ఇజ్రాయెల్: మితవాదం నుండి మధ్యేవాదం వైపుకు


From The Hindu

From The Hindu

జనవరి చివరి వారంలో జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగిపోయింది. గాజా ప్రాంతం పైకి హంతక దాడులు చేసి 150 మందికి పైగా పాలస్తీనీయులను బలిగొనడం ద్వారా స్పష్టమైన మెజారిటీ సాధిస్తానని కలలు కన్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆశలు నెరవేరకపోగా గణనీయమైన సంఖ్యలో సీట్లు కోల్పోవడంతో ఇజ్రాయెల్ రాజకీయాలు ఒక మాదిరి మలుపు తిరిగాయి.

కొత్తగా ఏర్పడిన రెండు సెంట్రిస్టు పార్టీలు అనూహ్య రీతిలో 31 స్ధానాలు గెలుచుకోవడంతో నెతన్యాహు ప్రధాన మంత్రిత్వం నిలబడినప్పటికీ, ఆయన అతి మితవాద శిబిరం నుండి దూరంగా మధ్యేవాద శిబిరం వైపుకి జరగవలసిన పరిస్ధితి ఏర్పడింది. మితవాది నెతన్యాహు చేతుల్లోనే పాలనా పగ్గాలు నిలిచిపోవడంతో వెస్ట్ బ్యాంక్, గాజాలలో నివసిస్తున్న పాలస్తీనీయులకు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు అయింది.

జనవరి 22 తేదీన ఎన్నికల తర్వాత అల్ట్రా-ఆర్ధడాక్స్ ఇజ్రాయేలీయుల శిబిరం తీవ్రంగా నష్టపోయింది. కాగా ఎన్నికలకు ముందు అనేక రోజుల పాటు ఆందోళనల్లో పాల్గొన్న మధ్యతరగతి ప్రజలకు మొదటిసారిగా సరైన ప్రాతినిధ్యం లభించిందని పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆవిగోర్ లీబర్మెన్ నేతృత్వంలోని అతి మితవాద (ultra-right) పార్టీ బాగా నష్టపోవడంతో ఇన్నాళ్లూ మిలట్రీ సర్వీసు నుండి మినహాయింపు పొందిన అల్ట్రా-ఆర్ధడాక్స్ ఇజ్రాయెలీ యువకులు ఇకనుండి ఆ మినహాయింపు కోల్పోనున్నారు.

Yesh Atid leader Yair Lapid -The Hindu

Yesh Atid leader Yair Lapid -The Hindu

అనూహ్య ఫలితాలు

యయిర్ లపీద్ నేతృత్వంలోని యెష్ అతీద్ (There is a future) మొదటిసారి ఎన్నికల్లో పాల్గొన్నప్పటికీ 120 సీట్ల ఇజ్రాయెల్ పార్లమెంటు నెస్సెట్ లో అనూహ్యంగా 19 సీట్లు సంపాదించగా నఫ్తాలి బెన్నెత్ నేతృత్వంలోని జూయిష్ హోమ్ పార్టీ 12 సీట్లు సంపాదించింది. మొత్తంగా చూస్తే మితవాద, అతి మితవాద శిబిరంలోని పార్టీలకు 60 సీట్లు రాగా సెంటర్-లెఫ్ట్ శిబిరంలోని పార్టీలకు మిగిలిన 60 సీట్లు దక్కాయి. ఫలితంగా ప్రధాని నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రెండు నెలల పాటు శ్రమించవలసి వచ్చింది. చివరకు యెష్ అతీద్ పార్టీతో ఒప్పందం కుదిరిందని బెంజమిన్ నెతన్యాహు శనివారం ప్రకటించాడు.

