అమెరికా అనే సామ్రాజ్యవాద మత్త గజాన్ని తెలిసి తెలిసి ఢీకొన్న నేటి కాలపు హీరో బ్రాడ్లీ మేనింగ్.
ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధాల్లో అమెరికా సైనికులు, అధికారులు పాల్పడిన అమానవీయ హత్యాకాండలు, సామాన్య పౌరులపై సాగించిన యుద్ధ నేరాలు తదితర సమాచారాన్ని ‘వికీ లీక్స్’ కి అందజేసి ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న దారుణ కృత్యాలకు కేంద్రం అమెరికాయేనని ససాక్ష్యాలతో వెల్లడి చేశాడు బ్రాడ్లీ మేనింగ్.
అత్యంత రహస్యంగా బ్రాడ్లీ మేనింగ్ ని విచారిస్తూ తాను నిత్యం వల్లించే మానవ హక్కుల నీతులు ఒట్టి కబుర్లేనని అమెరికా తేటతెల్లం చేసింది. తానే వికీ లీక్స్ కి అమెరికా దారుణాల రహస్యాలను అందజేసానని రహస్య కోర్టు విచారణలో అంగీకరించి, అమెరికా ప్రజలకు అమెరికా సైనికులు సాగిస్తున్న అకృత్యాలు తెలియజేయడానికే అలా చేసానని చెప్పి అద్వితీయమైన సాహసాన్ని ప్రదర్సించాడు బ్రాడ్లీ మేనింగ్.
రహస్యంగా రికార్డు చేసిన బ్రాడ్లీ సాక్ష్యాన్ని ‘రష్యా టైమ్స్’ మొదటి సారిగా తన వెబ్ సైట్ లో ఆడియో రూపంలో ప్రచురించింది. అదే ఈ ఆడియో.
–
–
ఇద్దరు రాయిటర్స్ వార్తా సంస్ధ విలేఖరులను అమెరికా అపాచి హెలికాప్టర్ గన్ ఎలా కాల్చి చంపిందీ ‘కోలేటరల్ మర్డర్’ పేరుతో వికీ లీక్స్ వెబ్ సైట్ 2010లో ప్రచురించిన వీడియోతో మొదలైన సంచలనం అంతటితో ముగిసిపోలేదు.
వార్ లాగ్స్ పేరుతో ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో అమెరికా, యూరప్ దేశాల సైనికులు వందల వేలమంది అమాయక పౌరులపై సాగించిన అకృత్యాలు, అమానవీయ హింసల వివరాలను వికీ లీక్స్ ప్రచురించింది. అనంతరం ‘డిప్లొమెటిక్ కేబుల్స్’ పేరుతో ప్రపంచ వ్యాపితంగా వివిధ దేశాలలో అమెరికా రాయబారులుగా నియమితులయిన మర్యాదస్ధులు, అమెరికా బహుళజాతి కంపెనీల కోసం రాయబారం మాటున ఏ విధంగా గూఢచర్యానికీ, బెదిరింపులకు, బేరసారాలకు పాల్పడిందీ వికీ లీక్స్ వెల్లడి చేసింది.
వికీ లీక్స్ / జులియన్ అసాంజె కు ఈ వివరాలు అందజేసింది తానేనని బ్రాడ్లీ మేనింగ్ రహస్య విచారణలో అంగీకరించాడు. అమెరికా ప్రభుత్వం మోపిన 22 నేరాలలో 10 నేరాలకు తాను పాల్పడ్డానని బ్రాడ్లీ అంగీకరించాడని రష్యా టైమ్స్ తెలిపింది. అంగీకరించిన నేరాలకు కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని తెలుస్తున్నది.
ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధాలకు సంబంధించి అమెరికా మిలట్రీ, అమెరికా ప్రభుత్వ విదేశాంగ విధానం నిర్వహించిన పాత్ర పైన అమెరికా ప్రజల్లో చర్చ లేవనెత్తడానికే తాను వికీ లీక్స్ కు సమాచారం ఇచ్చానని బ్రాడ్లీ మేనింగ్ కోర్టుకు స్పష్టం చేశాడు. అమెరికా సైన్యం మానవ ప్రాణాలకు ఏ మాత్రం విలువ ఇవ్వరని ఆరోపించిన బ్రాడ్లీ “చిన్న పిల్లవాడు భూతద్దంలో చూస్తూ చీమలను హింసించే తరహాలో” అమాయక పౌరులను ఇతరులను హింసించారని తన సాక్ష్యంలో వెల్లడి చేశాడు.
కోలేటరల్ మర్డర్ వీడియో గురించి చెబుతూ బ్రాడ్లీ, “వీడియోలో నాకు అత్యంత భయానక విషయంగా తోచిన విషయం ఏమిటంటే, విలేఖరులతో సహా పౌరులను చంపడంలో వారు సంతోషాతిరేకాలతో రక్త దాహాన్ని వ్యక్తపరిచిన తీరు” అని తన సాక్ష్యంలో పేర్కొన్నాడు. (రష్యా టైమ్స్)
నేటి కాలపు ఈ ఒంటరి వీరుడికి జేజేలు పలుకుదాం!


బ్రాడ్లీ మానింగ్ యూ ఆర్ రియల్లీ గ్రేట్. నీ సాహసం, త్యాగం నిరుపమానం
ఇవాళ్టి యువతరం ఇటువంటి నిజమైన వీరులను ఆదర్శంగా తీసుకోవాలి.
పింగ్‌బ్యాక్: బ్రాడ్లీ మేనింగ్ రహస్య కోర్టు సాక్ష్యం -ఆడియో | Raja's Realms
పింగ్‌బ్యాక్: బ్రాడ్లీ మేనింగ్ రహస్య కోర్టు సాక్ష్యం -ఆడియో | Raja's Realms