టర్కీ: సిరియా తిరుగుబాటు ఎగదోస్తూ, సొంత ప్రజలపై ఉక్కుపాదం


సిరియా సెక్యులర్ పాలకుడు బషర్ అసద్ ను గద్దె దింపడానికి టర్కీ మతతత్వ పాలకుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చేయని ప్రయత్నం లేదు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర పశ్చిమ రాజ్యాలతో కుమ్మక్కై సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు తమ భూభాగం పైనే శిక్షణా శిబిరాలు నెలకొల్పి సిరియాకు పంపుతున్న ఘనత ఎర్డోగాన్ సొంతం. సిరియాలో ప్రజలపైనా, ప్రభుత్వ వ్యవస్ధల పైనా మారణ హోమం సృష్టిస్తున్న ఆల్-ఖైదా టెర్రరిస్టులకు టర్కీ ద్వారా పశ్చిమ దేశాలు అనేక మారణాయుధాలు సరఫరా చేస్తున్నారు. కిరాయి తిరుగుబాటుకి ఇంత సహకరిస్తున్న ఎర్డోగాన్ కేవలం ఒక పార్కు విషయంలో తన సొంత ప్రజలపై ఉక్కు పాదం మోపుతూ పచ్చి నియంతగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

టర్కీలో అతి పెద్ద నగరం ఇస్తాంబుల్ లో రెండు వారాల క్రితం మొదలయిన ఆందోళనలు ఎర్డోగాన్ నియంతృత్వ వైఖరితో దేశం అంతా విస్తరించాయి. ఇస్తాంబుల్ లోని చారిత్రక ‘గెజి పార్క్’ ను కూల్చివేసి దాని స్ధానంలో ఫ్యూడల్ పాలకులైన ఒట్టోమాన్ సామ్రాజ్య ప్రభువుల నిర్మాణ నమూనాలో మిలట్రీ బ్యారక్ నిర్మించడానికి ఎర్డోగన్ పూనుకున్నాడు. బ్యారక్ తో పాటు ప్రైవేటు కంపెనీల కోసం పెద్ద పెద్ద మాల్స్ నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించాడు. అందుకోసం గెజి పార్క్ లో వృక్షాలను కూల్చడం ప్రారంభించాడు. దేశంలోని పర్యావరణ వాదులు దీనిని తీవ్రంగా నిరసించారు. గెజి పార్కు చేరుకుని నిరసన తెలిపారు. సిరియాలో టెర్రరిస్టులకు ప్రజాస్వామ్య ముసుగు తొడిగి సెక్యులర్ అసద్ ని నియంతగా తిట్టిపోస్తున్న ఎర్డోగన్, గెజి పార్క్ లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై తీవ్ర నిర్బంధం ప్రయోగించాడు.

నిరసన కారులను చుట్టుముట్టిన వందలాది పోలీసులు లాఠీలతో కుళ్లబోడిచారు. టియర్ గ్యాస్ ప్రయోగించి వందలమందిని ఆసుపత్రి పాలు చేశారు. వాటర్ కెనాన్ లు తెచ్చి గెజి పార్క్ ను యుద్ధరంగంగా పోలీసులు మార్చివేశారు. ఈ నిర్బంధాన్ని టి.వీల్లో చూసిన టర్కీ ప్రజలు ఆగ్రహోదగ్రులయ్యారు. ఈసారి అనేక ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలతో జతకలిశాయి. దాదాపు వందకు పైగా పార్టీలు, సంస్ధలు, సంఘాలు టర్కీ అంతటా వివిధ నగరాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. పోలీసుల వైఖరి మూలాన అనేక చోట్ల ఈ నిరసనలు మిలిటెంట్ రూపం సంతరించుకున్నాయి. టర్కీ రాజధాని అంకారా లో ఆనాటి నుండి నేటి వరకూ వీధి యుద్ధాలు సర్వ సాధారణం అయ్యాయి.

నిరసనల కేంద్రం ఇస్తాంబుల్ లోనైతే ఆందోళనకారులు ఈజిప్టులోని తాహ్రీరి స్క్వేర్ తరహా ఉద్యమాన్ని చేపట్టారు. గెజి పార్కు వద్ద గుడారాలు నిలకొల్పారు. చుట్టూ బ్యారికేడ్లు నిర్మించి అక్కడే సెటిలైపోయారు. వీరిని తొలగించడానికి ఎర్డోగన్ పనుపున పోలీసులు రోజుల తరబడి తీవ్ర ప్రయత్నాలు చేశారు. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్, లాఠీ చార్జ్, కాల్పులు అన్నీ ప్రయోగించారు. కొన్ని సార్లు విజయవంతంగా ఆందోళనకారులను పార్కు నుండి తరిమినప్పటికీ ఆ వెంటనే కొత్త బ్యాచ్ ఆందోళనకారులు పార్క్ ను ఆక్రమించేవారు. లాయర్లు, డాక్టర్లు, ప్రభుత్వోద్యోగులు, మహిళలు, వయోవృద్ధులు అనేకమంది ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. 

