సిరియా భవిష్యత్తు నిర్ణయించడానికి వాళ్ళెవరు? -బషర్


అర్జెంటీనా వార్తా సంస్ధలు క్లారిన్, తెలం ల విలేఖరులతో బషర్ అస్సద్

అర్జెంటీనా వార్తా సంస్ధలు క్లారిన్, తెలం ల విలేఖరులతో బషర్ అస్సద్

సిరియా భవిష్యత్తు నిర్ణయించాల్సింది సిరియా ప్రజలు మాత్రమేనని ఆ దేశ అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సద్ మరోసారి స్పష్టం చేశారు. సిరియా ప్రజల తరపున మాట్లాడడానికి జాన్ కెర్రీ ఎవరని ఆయన సూటిగా ప్రశ్నించారు. అర్జెంటీనా టి.వి చానెళ్ల విలేఖరులకు ఇంటర్వ్యూ ఇచ్చిన బషర్ అమెరికా-రష్యా ల శాంతి సమావేశం ప్రయత్నాలు ఫలిస్తే సంతోషమని, కానీ పశ్చిమ దేశాలకు శాంతి ప్రయత్నాలు సఫలం కావడం ఇష్టం లేదని వ్యాఖ్యానించాడు. సిరియాలో కిరాయి తిరుగుబాటుదారులు ఎదురు దెబ్బలు తింటూ వరుస ఓటమలు చవిచూస్తుండడంతో, సమయం తీసుకుని తిరిగి పుంజుకునే ఎత్తుగడతోనే అమెరికా శాంతి పల్లవి ఎత్తుకుందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్న నేపధ్యంలో సిరియా అధ్యక్షుడు అనుమానాలు సత్యదూరం కాబోవు.

“రష్యా-అమెరికా ప్రయత్నాలను మేము స్వాగతిస్తున్నాం. సిరియా ప్రజలు సంక్షోభాన్ని అధిగమించడానికి ఈ అంతర్జాతీయ సమావేశం సహాయపడుతుందని ఆశిస్తున్నాం. కానీ సిరియాలో ఒక పరిష్కారాన్ని చూడడానికి అనేక పశ్చిమ దేశాలు ఇష్టపడుతున్నాయని మేము భావించడం లేదు. టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్న అనేక శక్తులు సంక్షోభానికి పరిష్కారం కావాలని భావిస్తున్నాయని కూడా మేము అనుకోవడం లేదు” అని అర్జెంటీనా ఛానెళ్ళతో బషర్ అన్నారని రష్యా టుడే పత్రిక తెలిపింది.

అనేక పశ్చిమ దేశాలు అంటే బషర్ ఉద్దేశ్యం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలని. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు చురుకుగా సిరియా తిరుగుబాటుదారులకు మద్దతు ఇస్తుండగా జర్మనీ తెరవెనుక నుండి మద్దతు ఇస్తోంది. టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్న శక్తులు అంటే ఈ పశ్చిమ దేశాలతో పాటు టర్కీ, సౌదీ అరేబియా, కతార్, జోర్డాన్ దేశాలు. బహ్రెయిన్, యు.ఏ.ఇ లాంటి ఇతర గల్ఫ్ దేశాలు కూడా సిరియా టెర్రరిస్టులకు మద్దతు ఇస్తున్నప్పటికీ అవి పరోక్ష పాత్ర మాత్రమే పోషిస్తున్నాయి.

