ఇరాన్ నుండి సహజ వాయువును పైప్ లైన్ ద్వారా దిగుమతి చేసుకోవడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు నిర్మాణాన్ని అమెరికా బెదిరింపులతో భారత ప్రభుత్వం అటకెక్కించగా పాకిస్తాన్ అమెరికా బెదిరింపులను లెక్క చేయకుండా సాధించుకుంటోంది. ఈ మేరకు ఇరాన్ దేశం వరకు పైప్ లైన్ నిర్మాణాన్ని ఇరాన్ ప్రభుత్వం పూర్తి చేయగా పాకిస్ధాన్ నేలపైన జరగనున్న పైపు లైన్ నిర్మాణాన్ని సోమవారం పాక్ ప్రభుత్వం ప్రారంభించింది. ఒక పక్క అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి విక్టోరియా నూలంద్ పాకిస్ధాన్ కు బెదిరింపులు జారీ చేస్తుండగానే ఇరాన్, పాకిస్ధాన్ అధ్యక్షుల సమక్షంలో పాక్ భూభాగంలో ఇరు దేశాల సరిహద్దు వద్ద పైపు లైన్ నిర్మాణం లాంఛనంగా ప్రారంభం అయింది.
ఇరాన్ గ్యాస్ పైప్ లైన్ నిర్మాణంలో పాక్ ముందుకు పోతే ఆ దేశంపై ఆంక్షలు విధిస్తామని విక్టోరియా నూలంద్ బెదిరించింది. “మాకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిజంగానే ముందుకు సాగితే ‘ఇరాన్ ఆంక్షల చట్టం‘ అమలు చేస్తాం” అని నూలంద్ సోమవారం బెదిరించింది. “మా అభ్యంతరాలను పాకిస్ధాన్ కు నేరుగానే తెలియజేసాము” అని ఆమె తెలియజేసింది.
అమెరికా బెదిరింపులను పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ జర్దారీ కొట్టిపారేశాడు. పాకిస్ధాన్ తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కుంటోందని ఇరాన్-పాక్ గ్యాస్ పైప్ లైను పాకిస్ధాన్ జాతీయ ప్రయోజనాల కోసం ఉద్దేశించిందని ఈ విషయంలో తమను ఎవరూ ఆదేశించలేరని ప్రకటించాడు. పాకిస్ధాన్ సార్వభౌమాధికారం గల స్వతంత్ర దేశం అనీ, అది తనకు ప్రయోజనాలకు అనుగుణంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగల సత్తా ఉన్న దేశమని జర్దారీ మార్చి మొదటి వారంలో అమెరికా బెదిరింపులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించాడు.
తమ భూభాగంలో అవసరమైన మేరకు పైపు లైను నిర్మాణాన్ని ఇరాన్ ఇప్పటికే పూర్తి చేసింది. ఇరాన్ భూభాగం పైన దాదాపు 900 కిలో మీటర్లు సాగే పైపు లైను పాక్ భూభాగం పైన 780 కి.మీ మేరకు నిర్మించవలసి ఉంది. ఇరాన్ సరిహద్దు నుండి పాకిస్ధాన్ గ్యాస్ సరఫరా కూడలి అయిన నవాబ్ షా (సింధ్ రాష్ట్రం) వరకు పైపు లైను నిర్మించవలసి ఉంది. నిధుల లేమితో వాయిదా పడుతూ వస్తున్న ఈ నిర్మాణం, ఇరాన్ 500 మిలియన్ డాలర్ల మేరకు ఋణం మంజూరు చేయడంతో కొనసాగనున్నది. ఇరానియన్ పోర్టు నగరం ‘చబాహర్‘ లో జరిగిన ప్రారంభ వేడుకకు పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారీ 300 మంది ప్రతినిధులతో తరలి వెళ్ళాడు.