పోలీసుల టియర్ గ్యాస్ వలన నాలుగు వేల మందికి పైగా నిరసనకారులు ఆసుపత్రి పాలయ్యారు. టియర్ గ్యాస్ నుండి రక్షణ పొందడానికి అనేకమంది నిరసనకారులు మాస్క్ లు తొడుగుకుని పెట్రోల్ బాంబులతో పోలీసులను ఎదుర్కొన్నారు. క్యాట్ బాల్ లాంటివి తెచ్చి పోలీసులపై రాళ్ళు రువ్వారు. నీటి ఫిరంగులకు ఎదురొడ్డి నిలిచారు. ఈ క్రమంలో ముగ్గురు ఆందోళన కారులు చనిపోగా, ఒక పోలీసు ఎత్తైన ప్రదేశం నుండి కిందపడి చనిపోయాడు. పోలీసు నిర్బంధం ఎంత తీవ్రంగా ఉందంటే అమెరికా, యూరప్ లాంటి నాటో దేశాలు సైతం ఆ నిర్బంధాన్ని ఖండిస్తూ తీర్మానాలను ఆమోదించాయి. సిరియాలో ప్రజాస్వామిక తిరుగుబాట్లను సమర్ధిస్తున్నామని చెబుతూ టర్కీలో వాస్తవ ప్రజాస్వామిక ఆందోళనలపై ఉక్కు పాదం మోపడాన్ని ఖండించలేని అనివార్య పరిస్ధితి అమెరికా, ఐరోపాలు ఎదుర్కొన్నాయి.

ఇస్తాంబుల్ లోని గెజి పార్కు వద్ద పోలీసులు, నిరసనకారుల మధ్య రణరంగమే నడిచింది. ఆ దృశ్యాలివి.

టర్కీ ఆందోళనలు ప్రధానంగా ప్రధాని ఎర్డోగన్ నియంతృత్వ వైఖరికి, దేశాన్ని మళ్ళీ ముస్లిం మతతత్వం వైపుకి నడిపిస్తున్న ఆయన విధానాలకూ వ్యతిరేకంగా జరుగుతున్నాయని వివిధ అంతర్జాతీయ విశ్లేషకులు విశ్లేషించారు. గెజి పార్కు లో ఒట్టోమన్ ముస్లిం పాలకుల స్మృతి చిహ్నం ఏర్పాటు చేయడం అంటే 1924 నుండి టర్కీని సెక్యులరిజం వైపుకి నడిపించి ముస్తఫా కేమల్ అటాటర్క్ నెలకొల్పిన సంప్రదాయాన్ని తిరగడోడడమేనని దేశంలోని సెక్యులర్ ప్రజలు ఆందోళన చెందారు. సెక్యులర్ రాజ్య సంప్రదాయాన్ని కొనసాగిస్తానని అధికారంలోకి వచ్చిన మతవాది ఎర్డోగన్ తన చర్యల ద్వారా మతతత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడని వారు అనుమానిస్తున్నారు. గత ఎనిమిదేళ్ళ పాలనలో ఆయన తీసుకున్న అనేచర్యలు ఈ అనుమానాన్ని తీవ్రం చేశాయి. గెజి పార్కు కూల్చివేత, శాంతియుత నిరసనకారులపై పాల్పడిన క్రూర అణచివేతతో ఈ ఆందోళనలన్నీ ఒక్కసారిగా సంఘటిత రూపం తీసుకున్నాయి.

గెజి పార్కుని కూల్చివేసి తీరతానని, తాను అనుకున్నట్లు నిర్మాణాలు చేపడతానని బీరాలు పలికిన ఎర్డోగన్ నిరసనల తీవ్రతకు తల ఒగ్గుతున్నట్లు శనివారం నాడు ప్రకటించాడు. బ్యారక్, మాల్స్ నిర్మాణాలను ఉపసంహరించుకుంటాననీ, పార్క్ ను కొనసాగిస్తాననీ ఆయన ప్రకటించి ఆందోళనలు విరమించాలని కోరాడు. అయితే ఆందోళనకారులు ఇంకా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఆందోళన తీవ్రత తగ్గించడానికి అంగీకరిస్తూ అందుకు అనుగుణంగా కొన్ని చర్యలు చేపట్టారు. అయితే గెజి పార్కు ను ఖాళీ చేయడానికి వారు ఇంకా అంగీకరించలేదు.

వ్యాఖ్యానించండి