ఈ ఫొటోలో ఉన్న అబ్బాయి వయసు 12 సంవత్సరాలు. శ్రీలంక ఎల్.టి.టి.ఇ దివంగత నాయకుడు వేలుపిళ్ళై ప్రభాకరన్ కుమారుడు బాలచంద్రన్ ప్రభాకరన్. తమిళ టైగర్‌లకు, శ్రీలంక సైన్యానికి మధ్య హోరాహోరీగా జరిగిన పోరాటంలో కాల్పుల మధ్య చిక్కి చనిపోయాడని శ్రీలంక ప్రభుత్వం ప్రపంచానికి చెప్పింది. కానీ అది వాస్తవం కాదని, సజీవంగా పట్టుబడిన బాలచంద్రన్ ను శ్రీలంక సైనికులే అతి సమీపం నుండి కాల్చి చంపారని బ్రిటిష్ వార్తల చానల్ ‘ఛానల్ 4’ ద్వారా వెల్లడయిన వీడియో ద్వారా తెలిసింది. బాలచంద్రన్ బాడీ గార్డులు ఐదుగురిని కాళ్లు, చేతులు కట్టేసి, కళ్లకు గంతలు కట్టి అతని ముందే కాల్చి చంపిన శ్రీలంక సైనికులు తర్వాత బాలుడిని కూడా కాల్చి చంపారని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారని చానల్ 4 తెలిపింది.
ఏ జాతరలోనో తప్పిపోయిన పిల్లాడిలా ఫొటోలో కనిపిస్తున్న బాలచంద్రన్, వాస్తవానికి తన బాడిగార్డులతో కలిసి లొంగిపోవడానికి వచ్చాడని, కానీ బాలుడిని చంపడానికే శ్రీలంక సైన్యం అత్యున్నత అధికారులు మొగ్గు చూపారని చానల్ 4 గత సంవత్సరం మార్చి నెలలో ప్రసారం చేసిన 50 నిమిషాల కార్యక్రమంలో తెలియజేసింది. శ్రీలంక ప్రభుత్వం చానల్ 4 ప్రసారం చేసిన వీడియో సాధికారతను ప్రశ్నిస్తూ, ఉద్దేశపూర్వకంగా దృశ్యాలను సృష్టించి (concocted) వీడియో తయారు చేశారని ఆరోపించింది. ఈ ఆరోపణలను చానల్ 4 తిరస్కరించింది. నైపుణ్యం కలిగిన ఫోరెన్సిక్ పాధాలజిస్టు ప్రొఫెసర్ డెరిక్ పౌండర్ తమకు అందిన వీడియోను శల్య పరీక్ష చేసి అది అసలైనదేనని నిర్ధారించారని తెలిపింది.
‘ది హిందూ’ ప్రచురించిన పై ఫొటోలు కొత్తగా అందిన సాక్ష్యాలుగా పత్రిక తెలిపింది. వీడియో తీసిన డిజిటల్ కెమెరాతోనే ఫొటోలు తీశారని ఫోరెన్సిక్ పాధాలజిస్టు నిపుణులు తెలిపారని తెలియజేసింది. బాలచంద్రన్ వైరి శిబిరాల కాల్పుల మధ్య చిక్కి చనిపోలేదని, అతనిని ఉద్దేశపూర్వకంగా, ఒక పధకంలో భాగంగానే చంపారని స్పష్టం అవుతోందని ‘ది హిందూ’ పత్రికకు రాసిన ఆర్టికల్ లో మెక్ రే తెలిపాడు. ఈ దురాగతానికి పాల్పడిన శ్రీలంక సైనికులు ‘వార్ ట్రోఫీ’ రూపంలో జ్ఞాపికగా ఉంచుకోవడానికి వీడియో, ఫొటోలు తీసినట్లు కనిపిస్తోందని ఛానల్ 4 డాక్యుమెంటరి (Sri Lanka’s Killing Fields: War Crimes Unpunished) డైరెక్టర్ కల్లమ్ మెక్ రే ని ఉటంకిస్తూ గత సంవత్సరం ‘శ్రీలంక గార్డియన్’ పత్రిక తెలిపింది.
