మహేంద్ర కర్మ, తదితరుల కాంగ్రెస్ పార్టీ నాయకులే తమ మెరుపుదాడికి లక్ష్యం అని మావోయిస్టులు ప్రకటించారు. తమ దాడిలో మరణించిన అమాయకులకు వారు క్షమాపణలు తెలిపారు. సల్వాజుడుం ద్వారా గిరిజన గ్రామాల్లో విధ్వంసం సృష్టించిన మహేంద్ర కర్మ, ఇతర కాంగ్రెస్ నాయకులపై గిరిజనుల తరపున ప్రతీకారం తీర్చుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించిన మావోయిస్టులు దాడిలో పాల్గొన్న పీపుల్స్ లిబరేషన్, గెరిల్లా ఆర్మీ మరియు మిలీషియా సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ప్రతినిధి ఉసెండి పేరుతో పత్రికలకు, ఛానెళ్లకు ప్రకటన విడుదల చేశారని ది హిందూ, ఈ టీవి తదితర చానెళ్లు తెలిపాయి. హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ప్రకటన విడుదల చేశారని ఈ టీవి తెలిపింది.
ఛత్తీస్ ఘర్, బస్తర్ జిల్లాలోని శనివారం 150 మందికి పైగా మావోయిస్టు గెరిల్లా ఆర్మీ సభ్యులు జరిపిన దాడిలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సహా 27 మంది మంది చనిపోగా 30 మంది వరకు గాయపడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, హింసాత్మక ‘సల్వాజుడుం’ నిర్వాహకుడు మహేంద్ర కర్మ, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నంద్ కుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్, మాజీ ఎం.ఎల్.ఏ ఉదయ్ ముదలియార్ లతో పాటు పలువురు సాధారణ పార్టీ కార్యకర్తలు చనిపోయారు. చనిపోయిన కాంగ్రెస్ నాయకులు ‘ప్రజా శత్రువులు’ అని మావోయిస్టుల పత్రిక ప్రకటన పేర్కొంది.
మూడు భాషల్లో వెలువడిన మూడు పేజీల ప్రకటన పైన మావోయిస్టు పార్టీ ఛత్తీస్ ఘర్ ప్రతినిధి గుడ్స ఉసెండి సంతకం ఉన్నదని ది హిందు తెలిపింది. మహేంద్ర కర్మ తమ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్న ప్రకటన ఆయనను ‘ప్రఖ్యాతి చెందిన క్రూర శాసనుడు’ అనీ, ‘హంతకుడు’ అనీ అభివర్ణించింది. గిరిజనులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించని సాయుధ దాడులకు మహేంద్ర కర్మ బాధ్యుడని తెలిపింది. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ను అమలు చేయాలని గిరిజనుల 1996లో ప్రారంభించిన ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి ఆయన ప్రయత్నించాడని, ఉద్యమానికి వ్యతిరేకంగా నిలబడ్డాడని పేర్కొంది. స్వార్ధపూరితమైన పట్టణ వ్యాపారుల ప్రతినిధిగా, భారీ సంపదలు కూడబెట్టిన దోపిడీదారుగా గిరిజన ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించాడని తెలిపింది.
సల్వాజుడుం (శాంతి యాత్ర) నాయకుడుగా గిరిజనులపై భారీ స్ధాయిలో హింసాత్మక దాడులకు పాల్పడ్డాడని ప్రకటన తెలిపింది. “… సల్వాజుడుం గూండాలు, ప్రభుత్వ సాయుధ బలగాల చేతుల్లో చనిపోయిన వెయ్యికి పైగా ఆదివాసీల తరపున మేము ప్రతీకారం తీర్చుకున్నాము” అని మావోయిస్టు ప్రకటన పేర్కొంది. మహేంద్ర కర్మ అవినీతికి నిదర్శనంగా ప్రభుత్వ నివేదికలనే మావోయిస్టు ప్రకటన ఉటంకించింది. ‘మాలిక్ మక్బూజ’ అనే పేరుతో వెలుగులోకి వచ్చిన 1992-96 నాటి భారీ కలప కుంభకోణంలో మహేంద్ర కర్మ కలప నల్ల వ్యాపారులతో కర్మ భాగస్వామ్యం వహించినట్లు, ఆదివాసీ ప్రజలను మోసగించి మిలియన్ల కొద్దీ రూపాయల సొమ్ముని వెనకేసుకున్నట్లుగా ఆయనపై లోకాయుక్త ఆరోపించిన విషయాన్ని మావోయిస్టులు గుర్తు చేశారు.
పి.సి.సి అధ్యక్షుడు నందకుమార్ పటేల్ తాను హోమ్ మంత్రిగా ఉండగా పారా మిలట్రీ బలగాలను మోహరించడానికి బాధ్యుడని మావోయిస్టులు ఆరోపించారు. సామ్రాజ్యవాదులకు నమ్మకమైన సేవకుడుగా వ్యవహరించిన వి.సి.శుక్లా ప్రజా శత్రువు అని ప్రకటించారు.
తమ దాడిలో మరణించిన అమాయకులకు క్షమాపణలు తెలిపారు. “ఈ భారీ దాడిలో కొందరు అమాయకులు, కొందరు కింది స్ధాయి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. వారు నిజానికి మా శత్రువులు కారు. సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వారికి దీని పట్ల విచారం వ్యక్తం చేస్తున్నది. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాం” అని ప్రకటన పేర్కొంది.
