టర్కీ ప్రధాని రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ నియంతృత్వ విధానాలకు, ఆయన అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా మూడు వారాలుగా ఆందోళన చేస్తున్న టర్కీ ప్రజలు సోమవారం నుండి వినూత్న నిరసన చేపట్టారు. ప్రముఖ టర్కీ నాట్య కళాకారుడు ఎర్దెమ్ గుండుజ్ ప్రారంభించిన ఈ నిరసన రూపం కొద్ది గంటల్లోనే దేశ వ్యాప్తంగా బహుళ ప్రజాదరణ పొందడమే కాక అనేకమంది ఆయనను అనుసరించడానికి దారి తీసింది. ఇది ఎంతగా ప్రజాదరణ పొందిందంటే శరవేగంగా ఆదరణ పొందిన ఈ నిరసన రూపాన్ని చూసి ప్రభుత్వం ట్విట్టర్, ఫేస్ బుక్, గూగుల్ తదితర సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్ల వినియోగాన్ని నియంత్రించడానికి తలపెట్టిన బిల్లును వేగవంతం చేసింది.
గుండుజ్ ప్రారంభించిన వినూత్న నిరసన మరేమీ కాదు. మాట్లాడకుండా, అటు ఇటూ కదల కుండా ఒకే చోట గంటల తరబడి నిలబడడం. ‘స్టాండింగ్ మేన్’ గా పిలుస్తున్న దీనిని టర్కీ భాషలో ‘దురన్ ఆదం’ అని అంటారట. ఈ నిరసన ప్రారంభం అయ్యాక ట్విట్టర్ లో ‘హేష్ ట్యాగ్ దురన్ ఆదం’ (#Duranadam) టాప్ ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయిందని పత్రికలు తెలిపాయి. ట్విట్టర్ వరకే ఇది పరిమితం కాలేదు. గుండుజ్ ని అనుసరిస్తూ డజన్ల కొద్దీ నిరసనకారులు ఇస్తాంబుల్ లోని తకసిమ్ స్క్వేర్ వద్ద గంటల తరబడి నిలబడి నిరసన తెలిపారు. ఒక్క ఇస్తాంబుల్ లోనే కాకుండా టర్కీలోని ఇతర నగరాల్లో కూడా ఈ నిరసన పాకిందని ఆర్.టి (రష్యా టుడే) తెలిపింది.
గత మూడు వారాలుగా ఇస్తాంబుల్ నగరంలోని తకసిమ్ స్క్వేర్ లోని గెజి పార్క్ కేంద్రంగా టర్కీ ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గెజి పార్క్ ను తొలగించి భారీ స్ధాయిలో వాణిజ్య వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా పెద్ద పెద్ద మాల్స్ నిర్మించడానికి టర్కీ ప్రధాని ఎర్డోగన్ పూనుకోగా, దానికి వ్యతిరేకంగా పర్యావరణ వేత్తలు కొద్దిపాటి నిరసన ప్రారంభించారు. ఈ నిరసనను పోలీసులు ఉక్కుపాదం మోపి అణచివేయడంతో దేశవ్యాపితంగా ప్రజలు స్పందించారు. ఎక్కడికక్కడ నిరసనలు చెలరేగగా దాదాపు అన్ని వర్గాల ప్రజలు వాటిలో పాల్గొన్నారు. లాయర్లు, డాక్టర్లు, విద్యార్ధులు, కార్మికులు, మహిళలు ఒకరేమిటి, నిరసనలో పాల్గొనకపోతే పాపం అన్నట్లుగా పాల్గొన్నారు.
ఈ నిరసనలను పోలీసు చేత నిర్బంధం ప్రయోగించి అణచివేయడానికే ఎర్డోగన్ మొగ్గు చూపారు. ఆందోళనలు ప్రారంభం అయినప్పటి నుండీ దాదాపు ప్రతి రోజూ రసాయనాలు కలిపిన నీటి ఫిరంగులు, టియర్ గ్యాస్, లాఠీ చార్జి ప్రయోగించిన్నప్పటికీ ఆందోళనకారులు మళ్ళీ మళ్ళీ చారిత్రక తకసిమ్ స్క్వేర్ ను ఆక్రమిస్తూ నిరసనలు కొనసాగించారు. ఆందోళనకారుల్లోని కొంతమందిని ఎంపిక చేసుకుని తమవైపు తిప్పుకున్న ఎర్డోగన్ వారితో చర్చల నాటకం ఆడి ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు. కానీ దానిని ఆందోళనకారులు అంగీకరించలేదు. నిరసనను కొనసాగించారు. దానితో పోలీసులు, సైన్యం కలిసి మళ్ళీ హింసాత్మక చర్యలతో ఆందోళనకారులను స్క్వేర్ నుండి ఖాళీ చేయించారు.