గత సంవత్సరమే వీడియోతో పాటు ఫొటోలు సంపాదించిన చానల్ 4 డాక్యుమెంటరీ డైరెక్టర్ మెక్ రే వాటిని ఫోరెన్సిక్ నిపుణులతో పరీక్షింపజేసి అసలైనవేనని నిర్ధారించుకుని మంగళవారం ది హిందు పత్రికలో ఒక ఆర్టికల్ రాస్తూ ప్రచురించాడు. (ఛానల్ 4 సంపాదించిన హంతక వీడియోలో కొద్ది భాగాన్ని శ్రీలంక గార్డియన్ వెబ్ సైట్ లో చూడవచ్చు. హెచ్చరిక: వీడియోలోని భయానక దృశ్యాలు కొందరికి భరించరానివిగా తోచవచ్చు. అందుకు సిద్ధపడితేనే వీడియో చూడగలరు. ఈ లింక్ ద్వారా ఓపెన్ అయ్యే ఆర్టికల్ కింద వీడియోకి లింక్ ఇవ్వబడింది) గత సంవత్సరం కూడా ది హిందూ పత్రికలో బాలచంద్రన్ విగత దేహం ఫోటో ప్రచురించబడినప్పటికీ అతను సజీవంగా ఉన్న ఫొటోలు ప్రచురించడం ఇదే మొదటిసారి.
శ్రీలంక గార్డియన్ ప్రకారం శ్రీలంక సైన్యంలోని అత్యున్నత అధికారులు చట్టబద్ధంగా ఇచ్చిన సాక్ష్యం లీక్ కాగా దానిని ఛానల్ 4 సంపాదించింది. శ్రీలంక ప్రభుత్వ సైనికులే బాలచంద్రన్ ను కాల్చి చంపారని ఆయన సాక్ష్యం ఇచ్చినట్లు అందులో స్పష్టం అయినట్లు చానల్ 4 తెలిపింది. “ఐదుగురు ఎస్కార్టు సైనికులతో లొంగిపోవడానికి వస్తుండగా అతనిని (బాలచంద్రన్) చూశారు. అతను ప్రభాకరన్ కొడుకని నాకు ఆ తర్వాత తెలిసింది” అని సైనికాధికారి సాక్ష్యం పేర్కొన్నట్లు ఛానల్ తెలిపింది. “మేము ఆ డాక్యుమెంటును పరీక్షించాము. మా పరీక్షలో అది అసలైందని తెలిసింది. పట్టుబడిన మరియు లొంగిపోవడానికి సిద్ధపడిన అనేకమంది ఎల్.టి.టి.ఇ ఫైటర్లను శ్రీలంక సైనికులు ఒక పద్ధతి ప్రకారం చంపే విధానాన్ని అనుసరించారని వణుకు పుట్టించే ఈ సాక్ష్యాల ద్వారా తెలుస్తోంది. వాళ్ళు పిల్లలు అయినప్పటికీ వదిలిపెట్టలేదు” అని డాక్యుమెంటరీ డైరెక్టర్ మెక్ రే తెలిపాడు. (శ్రీలంక గార్డియన్, మార్చి 14, 2012)
తమ డాక్యుమెంటరి గురించి మెక్ రే ఇలా తెలిపాడు. “బాధ్యులు ఎవరు అనే విషయాన్ని అది పరిశోధించింది. పరిశోధన ఫలితాలు శ్రీలంక ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారులు, వారి మిలట్రీ అత్యున్నత స్థాయి అధికారుల వైపు వేలెత్తిచూపుతున్నాయి. (డాక్యుమెంటరీ) నాలుగు నిర్దిష్ట కేసులను ఫోరెన్సికల్ గా పరీక్షించింది. ఆ కేసులు ఏమిటంటే: ‘నో ఫైర్ జోన్ లో ఉన్న పౌరులపైనా, ఆసుపత్రి పైనా ఉద్దేశపూర్వకంగా ఫిరంగులతో కాల్పులు జరపడం; యుద్ధంలో చిక్కుకుపోయిన వందల వేల (తమిళ) పౌరులకు ఆహారం, మందులను వ్యూహాత్మకంగా నిరాకరించడం; … నగ్నంగా చేసి, కట్టివేసిన ఎల్.టి.టి.ఇ ఖైదీలను ఒక పద్ధతి ప్రకారం కాల్చి చంపడం.”
