ఆడ శిశువుల పీక నులుముతున్న ఆంధ్ర ప్రదేశ్


ది హిందు నుండి

ది హిందు నుండి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆడ శిశువుల పాలిట వధ్య ప్రదేశ్ గా మారుతోంది. కడుపులో ప్రాణం పోసుకున్న వెంటనే పుట్టబోయేది ఆడపిల్లలేనని చెప్పడానికి కార్పొరేట్ ఆసుపత్రులు సైతం క్యూ కట్టడంతో ఆడ పిండాలు ఎదగకుండానే పీక నులమడానికి తల్లిదండ్రులే సిద్ధపడుతున్నారు. గత దశాబ్ద కాలంలో ఆడ పిల్లల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా తగ్గిపోయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డి.ఎల్.రవీంద్రా రెడ్డి స్వయంగా తెలియజేశారు. ఆడ శిశువులను గర్భంలోను, పురిటిలోను చంపడాన్ని నివారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 1994లో తెచ్చిన చట్టం “Pre-Conception and Pre Natal Diagnostics Act (PC & PNDT Act)” మరియు 1996లో తెచ్చిన నియమ నిబంధనలను బడా ఆసుపత్రులు, వైద్యులు ఉల్లంఘిస్తున్నారని దీనిని నివారించడానికి ఆసుపత్రులు, వైద్య మరియు డయాగ్నస్టిక్స్ కేంద్రాలపై ఇకనుండి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించాడు. తద్వారా ఇంతవరకు చట్టాన్ని అమలు చేయడానికి తామే చిత్తశుద్ధితో పూనుకోలేదని చెప్పకనే చెప్పారు.

2001 జనాభా లెక్కలతో పోలిస్తే 2011 జనాభా లెక్కలలో ఆంధ్ర ప్రదేశ్ లో ఆడ శిశువుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. 0 నుండి 6 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి 1000 మంది మగశిశువులకు 2001లో 961 మంది ఆడ శిశువులు నమోదు కాగా ఈ సంఖ్య 2011లో 943కు తగ్గిపోయింది. రాష్ట్రంలోని జిల్లాలలో వరంగల్ జిల్లా అత్యంత ఘోరంగా దశాబ్ద కాలంలో ఆడ శిశువుల సంఖ్య 955 నుండి 912కు పడిపోయింది. రాష్ట్రంలో ఈ విధంగా ఆడ శిశువుల సంఖ్య పడిపోవడానికి ప్రధాన కారణం ఆడ పిండాల హత్యలేనని ప్రభుత్వం భావిస్తున్నట్లు ది హిందు పత్రిక తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే ఆడ శిశువుల సంఖ్య తగ్గకుండా 970 వద్ద కొనసాగిందని, ఇతర జిల్లాలన్నీ తగ్గుదల నమోదు చేశాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ లోనే తక్కువ ఆడ శిశువుల నిష్పత్తి తక్కువగా ఉన్నదని గణాంకాల ద్వారా తెలుస్తోంది.

PC & PNDT చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయడానికి ఉద్దేశిస్తూ మంత్రి రవీంద్ర రెడ్డి సోమవారం రాష్ట్ర సలహా కమిటీ సమావేశం నిర్వహించాడు. రాష్ట్రంలో చట్టం అమలు చాలా ఘోరంగా ఉన్నదని ఆయన అంగీకరించాడు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 3 యేళ్ళ జైలు శిక్ష, రు. 10,000/- అపరాధ రుసుము వసూలు చేయాలని చట్టం చెబుతున్నప్పటికీ ఇంతవరకు ఒక్కరు కూడా శిక్షకు గురికాలేదని మంత్రి తెలిపారు. “ఇకముందు చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాము” అని మంత్రి చెప్పడం ద్వారా చట్టం అమలు విషయంలో ప్రభుత్వ తీరు స్పష్టం అవుతోంది.

మంత్రి వెల్లడి చేసిన గణాంకాల ప్రకారమే రాష్ట్రంలో చట్ట ఉల్లంఘన తీవ్రంగా ఉన్నప్పటికీ, గత దశాబ్ద కాలంలో కేవలం 73 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇందులో 31 కేసులు ఎటువంటి దోష నిర్ధారణ గానీ, చర్యలు గానీ లేకుండా కొట్టివేయగా మిగిలినవి పెండింగ్ లో ఉన్నాయి. కనీసం ఒక్క కేసులో కూడా నిందితుల నేరం రుజువు కాలేదని మంత్రి తెలిపారు. పెండింగ్ లో ఉన్న కేసులలో మహా కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ఉన్నాయని అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ ది హిందూ తెలియజేసింది. ప్రఖ్యాతి చెందిన అపోలో, యశోద ఆసుపత్రుల పైన కూడా ఆడ శిశువుల లింగ నిర్ధారణ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

