సీతాకోకచిలకలా ఎగరాలి, తేనెటీగలా కుట్టాలి… -కార్టూన్


The Hindu

The Hindu

“Float like a butterfly, sting like a bee” అనేది ఒక పాట. బ్రిటిష్ పాప్ సింగర్ ఫిల్ మార్షల్ రాసి పాడిన పాట ఇది. ఆ పాటని భారత విదేశాంగ విధానానికి అన్వయించారు కార్టూనిస్టు కేశవ్. ఆయన సెన్సిబుల్ కార్టూనిస్టు అనడానికి ఈ కార్టూన్ మరొక మచ్చుతునక.

ఇటీవల కాలంలో రెండు (స్వ)విదేశీ సమస్యలు భారత విదేశాంగ విధానానికి పరీక్ష పెట్టాయి. అమెరికా ‘ఆసియా పివోట్’ వ్యూహంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ ను మిత్రుడుగా చేసుకున్నాక భారత్ విదేశాంగ విధానం సహజంగానే కత్తిమీది సాములా మారిపోయింది. భారత సరిహద్దుల్లో ఏ చిన్న కదలిక జరిగినా అది అనివార్యంగా అమెరికా జియో పోలిటికల్ వ్యూహాలతో ముడిపడిపోయి ఉంటుంది. అప్పటికి ముడిపడి ఉండకపోతే, అప్పటి తర్వాతయినా ముడిపడిపోతుంది. ఈ నేపధ్యంలో పాకిస్ధాన్, చైనా లకు సంబంధించి భారత్ ఎత్తుగడలు మరీ సంక్లిష్టంగా, సున్నితంగా మారిపోయినై.

“సీతాకోక చిలకలాగా ఎగరడం తేలిగ్గానే ఉంది గానీ, తేనెటీగలాగా కుట్టడమే…. (ఇబ్బందికరంగా ఉంది)” అని భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మౌనంగా వాపోతున్నట్లు కార్టూనిస్టు చిత్రీకరించడం ఈ నేపధ్యంలోనే. లడఖ్ లో తలవని తలంపుగా చైనా నెలకొల్పిన సైనిక శిబిరం భారత ప్రతిపక్షాలకు, ముఖ్యంగా బి.జె.పికి అందివచ్చిన అవకాశం. ఈ సమస్యను అడ్డం పెట్టుకుని కృత్రిమ దేశభక్తిని రెచ్చగొట్టడం రాజకీయ పార్టీలకు చాలా తేలిక.

కానీ బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న దరిమిలా చైనాతో పెంపొందుతున్న స్నేహ సంబంధాలు భారత ఆర్ధిక వ్యవస్ధకు సహాయకారి అనడం నిస్సందేహం. అదీ కాక మే రెండో వారంలో సల్మాన్ ఖుర్షీద్ చైనాలో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఆయన కజకిస్తాన్ లో ఉన్నారు. ఈ పర్యటనకు ముందు చైనాకు వ్యతిరేకంగా దూకుడుగా వ్యవహరించి సంబంధాలు చేడగొట్టుకోవడం ఎందుకన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సల్మాన్ ప్రకటనలు, రక్షణ మంత్రి ఆంటోని ప్రకటనలు సూచించాయి.

దానితో సీతాకోక చిలకలాగా అందరికి దృశ్యానందాన్ని పంచుతూ చైనాకి ఎగిరి వెళ్ళడం తేలికగానే ఉన్నా అక్కడికి వెళ్ళాక తేనెటీగలాగా కుట్టడమే, అనగా సరిహద్దు సమస్యపై తాడో పేడో తేల్చుకోవడమే, కష్టం అని సల్మాన్ తలపోస్తున్నట్లు ఈ కార్టూన్ సూచన. మే నెలలోనే చైనా ప్రధాని లీ కెకియాంగ్ భారత్ రానున్నారు. సల్మాన్ చైనా పర్యటన దానికి తగిన ఏర్పాట్లలో భాగమే. కనుక సున్నితంగా వ్యవహరించడం తప్ప మరో మార్గం ప్రస్తుతానికి లేదు.