ఒక పసి పిల్లవాడిని అత్యంత దారుణంగా చంపెయ్యవచ్చని ఒక సైనిక వ్యవస్థ భావించిందంటే వారి మైండ్ సెట్ ని అర్ధం చేసుకోవడం చాలా కష్టంగా ఉందని మెక్ రే ‘ది హిందు’లో రాసిన ఆర్టికల్ లో పేర్కొన్నాడు. “కొత్త సాక్ష్యాలు మరిన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన పరిస్ధితిని శ్రీలంక సైన్యానికి కొని తెచ్చాయి. ఒక్కో నెల గడిచేకొందీ ఖైదీలను ఒక పద్ధతి ప్రకారం చంపిన సాక్ష్యాలు పెరుగుతూ పోతున్నాయి. మహిళా ఫైటర్ల పైన లైంగిక హింస జరిగిన విధం అయితే చాలా తీవ్ర స్ధాయిలో ఉన్నది.” అని మెక్ క్రే తెలిపాడు. శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్ష, డిఫెన్స్ కార్యదర్శి గోటబాయ రాజపక్షలు అనేక కఠిన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉందని కూడా మెక్ క్రే తెలిపాడు. మారణకాండకు బాధ్యులయిన వారు ఇంకా అధికారంలో ఉన్నారని న్యాయం జరగకుండా శాంతి, ఐకమత్యాలకు అర్ధం లేదని చెబుతూ న్యాయం జరగడానికి శ్రీలంకపై భారత ప్రభుత్వం ఒత్తిడి తేవాలని కోరాడు.
అయితే మెక్ రే గానీ, ఛానల్ 4 గాని ప్రపంచానికి చెప్పని విషయాలకు కొదవలేదన్నది గమనార్హం. శ్రీలంక తమిళులపై అక్కడి ప్రభుత్వం, సైన్యం సాగించిన హత్యాకాండలు నిస్సందేహంగా ఖండించాల్సిందే. శ్రీలంకలో అధికారంలో ఉన్న మహేంద్ర రాజపక్ష ప్రభుత్వాన్ని తమిళులపై సాగిన రాక్షసకాండకు బాధ్యురాలిని చేసి తగిన ఫలితాన్ని అనుభవింపజేసేలా భారత ప్రభుత్వం ఒత్తిడి చేస్తే శ్రీలంక తమిళులకు పూర్తిగా కాకపోయినా కొంతమేరకయినా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాని బ్రిటన్ సైనికులు ఆఫ్ఘనిస్ధాన్, లిబియా, సిరియాలలో సాగించిన, సాగిస్తున్న అరాచక హత్యాకాండల గురించి ఛానల్ 4, మెక్ రే లు ఎందుకు పట్టించుకోరు? తిరుగుబాటు పేరుతో లిబియాలో ముస్లిం టెర్రరిస్టులకు ఆయుధాలు సరఫరా చెయ్యడమే కాకుండా క్షిపణుల వర్షంతో, మానవరహిత డ్రోన్ విమాన దాడులతో లిబియా నగరాలను నేలమట్టం చేసి వేలాది పౌరులను హతం చేసిన బ్రిటన్ ప్రభుత్వం దోషిత్వాన్ని వాళ్లు ఎందుకు పరిశోధించరు?
