ఇండియా భాగస్వామిగా ఉన్న బ్రిక్స్ (BRICS) లో చేరడం తమ లక్ష్యంగా ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్ మోర్సి ప్రకటించాడు. సోమవారం నుండి ఇండియాలో పర్యటిస్తున్న విప్లవానంతర ఈజిప్టుకు మొదటి అధ్యక్షుడుగా ఎన్నికయిన మోర్సి పర్యటనకు ముందు ది హిందు పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. భారత దేశంతో వాస్తవిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా తమ దేశ ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించుకోవాలని భావిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల కూటమి బ్రిక్స్ కూటమి ఈజిప్టు చేరికతో E-BRICS గా పేరు పొందాలన్న కోరికను వ్యక్తం చేశాడు. కాగా రెండు రోజుల పర్యటనలో మోర్సి భారత ప్రభుత్వంతో 7 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పత్రికలు తెలిపాయి.
“ఇండియాతో ఒక అసమానమైన, శక్తివంతమైన, సంస్థాగతమైన, పరస్పర లాభకరమైన సంబంధాలు నెలకొల్పుకోవాలని నేను ఆశిస్తున్నాను. భారతీయులకు, మేము ఉత్తర ఆఫ్రికాతో పాటు ఆఫ్రికాకు సైతం కూడలిగా ఉపయోగపడగలం” అని మోర్సి భారత వ్యాపారులను ఊరించాడు. బ్రిక్స్ కూటమిలో చేరడానికి మోర్సి అమిత ఆసక్తి ప్రదర్శించాడు. “BRICS ఏదో ఒకరోజు E-BRICS గా అవతరిస్తుందని ఆశిస్తున్నాను. ఇందులో E అంటే ఈజిప్టు. మా ఆర్ధిక వ్యవస్ధలో కదలిక ఆరంభం అయ్యే నాటికి E-BRICS సాకారం అవుతుందని నా నమ్మకం.” అని మోర్సి తెలిపాడు. అయితే భారత్, ఈజిప్టు ప్రభుత్వాధినేత చర్చలలో ఈ విషయమై చర్చలు జరిగినట్లు ఏ మాత్రం సూచన అందకపోవడం గమనార్హం.
ఎందుకు ఆసక్తి?
BRICSలో చేరికపై మోర్సి అంత ఆసక్తిగా ఎందుకు ఉన్నట్లు? ఆయన ఇంటర్వ్యూలోని ఒక అంశం ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్లు కనిపిస్తోంది. BRICS బ్యాంకు నెలకొల్పడానికి సదరు కూటమి దేశాలు చేసిన ప్రతిపాదన ఈజిప్టు అధ్యక్షుడు మోర్శిని ఆకర్షించినట్లు కనిపిస్తోంది. BRICS బ్యాంక్ అనే ఆలోచనకు మోర్సి గట్టిగా మద్దతు ఇచ్చాడు. “(కూటమి) దేశాలు అత్యున్నత వృద్ధి రేటు సాధించడానికి అటువంటి బ్యాంకు బాగా తోడ్పడుతుంది.
అంతే కాకుండా IMF, ప్రపంచ బ్యాంకు తదితర సంస్థలకు అనుబంధం సహాయంగా ఉపయోగపడుతుంది” అని ఈజిప్టు అధ్యక్షుడు పేర్కొన్నాడు. పశ్చిమ దేశాల తరపున ప్రపంచ కాబూలీవాలా గా వ్యవహరిస్తూ అప్పులతో పీడించుకు తింటున్న ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకులకు BRICS Bank అనుబంధంగా ఉండాలే తప్ప ప్రత్యామ్నాయంగా ఉండాలని మోర్సి ఆశించకపోవడం గమనార్హం.
‘ఎమర్జింగ్ ఆర్ధిక వ్యవస్థలు‘గా పేరు పొందిన దేశాలలో నాలుగు దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మొదట BRIC కూటమిగా ఏర్పడి పశ్చిమ దేశాల పెత్తనాన్ని పరిమితంగా అయినా ఎదుర్కునే ప్రయత్నం చేశాయి. ఈ కూటమి పశ్చిమ దేశాలకు పోటీగా ఉండడం కంటే అంతర్జాతీయ వేదికల పైన ఉమ్మడి బేరసారాలకు మాత్రమే ప్రధానంగా ఉపయోగపడుతోంది. సౌత్ ఆఫ్రికాను కూడా కలుపుకున్న తర్వాత బ్రిక్స్ గా ఈ కూటమిని పిలుస్తున్నారు.
