పశ్చిమ మీడియా రిపోర్ట్ చేయని వార్త ఇది. సరిహద్దు దాటి సిరియాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ ట్యాంకును సిరియా బలగాలు ధ్వంసం చేశాయని సిరియా మిలట్రీ కమాండ్ తెలియజేసింది. ఈ మేరకు గ్లోబల్ రీసర్చ్ సంస్ధ అధినేత ప్రొఫెసర్ మైఖేల్ చోసుడోవ్ స్కీ తమ వెబ్ సైట్ లో మంగళవారం సమాచారం ప్రచురించారు. సిరియాలో ఆల్-ఖైదా శాఖ ఆల్-నుస్రా ఫ్రంట్ టెర్రరిస్టులు చావు దెబ్బలు తింటూ స్ధైర్యం కోల్పోతున్న స్ధితిలో వారిని ఉత్సాహ పరిచే ఉద్దేశ్యంతో ఇజ్రాయెల్ తన ట్యాంకును సరిహద్దు దాటించిందని దానిని తమ సైన్యాలు ధ్వంసం చేశాయని సిరియా మిలట్రీ కమాండ్ చెప్పిందని ప్రొఫెసర్ మైఖేల్ తెలిపారు.
“మంగళవారం తెల్లవారు ఝామున గం. 1:10 కి (2100 GMT) మా సాయుధ బలగాలు ఒక ఇజ్రాయెల్ వాహనాన్ని ధ్వంసం చేశాయి. అందులో ఉన్న ప్రతిదాన్నీ మావాళ్లు నాశనం చేశారు. ఇజ్రాయెల్ ఆక్రమిత (గోలన్ హైట్స్) ప్రాంతం నుండి ఆ వాహనం చొరబడింది” అని సిరియా మిలట్రీ తెలిపింది. “మా సాయుధ బలగాలు ఆక్రమిత ప్రాంతాల నుండి చొరబడి యుద్ధ విరమణ రేఖను దాటి బిర్ ఆజమ్ గ్రామం వైపుకి వచ్చిన ఒక ఇజ్రాయెల్ వాహనాన్ని ధ్వంసం చేశారని ఆర్మీ మరియు సాయుధ బలగాల జనరల్ కమాండ్ తెలియజేసింది” అని సిరియా ప్రకటన పేర్కొంది.
బిర్ ఆజమ్ గ్రామంలో ఉన్న టెర్రరిస్టులకు సహాయం చేయడానికే ఇజ్రాయెల్ వాహనం చొరబడిందని సిరియా తెలిపింది. “(బిర్ ఆజమ్) గ్రామం సరిహద్దు ప్రాంతంలో ఉంది. అక్కడ సాయుధ టెర్రరిస్టు గ్రూపులు ఉన్నాయి” అని సిరియా తెలిపింది. తమ కాల్పుల తర్వాత ఇజ్రాయెల్ ఆక్రమిత భూభాగం నుండి రెండు రాకెట్లు ప్రయోగించిందని, అందులో ఎవరూ గాయపడలేదని సిరియా తెలిపింది. అధో స్ధితిలో ఉన్న టెర్రరిస్టు గ్రూపుల నైతిక స్ధైర్యాన్ని పెంపొందించే ఉద్దేశ్యంతోనే ఇజ్రాయెల్ చొరబాటుకి దిగిందని అయితే తమ సాయుధ బలగాలు తగిన బుద్ధి చెప్పాయని తెలిపింది.
గోలన్ హైట్స్ ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న సిరియా భూభాగం. 1967 అరబ్ యుద్ధంలో ఇజ్రాయెల్ గోలన్ హైట్స్ ను సిరియానుండి ఆక్రమించుకుంది. కాల్పులను విరమించిన చోట ఒక రేఖను గీచి అక్కడి నుండి ఇరు పక్షాలు భద్రతా జోన్ ను ఏర్పరిచాయి. ఈ రేఖను దాటి సిరియా భూభాగంలోకి ప్రవేశించి సిరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధంగా తలపడుతున్న ఆల్-నుస్రా ఫ్రంట్ టెర్రరిస్టులకు ఇజ్రాయెల్ సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ సహాయాన్ని సిరియా మొదటిసారిగా మంగళవారం అడ్డుకున్నట్లు కనిపిస్తోంది.