గుజరాత్ ముస్లింల నరమేధం గురించి వలపోస్తూ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని దశాబ్దం పాటు బహిష్కరించామని చెప్పిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు (ఇంకా ఇతర యూరోపియన్ దేశాలు) దేశాలు ఆఫ్ఘనిస్ధాన్, లిబియా దేశాల ముస్లిం ప్రజలపై హత్యాకాండ ఎలా సాగించాయి? లిబియా దురాక్రమణ యుద్ధం సందర్భంగా అమెరికా, యూరప్ దేశాలు అక్కడికి తరలించిన అత్యాధునిక ఆయుధాలే ఇప్పుడు మాలి, అల్జీరియా, సిరియా తదితర తయారుచేయబడిన తిరుగుబాట్ల (manufactured revolutions) కోసం తరలిస్తున్నారని పశ్చిమ పత్రికలే చెబుతున్న నేపధ్యంలో ఛానెల్ 4, బ్రిటన్ దురాగతాల పైన కూడా డాక్యుమెంటరీలు నిర్మించగలదా? బషర్ అస్సద్ నేతృత్వంలోని సిరియా పైన ఆయుధ నిషేధం విధించిన అమెరికా, యూరప్ దేశాలు తమ ఆయుధాలను లిబియా ద్వారా సిరియా టెర్రరిస్టులకు తరలిస్తున్న కుట్రను మెక్ రే పరిశోధించగలడా? ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికులు కూడా అర్ధరాత్రి సమయాల్లో గ్రామాలపై బడి ఇళ్లలో దూరి పసి పిల్లలు, స్త్రీలను కాల్చి చంపిన దురాగతాలను పశ్చిమ పత్రికలు కూడా వెల్లడించాయి. అమెరికా సైనిక వ్యవస్ధ మైండ్ సెట్ ని అర్ధం చేసుకోవడానికి మెక్ రే ప్రయత్నం చెయ్యగలడా? మెక్ రే ఈ కఠిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలడా?



hindu lo news chadavagaane,manassu entho baruvekkipoyindandee.enduku manushullo intha raakshasatvam?chadivinappati nunchee,kanneellu aagadam ledu.
ధరణిజ గారు మీ మనసులోని ఆర్ద్రతను భద్రంగా ఉండనివ్వండి. ఇలాంటి ఘోరాలు ప్రపంచం నిండా జరుగుతున్నాయి. పెట్టుబడిదారుల, భూస్వాముల ప్రయోజనాల కోసం వివిధ జాతుల స్వయం నిర్ణయాధికార హక్కులను పాతాళానికి తొక్కేయాలన్న లక్ష్యమే ఇలాంటి దారుణాలకు కారణం అని తెలిస్తే ఇలాంటి దారుణాలు మరిన్ని మన దృష్టికి వస్తాయి. అప్పుడిక ఏడ్వడానికి కన్నీళ్లు సరికదా, మనసుల్లోని అర్ద్రత సైతం ఇంకిపోతుంది. ఈ పరిస్ధితుల్లో మన మానవీయ స్పందనలు కాపాడుకోవడం కూడా ఒక సవాలుగా మారుతోంది. అందుకే మీ ఆర్ద్రతను భద్రంగా కలకాలం నిలుపుకోవాలని కోరుతున్నాను.
మొదటగా , Callum Macrae వ్రాసిన The killing of a young boy వ్యాసం హిందూ లో చదువుతూ ఉంటే మనసంతా చెప్పడానికి రానంత విషాదం తో నిండి పోయింది. ప్రభాకరన్ మీద జాలి కాదు, LTTE మీద సానుభూతి కాదు. ఈ దురాగతం పై ఆవేదన అని వ్రాస్తే నాటకీయం గా అనిపించవచ్చు గాని, అది నిజం. దాన్ని ఇంకెలా వ్రాయాలో తెలియదు. తీవ్రమైన నిర్బంధం, అణిచివేత ను ఎదుర్కోవడానికి పుట్టిన హింస, అలా పుట్టిన హింస ను అణచివేయడానికి పుట్టుకొచ్చిన ప్రతిహింస. ఈ క్రమమంలో ఎన్నో విలువైన జీవితాలు తుపాకుల బాంబుల పాలు అయ్యాయి.
Callum Macrae వ్రాసినట్లు అంతర్జాతీయ చట్టాలను, మానవ హక్కులను గౌరవిస్తాం అని చెప్పుకుంటున్న శ్రీలంక ప్రభుత్వం, తమ సైన్యం తో చేయించిన అమానవీయ చర్యలను, ప్రభాకరన్, తమిళ టైగర్ లు చేసిన దురాగతాలు, అత్యాచారాల వెనుక దాక్కొని ఇక ఎంత మాత్రం సమర్థించుకోవడం కుదరదు.