అత్యధిక జనాభా కలిగిన దేశాలు ఇండియా, చైనాలు సభ్యులుగా ఉండడం, అమెరికా తర్వాత చైనా ప్రధాన ఆర్ధిక శక్తిగా ఎదగడం, ఒకప్పుడు అమెరికాతో ప్రపంచాధిపత్యానికి పోటీపడిన రష్యా కూడా ఇందులో సభ్యురాలు కావడంతో బ్రిక్స్ కూటమి దేశాలలోని భారీ మార్కెట్లు ఆకర్షణీయంగా మారాయి. ఈ దేశాల సరసన నిలవడం అంటే పశ్చిమ దేశాల తర్వాత స్ధానంలో నిలవడంగా ఇప్పుడు వాడుకలోకి వస్తున్నది. కనుక, బ్రిక్స్ లో చేరడానికి ఈజిప్టు ఆసక్తి చూపడంలో ఆశ్చర్యం లేదు.
ఏకధ్రువ వ్యతిరేకత
ఏక ధృవ ప్రపంచంగా ప్రస్తుత ప్రపంచం కొనసాగడానికి తాను బద్ధ వ్యతిరేకిని మహమ్మద్ మోర్సి చెప్పడం విశేషం. సోవియట్ రష్యా పతనం అయ్యే ముందు వరకు ప్రపంచ రాజకీయ, ఆర్ధిక వ్యవస్థ ద్వి ధృవ ప్రపంచంగా ఉంటూ వచ్చింది. అమెరికా, రష్యాలు ప్రధాన ఆర్ధిక, రాజకీయ, రక్షణ (defense) కేంద్రాలుగా ఉండగా ప్రపంచ దేశాలు చెరో పక్షం చేరి ఉన్న పరిస్ధితిని రెండు ధృవాల ప్రపంచంగా విశ్లేషకులు పేర్కొన్నారు. అప్పటి పరిస్ధితిని ఈ విశ్లేషణకు చక్కగా అమరింది కూడా. ఈ రెండు శిబిరాలలో లేకుండా తటస్థ దేశాలుగా ఉండే పేరుతో ఇండియా, ఈజిప్టు, ఇండోనేషియాల చొరవతో ‘అలీన దేశాల కూటమి‘ (Non-Aligned Movement –
NAM) ఏర్పడింది. కానీ దానిని ప్రధానంగా నామమాత్ర చర్యలతో పరిమితం చేయడంలో అగ్రరాజ్యాలు సఫలం అయ్యాయి.
NAM కూటమి మళ్ళీ శక్తివంతమైన పాత్ర పోషించాలని మోర్సి ఉవ్విళ్లూరుతున్నాడు. ‘ఏక ధృవ ప్రపంచం‘ కొనసాగడానికి వీలు లేదని చెబుతూ ఆయన ‘సమకాలీన ప్రపంచంలో కీలకమైన సమతూకం తేవడానికి, సమగ్ర శాంతిని సాధించడానికీ‘ అలీన కూటమి మళ్ళీ తన పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నాడు. “ప్రపంచానికి ఒకే ఒక ధృవం (అమెరికా) ఆధిపత్యం వహించడాన్ని అంగీకరించరాదు. ఈ విషయంలో అలీన దేశాల కూటమి ప్రభావశీల పాత్ర పోషించగలదు. భారత దేశ నాయకులతో ఈ అంశాన్ని చర్చిస్తాను” అని మోర్సి ది హిందు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
అయితే మోర్సి మాటలు ఒట్టి వాగాడంబరం అని ఆయన ఆచరణ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇటీవల ఇరాన్ రాజధాని టెహరాన్ లో జరిగిన అలీన దేశాల కూటమి సమావేశంలో ఆయన అచ్చు అమెరికా తదితర పశ్చిమ దేశాల ప్రతినిధిగానే మాట్లాడాడు తప్ప ఏక ధృవ ఆధిపత్యాన్ని వ్యతిరేకించే విధంగా ఏమీ మాట్లాడలేదు. పైగా సిరియాలోని స్వతంత్ర సెక్యులర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆల్-ఖైదా టెర్రరిస్టులకు ఆయుధాలు, శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తూ, స్వయంగా సిరియా సరిహద్దులలో క్షిపణులు కూడా మోహరింపజేసిన, అమెరికా, యూరోపియన్ రాజ్యాల దుర్మార్గాలకు వంతపాడాడు.