టెర్రరిస్టులతో చర్చలు జరపమంటున్న దేశాలు తాము ఆ పని చేయగలవా అని బషర్ ప్రశ్నించారు. “అమెరికా, ఐరోపాలు కూడా టెర్రరిజం బాధితులే – టెర్రరిస్టులతో చర్చలు చేయడానికి ఏ ప్రభుత్వమూ సుముఖంగా లేదు. ఒక రాజకీయ శక్తితో చర్చలు అంటే సరే. కానీ తలలు తెగనరుకుతూ, సామూహిక హత్యలు చేస్తూ, విషపూరిత రసాయన వాయువులను ప్రజల మీద ప్రయోగించే టెర్రరిస్టులతో చర్చలా?” అని బషర్ ప్రశ్నించారు. సిరియా సంస్కరణలకు సంబంధించి విదేశాలు నిర్ణయాత్మక పాత్ర పోషించజాలవని బషర్ పునరుద్ఘాటించారు.

అస్సద్ దిగిపోవడం ద్వారా శాంతికి కృషి చేయవచ్చని అమెరికా విదేశీ మంత్రి కెర్రీ చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. “సిరియాలో ఎవరైనా ఒక వ్యక్తి కొనసాగాలో లేక దిగిపోవాలో చెప్పేందుకు కెర్రీ గాని మరొకరుగానీ సిరియా ప్రజలనుండి ఎలా మేండేట్ పొందగలిగారో నాకు అర్ధం కాకుండా ఉంది. సిరియాలో సంస్కరణల గురించిన ఏ నిర్ణయమైనా అది సిరియా ప్రజల నుండే రావాలి. అమెరికా గానీ, మరే ఇతర దేశం గానీ ఇందులో జోక్యం చేసుకునేందుకు వీలు లేదు” అని బషర్ స్పష్టం చేశారు.

రెండు సంవత్సరాల నుండి రగులుతున్న సిరియా కిరాయి తిరుగుబాటులో ఐరాస లెక్కల ప్రకారం 80,000 మందికి పైగా చనిపోయారు. టెర్రరిస్టులు విచక్షణారహితంగా సాగించిన దాడుల్లో అనేకమంది ప్రజలు ఆహుతి అయ్యారు. టెర్రరిస్టులు సాగించిన మారణకాండలకు సిరియా అధ్యక్షుడు బషర్ కారణమని చెప్పేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నాలు చేశాయి. అయితే అసలు బాధ్యులు టెర్రరిస్టులెనని వారికి ఆయుధాలు, డబ్బు, ఆహారాలు సరఫరా చేస్తున్నది అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, కతార్ దేశాలేనని ససాక్ష్యాలతో వెల్లడి కావడంతో ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు.

చివరికి రసాయన ఆయుధాలు సైతం టెర్రరిస్టులకు సరఫరా చేసి ప్రయోగింపజేసిన అమెరికా తదితర పశ్చిమ దేశాలు ఆ నెపాన్ని బషర్ పై నెట్టడానికి చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు. దానితో గత్యంతరం లేని పరిస్ధితుల్లో జూన్ 2012 నాటి జెనీవా సదస్సు శాంతి తీర్మానాన్ని ముందుకు కొనిపోవడానికి అమెరికా కనీసం పైకయినా అంగీకరించక తప్పలేదు.

మరో వైపు వివిధ టెర్రరిస్టు సంస్ధల మధ్య అంతర్గత వైరుధ్యాలు తలెత్తి పరస్పరం ఒకరినొకరు చంపుకుంటున్నారని శనివారం వెలువడిన వార్తల ద్వారా తెలుస్తోంది. బషర్ ని కూలదోయడానికి ఆల్-ఖైదా అనుబంధిత ఆల్-నుస్రా ఫ్రంట్ ను వినియోగిస్తున్న అమెరికా తదితర పశ్చిమ దేశాలు తమకు అచ్చిరాకపోతే వారిని నడిసంద్రాన వదిలేయడానికి ఏ మాత్రం వెనుకాడవు. ఈ నేపధ్యంలో భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు రష్యా, చైనాల దౌత్య, వ్యూహాత్మక విజయానికి, అమెరికా, ఐరోపాల పరాజయానికి సూచికలుగా వ్యక్తం అయితే ఆశ్చర్యపోనవసరం లేదు.

వ్యాఖ్యానించండి