ఈ కింద వ్రాయబోయేది పై సంఘటనకు పూర్తిగా సంబందమైనది కాదు. అంతే కాక ఇంతటి విషాద వార్త పక్కన ఇలాంటి చర్చ జరగడం సబబు కాదు అని మీరు భావిస్తే దీన్ని ప్రచురించ వద్దు.
బ్రిటన్ సైన్యం పాత్ర ఉన్న అరాచక హత్యాకాండల గురించి ఎందుకు పట్టించుకోరు అని అడగడం సబబే. దాని గురించి వ్రాసే ముందు, Callum Macrae గాని మిగతా బ్రిటిష్ లేదా అమెరికన్ మీడియా అక్కడి ప్రభుత్వం, సైన్యం విధానాల గురించి పట్టించుకున్నా పోక పోయినా, శ్రీలంక సైన్యం అరాచకాల గురించి వారు వ్రాసింది నిజం కాకుండా పోదు.
లిబియా తిరుగుబాటు జరిగినప్పుడు నేను బ్రిటన్ లోనే ఉన్నాను. కొంత మేర దాని గురించి మీడియా లో వచ్చే వార్తలను ఫాలో అయ్యాను. లిబియా తిరుగుబాటు దారులకు విచ్చలవిడిగా ఆయుధాలు ఎలా అందుబాటు లోకి వచ్చాయి? వాటిని సరఫరా చేసింది ఎవరు? అని బ్రిటన్ లోని ఏ ప్రధాన స్రవంతి మీడియా కుడా ప్రశ్నించినట్లు నేను చూడలేదు. ఆ ఆయుధాల వలన మరణిస్తున్న వారి పట్ల గాని, తిరుగుబాటు పూర్తి అయిన తరువాత లిబియా లో కొంతమంది దగ్గర ఇలాంటి ఆయుధాలు ఉండడం వలన జరగబోయే హింస పట్ల గాని, కనీస సానుభూతి, concern వ్యక్తం చేస్తున్న వార్తలు నేను ఏ మీడియా లో చూడలేదు, చదవలేదు.
సమానమైన తెలుగు పదం తెలియదు గాని ఇంగ్లీష్ లో hypocrisy అని పిలిచే ఈ స్వభావాన్ని అర్థం చేసుకోవానికి లిబియా తిరుగుబాటు జరగడానికి కొన్ని నెలల ముందు బ్రిటన్ లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకోవాలి. Coventry అనే టౌన్ లో ఒకామె వేరొకరి ఇంటి పెంపుడు పిల్లిని, అది యజమాని ఇంటి బయట గోడ మీద కుర్చుని ఉండగా తీసి పక్కనే ఉన్న Dust bin (Wheelie bin అంటారు ఇక్కడ) లో వేసి మూత పెట్టింది. అది దగ్గరలో ఉన్న CCTV లో రికార్డు అయ్యింది. దాన్ని YouTube లో పెట్టడంతో బాగా ప్రచారంలోకి వచ్చింది. బహుశా ఇది మన మీడియాలో కుడా వచ్చి ఉంటుంది అనుకుంటాను. దాని గురించి ఇక్కడి ప్రధాన స్రవంతి మరియు సోషల్ మీడియాలలో చాల చర్చ, ప్రచారం జరిగాయి. ఆ పిల్లి పట్ల చూపించిన జాలి, సానుభూతి లో ఒక శాతం అయినా లిబియా లో చనిపోతున్న వాళ్ళ పట్ల ఎందుకు చూపించడం లేదు అనే ఆలోచన చాల సార్లు వచ్చింది. కొద్ది రోజుల తరువాత కొంత సంతృప్తి కరమైన సమాధానం లాంటిది దొరకింది. దాన్ని ఇక్కడ చెప్పడానికి ప్రయతిస్తాను.