ఇక పాక్ తో వచ్చిన సమస్య ఇబ్బందికరంగా మారింది. పాక్ జైలులో దాడిలో చనిపోయిన సరబ్ జిత్ సింగ్ విషయంలో ఇండియా దాదాపు దూకుడుగా వ్యవహరించింది. పాక్ ని దోషిని చేసింది. జైళ్ళు ఇలాగానే నడిపేది అని ఇండియా ప్రశ్నించింది. ఇతర భారత ఖైదీలకు రక్షణకు గ్యారంటీ ఉన్నదా అని నిలదీసింది. సరబ్ జిత్ సింగ్ విగత దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడమే దాదాపు కోటిన్నర రూపాయల వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం ప్రకటించాయి.

ఇంతలోనే జమ్ము జైలులో పాక్ ఖైదీ పైన దాడి జరిగింది. సనయుల్లా పాక్ గూఢచారి అయితే, సరబ్ జిత్ భారత గూఢచారి. సరిహద్దు గ్రామాల్లో యువకులను ఆకర్షించి గూఢచారులుగా సరిహద్దు దాటించడం ఇరు దేశాలకు ఉన్న అలవాటే. సరబ్ జిత్ సింగ్ భారత గూఢచారిగా పాకిస్ధాన్ లోకి ప్రవేశించాడన్న విషయాన్ని భారత ప్రభుత్వం ప్రకటించలేదు. ఆయన కుటుంబం కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. తాగి గీత దాటాడని మాత్రమే చెప్పారు. గూఢచారులకు అరెస్టు కానంతవరకు మాత్రమే ప్రభుత్వ మద్దతు డబ్బు రూపంలో ఉంటుంది. ప్రత్యర్ధులకు పట్టుబడితే తమకు సంబంధం లేదనే ప్రభుత్వాలు చెబుతాయి. ప్రతిదేశమూ పాటించే సూత్రమే ఇది.

జమ్ము జైలు దాడితో భారత్ గొంతు మూగబోయింది. అప్పటివరకూ ఆత్మరక్షణలో ఉన్న పాకిస్ధాన్ ఒక్కసారిగా గొంతు పెంచి దాడి మొదలు పెట్టింది. జైళ్ళు నడిపేది ఇలాగేనా అని ఎదురు ప్రశ్నించింది. ఇంకా 500కి పైగా పాక్ ఖైదీలు ఉన్నారు, వారికి రక్షణ ఉన్నదా అని నిలదీసింది. ‘మావాడిని చూసుకోవడానికి మా రాయబారులు వస్తారు అనుమతి ఇవ్వండి’ అని డిమాండ్ చేసింది. భారత్ కూడా అప్పటివరకూ దాడి పొజిషన్ లో ఉన్నది కాస్తా ఆత్మరక్షణలో పడిపోయింది. కార్టూన్ లో సల్మాన్ తలకి ఉన్న బొప్పి బహుశా ఇదే సూచిస్తోంది.

అందుకే సీతాకోక చిలక లాగా ఎగరడం తేలికే గానీ, తేనెటీగలాగా కుట్టడమే…..

2 thoughts on “సీతాకోకచిలకలా ఎగరాలి, తేనెటీగలా కుట్టాలి… -కార్టూన్

  1. గూఢచారులు చక్కగా వీసాలు తీసుకొని విమానాలు ఎక్కి వేరే దేశానికి వెల్లి పర్యాటకుల లాగానొ వ్యాపారుల లాగానొ విద్యార్దుల లాగానొ ఉంటూ గూడచర్యం చేస్తారని అంటారు కాని ఇలా తప్ప తాగి గీత దాటి వెల్లి కూడా గూదచర్యం చేస్తారని ఒక కొత్త కోణాన్ని మీరు ఆవిష్కరించారు ఎంతైనా మీరు జర్నలిస్ట్ చేతితొ కవి హ్రుదయం తొ పుట్టారు కదా ఒక చిన్న కార్టూన్ మీదె 4 పేజీలు రాస్తారు ఈ ఆవిష్కరణ మీకు లెక్కలొనిది కాదు కదా …………..

వ్యాఖ్యానించండి