అల్ట్రా ఆర్ధడాక్స్ ఇజ్రాయేలీయులకు మిలట్రీ సర్వీసు నుండి మినహాయింపు ఇవ్వడం వెంటనే రద్దు చేయాలని కొత్త పార్టీ ఎన్నికలకు ముందునుండే ప్రచారం చేస్తూ వచ్చింది. కూటమి ప్రభుత్వంలో చేరాలంటే తమకు ఈ మేరకు హామీ ఇవ్వాలని కూడా యెష్ అతీద్ పార్టీ ఎన్నికల అనంతరం షరతులు విధించింది. పాలస్తీనీయులతో వెంటనే శాంతి చర్చలు ప్రారంభించాలని కూడా ఆ పార్టీ షరతు విధించింది. అయితే ఈ షరతు ఆచరణలోకి వస్తుందా లేదా అన్నది ఆచరణలో మాత్రమే తేలవలసిన విషయం.

Benjamin Netanyahu

Benjamin Netanyahu

తాను నమ్ముకున్న అతి మితవాద పార్టీ యిజ్రాయెల్ బెతేనుతో కలిపి 31 సీట్లు మాత్రమే నెతన్యాహు పొందగలిగాడు. గత ఎన్నికలలో 42 సీట్లు గెలుచుకున్న ఈ మితవాద, అతి మితవాద కూటమి తాజా ఎన్నికల్లో 11 సీట్లు కోల్పోవడంతో లికుడ్-యిజ్రాయెల్ బెతేను కూటమి అల్ట్రా-ఆర్ధడాక్స్ పార్టీలతో తెగతెంపులు చేసుకుని కొత్తగా ఏర్పడిన మధ్యేవాద పార్టీలతో జట్టు కడుతూ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంతో మితవాద, మధ్యేవాద కూటమి (center-left coalition) 68 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అయింది.

గాజా యుద్ధం ద్వారా ఇజ్రాయెల్ భద్రతకు తానే అసలైన ఛాంపియన్ అని తనను తాను ప్రచారం చేసుకున్న నెతన్యాహు అనూహ్య ఫలితాలతో ఖంగు తిన్నాడు. పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా జాత్యహంకార వ్యాఖ్యలతో, అక్రమ యూదు సెటిల్‌మెంట్ల నిర్మాణాలతో నాలుగు సంవత్సరాల పాటు హల్ చల్ చేసిన నెతన్యాహు ఫలితాలు వెలువడిన వెంటనే గొంతు మార్చి తాను పాలస్తీనీయులతో నమ్మకమైన శాంతి చర్చలు చేయడానికి సుముఖంగా ఉన్నట్లు ప్రకటించాడు. కొత్త పార్టీలతో ఒప్పందం కోసమే ఆయన గొంతు మార్చాడని పలువురు విశ్లేషకులు ఊహించినదే చివరికి నిజమైంది.

ప్రపంచ రాజకీయ కేంద్రం

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఇజ్రాయెల్ సందర్శించడానికి కేవలం రెండు రోజుల ముందు ఇజ్రాయెల్ లో ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పందం కుదరడం విశేషం. అమెరికా విదేశాంగ విధానంలో ఇజ్రాయెల్ కు అత్యంత కీలక స్ధానం ఉన్నది. అమెరికాలోని ఇజ్రాయెలీ ఓటర్లు కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒకింత కీలక పాత్ర పోషిస్తారు. ఇక అమెరికాలోని అత్యంత శక్తివంతమైన ఇజ్రాయెల్ లాబీ గురించి చెప్పనవసరం లేదు. మధ్య ప్రాచ్యంలో అమెరికా పాల్పడుతున్న హంతక దురాక్రమణ యుద్ధాలకు కారణభూతమైన ఈ లాబీ చేతులే కాక వొళ్ళంతా అనేకమంది అమాయక అరబ్ పౌరుల రక్తంతో తడిచి ముద్దయ్యారంటే అతిశయోక్తి కాదు.

