ఇజ్రాయల్ అకడమిక్ బాయ్ కాట్ లో చేరిన స్టీఫెన్ హాకింగ్


Stephen Hawking

ఐనిస్టీన్ తర్వాత అంతటి మేధావిగా మన్ననలు అందుకుంటున్న ప్రఖ్యాత బిటిష్ ఫిజిక్స్ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, బహుశా తన జీవితంలో మొదటిసారిగా ఒక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయల్ ను అకడమిక్ బాయ్ కాట్ చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు షిమాన్ పెరెజ్ ఆతిధ్యం ఇవ్వనున్న అత్యున్నత స్ధాయి కాన్ఫరెన్స్ కు హాజరు కాకూడదని ఆయన నిర్ణయించాడు. తద్వారా ఇజ్రాయెల్ ను అకడమిక్ గా బాయ్ కాట్ చేస్తున్న బ్రిటిష్ ప్రముఖుల్లో ఆయన కూడా ఒకరయ్యారు.

‘బ్రిటిష్ కమిటీ ఫర్ ద యూనివర్సిటీస్ ఆఫ్ పాలస్తీన్’ (Bricup – బ్రికప్) అనే సంస్ధ ఇజ్రాయెల్ అకడమిక్ బాయ్ కాట్ కు సారధ్యం వహిస్తోంది. ఇజ్రాయెల్ లో పాలస్తీనా అరబ్బు ప్రజలపై సాగిస్తున్న అమానుష దమనకాండకు వ్యతిరేకంగా బ్రికప్ సంస్ధ ‘అకడమిక్ బాయ్ కాట్’ ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఉద్యమం ఫలితంగా అనేకమంది విద్యావేత్తలు, రచయితలు, సినిమా నిర్మాతలు ఇజ్రాయెల్ ను బహిష్కరించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్వహించే విద్యా, సాంస్కృతిక కార్యకలాపాలు వేటిలోనూ పాల్గొనకుండా బహిష్కరించడం బ్రికప్ చేపట్టిన నిరసన విధానం.

“ఆయన (స్టీఫెన్ హాకింగ్) తనకు పాలస్తీనా పట్ల ఉన్న అవగాహన, తన సొంత అకడమిక్ సంబంధీకులు ఏకగ్రీవ సలహాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు” అని బ్రికప్ ప్రతినిధి తెలిపాడని ది హిందు తెలియజేసింది.

ప్రొఫెసర్ హాకింగ్ ఇజ్రాయెలి ప్రెసిడెన్షియల్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించవలసి ఉండగా దానిని రద్దు చేసుకున్నారు. ఇజ్రాయెలి ప్రెసిడెన్షియల్ కాన్ఫరెన్స్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. పత్రిక ప్రకారం టోని బ్లెయిర్, జార్జి డబ్ల్యూ. బుష్, హెన్రీ కిసింజర్ లాంటి ప్రముఖులు ఈ వార్షిక సభల్లో పాల్గొని ప్రసంగించిన చరిత్ర ఉన్నది.  ఈసారి జెరూసలేం లో జరగనున్న ఈ కాన్ఫరెన్స్ లో ‘ఫేసింగ్ టుమారో’ అనే అంశం పైన ప్రసంగించవలసిందిగా హాకింగ్ కు ఆహ్వానం అందింది. ఇజ్రాయెల్ అధ్యక్షుడు షిమాన్ పెరెజ్ పుట్టిన రోజు కూడా ఈ సంవత్సరం కాన్ఫరెన్స్ సందర్భంగా జరపనున్నట్లు తెలుస్తోంది.

“ప్రొఫెసర్ హాకింగ్ తన సహ విద్యావేత్తలతో చర్చించి, తన వ్యక్తిగత కారణాల రీత్యా, కాన్ఫరెన్స్ కు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు” అని కేంబ్రిడ్జి యూనివర్సిటీ తెలిపింది. పాలస్తీనీయుల భూభాగాలను ఆక్రమిస్తూ, అక్రమ సెటిల్మెంట్లు నిర్మిస్తున్న ఇజ్రాయెల్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అనేక సంవత్సరాలుగా వివిధ రంగాలలో నిరసనలు వెల్లువెత్తినప్పటికీ ఇజ్రాయెల్ పట్టించుకోలేదు. నిరసనలు వ్యక్తం చేసినవారిపైన ఎదురు దాడికి దిగడం ఇజ్రాయెల్ ప్రభుత్వాలు క్రమం తప్పకుండా అనుసరిస్తున్న విధానం.

ఇజ్రాయెల్ లో కూడా అనేకమంది పాలస్తీనా ప్రజలు నివాసితున్నారు. వీరిపైన జాత్యహంకార విధానాలను యూదు రాజ్యం, ప్రజలు అమలు చేస్తారు. పాలస్తీనా అరబ్బులను తమ రోడ్లపై తిరగనివ్వరు. యూదులకు అందమైన రోడ్లు నిర్మించుకుని పాలస్తీనా ప్రజలకు ప్రత్యేకంగా కచ్చా రోడ్లు నిర్మిస్తారు. యూదు ఆవాసాల చుట్టూ పెద్ద ఎత్తున గోడలు కట్టుకోవడం ఆనవాయితి. పాలస్తీనా ప్రజలకు చెందిన జల వనరులను కూడా లాక్కునే విధానాలను ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుసరిస్తోంది. ఈ విధానాలపై అంతర్జాతీయంగా ఎన్ని నిరసనలు వచ్చినప్పటికీ ఇజ్రాయెల్ లొంగిరాలేదు.

One thought on “ఇజ్రాయల్ అకడమిక్ బాయ్ కాట్ లో చేరిన స్టీఫెన్ హాకింగ్

  1. శాస్త్రవేత్తలకు సామాజిక విషయాల మీద అవగాహన ఉండటం హర్షించదగిన విషయం.

వ్యాఖ్యానించండి