భారత దేశం కూడా ఇరాన్ తో గతంలో గ్యాస్ పైప్ లైను ఒప్పందం కుదుర్చుకుంది. పాక్ మీదుగా భారత దేశం వరకు గ్యాస్ పైపు లైను ద్వారా గ్యాస్ సరఫరా చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందాన్ని భారత్ ఉన్నపళంగా రద్దు చేసుకుంది. భద్రతా కారణాల రీత్యా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని మన్మోహన్ చెప్పిన కారణం ఎవరూ పెద్దగా నమ్మలేదు. 2008లో లెఫ్ట్ పార్టీలతో మిత్రత్వాన్ని త్యాగం చేసి మరీ కుదుర్చుకున్న ‘అణు సహకార ఒప్పందం‘ కోసం ఇరాన్ పైప్-లైన్ ఒప్పందాన్ని భారత దేశం వదులుకుందని, అమెరికా చేసిన ఒత్తిడికి భారత పాలకులు లొంగిపోయారని ‘వికీ లీక్స్‘ ద్వారా వెల్లడయిన అమెరికా రాయబార పత్రాల ద్వారా లోకానికి వెల్లడయింది.
‘పీస్ పైప్ లైన్‘ గా అభివర్ణించబడిన ఇరాన్-పాక్ గ్యాస్ పైప్ లైన్, వాస్తవానికి అసలు ఒప్పందం ప్రకారం ఇండియా వరకు కొనసాగవలసి ఉన్నది. అమెరికా జోక్యంతో అది కాస్తా మూలన పడిపోయింది. భారత ప్రభుత్వం చెప్పిన భద్రత మరియు ధరల సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. వాణిజ్య ఒప్పందాలలో ఇటువంటి సమస్యలు సర్వసాధారణం. ఇరాన్-పాక్-ఇండియా పైప్ లైన్ నిర్మాణం పూర్తయితే మధ్య ప్రాచ్యం, దక్షిణాసియా ప్రాంతాల్లో అమెరికా ఆధిపత్యానికి తీవ్ర నష్టం వాటిల్లడం తథ్యం. పాకిస్ధాన్ లో పైప్ లైన్ నిర్మాణం పూర్తయితే అది చైనాకు కూడా ఉపయోగపడుతుంది. నిజానికి భూ మార్గం ద్వారా అందునా పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా, చైనాకు వరమే. ఈ పైప్ లైన్ కోసం చైనా కూడా ఎదురు చూస్తున్నదంటే అతిశయోక్తి కాదు.
అమెరికా తర్వాత అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగి ఉన్న చైనా ఎనర్జీ అవసరాలు అంతకంతకూ పెరుగుతున్న నేపధ్యంలో పాకిస్ధాన్ పైపు లైన్ నిర్మాణం ఇరాన్ దేశానికి కూడా మార్కెట్ ను పెంచుతుంది. చైనా ఆర్ధిక బలిమిని ప్రధాన సమస్యగా భావిస్తున్న అమెరికా మరో పక్క ఇరాన్ ధిక్కారం పట్ల కూడా కడుపు మంటతో రగిలిపోతోంది. ఐరాస వేదికను స్వప్రయోజనాలకు వినియోగిస్తూ ఇరాన్ దేశం పైన నాలుగు విడతలుగా అక్రమ ఆంక్షలు విధించడమే కాక స్వంతంగా కూడా ఆంక్షలు విధించి ఇరాన్ ప్రజలకు మందులు కూడా అందకుండా కక్ష తీర్చుకుంటోంది. అలాంటి అమెరికా ఇరాన్-పాక్-ఇండియా పైపు లైన్ ని వ్యతిరేకించడం అనివార్యం.
కానీ అమెరికా జియో-పోలిటికల్ వ్యూహాలకు భారత ప్రజల ప్రయోజనాలను బలిపెట్టడానికి కూడా భారత పాలకులు సిద్ధపడగా పాకిస్ధాన్ అందుకు విరుద్ధంగా తమ దేశ ఎనర్జీ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం నిస్సందేహంగా ప్రశంసనీయం. అయితే విక్టోరియా నూలంద్ తన ప్రకటనలో నర్మగర్భంగా వ్యాఖ్యానించినట్లు పైపు లైను నిర్మాణం ‘నిజంగానే ముందుకు సాగుతుందా లేదా అన్నది వేచిచూడాల్సి ఉంది. అమెరికాతో జరిపే బేరసారాలలో స్టేకు పెంచుకోవడం కోసమే పాకిస్ధాన్ పాలకులు ఇరాన్ పైపు లైన్ ఒప్పందాన్ని వెలికి తీసారా లేక నిజంగానే దేశ ఎనర్జీ అవసరాల కోసమే ప్రయత్నిస్తున్నారా అన్న విషయంలో ‘రష్యా టైమ్స్‘ లాంటి వార్తా సంస్థలు కూడా అనుమానాలు వెలిబుచ్చడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.

