సిరియా కిరాయి తిరుగుబాటు విషయంలో అమెరికా క్రమంగా మద్దతు కోల్పోతోంది. అమెరికా తదితర పశ్చిమ రాజ్యాలతో పాటు మధ్య ప్రాచ్యంలోని వివిధ ఇస్లాం మత ఛాందస రాజ్యాలు మద్దతు ఇస్తున్న కిరాయి తిరుగుబాటుదారులు సిరియా ప్రజలపై సాగిస్తున్న అకృత్యాలు క్రమంగా వెల్లడి అవుతుండడంతో పశ్చిమ రాజ్యాల ఎత్తుగడలకు మద్దతు ఇవ్వడానికి వివిధ దేశాలు వెనకాడుతున్నాయి. బుధవారం పశ్చిమ దేశాల మద్దతుతో ఐరాసలో కతార్ ప్రవేశపెట్టిన తీర్మానానికి గతం కంటే మద్దతు తగ్గిపోవడాన్ని అంతర్జాతీయ పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.
బుధవారం జరిగిన ఐరాస జనరల్ అసెంబ్లీలో సిరియా విషయమై కతార్ ఒక తీర్మానం ప్రవేశ పెట్టింది. సిరియా తిరుగుబాటుకు సంబంధించి ఐరాస ఆమోదించిన తీర్మానాల్లో ఇది అయిదవది. సిరియాలో రాజకీయ పరివర్తన జరగాలని కోరిన ఈతీర్మానాన్ని 107 దేశాలు సమర్ధించగా 12 దేశాలు వ్యతిరేకించాయి. 59 దేశాలు ఓటు వేయలేదు. జనరల్ అసెంబ్లీ తీర్మానాలను దేశాలు పాటించి తీరాలన్న నిబంధన ఏమీ లేదు. భద్రతా సమితి తీర్మానాలు మాత్రమే పాటించవలసిన నిబంధన ఉంటుంది.
గత ఆగస్టులో ఐరాస జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంతో పోలిస్తే ఇప్పటి తీర్మానానికి మద్దతు తగ్గిపోవడం గమనార్హం. ఆగస్టు తీర్మానానికి 133 దేశాలు మద్దతు ఇవ్వగా 12 దేశాలు వ్యతిరేకించాయి. 31 దేశాలు ఓటు వేయలేదు. అప్పటికి ఇప్పటికీ ఓటు వేయని దేశాల సంఖ్య 28 పెరిగి 59కి చేరగా మద్దతు దేశాల సంఖ్య 26 తగ్గి 107కు చేరింది. వ్యతిరేకించిన దేశాలలో ఎలాంటి మార్పు లేకపోయినప్పటికీ పశ్చిమ దేశాలకు గుడ్డిగా మద్దతు ఇచ్చే దేశాల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. ఇలా తగ్గిన దేశాలలో ఇండియా కూడా ఒకటి.
సిరియా తిరుగుబాటుదారులు అక్కడి ప్రజలపైనా, ప్రభుత్వ సైనికుల పైనా సాగిస్తున్న అకృత్యాలు ఒక్కొక్కటి వెలుగు చూడడంతో అమెరికా ప్రేరేపించే తీర్మానాలకు మద్దతు ఇవ్వడానికి దేశాలు వెనకాడుతున్నాయి. ఈ విషయాన్నే ఐరాసలో భారత్ శాశ్వత ప్రతినిధి అశోక్ కుమార్ ముఖర్జీ ఎత్తి చూపారు. “ఏక పక్ష చర్యలు సంక్షోభాన్ని నివారించలేవు… అది సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. మరింత అస్ధిరత్వానికి, హింసకు దారి తీస్తుంది. అవి సిరియా సరిహద్దులను దాటి విస్తరించే అవకాశం కూడా ఉన్నది” అని ముఖర్జీ వ్యాఖ్యానించారని ది హిందు తెలిపింది. సిరియా ప్రభుత్వ సైనికుడిని చంపి అతని గుండెను పెకలించి ఒక తిరుగుబాటు నాయకుడు తింటున్న దృశ్యం ఉన్న ఒక వీడియో ఇంటర్నెట్ లో విస్తృతంగా ప్రచారం పొందింది.
బహుశా ఈ సందేశాన్ని అందుకున్నారేమో సిరియా విషయంలో అమెరికా ఏకపక్షంగా చర్య తీసుకోదంటూ అధ్యక్షుడు ఒబామా శుక్రవారం వ్యాఖ్యానించారు. అమెరికా సందర్శించిన టర్కీ ప్రధాని ఎర్దోగన్ తో కలిసి వైట్ హౌస్ వద్ద విలేఖరుల సమావేశం నిర్వహించిన ఒబామా ఈ మేరకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. సిరియా కిరాయి తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారంటూ సిరియా ప్రభుత్వం ఆరోపించిన దేశాల్లో టర్కీ ఒకటి. సిరియాతో వేల కి.మీ సరిహద్దు ఉన్న టర్కీ, సరిహద్దు వెంబడి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి తిరుగుబాటుదారులకు శిక్షణ ఇచ్చి సిరియాలోకి పంపుతోందని పశ్చిమ పత్రికలతో సహా అనేక పత్రికలు తెలిపాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, కతార్, సౌదీ అరేబియా దేశాలు సిరియా కిరాయి తిరుగుబాటుకు చురుకుగా మద్దతు ఇస్తున్నాయి.
బుధవారం నాటి ఐరాస సమావేశానికి ముందు సిరియా పరిస్ధితిపై ఆయా దేశాలను హెచ్చరిస్తూ రష్యా లేఖలు రాసింది. కతార్ తీర్మానం అమెరికా-రష్యాలు చేస్తున్న శాంతి యత్నాలకు భంగకరమని, కనుక దానికి దూరంగా ఉండాలని కోరింది. సాటి బ్రిక్స్ సభ్య దేశం సూచనను ఇండియా గౌరవించినట్లు కనిపిస్తోంది. పాకిస్ధాన్ మాత్రం సిరియాకు వ్యతిరేక కతార్ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది.