సాధారణం గా ఇక్కడి వాళ్ళలో ఎక్కున మంది civic sense ఉన్న వాళ్ళు. ఇతరుల పట్ల దయ మరియు compassion కుడా ఎక్కువ గానే ఉంటాయి. పిల్లి విషయం లో చూసినట్లు గా అవి కేవలం సాటి మనుషుల పట్లనే కాకుండా జంతువుల పట్ల కుడా చూపిస్తారు . మీడియా కూడా ఇవే భావలతో పని చేస్తూ ఉంటుంది (అక్కడి నివసించే వారి పట్ల మాత్రమె). కాని తమ ప్రభుత్వం, సైన్యం ఇతర దేశాలలోని ప్రజల పట్ల అనుసరించే వైఖరి గురించి మాత్రం దాదాపు అందరూ మౌనం పాటిస్తారు. (ఒక్క ఇరాక్ యుద్ధం విషయం లో మాత్రం కొంత వ్యతిరేకత చూపించినట్లు అనిపించింది). కాని ఆ మౌనం వెనకాల ఆసక్తి లేక పోవడం కంటే ఆర్ధిక కారణాలు ఉండడం ఎక్కువ నిజమేమో అని అనిపిస్తుంది.
అలా అనిపించడానికి కారణం BP (బ్రిటిష్ పెట్రోలియం) కంపెని ఆధీనంలో ఉన్న మెక్సికన్ గల్ఫ్ చమురు బావులలో జరిగిన ఆయిల్ స్పిల్ ప్రమాద సంఘటన. ఈ ప్రమాదం గురించి మన దగ్గర మీడియా కుడా కొంత కవర్ చేసి ఉంది. అమెరికా తీర ప్రాంతం లో జరిగిన ఈ ప్రమాదం ఒక పర్యావరణ disaster (తెలుగు పదం తెలియదు). బ్రిటన్ లో మీడియా లో పర్యావరణం కోణం లోనే కాకుండా ఆర్ధిక కోణం లో కుడా ఆ వార్త ను కవర్ చేసింది. అమెరికన్ ప్రభుత్వం BP కి విధించ బోయే జరిమానా, అలా విధించ బోయే జరిమానా BP షేర్ వేల్యూ ఏ విధం గా పడిపోయేది, ఆ ఫలితం గా BP లో పెట్టుబడి పెట్టిన ఉద్యోగుల పెన్షన్ ఫండ్ మీద పడే ప్రభావం, తద్వారా ఉద్యోగుల పెన్షన్ వేల్యూ తగ్గిపోవడం లాంటి విశ్లేషణలు ఇక్కడి మీడియాలో చూసాను. మనం పర్యావరణ ప్రేమికులు అయినా, శాంతి కాముకులు అయినా మనకు ఆర్థికంగా నష్టం కానంత వరకే అనేది ఇక్కడ మీడియా వైఖరి. ఇది ఇక్కడి ప్రజల వ్యక్తిగత అభిప్రాయం కాకపోవచ్చు, మీడియా లో వ్యక్తం అయ్యేది మాత్రం ఇదే అనిపించింది నాకు.
బ్రిటన్ లో, అమెరికాలో (లేదా ఏదైనా అభివృద్ధి చెందిన దేశంలో, సాధారణంగా ఏదో ఒక వెస్ట్రన్ దేశం అయ్యి ఉంటుంది) గాని ప్రజల ఖరీదైన జీవన విధానాన్ని, వస్తు వినిమయ (consumer) సంస్కృతి ని కొనసాగించడానికి సహజ వనరులు చాల అవసరం. అవి వాళ్లకు సులభంగా అందుబాటులో ఉండాలి అంటే, 1. అవి లభ్యమయ్యే చోట ఆ దేశాల ఆధిపత్యం ఉండాలి. 2. అక్కడి వాళ్ళు సహజ వనరులు ఉపయోగ పెట్టుకొనే పరిస్థితులు ఉండకూడదు.
