాత్రలు (గోడ మరియు దుర్గశక్తి నాగపాల్) కనీసం ఒక్క ఫొటోలో అయినా ఒకే దృశ్యంలో కనపడాలి కదా?!
ఫస్ట్ పోస్ట్ వారూ, దుర్గాశక్తి నాగపాల్ కదల్పూర్ లో ఉన్నారు సరే, మసీదు గోడ ఏదీ? (ఈ ప్రశ్న ఫస్ట్ పోస్ట్ లోనే అడుగుదామనుకుంటే అక్కడ వ్యాఖ్యలు పోస్ట్ చెయ్యడానికి అవకాశం లేదు. Comments అని లింక్ ఉంటుంది గానీ అది క్లిక్ చేస్తే ఏమీ జరగదు, పేజి కొద్దిగా పైకి స్క్రోల్ అవడం తప్ప!)







పింగ్‌బ్యాక్: ఐ.ఎ.ఎస్ లను తంతే…..?–కార్టూన్ | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