ఈ నేపధ్యంలో కళాకారుడు గుండుజ్ ప్రారంభించిన ‘దురన్ ఆదం’ నిరసన వేగంగా వ్యాపించింది. ఇస్తాంబుల్ ప్రజల ఊహాలను ఇది ఆకట్టుకోవడంతో ప్రభుత్వ అణచివేత పట్ల ఆగ్రహంగా ఉన్న జనం ఆయనను వెంటనే అనుకరించడం ప్రారంభించారు. తకసిమ్ స్క్వేర్ లో ఆధునిక సెక్యులర్ టర్కీ వ్యవస్ధాపకుడు కెమెల్ అటాటర్క్ విగ్రహం ఎదుట గుండుజ్ ఏకధాటిగా 8 గంటల పాటు మౌనంగా నిలబడి నిరసన తెలిపాడు. ఆయనను గమనించిన నిరసనకారులు క్రమంగా బైటికి వచ్చి ఆయన చుట్టూ అదే మాదిరి మౌనంగా నిలబడి ‘దురన్ ఆదం’ అవతారం ఎత్తారు. ఈ దృశ్యాలు టీవి ఛానెళ్లలో ప్రసారం కావడం, ట్విట్టర్, ఫేస్ బుక్ తదితర సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఇతర నగరాల్లో కూడా ఇదే తరహా నిరసనలు మొదలయ్యాయి. మంగళవారం ఉదయానికల్లా ట్విట్టర్ లో #Duranadam టాప్ ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయింది.
ఇంటర్నెట్ నల్ల చట్టం
ఆందోళనలు, సరికొత్త ఆందోళన రూపాలు దేశంలో శరవేగంగా విస్తరించడం టర్కీ పాలకులకు నచ్చలేదు. టి.విలలో ప్రసారం అవుతున్న ఆందోళనలు ఒక ఎత్తయితే, ఇంటర్నెట్ ద్వారా ఆందోళనలు వేగంగా పాకుతున్నాయని వారు భావిస్తున్నారు. దానితో అంతర్జాల కంపెనీలను నియంత్రిస్తూ కొత్త చట్టం తీసుకురావడానికి ముసాయిదా తయారు చేస్తున్నామని టర్కీ హోమ్ మంత్రి మౌమ్మర్ గులార్ ప్రకటించాడు. సోషల్ మీడియాలో ప్రచురితం అవుతున్న పాఠ్యాన్ని, ఇతర కంటెంట్ ను నియంత్రించడానికి ఈ బిల్లు ఉపకరిస్తుందని ఆయన బహిరంగంగానే చెబుతున్నారు. ఆందోళనల సందర్భంగా ప్రజలను రెచ్చగొడుతూ అనేక పోస్టులు ప్రచురించారని, వీటి వలన దేశంలో అశాంతి, అలజడి తలెత్తుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఆర్.టి ప్రకారం టర్కీ విదేశాంగ శాఖ ఇప్పటికే 5 మిలియన్ల ట్వీట్ లపైన విచారణ ప్రారంభించింది. ఇవన్నీ గెజి పార్క్ నిరసనలకు సంబంధించినవే. ఆందోళనకారులు ప్రచురించిన కొన్ని విషయాలు వాస్తవాలు కావనీ, ఆందోళనలు వ్యాపింప జేయడానికి కల్పితాలు ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. ట్విట్టర్, ఫేస్ బుక్ తదితర మీడియాలలోని తప్పుడు వార్తల వలన దేశ భద్రత, ప్రజల జీవితాలు, ఆస్తులు ప్రమాదంలో పడుతున్నాయని ఆయన వాపోయారు.
అరబ్ స్ప్రింగ్ గా పశ్చిమ పత్రికలు అభివర్ణించిన ఈజిప్టు, ట్యునీషియా, లిబియా తిరుగుబాట్లు తమ సోషల్ నెట్ వర్క్ కంపెనీల పుణ్యమేనని అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అట్టహాసంగా ప్రకటించారు. తమ అంతర్జాల బహుళజాతి కంపెనీలు ప్రపంచవ్యాపితంగా తమలాగే ప్రజాస్వామ్య సంస్ధాపన కోసం నడుం బిగించాయని ఆమె గొప్పలు చెప్పుకున్నారు. ఈజిప్టులో హోస్నీ ముబారక్ నియంతృత్వ పాలనను కాపాడి తోడుగా నిలిచింది తామేనన్న విషయాన్ని ఆమె ఆక్షణాల్లో మర్చిపోయారు. ఇప్పుడు అవే కంపెనీలను నియంత్రించడానికి తమ అనుంగు మిత్రుడు టర్కీ ప్రధాని ప్రయత్నిస్తుంటే అమెరికా పాలకులు నోరు మెదపడం లేదేందుకని?







ఈ నిరసన ఏదో కొత్తగా బాగుందే. హ్యాట్సాఫ్ టూ గుండుజ్. జై దురున్ ఆదం.
కానీ ఈ రకమైన నిరసన మన దగ్గర చేస్తే… తోలుమందం పాలకులకు వేడి పుడుతుందా…?
mana tholu mandham rulers ku khacchithamugaa vedi puduthundhi… its my trust on people of india.