PC & PNDT చట్టం అమలు పర్యవేక్షణ రాష్ట్రంలో దాదాపు లేనట్లే అని చెప్పుకోవచ్చు. చట్టం అమలుకు సంబంధించి రాష్ట్ర సలహా కమిటీ నాలుగు నెలలకు ఒకసారి సమావేశం కావలసి ఉండగా 2004 నుండి కమిటీ అసలు సమావేశమే కాలేదని పత్రిక తెలిపింది. ఇకనుండి తప్పనిసరిగా నాలుగు నెలలకు ఒకసారి కమిటీ సమావేశం అవుతుందని మంత్రి ఇప్పుడు హామీ ఇస్తున్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి కమిటీలు కూడా రెండు నెలలకు ఒకసారి సమావేశం కావలసి ఉండగా అలా జరగలేదని, ఇకనుండి జరుగుతుందని మంత్రి హామీ ఇస్తున్నారు.

చట్టాన్ని కఠినంగా అమలు చేసే బాధ్యతను కుటుంబ సంక్షేమ కమిషనర్ పూనం మాలకొండయ్యకు అప్పగిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. చట్టాన్ని ఉల్లంఘించే ఆసుపత్రులు, వైద్య కేంద్రాలు, డాక్టర్లు, వ్యక్తులు ఎవరైనా వదిలిపెట్టేది లేదని మంత్రి తీరికగా ఇప్పుడు హుంకరిస్తున్నారు. “ఇకనుండి రాజకీయ ఒత్తిడులను అనుమతించబోము. జిల్లా స్ధాయిలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి క్రిమినల్ చర్యలు తీసుకుంటారు” అని మంత్రి విలేఖరులకు తెలిపారు. పోలీసులు, వైద్య అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు, న్యాయ అధికారులు… వీరందరిని సమస్యపైన సెన్సిటైజ్ చెయ్యడానికి ప్రాధాన్యత ఇస్తామని, ప్రతి జిల్లాకు న్యాయ సలహాదారులను నియమిస్తామని తెలిపారాయన. చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తున్నట్లు తెలిస్తే 104 నెంబరుకు ఉచితంగా కాల్ చేయవచ్చని, అలాంటి వారి పేర్లు రహస్యంగా ఉంచుతామని పూనం మాలకొండయ్య తెలిపారు.

చట్టాన్ని ఉల్లంఘిస్తున్నది ఎవరో మంత్రి హామీలు, హెచ్చరికలే తెలియజేస్తున్నాయి. రాజకీయ ఒత్తిడులను ‘ఇకనుండి’ అనుమతించబోమని సాక్ష్యాత్తూ మంత్రిగారే చెబుతున్నారంటే దశాబ్ద కాలంలో పెరిగిపోయిన ఆడ పిండాల హత్యలకు ఎవరు కారణమో మంత్రిగారు చెబుతున్నట్లే. ఇంతవరకు జరిగిన హత్యలకు నిందితులకు ఆయన పరోక్షంగా క్షమాభిక్ష ఇస్తున్నట్లేనా అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. 2004 నుండి రాష్ట్ర సలహా కమిటీ సమావేశం కాకపోవడానికి కారణం ఏమిటో ఆ శాఖ మంత్రి చెప్పకపోవడం, ‘ఇకనుండి’ సరిగ్గా సమావేశం అవుతాం అని చెప్పడం బట్టి లోపం చట్టాన్ని అమలు చేయవలసిన వారిలోనే ఉన్నదని స్పష్టం అవుతోంది. ప్రజలు అనేక కష్ట నష్టాలకు ఓర్చి ఆందోళనలు, పోరాటాలు చేసి చట్టాలు సాధించుకుంటే, ఆ చట్టాలను అమలు చేసేవారు లేనప్పుడు, ఉల్లంఘనదారులకు అమలు బాధ్యత ఉన్నవారే అండగా నిలబడుతున్నపుడు మంత్రి గారు హెచ్చరికలు ఎవరికి ఇస్తున్నట్లు? తాజాగా ఇస్తున్న హామీలకు జవాబుదారులుగా ఎవరిని నిలుపుతున్నట్లు?

ఢిల్లీ అత్యాచారం లాంటి దుర్ఘటనలు జరిగినపుడు మళ్ళీ వీళ్ళే గొంతులు చించుకుని హాహాకారాలు చేయడం, వీలయితే కన్నీళ్లు కార్చుతూ శోకాలు పెట్టడం, పనిలో పనిగా నాలుగు ఉపదేశాలు చెయ్యడం… ఇదే కదా పాలక మాన్యుల నిజ స్వరూపం!

3 thoughts on “ఆడ శిశువుల పీక నులుముతున్న ఆంధ్ర ప్రదేశ్

  1. ప్రవీణ్ గారు ది హిందు పత్రిక ప్రకారం నెంబర్ 104. మళ్ళీ చూసాను. నెంబర్ 104 అనే ఉంది. ఒకవేళ పత్రిక తప్పు రిపోర్ట్ చేసిందేమో వెరిఫై చేస్తాను.

వ్యాఖ్యానించండి