ఇజ్రాయెల్ రక్షణ మంత్రి మోషే యాలోన్ కూడా ఈ సంఘటనను ధృవీకరించడం విశేషం. అయితే ఈ ఘటనకు ఆయన పూసిన రంగు వేరు. “గత రాత్రి మేము ఇజ్రాయెల్ పెట్రోల్ వాహనం పైకి కాల్పులు జరిపిన సిరియా ఆర్మీ పొజిషన్ ఒకదానిని నాశనం చేశాము” అని ఆయన ప్రకటించాడని ఇజ్రాయెల్ పత్రికలు తెలిపాయి. ఇజ్రాయెల్ పెట్రోల్ వాహనం పైకి సిరియా ఆర్మీ కాల్పులు జరిపిండని అయితే అందులో ఏ వాహనమూ ధ్వంసం కాలేదనీ, ఎవరూ చనిపోలేదని ఇజ్రాయెల్ మిలట్రీ ప్రతినిధి ఒకరు చెప్పినట్లు కూడా సదరు పత్రికలు తెలిపాయి.
ఆల్-నుస్రాకు ఇజ్రాయెల్ మద్దతు
ఆల్-నుస్రా ను టెర్రరిస్టు సంస్ధగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. కానీ సిరియా ప్రభుత్వ బలగాలతో వాస్తవంగా తలపడుతున్నది ఆల్-నుస్రా మాత్రమే. ఈ సంస్ధ ఆల్-ఖైదాకు తన విధేయతను ప్రకటించింది. ఈ సంస్ధకు ఆయుధాలు అందకుండా జాగ్రత్త పడుతున్నామని అమెరికా చెబుతుంది. కానీ వాస్తవంలో అది సి.ఐ.ఏ ద్వారా సాయుధం చేస్తున్నది ఆల్-నుస్రా టెర్రరిస్టులనే. అమెరికా-ఇజ్రాయెల్ కూటమికి ఇలాంటి కపట విలువలు పాటించడం చాలా సాధారణం.
గత ఫిబ్రవరిలో సిరియా లోపల తమ రక్షణ కోసం బఫర్ జోన్ ఏర్పాటు చేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ ప్రకటనే ఎంత దురహంకార పూరితంగా ఉన్నదో గమనించవచ్చు. ఇజ్రాయెల్ రక్షణ కోసం సిరియా భూభాగంలో బఫర్ జోన్ ఏర్పాటు చేయడం ఏమిటసలు? సిరియా సరిహద్దు గ్రామాలను టెర్రరిస్టులులు వశం చేసుకున్నారనీ, వీరి నుండి తమకు ప్రమాదం ఉన్నదని, సిరియా ప్రభుత్వం వారిని కట్టడి చేయకపోతే తామే ఆ పనికి పూనుకుంటామని. అందుకోసమే బఫర్ జోన్ ఏర్పాటు చేస్తామని ఇజ్రాయెల్ కవి హృదయం యొక్క అర్ధం. ఈ మేరకు ఇజ్రాయెల్ హృదయ వేదనను లండన్ టైమ్స్ పత్రిక ఫిబ్రవరిలో వివరించింది.