దాడి అనంతరం రాష్ట్రాన్ని సందర్శించిన కాంగ్రెస్ నాయకులకు ‘ప్రజాస్వామ్యం’ గురించి చర్చించే “నైతిక హక్కు” లేదని ప్రకటన స్పష్టం చేసింది. “… బీజాపూర్ జిల్లాలో మే 17 తేదీన జరిపిన దాడిలో ముగ్గురు పిల్లలతో సహా, ఎనిమిది మందిని పోలీసులు, పారా మిలట్రీ బలగాలు చంపేశారు. ఆ రోజు ఈ నాయకులేవ్వరికీ ప్రజాస్వామ్య విలువలు ఎందుకు గుర్తుకు రాలేదు?” అని వారు ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయని ఉసెండి గుర్తు చేశారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ ను రద్దు చేయాలని, వివిధ ప్రత్యేక చట్టాలను రద్దు చేయాలని, సహజ వనరులను కొల్లగొట్టడానికి అనేక కార్పొరేటు కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని ప్రకటన డిమాండ్ చేసింది.
మావోయిస్టుల ప్రకటన పత్రికలకు ఎలా చేరిందన్న విషయమై భద్రతా బలగాలు విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక మొబైల్ పరికరం నుండి ప్రకటన వచ్చినట్లు గుర్తించారని తెలుస్తోంది. ఒక ప్రైవేటు తేలికమ్యూనికేషన్స్ నెట్ వర్క్ ద్వారా ప్రకటన వచ్చినట్లు కూడా వారు గుర్తించినట్లు తెలుస్తోంది.
ప్రాచీన ఆయుధాలు
ప్రభుత్వ బలగాలు ఉపయోగించిన ఆయుధాల కంటే మించిన ఆధునిక ఆయుధాలను మావోయిస్టు బలగాలు వినియోగించారన్న ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది. ఫస్ట్ పోస్ట్ పత్రిక ప్రకారం మావోయిస్టులు అత్యంత ప్రాచీన తుపాకులను వినియోగించారు. కేవలం 18వ శతాబ్దం నాటి పాత మోడల్ తుపాకులతో అత్యాధునిక ఆయుధాలు ధరించి ప్రభుత్వ బలగాలను మావోయిస్టులు ఎదుర్కొన్నారు.
100కు పైగా మావోయిస్టు జన్ మిలీషియా సభ్యులు భార్మర్ తుపాకులతో దాడిలో పాల్గొన్నారని వీరికి ఆయుధాల వాడకంలో సరయిన శిక్షణ కూడా లేదని పత్రిక తెలిపింది. భార్మర్ తుపాకులను 1830లు, 40ల్లో వాడేవారని, వీటిలో ప్రతి గుండును బారెళ్ళ ద్వారా చేతులతోనే లోడ్ చేయాల్సి ఉంటుందని సదరు పత్రిక తెలిపింది. మరో వైపు ప్రభుత్వ బలగాలు ఏ.కె సిరీస్ రైఫిళ్ళు, ఆధునిక ఎం.పి5 తుపాకులు ఉపయోగించారని తెలిపింది. ప్రాచీన ఆయుధాలతోనే మావోయిస్టులు ఇంతటి పై చేయి సాధిస్తే వారి చేతికి అత్యాధునిక ఆయుధాలే వస్తే పరిస్ధితి ఏమిటని పత్రిక ప్రశ్నించింది.

భర్మర్ తుపాకులలో తూటాలు ఉండవు. చేతితో గన్ పౌడర్ పోసి పేలిస్తే గుండు బయటకి వస్తుంది. పోలీసుల దగ్గర ఉన్నవి లీ ఎన్‌ఫీల్డ్ .303 రకం తుపాకులు. వాటికి తూటాలు ఉంటాయి. తోలుతో చేసిన తూటా మధ్యలో గన్ పౌడర్ ఉంటుంది, గన్ పౌడర్ మధ్యలో గుండు ఉంటుంది. ట్రిగ్గర్ నొక్కితే తూటా పేలి గుండు బయటకి వస్తుంది. తూటా తొక్కని మాత్రం చేతితోనే బయటకి తియ్యాలి. భర్మర్ తుపాకులు కంటే ఇవే వాడడం సులభం. జలియాన్‌వాలా బాగ్‌లో డయ్యర్ ఇలాంటి తుపాకులతోనే కాల్పులు జరిపించాడు.
girijanulu tarupuna veellu prateekaaram teerchukovatam enti ??? 1830 40 lovi ayudhaalu kaadaa vaatito praanaalu pova aa varnana anta enduku ? praanam teeyataaniki edayite enti ?? atyadhunika aayudhaalu vaste paristiti enti ante desam motham dandakaaranyam avutundemo choodaali……….
మీరు కార్మికవర్గ విప్లవకారులకి ఆదివాసీల గురించి అనవసరం అని అంటారు. ఇది ఎవరినివాళ్ళే ఉద్ధరించుకోవాలనే వ్యక్తివాద ప్రవచనమే తప్ప ఇంకొకటి కాదు.