‘సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్ గద్దె దిగాలన్న అమెరికా, యూరప్ దేశాల డిమాండును అలీన కూటమి సమావేశాల్లో ప్రవేశపెట్టిన ఒకే ఒక్క నేత మహమ్మద్ మోర్సి. తతిమా దేశాలన్నీ సిరియాలో అమెరికా, యూరప్ ల జోక్యాన్ని తూర్పారబట్టాయి. సిరియాలో టెర్రరిస్టు దాడులకు బయటి దేశాల జోక్యానికి వ్యతిరేకంగా అలీన కూటమి ఒక తీర్మానం కూడా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని వ్యతిరేకించి, అమెరికా ఆధిపత్యానికి ప్రతినిధిగా వ్యవహరించిన మోర్సి ఇప్పుడు తగుదునమ్మా అంటూ ‘ఏక ధృవ ఆధిపత్యానికి‘ తాను వ్యతిరేకినంటూ చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవు. బ్రిక్స్ కూటమిలో చేరి తద్వారా వచ్చే ప్రతిష్టతో అమెరికా, యూరప్ ల వద్ద మరింత బేరమాడే శక్తిని పొందడానికి ఎత్తులు వేస్తున్న ఈజిప్షియన్ దళారీ బూర్జువాలకు పక్కా ప్రతినిధి మహమ్మద్ మోర్సి. అలాంటి దళారి కబుర్లు భారత దళారులకు రుచిస్తాయేమో గానీ భారత ప్రజలకు మాత్రం కాదు.
7 ఒప్పందాలు
ఇండియా, ఈజిప్టులు 7 ఒప్పందాలు కుదుర్చుకున్నాయని మంగళవారం పత్రికలు తెలిపాయి. సైబర్ సెక్యూరిటీ విషయమై కుదిరిన ఒప్పందం ప్రధానమైనదిగా తెలుస్తోంది. ప్రధాని మన్మోహన్, అధ్యక్షుడు మహమ్మద్ మోర్సి లు ద్వైపాక్షిక చర్చలు జరిపిన అనంతరం ఈ ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు పత్రికలు తెలిపాయి. రక్షణ రంగం లోనూ, అంతర్జాతీయ వేదికల పైనా పరస్పరం సహకరించుకోవాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. ఈజిప్టు అధ్యక్షుడు మహమ్మద్ మోర్సి సమర్ధవంతమైన నాయకుడని, ఆయన ఆధ్వర్యంలో ఈజిప్టులో శక్తివంతమైన ప్రజాస్వామిక వ్యవస్థలు రూపు దిద్దుకుని, సామాజిక న్యాయం, సమ్మిళిత ఆర్ధిక వృద్ధి సాధిస్తాయని తాను నమ్ముతున్నానని మన్మోహన్ పత్రికలతో అన్నారు.
వాస్తవానికి మహమ్మద్ మోర్సి నియంతృత్వ విధానాలు అవలంబిస్తూ, కోర్టు, సైనిక అధికారాలను కూడా తనకే దఖలుపరుచుకుని ప్రత్యర్థులను ఉక్కుపాదంతో అణచివేస్తున్నాడని ఈజిప్టులో ప్రజలు అనేక వారాలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కైరోలోని తాహ్రిరి స్క్వేర్ వద్ద, అలెగ్జాండ్రియా లాంటి రేవు నగరాలలోనూ ప్రజల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ మోర్సికి గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థల నిర్మాతగా సర్టిఫికేట్ ఇవ్వడం ఎలా అర్ధం చేసుకోవాలి? “ఈజిప్టులో విజయవంతమైన మార్పిడి (transition) ఈ ప్రాంతానికే కాక ప్రపంచానికి కూడా ఒక నమూనా అని నాకు నమ్మకం కుదిరింది” అని మన్మోహన్ ప్రశంసించడాన్ని పత్రికలు రికార్డు చేశాయి. ఈజిప్టు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను అమెరికా-ముస్లిం బ్రదర్ హుడ్ ల కూటమి హైజాక్ చేసిందని అనేకమంది అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషించిన నేపధ్యంలో భారత ప్రధాని మాటలు భవిష్యత్తులో కఠిన పరీక్ష ఎదుర్కోక తప్పదు.
ఐ.టి, సేవలు, ఎలక్ట్రానిక్స్, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు, మాన్యుఫాక్చరింగ్, ఎరువులు, సాంప్రదేయేతర శక్తి వనరులు తదితర రంగాలలో పరస్పర సహకారానికి అవకాశం ఉందని ఇరు దేశాలు అంగీకరించినట్లు పత్రికలు తెలిపాయి. ఈజిప్టులోని ఆల్-అజర్ యూనివర్సిటీలో ‘సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఐ.టి (CEIT) నెలకొల్పడానికి భారత్ అంగీకరించింది. ఇ-గవర్నెన్స్, ఇ-ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ తదితర రంగాలలో భారత్ సహకారాన్ని ఈజిప్టు కోరినట్లు తెలుస్తోంది. ఇవన్నీ భారత వ్యాపారులకు ఒక అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ అగ్నిగుండం పైన సలసలా కాగుతున్నట్లు ఉండే మధ్య ప్రాచ్యం రాజకీయాలు వారికి ప్రధాన అడ్డంకి.