ఇప్పుడు రాజకీయ సిద్దాంతాల తో సంబంధం లేకుండా, ఏ దేశం లో అయినా అభివృద్ధి అంటే సహజ వనరులను (చమురు, బొగ్గు ఇంకా ఇతర ఖనిజాలు) ఉపయోగించుకోవడమే. అభివృద్దికి ముఖ్య సూచిక ఏమిటంటే, మీరు ఎంత అభివృద్ధి చెందితే అంత ఎక్కువగా సహజ వనరులను ఉపయోగించు కోవాలి. కాని ఇలా ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలు అభివృద్ధి (సహజ వనరులను ఉపయోగించుకొనే అభివృద్ధి) బాట పడితే అది పరిమితంగా ఉన్న ప్రపంచ సహజ వనరుల కోసం పోటీని సృష్టిస్తుంది. అప్పుడు అభివృద్ధి చెందిన దేశాలకు వాటిని పొందడం కష్టం అవుతుంది. కాని ఏ దేశం అయినా ఇలా అభివృద్ధి బాట పట్టాలి అంటే అక్కడ అందుకు అనువైన రాజకీయ సుస్థిరత మరియు శాంతి ఉండాలి. అలా కాకుండా ఆ దేశాల ప్రజలను గొడవలలో(జాతుల, మతాల, ప్రాంతాల గొడవలు) తనమునకలు అయ్యేలా చెయ్యగలిగితే, ఇంక అక్కడ అభివృద్ధి లేదు సహజ వనరుల వినియోగం లేదు. వాటికోసం పోటి లేదు.
గొడవలు పడే వాళ్ళకు కావలసిన ఆయుధాలు కుడా మనమే తయారు చేస్తే, అవి కొనడానికి ఒక మార్కెట్ తయారుగా ఉంటుంది. గొడవలను చల్లార కుండా చూసుకుంటూ, వీలైన చోట్ల కొత్త వివాదాలను రేకెత్తిస్తూ ఉంటె ఆయుధాల పరిశ్రమ కు మార్కెట్, పోటి లేకుండా సహజ వనరులు అందుబాటు.
నాకు అర్థం అయిన దాని ప్రకారం, ఈ విషయం ఇక్కడి మీడియాకు చాల బాగా తెలుసు(కొంత వరకు సామాన్య ప్రజలకు కుడా) అందుకే ఒకే రకమైన సంఘటనలకు వేరు వేరు విధాల స్పందనలు. శ్రీలంక హింస , లిబియా, సిరియా ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లో హింస ఇక్కడి మీడియా దృష్టి కి వేరు వేరు గా కనిపిస్తాయి.
కాకపోతే ఈ hypocrisy అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితం కాదు. మన దగ్గర మీడియా కుడా లిబియా, సిరియా ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లో వెస్ట్రన్ దేశాలు చేస్తున్న హింస గురించి వ్రాస్తుంది కాని, మన పక్కనే బర్మాలో ఉన్న సైనిక ప్రభుత్వ అరాచకాల గురించి వ్రాయరు. ఎందుకంటే మనకు ఆదేశం లో ఉన్న సహజ వనరులు కావాలి. దాని కోసం మన ప్రభుత్వం అక్కడి సైనిక ప్రభుత్వ అరాచకాలను చూసి చూడనట్లు వదిలేస్తుంది. మన మీడియా మౌనం పాటిస్తుంది.
సహజ వనరుల వినియోగం విషయంలో కుడా అవే పోలికలు చెప్పుకోవచ్చు. దేశం లో కొంత మంది ఖరీదైన జీవితం గడపడానికే అవి ఉపయోగ పడుతాయి. మెజారిటీ ప్రజలు మాత్రం అభివృద్దికి (వనరుల వినియోగానికి) దూరంగా ఉంటారు. అలా వాళ్ళు తమలో తాము కొట్టుకుంటూ అభివృద్ధి కి దూరం గా ఉండడానికి కావలిసినన్ని కారణాలు సరఫరా చెయ్యబడుతాయి.
Coventry Wheelie bin సంఘటన గురించిన వార్తా లింక్ http://www.guardian.co.uk/world/2010/aug/25/mary-bale-lola-cat-wheelie-bin
పింగ్‌బ్యాక్: కాల్పుల్లో చిక్కి చనిపోలేదు, గురిపెట్టి కాల్చి చంపారు | Raja's Realms