అమెరికా విదేశాంగ విధానాన్ని ఇజ్రాయెల్ మరియు ఇజ్రాయెల్ లాబీ ఎంతగా ప్రభావితం చేస్తారంటే ఒక్కోసారి శరీరం తోకను ఆడిస్తోందా లేక తోకే శరీరాన్ని ఆడిస్తోందా అనే అనుమానం అనేకమంది వ్యక్తం చేయడం కద్దు. మానవ జీవితాన్ని శాసించే శక్తి వనరులైన చమురు వనరులకు అరబ్ దేశాలు నిలయం. అలాంటి అరబ్ దేశాల మధ్య ఇజ్రాయెల్ దేశాన్ని కృత్రిమంగా, అక్రమంగా, పాలస్తీనీయుల పైన అత్యంత అమానుష రీతిలో హత్యాకాండ సాగించి మరీ వెళ్లగొట్టడం ద్వారా స్థాపించడం లోనే బ్రిటన్, అమెరికా దేశాలు డెబ్భై యేళ్ళ క్రితమే కుత్సిత బుద్ధిని ప్రదర్శించాయి. ఆనాటి నుండి రావణ కాష్టంలా రగులుతున్న మధ్య ప్రాచ్యం అమెరికా ప్రపంచాధిపత్య వ్యూహాలకు కేంద్ర స్ధానం.

ఈ నేపధ్యంలో ఇజ్రాయెల్ ఎన్నికలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. దశాబ్ద కాలంగా మితవాదుల ఆధిపత్యంలో ఉన్న ఇజ్రాయెల్ తాజా ఎన్నికల ద్వారా మితవాదులు మరియు మధ్యే వాదుల కూటమి చేతుల్లోకి వచ్చినట్లయింది. ఇప్పటివరకూ పూర్తిగా మితవాదుల చేతుల్లో కొనసాగిన దేశం మధ్యేవాద రాజకీయాలకు అవకాశం ఇవ్వడం ద్వారా పాలస్తీనా సమస్య పరిష్కారం దిశలో చిగురాశ మొలకెత్తింపజేసింది. కానీ ఈ ఆశ సాకారం కావడం అత్యంత కష్టం. అమెరికా ఉడుం పట్టు ఇజ్రాయెల్ పైన ఉన్నంతవరకు పాలస్తీనా సమస్య రగులుతూనే ఉంటుంది.

4 thoughts on “ఇజ్రాయెల్: మితవాదం నుండి మధ్యేవాదం వైపుకు

  1. అల్ట్రా-ఆర్ధడాక్స్ artham ento vivarinchi cheppagalaru…. mee ee varthalu vishleshanlu chala bagunnayi.. andhariki ardam ayyela chakkaga rastunnaru.. thank you.. daily veelainanni ekkuva varthalu post cheyalani manavi.. :)

  2. వెంకీ గారు అల్ట్రా-ఆర్ధడాక్స్ లో అల్ట్రా అంటే తీవ్ర అని, ఆర్ధడాక్స్ అంటే సనాతన మత సంప్రదాయాలను నిక్కచ్చిగా నమ్మే తత్వం అని అర్ధం. ఈ ఆర్టికల్ లో యూదు మత సనాతన సంప్రదాయాలను తీవ్ర స్ధాయిలో, నిక్కచ్చిగా నమ్మేవారని అర్ధం. వారిలో భిన్న సంప్రదాయాల సమూహాలు ఉన్నాయి. (వీరి రాజకీయంగా ప్రాతినిధ్యం వహించే పార్టీలను అతి మితవాద పార్టీలుగా -ultra rightist – చెబుతారు.) ఇజ్రాయెల్ లో వీరికి కంపల్సరీ మిలట్రీ సర్వీస్ నుండి మినహాయింపు ఉంటుంది. దీనిని తొలగించాలని ఇతరులు అనేక యేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. తాజా ఎన్నికల తర్వాత ఆ డిమాండ్ నెరవేరబోతోందని పత్రికల అంచనా. ఆచరణలోకి వస్తుందో లేదో చూడాలి.

వ్యాఖ్యానించండి