ఇళవరసన్ ది హత్యా, ఆత్మహత్యా? -తొలగని అనుమానాలు


VCK rally in Madurai

VCK rally in Madurai

ధర్మపురిలో రైలు పట్టాలపై శవమై కనిపించిన ఇళవరసన్ ది హత్యే అన్న అనుమానాలు బలపడుతున్నట్లు కనిపిస్తోంది. ది హిందు పత్రిక ప్రకారం ధర్మపురి ప్రాంతంలో రైలు పట్టాల పక్కన శవం కనిపించినట్లుగా ఏ రైలు అధికారీ రికార్డు చేయలేదని రైల్వే అధికారులు చెప్పారు. రైల్వే నిబంధనల ప్రకారం ఒక రైలు ఏ వ్యక్తినైనా ప్రమాదవశాత్తూ ఢీ కొట్టినా లేక ఆత్మహత్య కోసం రైలు ముందుకు దూకినా సదరు రైలు డ్రైవర్ గానీ, గార్డు గానీ లేదా ఇతర అధికారులు గానీ వెంటనే సమీప స్టేషన్ మాస్టర్ కి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఇళవరసన్ విషయంలో అలాంటిదేమీ జరగలేదని పత్రిక విచారణలో తేలడంతో హత్యే కావచ్చన్న అనుమానం కలుగుతోంది.

నిజానికి ఇళవరసన్ చనిపోయి ఉంటాడని భావించిన సమయంలో మూడు రైళ్లు ఆ మార్గంలో వెళ్ళాయనీ, ఆ మూడు రైళ్ల అధికారుల్లో ఎవరూ శవం చూసినట్లుగానీ, ఎవరైనా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు గానీ రిపోర్టు చేయలేదని ది హిందూ తెలిపింది. ఇళవరసన్ విగత దేహాన్ని మొదటిసారిగా చూసింది రైల్వే కీ మెన్ లేదా రైల్వే పెట్రోల్ మేన్ అని పత్రిక తెలిపింది. నిబంధనల ప్రకారం సదరు పెట్రోల్ మేన్ ధర్మపురి రైల్వే స్టేషన్ మాస్టర్ కు వెంటనే తెలియజేశారు.

కోయంబత్తూరు-ముంబై కుర్లా ఎక్స్ ప్రెస్ కింద పడి ఇళవరసన్ చనిపోయి ఉండవచ్చని రైల్వే పోలీసులు భావించారు. అయితే కుర్లా ఎక్స్ ప్రెస్ డ్రైవర్ మాత్రం అలాంటి సంఘటన గురించి ఎక్కడా నివేదించలేదు. దానితో ఇళవరసన్ ది హత్య అని అనుమానిస్తున్నవారి వాదన బలపడుతోంది. కానీ హత్య అని చెప్పడానికి ఇది తప్ప మరో ఆధారం ఏదీ లేనట్లు కనిపిస్తోంది. పోస్టు మార్టం రిపోర్టు ప్రకారం తలకు బలమైన గాయం తగలడం వలన ఇళవరసన్ మృతి చెందారు. ఆయన కపాలం చిట్లి మెదడు బైటికి వచ్చిందని తెలుస్తోంది.

ఒకవేళ ఇళవరసన్ కుర్లా ఎక్స్ ప్రెస్ కింద పడి చనిపోతే డ్రైవర్, తదుపరి స్టేషన్ అయిన హోసూరులో నివేదించి ఉండేవారని అయితే బెంగుళూరు డివిజన్ హెడ్ క్వార్టర్స్ ప్రకారం అలాంటి రిపోర్టు ఏదీ అందలేదని ది హిందూ చేసిన విచారణలో తేలింది. “కుర్లా ఎక్స్ ప్రెస్ వెళ్ళిన తర్వాత మరో రెండు రైళ్లు ఆ మార్గంలోనే వెళ్ళాయి. డ్రైవర్లు గానీ, గార్డులు గానీ శవాన్ని చూసినట్లయితే దానిని రికార్డు చేసి సమీపంలోని స్టేషన్ మాస్టర్ కు చెప్పి ఉండేవారు…” అని బెంగుళూరు డివిజన్ సీనియర్ సేఫ్టీ ఆఫీసర్ ప్రవీణ్ పాండే తెలిపారని పత్రిక తెలిపింది.