ఇంతకు మించిన హిపోక్రసీ మరొకటి ఉండదేమో. ఆల్-నుస్రా టెర్రరిస్టుల వల్ల అంత భయం ఉన్నట్లయితే ఇజ్రాయెల్ తన అనుంగు బాసు అమెరికాకు చెప్పి ఆల్-నుస్రా టెర్రరిస్టులకు సహాయం చెయ్యొద్దని, అది తమ దేశ రక్షణకు భంగకరమని చెప్పవచ్చు. సిరియా కిరాయి తిరుగుబాటుని ఎగదోసింది, దానిని అన్నీ రకాల సహాయ సహకారాలను అందజేస్తున్నది అమెరికా, ఐరోపాలే. అవి ఇజ్రాయెల్ కి మిత్రులే. టెర్రరిస్టులను ఎగదోస్తున్నవారికి చెప్పడం మాని టెర్రరిస్టులతో పోరాడుతున్న వారితో “మీరు కట్టడి చేస్తారా సరే, లేదా మేమే మీ భూభాగంలోకి చొరబడి బఫర్ జోన్ ఏర్పాటు చేసుకుని వారి పని పడతాం” అని హెచ్చరించడం ఏమిటి? ఇలాంటి బుద్ధి మాలిన ప్రకటనలను, ట్విస్టెడ్ లాజిక్కులను పశ్చిమ పత్రికలు మాత్రమే నమ్మి ప్రచారం చేయగలవు.
వాస్తవం ఏమిటంటే ఇజ్రాయెల్ కూడా ఆల్-నుస్రాకు సహాయం చేయాలని తపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ లు తమకు ప్రమాదంగా భావిస్తున్న హిజ్బొల్లా(లెబనాన్)-సిరియా-ఇరాన్ అనే ప్రతిఘటన అక్షాన్ని (axis of resistance) పడగొట్టాలంటే మొదట సిరియాలో బలమైన సెక్యులర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని పధకం వేశాయి. 2006లో హిజ్బొల్లాను అణచివేయాలని అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ మూడు నెలల పాటు యుద్ధమే చేసింది. కానీ ఆ యుద్ధంలో హిజ్బొల్లా విజేతగా నిలవగా, ఇజ్రాయెల్-అమెరికాలకు అవహేళన మాత్రమే మిగిలింది. ఇపుడు సిరియాలో బాషర్ ప్రభుత్వాన్ని పడగొడితే ఇరాన్-హిజ్బొల్లా ల మధ్య సంబంధాన్ని బలహీనపరిచి తద్వారా అంతిమంగా ఇరాన్ ను లొంగదీసుకోవాలని అమెరికా-ఇజ్రాయెల్-ఐరోపా కూటమి తలపోస్తోంది. కానీ సిరియా వారికి కొరకరాని కొయ్యగా మారింది.
సిరియా టెర్రరిస్టులకు మద్దతుగా ఇప్పటికీ మూడుసార్లు ఇజ్రాయెల్ దాడి చేసింది. వైమానిక దాడులు చేసి ఒక సారి 45 మంది సిరియా సైనికులను కూడా చంపేసింది. ఈ పరిణామంతో రష్యా అప్రమత్తమైంది. శక్తివంతమైన తమ ఎస్-600 క్షిపణులను సిరియాకు సరఫరా చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సరఫరా ఆపడానికి ఇజ్రాయెల్ ప్రధాని ప్రత్యేకంగా రష్యా సందర్శించి పుతిన్ ను కలిసినప్పటికీ ఆపలేకపోయాడు. ఎస్-600 క్షిపణులు సిరియా విషయంలో ‘గేమ్-ఛేంజర్’ అవుతాయని పలువురు విశ్లేషిస్తున్నారు. క్షిపణులను సిరియాకు అందకుండా ఉండాలంటే ఇజ్రాయెల్ ఇప్పుడు వాటిని తానే నాశనం చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే రష్యాను రెచ్చగొట్టినట్లే. తన సరఫరా పై దాడి చేసినందుకు రష్యా స్వయంగా రంగంలోకి దిగడం ఖాయం. దానితో ఇజ్రాయెల్ కి మద్దతుగా అమెరికా రంగంలోకి దిగుతుంది. సిరియా కిరాయి తిరుగుబాటు కాస్తా ప్రాంతీయ యుద్ధంగా మారి త్వరలోనే ప్రపంచ యుద్ధంగా మారినా మారవచ్చు.
మధ్య ప్రాచ్యమా మజాకా!