అయితే డ్రైవర్ గానీ, గార్డు గానీ ఎవరూ ఒక ఆత్మహత్య వాస్తవంగా జరిగినా గమనించలేకపోతే? అలాంటి అవకాశాలు లేకపోలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. రాత్రి పూట చీకట్లో జరిగినప్పుడు గానీ, బాగా మలుపు ఉన్న చోట ఆత్మహత్య జరిగినప్పుడు గానీ, లేదా తీవ్రంగా మేఘాలు ఆవరించి వర్షం పడుతున్నపుడు గానీ ఆ విధంగా ఆత్మహత్యలను గమనించలేని పరిస్ధితి ఉత్పన్నం అవుతుంది. కానీ ఇళవరసన్ చనిపోయిన సమయం మధ్యాహ్నం 12:30, 1:30 గంటల మధ్య. వర్షం ఏమీ కురవలేదు. మలుపు కూడా ఏమీ లేదు. కాబట్టి రైల్వే అధికారులు గమనించకుండా పోయే అవకాశాలు తక్కువ అని స్పష్టం అవుతోంది.

ఇదిలా ఉండగా కుర్లా ఎక్స్ ప్రెస్ డ్రైవర్ జులై 7 తేదీన ధర్మపురిలో తమ ఎదుట హాజరు కావలసిందిగా రైల్వే పోలీసులు సమన్లు పంపినట్లు తెలుస్తోంది. మిగిలిన రెండు రైళ్ల డ్రైవర్లకు సమన్లు పంపిందీ లేనిదీ తెలియలేదు.

మరో సమాచారం ప్రకారం ఒక మహిళ, మరి కొంతమంది విద్యార్ధులు, ఇలవరసన్ రైలు పట్టాలకు సమీపంలో ఉండగా గమనించినట్లు పరిశోధన అధికారులకు తెలిసింది. కానీ పోలీసులకు వారు ఎవరైనదీ ఇంకా తెలియలేదు. ఇది నిజమే అయినట్లయితే ఇలవరసన్ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పడానికి ఆధారం అవుతుంది. మొదట ఆత్మహత్యగా భావించిన పోలీసులు బంధువులు, రాజకీయ పార్టీల ఆరోపణలతో అన్నీ కోణాలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

విదుతలై చిరుతైగల్ కచ్చి (వి.సి.కె) పార్టీతో పాటు తమిళనాడు అంటరానితనం నిర్మూలనా సంస్ధ, మానవ హక్కుల లాయర్ల సంస్ధ తదితర సంస్ధలు ఇలవరసన్ మృతి పై ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ (సిట్) చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. పోస్టుమార్టం పైన తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేయడంతో మద్రాస్ హై కోర్టు అవసరమైతే మరోసారి పోస్టుమార్టం చేయడానికి వీలుగా శవానికి అంత్యక్రియలు నిర్వహించవద్దని ఆదేశించింది. రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు కేసు విచారణను రైల్వే పోలీసుల నుండి ధర్మ పోలీసులు స్వీకరించినట్లు తెలుస్తోంది.

3 thoughts on “ఇళవరసన్ ది హత్యా, ఆత్మహత్యా? -తొలగని అనుమానాలు

  1. Its really sad incident.

    //నిజానికి ఇళవరసన్ చనిపోయి ఉంటాడని భావించిన సమయంలో మూడు రైళ్లు ఆ మార్గంలో వెళ్ళాయనీ, ఆ మూడు రైళ్ల అధికారుల్లో ఎవరూ శవం చూసినట్లుగానీ, ఎవరైనా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు గానీ రిపోర్టు చేయలేదని ది హిందూ తెలిపింది. //

    In Eenadu, its giving as suicide. please check the link

    http://eenadu.net/district/inner.aspx?dsname=Tamilnadu&info=tam-panel1.

    Kurla express driver witnessed that, he could not stop the train though he had seen Ilavarasan standing on tracks.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s